[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘సంఘర్షణ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
భవాని నిన్నటి నుండీ ఒకటే నస పెడుతుంటే, ఈ రోజు ఉదయానే బద్ధకంగా నిద్ర మొహంతోనే రైతు బజారులోకి అడుగు పెట్టాను.
బండి పార్కింగులో పెట్టి, నాకు అలవాటైన వేగమైన నడకతో తలదించుకు పోతున్నాను, నాలుగడుగులు వేసిన తరువాత నాకు గుర్తుకొచ్చింది.. సంచిని బండిలోనే మరిచిపోయి వచ్చానని, తిరిగి వెళ్ళి బండిలోంచి సంచి తీసుకుంటూ.. యథాలాపంగా పక్కకు చూసాను.
ఇరవై అయిదు, ముప్పై మధ్య వయసులో ఉన్న ఓ అమ్మాయి బండి పార్క్ చేసుకుంటూ ఏవో కూనిరాగాలు తీసుకుంటూ కనిపించింది.
ఆ అమ్మాయి అచ్చం సుధలానే ఉంది. తనని చూసి నేను కొంచెం తడబాటుకు లోనయ్యాను. బహుశా ఈ అమ్మాయి సుధ కూతురయ్యుంటుందేమో.. ఓ చిన్న సంశయం మనసులో. అయ్యుండదులే అనుకుని అన్యమనస్కంగానే నా పని ముగించుకుని ఇంటి దారి పట్టాను.
మనసంతా ఏదో బరువుగా, ఓ చేదు జ్ఞాపకం పనిగట్టుకొని వచ్చి పలకరించినట్టినిపించింది.
నేను ఆ అరాచకానికి పాల్పడినప్పుడు.. నాకు నేను.. సరైన పనే చేసానని సరిపెట్టుకోగలిగాను, కానీ రాను, రాను నేను చేసిన పని సరైనది కాదని నా మనసు నన్ను దూషిస్తునే ఉంది.
బహుశా వయసూ, అనుభవం పైన పడుతున్నకొలదీ, నాలో అపరాధ భావన పెరుగుతుందేమో? నాకిప్పుడు డైభై ఏళ్ళు.
నా ఆ దుర్మార్గానికి పర్యవసానంగా పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చి, నలభై ఐదేళ్లప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాను. ఎవరి శాపమో పిల్లలైతే కలగలేదు. నేను..భవాని ఇద్దరమే.. చుట్టూ శూన్యం. మొహం చెల్లక సొంత ఊరు కూడా వదిలి నగరానికి వచ్చేసాను.
సుధ నాకు దగ్గర బంధువుల అమ్మాయే. తాను చిన్నప్పటి నుండీ నాకు బాగా తెలుసు, పైగా నేను మేనమామ వరస అవుతాను. తాను చాలా అందంగా, ఉషారుగా, ఆధునికంగా ఉండేది.
నేను బికామ్ పాసైన తరువాత, మాకు వ్యవసాయ భూమి ఉండటం వలన, పైగా ఒక్కడినే వారసుడిని. ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా వ్యవసాయం పైనే దృష్టి పెట్టి మంచి రైతుగా పేరు గడించాను.
నాన్న, నా కోసం పెళ్లి సంబంధాలు వెదకడం గురించి తెలిసి, సుధ వాళ్ల నాన్నగారు.. మా నాన్నతో వాళ్లమ్మాయిని నాకిస్తామని అడిగారు.
దగ్గర సంబంధం అవడం వలన, సుధ కూడా నాన్నకు చిన్నప్పటి నుండి తెలిసి ఉండటం వలన.. నాన్న, నేను మరో తలంపు పెట్టుకోకుండా, అలాగేనని అంగీకారం తెలియజేయడం, పెళ్లి ఘనంగా అయిపోవటం జరిగింది. సంవత్సరం తిరిగే సరికి సుధ పండంటి ఆడపిల్లను కన్నది.
అయితే మా పెళ్లైన నుండీ మాకిద్దరికీ ఉమ్మడి బంధువైన జయరాజు.. తనకి బావ వరుస, ఇద్దరిదీ ఒకే ఊరు అవటం వలన తరచూ అతను మా ఊరికి వచ్చేవాడు. మా ఇంటిలో రెండు మూడు రోజులు ఉండి పోయేవాడు.
అయితే నాకు మొదట అంతా సహజంగానే అనిపించినా, వారిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూసిన తరువాత.. నాలో ఓ బలహీనమైన క్షణాన, ఓ బలమైన అనుమాన బీజం మొలకెత్తింది. అది నా నాశనాన్ని చూసేంత వరకూ పెరుగుతునే ఉండింది.
ఓ రోజు నేను పనిమీద బయటకు పోతూ, ఏదో వస్తువు మరిచి పోయానని వెనక్కి వచ్చాను. జయరాజు అప్పుడే వచ్చినట్టున్నాడు అనడానికి గుర్తుగా అతని ఖరీదైన బూట్లు బయట ఉన్నాయి.
నేను తలుపు కొట్టబోయి.. ఓ క్షణం ఆలోచించి, నా అనుమాన నిర్దారణ చేసుకోడానికి సరైన సమయమిదేనని భావించి, మెల్లగా పెరటి వైపుకు చేరి పూర్తిగా మూయబడని మా బెడ్ రూం కిటీకీ నుండి తొంగి చూసి సగం చచ్చిపోయాను.
అప్పుడే నాలో ఓ రాక్షసుడు పురుడు పోసుకున్నాడేమో! వాడు హింసాపూరితమైన ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నాడు. అయితే అది సరైన సమయం కాదని నా బుద్ధి వారిస్తోంది.
ఏమీ తెలియనట్టు వెనక్కి తిరిగి వెళ్లి, అక్కడ, ఇక్కడ తిరిగి సాయంకాలనికి ఇంటికి చేరుకున్నాను.
“ఏమండీ! పాపని రేపు అమ్మవాళ్లింటి నుండి తీసుకొచ్చేయండి” అంటూ తను నాకందించిన కాఫీని అన్యమనస్కంగానే తాగి, సరే అని.. వీధిలో ఎవరో రేషన్ షాపులో కిరోసిన్ ఇస్తున్నారని అనుకుంటూ ఉంటుంటే, నేను ఓ పెద్ద క్యాను పట్టుకుని రేషన్ షాప్‌కి బయలుదేరాను.
విచక్షణ కోల్పోయిన నా బుద్ధి, మనసు ప్రతికారాన్ని బలంగా కోరుకుంటున్నాయి.
సహజంగా ఓ సమస్యకి పరిష్కారాలుగా చాలా దారులు ఉంటాయి. విచక్షణ కోల్పోని వాడెవడడైనా.. తనకి నష్టం లేని పరిష్కారాన్నే ఎన్నుకుంటాడు. కానీ నేను ముమ్మాటికి విచక్షణ కోల్పోయి ఉన్నాను.
తననుండి చట్ట పరంగా విడిపోవచ్చు, చెప్పినంత సులభం కాకపోయినా, తనతో ఆ విషయం చర్చించి.. తుది తప్పుగా భావించి క్షమించేయచ్చేమో! కానీ నా బుద్ది వికృతంగా వక్రించి తన అంతాన్ని చూడాలని కంకణం కట్టుకున్నట్టుంది.
విషం లాంటి నా ఆలోచన ఓ విష పన్నాగన్ని పన్ని, ఓ గరళ పన్నగమై బుసకొట్టింది. ఓ రాత్రి ఆదమరిచి నిద్రిస్తున్న సుధ, నేను మొన్న మోసుకొచ్చిన పెద్ద క్యాను కిరోసిన్ ఆజ్యంగా ఓ సమిధై మాడి పోయింది.
అంతా అయిపోయింది. తాను చేసింది నైతికంగా అనైతికమైనా.. కోర్టు దృష్టిలోనూ అది తప్పే అయినా హత్యా నేరమంత కాదు కదా?
సాక్ష్యాలన్ని బలంగా, నాకు వ్యతిరేకంగా ఉండటం వలన, కోర్టులో యావజ్జీవ శిక్ష పడింది. జీవితంలో అమూల్యమైన నా వయసుని, కాలాన్ని చేజేతులా బలి చేసుకున్నాను.
ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. తనని క్షమించాల్సింది, లేదా చట్టపరంగానైనా విడి పోవాల్సింది. ఓ రకంగా చెప్పాలంటే తనకి నరకాన్ని చూపించాలకుని, నాకు నేనుగా నరకంలోకి కూరుకు పోయాను. నాతో విడిపోయినా.. తాను సజీవంగా ఉండి ఉంటే, ఎక్కడో ఓ దగ్గర క్షేమంగా ఉండేది. ఏదో సంధర్భంలో నేను తారసపడ్డప్పుడు ఓ అపరాధ భావనతో కుమిలి పోయేది. కానీ నేనిప్పుడు ప్రతిక్షణం కుములుతూ బ్రతుకుతున్నాను. మా ఈ పతనానికి కారణమైన జయరాజ్ ఇప్పుడు పిల్లాపాపలతో, రాజకీయాలలో ప్రముఖుడుగా ఉన్నాడు.
నేను జైలు నుండి వచ్చిన తరువాత.. తన కుటుంబం తప్పితే, నా ఇతర బంధువులందరూ నాతో బాగానే ఉంటున్నారు. బహుశా నాపై సానుభూతి కావచ్చు.
ఏదేమైనా నేను చేసిన ఆ ఘోరం క్షమార్హం కాదని నేనిప్పుడు బలంగా నమ్ముతున్నాను.
అయితే ఈ రోజు రైతు బజారులో ఆ అమ్మాయి కనిపించిన తరువాత.. నాకు ఎందుకో తాను సుధ కూతురనే అనిపించింది.
నేను జైల్లో ఉన్నప్పుడు ఆ నోట, ఈనోట విన్న మాటల ప్రకారం.. ఆ అమ్మాయి ఢిల్లిలో తన మేనమామ దగ్గర పెరిగుతుందని తెలిసినా, నాకు సుధపైన ఉన్న కోపం వలన అంతగా పట్టించుకోలేదు.
కానీ నాలో సంఘర్షణల సాంధ్రత పెరుగుతున్న కొద్ది ఆ అమ్మాయి కూడా నాలోని సాహానుభూతి పరిది లోకి చేరింది. కానీ ఏ మోహం పెట్టుకు తన దగ్గరికి వెళ్లగలను? ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా క్షమిస్తుంది?
అందుకే అటువైపుగా ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఈరోజు ఆ అమ్మాయి కనిపించినప్పటి నుండీ తన గురించి తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. కొంతమందిని అడిగి చూసాను. కానీ ప్రయోజనం లేకపోయింది.
మరో రోజు అదే రైతు బజారులో.. అదే అమ్మాయి, మాకు దగ్గర బంధువైన సునందతో మాట్లాడుతోంది.
ఎందుకైనా మంచిదని నేను ఓ పక్కగా వాళ్లకు కనిపించకుండా వెళ్లాను. ఆ అమ్మాయి.. సునందకి బై చెప్పి వెళ్లిన తరువాత, నేను వెళ్లి సునందని పలకరించాను. ఆమె ఆశ్చర్యంగా నావైపు చూసి “ఎప్పుడొచ్చావు, ఇప్పుడే సుధ కూతురు నాతో మాట్లాడి వెళ్లింది. తనకి మన సిటీలోనే ఇచ్చారు, మొన్న మా ఇంటికి కూడా వచ్చింది.” అని అన్న సునందతో.. ఏం మాట్లాడలో అర్థం కాక “అలాగ.. నేను మొన్న తనని ఇక్కడే చూసాను. అప్పుడే అనిపించింది.. తాను సుధలా ఉందేనని. తనని చూసిన క్షణం నుండీ మళ్లీ ఆ చేదు అనుభవాలన్నీ గట్టిగా పలకరించాయి. నిజానికి తన కోసమే ఈ రోజూ బజారుకు వచ్చాను, నా అదృష్టం బాగుండి నా సంధేహానికి నీ ద్వారా జవాబు దొరికింది. నా దాష్టీకానికి సమాధైన సుధకి ప్రతి రూపంగా ఆ అమ్మాయి కనిపిస్తోంది నాకు” అని చెప్పి సునంద కి బై చెప్పి వచ్చేసాను.
విషయమంతా భవానికి చెప్పాను. తనూ చాలా ఆనందించింది. “మీరేమీ అతిగా ఆలోచించకండి. అయిందేదో అయింది. చూద్దాం కాలం ఏ తీర్పు చెబుతుందో? ఎక్కడో ఢిల్లీలో ఉండి ఇన్నాళ్లు కనిపించని ఆ అమ్మాయి.. మన సిటీకే కోడలుగా రావడం వెనుక ఆ విధి ప్రమేయముందేమో?”..
“ఏమో! తాను మనకు దగ్గరై.. మీ పశ్చాతాపాన్ని గుర్తించి, కనికరించి మనంటికి కూతురుగా రావొచ్చేమో! చూద్దాం. అంతే మంచే జరుగుతుందని ఆశిద్దామండి” అంటూ అనునయిస్తున్న భవాని మాటలను అలా వింటూ నిద్ర ఆవహిస్తుండగా.. “భవానీ వీధి తలుపు తెరిచి ఉంచు.. తను వస్తుందేమో” అంటూ గొణుక్కుంటూ అలా, అలా ఆశల నిద్రలోకి జారిపోతున్నాను
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.