Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంకెళ్ళు తెంచుకో

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘సంకెళ్ళు తెంచుకో’ అనే కవితని అందిస్తున్నాము.]

ది లేనిదే – మనిషికి గడువదు
నిరంతరం – వెంటపెట్టుకొని
తిరిగితే కానీ – మనిషి
జీవించలేనిది – ప్రాణం కన్న మిన్న
మనుషులను – కలవలేకపోయినా
దృశ్యరూపంలో – చూస్తూ
మాట్లాడే – చిత్ర – కొత్త- పరికరం
కనికొట్టిన మనిషి – వాస్తవ జీవితానికి
దూరం అవుతున్నా గ్రహించలేని స్థితికి
తీసుకెళ్ళే ఆధునిక పరికరం
తెలియని విషయాలు తెలుసుకొనే
పరిజ్ఞానం కన్నా,
నేరాలు ఎలా చేయవచ్చో,
సులువు మార్గాలను – సూచించే పరికరం
ఇది చేతిన లేనిదే ఉండలేని పరిస్థితి
అరచేతిలో ఒదిగిపోయే యంత్రమా
అరక్షణం కూడా తీరిక లేకుండా చేసే సాధనమా
మనుషులను బంధించే బంగారు పంజరమా
అనుబంధాలను దూరం చేసే యమపాశమా
చరవాణివా, శిరోభారానివా
చూపులను బంధించీ – మనస్సును లగ్నం చేస్తే
జీవితంలో సగ బాగం దానితో
సహచర్యం అలవాటుయైన మనిషి –
మానసిక స్థితి ఎంత చిత్ర విచిత్రమో
అంతర్జాలం అంటూ గాలం వేస్తావు
అంతరంగిక విషయాలు బట్టబయలు చేస్తావు
పలకరింపులు కరువాయె
నువ్వే లోకం – అన్నట్లుగా మానవుల ప్రవర్తన
చరవాణి సంకెళ్ళకు మనిషి శాశ్వత ఖైదీ
పాల బుగ్గల పసికూనల నుండి –
వృద్ధుల వరకు చరవాణికి – బానిస అయినవాడు
గ్యాంబ్లింగ్, ఆటలకు అలవాటుపడి –
వ్యసనపరులై – ధనాన్ని పోగొట్టుకొన్నవారు కొందరైతే
చూడరాని దృశ్యాలను వీక్షిస్తు –
మృగ తృష్ణ నింపుకొని – మానభంగాలు
చేసేవారు కొందరైతే –
దోపిడి దొంగలుగా మారి నేరాలు
చేయటంలో ఆరితేరిన వారు మరికొందరు
సాధనము – పరికరము ఉపయుక్తం కావాలి గాని
మనిషి జీవితాన్నే నష్టపరిచేది
సాధనంగా – మార్చుకోకూడదు
ఆలుమగల మధ్య కీచులాటకు
దారి తీసే సాధనము –
రహస్య చిత్రాల చిత్రీకరణ –
భార్యాభర్తలకు అనుమానమునకు తావు ఇచ్చే సాధనం
ఎల్లలు లేని చరవాణి – ఊసులు చెప్పే
సమాచారవాణి
సరిగమలు పలికే – రాగాల వాణి
దూరాన్ని దగ్గర చేసిన తరంగ వాణి
వినోదర్పణ వాణి – మాయ చేసే యంత్రవాణి
చేతిలో ఇమిడి మనసులో ఒదిగే
భావాలు నింపుతుంది – ప్రభావిత వాణి
తానే ప్రపంచమై ఆడించే క్రీడావాణి
అగాధంలోకి నెట్టే అంతర్జాల వాణి
మానవ సౌకర్యం కోసం సృష్టిస్తే
మానవులనే శాసించే నియంత వాణి
కృత్రిమ వాణి – మేధ వాణి
కలల వాణి – విష సంస్కతి నాడే
అందాల వాణి – అజ్ఞాత వాసి దూరవాణి
ఎన్నని చెప్పను – దీని లీలలు
విశ్వ చరవాణిని – విజ్ఞానం కోసం వాడు
మనిషి విలువ తెలుసుకో
చరవాణి చెరలో – చిక్కకు
చరవాణికి బానిసవ్వకు –
సంకెళ్ళు తెంచుకొని –
వాస్తవంలో – జీవించు.

Exit mobile version