Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సపోటా పళ్లు

[శ్రీ ఎస్. హనుమంతరావు రచించిన ‘సపోటా పళ్లు’ అనే బాలల కథని అందిస్తున్నాము.]

స్కూలు లాంగ్‌ బెల్‌ కొట్టారు. అప్పటికే పుస్తకాల్ని సంచుల్లో సర్దుకుని రెడీగా వున్న పిల్లలు ఒక్కసారిగా బయటకొచ్చి పరుగూ నడకలతో ఇళ్లకి బయలుదేరారు. కృష్ణ తన మిత్రుడు శివతో కలిసి పరుగుతీస్తూ రోడ్డుమీదకి వచ్చాడు. ఇళ్ల వైపు కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు.

కాలవ మీద వంతెన దాటిన తర్వాత, రోడ్డు పక్కనే వరుసగా ఇళ్లు. నాలుగు అడుగులు వేయగానే ఓ ఇంటిని కూలగొట్టడం కనిపించింది వారికి. అలాంటి దృశ్యాన్ని వాళ్లు ఎప్పుడూ చూడలేదేమో, కాస్త దూరంగా నిలబడి, ఆసక్తిగా చూడ్డం మొదలెట్టారు. రోడ్డు పక్కన ఇల్లేమో యజమాని దాన్ని కూలగొట్టి, కింద కొట్లు, పైన ఇల్లూ కట్టాలని, పాత ఇంటిని కూలగొట్టిస్తున్నాడు. ఆ ఇంటి గేటు పక్కనున్న సపోటా చెట్టును అడ్డమొస్తుందని కొట్టేశారు. కొమ్మల్ని రోడ్డు పక్కకు విసిరేశారు. కొమ్మల నిండా పళ్లు.. స్కూలు పిల్లలు పోటీపడి పళ్లని కోసుకోవడం మొదలెట్టారు.

కృష్ణ తన పుస్తకాల సంచీలో మడతపెట్టి వుంచిన క్యారీ బ్యాగుని పైకి తీసి, కోసిన పళ్లని అందులో వేసుకుంటున్నాడు. సంచి నిండిపోయి, బరువుగా అనిపిస్తోంది. ఇక చాల్లే అనుకుని, శివకి టాటా చెప్పి, ఇంటి వైపు కదిలాడు.

రోజూ కంటె ఉత్సాహంగా ఇంట్లో ప్రవేశించాడు కృష్ణ. వాడి చేతిలో బరువుగా వున్న క్యారీ బ్యాగుని చూసి ఏమిటన్నట్టు చూసింది అమ్మ నిర్మల.

“సపోటా పళ్లు” ఉత్సాహంగా చెప్పాడు.

“ఎక్కడివిరా?” అంది అమ్మ. వాటి వెనుక కథంతా చెప్పాడు వాడు.

కృష్ణ వచ్చే సమయం అయ్యిందని వాడు తాగడానికి పాలు వెచ్చ చేసింది అమ్మ అప్పటికే. ఓ స్టీలు మగ్‌లో పాలని పోసి, కృష్ణ చేతికిచ్చింది. పాలని ఊదుకుంటూ తాగుతుండగా, కృష్ణ వాళ్ల నాన్న వీరేశం ఆఫీసు నుండి వచ్చాడు. అతని చేతిలో క్యారీ బ్యాగులో సపోటా పళ్లు.. సైకిల్‌కి బుట్టలు కట్టుకుని పళ్లు అమ్ముకుంటే, ఒక పండును రుచి చూసి, రెండు డజన్లు తీసుకున్నాడు.

భర్త చేతిలో పళ్ల బ్యాగును చూసి “అయ్యో! మీరూ తెచ్చారా?” అంది నిర్మల.

“ఏం? వీధిలోకొస్తే నువ్వూ తీసుకున్నావా?” అన్నాడు వీరేశం.

“కాదు. కృష్ణ బాబు తెచ్చాడు” అంది.

“వాడి దగ్గర డబ్బులెక్కడివి?” ఆశ్చర్యంగా అడిగాడు.

“పళ్లని నేను కొనలేదు. చెట్టుని కొట్టేస్తే, కొమ్మలకి వున్న పళ్లని కోసుకుని తెచ్చాను” అన్నాడు కృష్ణ కాస్త దర్పంగా.

“అలాగా!” అన్నాడు వీరేశం.

నిర్మల రెండు ప్లేట్లలో భర్త తెచ్చిన పళ్లని సర్ది, ఒకటి కొడుక్కి, మరోటి భర్తకీ ఇచ్చి, తాను కొన్ని పళ్లని తీసుకుని, తొక్కల్ని తీసి తినసాగింది.

ఈలోగా కృష్ణ తను తెచ్చిన పళ్లని కొన్నింటిని తండ్రికి, తల్లికి ఇచ్చి, తనూ తినడం ప్రారంభించాడు.

తింటూ “అబ్బ!.. ఎంత బావున్నాయో ఇవి.. భలే తియ్యగా వున్నాయి. మంచి వాసన కూడాను..” అన్నాడు మురిసిపోతూ.

“అవున్రా!.. మీ నాన్న తెచ్చిన వాటి కంటే ఇవే బావున్నాయి” అంది అమ్మ.

“ఏం తేడా వుంది? రెండూ బాగానే వున్నాయి” ఉక్రోశంతో అన్నాడు వీరేశం.

“ఓయ్‌! వీరేశంగారూ.. ఆవేశపడిపోకండి.. మీవి బజార్లో కొని తెచ్చినవి.. వాడు స్వయంగా కోసుకు తెచ్చినవి.. ఎప్పుడైనా మనం స్వయంగా చేసిన పని మీద మనకి ప్రేమ, ఇష్టం కలుగుతాయి. పైగా వాడు ఇంటికి ఏదైనా తేవడం ఇదే మొదటిసారి.. వాడికి ఎంత థ్రిల్లింగ్‌గా వుంటుందో ఓసారి ఊహించండి.. బాబు తెచ్చినవి ఇంటి పెరట్లో కాసినవి.. మీరు తెచ్చినవి మందులు కొట్టి పెంచిన తోటపళ్లు.. ఏవి రుచిగా వుంటాయో వేరే చెప్పాలా? మన పెరట్లో పండిన కూరగాయలతో చేసిన కూర మనకి ఎంతో రుచిగా అనిపిస్తుంది. అదే బయట కొన్న కూరగాయలతో చేసిన కూరలో మనకి ఏ ప్రత్యేకతా కనిపించదు” అంది.

నిర్మల విశ్లేషణ కరక్టే అనిపించింది వీరేశానికి కూడా. ఇక కృష్ణ అయితే తల్లిని ఆరాధనాపూర్వకంగా చూస్తూ, కుడిచేయి బొటనవ్రేలు పైకెత్తి నవ్వాడు.

Exit mobile version