[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘సంఘర్షణ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
రెండు దేశాల
రెండు తనువుల మధ్యనే కాదు
తనతో తాను చేస్తున్న ఘర్షణ కూడా
నిర్విరామమైన సమరమే..!
గతి తప్పుతున్న జీవితాల్లో
మతి తప్పుతున్న మాటలు
వినిపించుకోవడం ఉండదు
సవాళ్లతో సమర్థించుకోవడమే..!
చర్యకు ప్రతి చర్యలున్నట్లుగానే
చర్చలు ప్రతి చర్చలతో
సత్యాలు అర్థసత్యాలతో
సందిగ్ధమైన ఆలోచనలతో సాగడమే..!
కాఠిన్యం అనుకుంటారేమో
ఎవరో ఒకరు చెప్పేదాకా తెలియదు
కోల్పోయిన సున్నితత్వమెలా వస్తుంది
పూలను కోల్పోయిన మొక్కను చూడడమే..!
అక్షరం అక్షరం మధ్యన
పురుడు పోసుకుంటున్న భావాల సాక్ష్యంగా
సంఘర్షణనే కొత్త చరిత్రకు నాంది
నీకై నువ్వు దారిని నిర్మించుకోవడమే..!