[శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల గారి ‘సంతోషాల గాలిపటం’ అనే బాల కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రసిద్ధ రచయిత్రి, కాలమిస్ట్, జర్నలిస్ట్ శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల తాజాగా వెలువరించిన తొలి బాలల కథాసంపుటి ‘సంతోషాల గాలిపటం’. ఇందులో 30 కథలున్నాయి.
~
“(ఇవి) ఇప్పటి పిల్లల మేధకు తగినట్టుగా, వారి సహేతుకతకు, కుతూహలానికీ, తెలివితేటలకూ గౌరవాన్నిస్తూ రాసిన కథలు. కథల నిడివి చాలా తక్కువ, కానీ వాటి ద్వారా చెప్పిన విషయాలు ఎప్పటికీ నిలిచేవి, పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకపాత్ర వహించేవి” అని తమ ముందుమాటలో ఈ కథల గురించి వ్యాఖ్యానించారు డా. సి. మృణాళిని.
“ముకుళిత బాలప్రపంచాన్ని వికసింపజేసే ప్రాణవాయువు ఈ ‘సంతోషాల గాలిపటం’. ఈ కథలు కాలక్షేపానికి రాసినవి కావు. పిల్లల్లోని తప్పొప్పులను, అసమానతలను కథాంశాలుగా తీసుకుని, వాటికి చక్కని పరిష్కార మార్గాలు చూపిస్తాయి, చదువరులను ఆలోచింపజేస్తాయి” అని వ్యాఖ్యానించారు శ్రీ చొక్కాపు వెంకటరమణ తమ ముందుమాటలో.
~
‘నాటకం వేస్తున్నాం.. రారండి!’ కథ నాటకంలో గాని చలనచిత్రాలలో కాని ఈ పాత్ర తక్కువా కాదు ఎక్కువా కాదనీ, అందరూ చక్కగా నటిస్తేనే ప్రదర్శన రక్తి కడుతుందని, నాటకం వేసే పిల్లలలో కలివిడితనం ఏర్పడుతుందని చెబుతుంది.
‘కాగితం విలువ తెలిసేనా!’ కథలో కాగితాలని వృథా చేయకూడదని, కాగితం తయారీ కోసం ఎన్నెన్ని చెట్ల కలవని వాడాల్సి వస్తుందో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి, వారిలో మార్పు తెస్తుందో ఉపాధ్యాయురాలు.
స్కూలు పిల్లలు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలన్న నియమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని గ్రహించిన సిరి, ఇక ఎన్నడూ స్కూలికి సివిల్ డ్రెస్ వేసుకెళ్ళను అంటుంది ‘స్కూల్ డ్రెస్‌తో ఏకత్వం!’ కథలో.
దేశం కోసం సైన్యం చేసే సేవ కాకుండా, మిగతా వాళ్ళు దేశం కోసం ఏం చేయాలో, ముఖ్యంగా పిల్లలు దేశం కోసం ఏం చేయాలనేది ‘దేశమంటే మట్టి కాదోయ్!’ కథ చెబుతుంది.
పెద్దయ్యాకా తాము ఏమవ్వాలనుకుంటారో పిల్లలు ఎలా నిర్ణయించుకోవాలో, అందుకు తగిన కృషి ఎలా చేయాలో ‘పెద్దయ్యాక ఏమవుతానంటే..!’ కథలో చక్కగా తెలిపారు రచయిత్రి.
‘తోటలో ఇల్లు’ కథ చక్కని సందేశాన్నిస్తుంది. తమ లేమి గురించి ఇతరులు ఏమనుకుంటారో అని పిల్లలు బాధపడాల్సిన అవసరం లేదని చెబుతుందీ కథ. ఒకరికి ఉన్నది, మరొకరికి ఉండదనీ అందువల్ల అందరూ ఉన్నవాళ్ళే, అందరూ లేనివాళ్ళే అన్న చక్కని సందేశాన్ని అంతర్లీనంగా అందిస్తుందీ కథ.
పిల్లలకి బహుమతులుగా పుస్తకాలు ఎందుకు ఇవ్వాలో, దాని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనం ఏమిటో ‘మామయ్య ఇచ్చిన బహుమతి’ కథ వెల్లడిస్తుంది.
తొందరపాటుతో ఎవరి మీదా అభాండాలు వేయకూడదని ‘తొందరపాటు నిందలు’ కథలో టీచర్ సూచిస్తారు.
డబ్బు ఉందనే గర్వంతో అన్నిటికీ బిల్లులు కడుతున్నామంటూ వనరులను వృథా చేసే గ్రీష్మకు వనరులను పొదుపుగా ఎందుకు వాడుకోవాలో అర్థమయ్యేలా చెప్తారు టీచర్ ‘మార్పు’ కథలో.
వేసవి సెలవల్ని అమ్మమ్మ/నానమ్మ, తాతయ్యల దగ్గర పల్లెటూరిలో గడిపితే ఎంత బాగుంటుందో, ఎన్ని నేర్చుకోవచ్చో ‘పల్లెకు పోదాం చలో చలో’ కథ వివరిస్తుంది.
తన విద్యార్థిలో అలసత్వాన్ని పోగొట్టి, చురుకుగా పనిచేసేలా మారుస్తారు రామారావు మాస్టారు, ‘చెట్టే ఆదర్శం’ కథలో.
అనుకరణకీ, సహజ గానానికి ఉండే తేడానీ, పాట పాడే విధానంలో నమత్రనీ, గర్వభావాన్ని చిలుక, కోయిల పాత్రల ద్వారా ప్రదర్శించి – గానప్రతిభలో గెలుపెవరిదో చెబుతుంది ‘నువ్వా.. నేనా’ కథ.
జంతువులు, పక్షులు పర్యావరణానికి చేసే మేలుని చిన్నారికి అర్థమయ్యేలా ఓ చిన్ని ప్రాణి చెప్పిన కథ ‘ఉడుత పాఠం’.
ఒక వినూత్న ఆలోచనతో, మొక్కల పెంపకానికి దోహదం చేసిన బాలుడి కథ ‘చెట్టు పుట్టినరోజు’.
తల్లిదండ్రులు చేసే ఉద్యోగాలని బట్టో లేదా ఎంచుకున్న జీవనోపాధిని బట్టో పిల్లలను అవహేళన చేయకూడనే చక్కని సందేశాన్నిస్తుంది ‘రైతే రాజు’ కథ.
తల్లిదండ్రులిచ్చే ‘పాకెట్ మనీ’ని దుర్వినియోగం చేయకుండా ఎలా మంచి పనులు చేయచ్చో పిల్లలకి చెప్తారు పార్కులోని ఓ తాతగారు. తోటివారికి సాయం చేయడానికి ప్రేరణనిస్తారు.
అహంకారంతో ఎవరినీ హేళన చేయకూడదని, ప్రకృతిలో దేని విలువ దానిదేనని చెబుతుంది ‘ఉప్పనైనా సముద్రం గొప్పదే’ కథ.
పేరులోనే కథాసారం నిండిన కథ ‘సహాయంలో సంతోషం!’. పుస్తక పఠనం ప్రయోజనాన్ని చెప్పిన కథ ‘నాకో పుస్తకం కావాలి’.
గాలిపటం ఎగరేయటంలో ఉన్న గొప్ప సందేశాన్ని మామయ్య, రాజుకి వివరిస్తాడు ‘గాలిపటమా పద పద!’ కథలో.
ఆడపనులు, మగపనులు అంటూ విడిగా ఉండవని, కుటుంబంలో అందరూ అన్ని పనులు చేయాలని బాల్యంనుంచే పిల్లలకు నేర్పాలని సూచిస్తుంది ‘సమ భావన!’ కథ.
మొగ్గ తొడిగిన మల్లె చెట్టు, కొండ మనకు అండ కథలు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి.
~
ఈ కథలు చిన్నపిల్లల కోసం చిన్నగా రాసిన కథలు. నేటి పిల్లలకు నేటి కథలు, మేటి కథలు. నీతి కోసం కథలలా కాకుండా, సందేశాన్ని/నీతిని సంభాషణల్లోనే ఇమిడ్చి పిల్లలకి సులువుగా బోధపడేలా రాసిన కథలు.
అందరు పిల్లలకీ అందాల్సిన పుస్తకం ఇది.
***
రచన: జొన్నలగడ్డ శ్యామల
పేజీలు: 96
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-jonnalagadda-syamala-sg/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.