[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘సంక్రాంతి సందడి ఎక్కడ?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వయస్సు మళ్ళిన వారి భ్రాంతి తప్ప
ఋతుధర్మం ప్రకారం హేమంతం వచ్చింది
నెలపట్టే సమయం ఆసన్నమైంది
అంతస్తులతో నిండిన రాతిభవనాల మధ్య
గోమయం కలిపిన కళ్లాపులు లేవు
ముంగిళ్ళు మంచుతో తడుస్తున్నాయి
అందాల రంగవల్లులు కానరావు
గొబ్బిళ్ళ అందాలు కరువైనాయి
హరిదాసు కీర్తనలు వినపడటం లేదు
గంగిరెద్దులను అలంకరించి చిందేయించే
మేళగాళ్ళు కనుమరుగైనారు
అమ్మ చేతి అరిసెలు అప్పచ్చుల
సువాసనలు మాయమైనాయి
రెడీమెడ్ వంటకాలు ముద్దయినాయి
బొమ్మలు పెట్టడం మోటయ్యింది
పాపాయికి భోగి పళ్ళు పోసే వారే లేరు
లంగా వోణి చీరెల రెపరెపలు పోయి
ఒంటికంటుకున్న జీన్స్ నైటీ మ్యాక్సీలు వచ్చాయి
సూర్యోదయానికి లేచే వారి కనబడరు
పెరిగిన సాంకేతిక విజ్ఞాన నేపథ్యంతో
మన సంస్కృతి సాంప్రదాయాలను
అందరూ మరచిపోతున్నారు
ముత్తయిదువుల కోలాహలం
ఆడపిల్లల ఆనందాల సందడులు
అత్తగారింటికి వచ్చిన అల్లుళ్ళ సరదాలు
బావామరదళ్ళ సరసాల ముచ్చట్లు
ఇవన్నీ ఈనాడు చెప్పుకోవటానికే మిగిలాయి
పాశ్చాత్యులు మన సాంప్రదాయాలను
గౌరవించి ఆనందంతో ఆహ్వానిస్తుంటే
మనకు మాత్రం అవన్నీ మోటయినాయి
అందుకే అంటారు దూరపు కొండలు నునుపని.