[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 20 – మొదటి భాగము
సంగీత విషయము – అర్థము:
రసప్రపూరితమై వీనులకు శ్రావ్యముగా ఉండెడి స్వరము లనబడెడి ఒకానొక రకపు ధ్వనుల విశ్వరంజక సమ్మేళనమే సంగీతము.
సంగీత ప్రాశస్త్యము:
విజ్ఞానమంతయు రెండు విధములుగా విభజించవచ్చు. 1. కళలు 2. శాస్త్రములు. కళలు 64. ఈ చతుష్షష్టి కళలలో ‘లలిత కళలు’ అనగా సంగీతము, కవిత్వము, శిల్పము, చిత్రలేఖనము – మొదలైనవి విశిష్టమైనవి. ఈ లలిత కళలలో సంగీతము అత్యున్నతమైనది.
ఏలన – ప్రపంచంలో ఏ మారుమూలనైనను – చివరకు ఎట్టి అనాగరిక జాతికైనను ఏదో ఒక రకమైన సాంప్రదాయకమైన గానఫణితి ఉండును.
సంగీతమునకు భాష, మతం, జాతి, దేశం మొదలగు హద్దులు లేవు. సంగీతజ్ఞులు దేశాంతరములందు గౌరవింపబడుదురు. ఉదాహరణకు సితార్ విద్వాంసులైన పండిట్ రవిశంకర్ సంగీతమును పాశ్చాత్యులు విని ఎంతో ఆనందించుచున్నారు. అటులనే కీర్తిశేషులైన ఖాన్ సాహెబ్ బడే గులామ్ ఆలీ, పాకిస్తాన్‍కి చెందినవారైనా, భారతీయులు ఆయన సంగీతమునకు జోహారు లర్పించిరి.
సంగీత ప్రభావమునకు లోబడని వారుండని మనకు అనేక కథలు, చరిత్రలు, ఘట్టములు తెలుపుచున్నవి.
శ్లో:
‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః’
- సంగీతము శిశువు, పశువులనే గాక, విష సర్పములను కూడా ప్రభావితం చేయును.
- సంగీతం అభ్యసించుట వలన లేక కనీసం విని ఆనందించుట వల మానవుడు తనను తాను ప్రక్షాళనము చేసికొని, సంఘమునకు మరింతగా ఉపయోగపడగలడు.
- సుసంగీతము వినుట వలన, అభ్యసించుట వలన ఆత్మశుద్ధి కల్గి సంస్కారము పెరుగుననుటలో సందేహము లేదు. సుసంగీతము విని ఆనందింపలేని వారు ఎట్టి పాపకార్యమునకైనను తగుదురనియు, మరియు అట్టివారు ఎన్ని శాస్త్రములలో పండితులైనప్పటికీ పశువుతో సమానమని చెప్పబడినది.
- సంగీతమునకు ప్రకృతియే లోబడినది. దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, తాన్‍సేన్, మొదలగు గాయకులెందరో తమ అపూర్వ గానముచే వర్షములు కురిపించిరనియు, పంటలు పండించిరనియు, రుగ్మతలను పోగొట్టిరనియు వారి వారి చరిత్రలను బట్టి తెలియుచున్నది.
లలిత సంగీతము:
ప్రేమ, భక్తి, సుగుణ వాత్సల్యము మొదలగు సద్గుణములకే లలిత గుణములని పేరు. మానవుల యందు లలిత భావ ప్రకోపము వలన లలిత గుణములు ఏర్పడును. ఈ గుణముల మానవులే కళలను ఉపాసించినందువలన ఏర్పడునో, ఆ యా కళలకు లలిత కళలని పేరు. ఇటువంటి కళలలో సంగీతము ఒక కళ.
ఒక్క మానవులకు మాత్రమే గాక సకల ప్రాణికోటికిని ఏకకాలమున రంజింప కలిగించెడి విశ్వరంజకత్వ లక్ష్మ ముందుట చేత సంగీత కళలలోకెల్ల ఉత్తమోత్తమ కళ (the finest of fine arts) గా పరిగణింపబడుచున్నది.
సంగీతము రసప్రపూరిత ధ్వనులకు సంబంధించినది ధ్వని భౌతిక శాస్త్రములో ఒక విషయము. కొంతవరకు ధ్వనికి సంబంధించిన భౌతిక విజ్ఞాన శాస్త్ర నియమముల ప్రకారము సంగీత కళ యేర్పడు చున్నందు వలన సంగీతము కేవలమొక కళ మాత్రమే గాక, విజ్ఞానదాయములగు శాస్త్రముగా కూడా నేర్పడినది.
మానవుడు తన మేధాశక్తి చేత విశ్వరంజకముగా సంగీత ధ్వనులను సమ్మేళనం చేయుచు, గాత్రముతో గాని, జంత్రముపైన గాని గానము చేసెడి క్రియకు సంగీత కళ అని పేరు.
సంగీత ధ్వనుల యుత్పత్తి, వాటి పరిమితి, వాటి భేదములు, ఆయా ధ్వనులలో ఒక దానితో మరియొక దానికి సంబంధము, వాటిని సమ్మేళన జేసెడి క్రమములు, ఆయా క్రమములకు సంబధించిన నియమములు మొదలగు లక్షణములన్నియు చేరి సంగీత శాస్త్రమనబడును.
సంగీత కళ విశ్వరంజకత్వమును, లలిత భావ ప్రేరేపణత్వమును, సాత్వికాది సుగుణదాయకత్వమును, మరియు, జ్ఞాన విజ్ఞానదాయకత్వమును కల్గినందు వలన ఏ దేశము ఆ కళ యందు వెనుకబడి యుండునో, ఆ దేశము నందలి ప్రజలు నాగరికత యందు వెనుకబడి యుండుట చెప్పవచ్చును. కనుక ప్రపంచమందు గల ఆయా దేశములలో ఆయా దేశీయుల అభిరుచులకు సరిపడు సంగీత పద్ధతులు గలవు.
సంగీతము అనునది భగవదారాధనే ధ్యేయముగను, అహంభావ రహితమైన మనుగడలు అలవర్చుకొనుటకు, తాత్వికులు సదా వారి సదాచారముల కొరకును, వారి ఆరాధన కొరకును, వారి సన్మార్గ గమనము కొరకును, భక్తితో సంగీతాధ్యయనము చేసి, సత్ సాంప్రదాయములను ఏర్పరిచినారు. తత్ సంప్రదాయ సంగీతమే నేడు శాస్త్రీయ సంగీతమను పేర ప్రచారము లోనికి వచ్చినది.
నిత్యకృత్యములలో వివిధములైన కళానుష్ఠానము వలన కలుగు రసానుభూతులు అనుభవైక వేద్యములు.
సువిదితములైన తదభిరుచులకు తగినట్లు సంగీతము కూడా భిన్నరీతులలో రూపొందినది. అందు లలిత సంగీతము యొక రూపాంతరము. ఇట్టి లలిత సంగీతమునకు ఒక సంప్రదాయము ఏర్పరచవలెను. సంగీతమునకు సంప్రదాయమెట్లేర్పడును? విలక్షణమైన రచన గాన సముద్భవము సంప్రదాయము. సుశారీరము, సుజ్ఞానము గల్గిన గాయకోత్తముల గానము నుండి సముద్భవించు గానఫణితిని సంప్రదాయమందురు.
లలిత సంగీతమునకు సంప్రదాయ స్రష్టలు బహుకొద్ది మంది మాత్రమే గాననగును. లలిత సంగీత సంప్రదాయ సృష్టికి కావలసిన విశేషములు:
- శృతి, లయ, స్వర జ్ఞానము నందు సుశిక్షితమైన పరిజ్ఞానము
- సాహిత్య జ్ఞానము
- రసపుష్టి కల్గిన సాహిత్య రచనలు
- సాహిత్య రచనలోని అర్థము, భావము తెలిసికొనగల్గిన పరిజ్ఞానము
- సంగీత, సాహిత్యములు మేళవింపజేయ గల్గిన సరస రసజ్ఞత
- సాహిత్య రచనలోని అర్థమును తెలిసికొని భావమును తగిన ఫణితని ఉపయోగించగల్గు భావనా విశేషము
- అట్లు ఊహించి రచించిన గేయ గానములను స్వరపరిచి వ్రాయగల శక్తి
- ఏదైనా సంగీత వాద్యము వాయించగల శక్తి
- రాగ జ్ఞానము, విశేష ప్రమాణములు గల గాన ప్రదర్శనా శక్తి
- వాద్య సమ్మేళన శక్తి
ఇంకను ఇట్టి అనేకములగు గుణ విశేషములు కలిగిన వారే లలిత సంగీతమునకు సంప్రదాయ మేర్పర్చగలరు. ఇట్టి శక్తియుక్తులు గల ధీమంతులు బహు అరుదు.
భారత సంగీత చరిత్ర:
కర్ణాటక సంగీత చరిత్ర బహు భంగిమలలో పూర్వము నుండి వృద్ధి పొందుచూ వచ్చినది. ఆంగ్ల సంగీతము మొదలిడు సమయమునకు మన భారతీయ సంగీతము అత్యున్నత స్థితికి వచ్చినది.
భారతీయ సంగీతమును ఈ క్రింది విధములుగా విభజించవచ్చు:
- స్వరముల పరిణామము (Evolution of Scales)
- రాగ పద్ధతి, రాగముల విభజనల పరిణామము
- తాళ పరిణామము
- సంగీత రచనల పరిణామము
- మనో ధర్మ సంగీతము యొక్క పుట్టుక, తరువాత పరిణామము
- శాస్త్రీయ సంగీతము, సంగీత నాటికలు, నృత్యగానము, జానపదముల యొక్క పరిణామము
- కాలక్షేపము యొక్కయు, గాన సభల యొక్కయు చరిత్ర
- సంగీతము యొక్క పరిణామము
- సంగీత పాఠశాలలు, నేర్పు పద్ధతులు
- సంగీతము యొక్క ఫక్కీల మార్పుదల
- సంగీత వాద్యముల పరిణామము
- సంగీత కావ్యములు
- వాగ్గేయకారులు, విద్వాంసులు, గాయకులు
- ఇతర దేశ సంగీతము వలన కలిగిన మార్పులు
ఆది నుండియు గానము చేయని మనుజుడు లేడు. మనుజుడనేల, జీవరాశి యేదైనను సరియే. ఏదియూ ఒక విధమైన సంగీత ధ్వని ప్రతి కణము నందు ఉన్నది. సెలయేళ్ళ అలజడి, పల్లెటూరి గొల్లపిల్లవాని పిల్లనగ్రోవి పాట అన్నియు సంగీత నాదమే. ఏ శబ్దమైనను అది ఓంకారమే. ఓంకారమే శుశృతి, సంగీతము కనుక ప్రకృతి అంతయు నాదముతోను, గానము తోను నిండియున్నది. కాన ప్రకృతి ఎప్పుడు మొదలిడినదో, అప్పుడే గానము పుట్టినది. రామాయణమంతయు జతులలో లవకుశులు రామాస్థానము నందు పాడినట్లు మనకు రామాయణము వలన తెలియుచున్నది. వేదములలో సామవేదము పూర్తిగా గానము చేయదగి యున్నది.
సంగీత చరిత్రను మూడు భాగములుగా విభజించవచ్చు:
- ప్రాచీన కాలము నుండి మతంగ ముని వరకు
- మధ్య కాలము నుండి అనగా మతంగ ముని యొద్ద నుండి వేంకటమఖి వరకు (రత్నాకరము నకు ముందు, తరువాతి కాలమని కూడా అనవచ్చు)
- ప్రస్తుత కాలము
దీన్నే ఆంగ్లమున ancient, medieval, and modern అని అనవచ్చు.
ఋగ్వేద కాలములో ఋగ్వేదమును ఒకే స్వరములో పాడుచుండిరి. ఏకస్వర గానమని అందురు. దీనినే ఆర్చిక గానమని అందురు.
తరువాత 2 స్వరములలో గానము చేయుచు దానికి గాతిక అనియు; 3 స్వరములలో గానము చేసిన సామిక అనియు పేర్లు పెట్టిరి.
- ఎక్కువ శృతి యందు పాడు స్వరములకు – ఉదాత్త అనియు
- క్రింది శృతి యందు పాడు స్వరములకు అనుదాత్త అనియు
- మధ్యమ శృతి అయందు పాడు స్వరములకు – స్వరిత అనియు పేర్లు పెట్టిరి.
మధ్యమ శృతికి స్వరితమే ఆధార స్వరము.
ఒక స్థాయిలో ఎన్నియో శృతులు కలవు. స్థాయి యొక్క క్రింది షడ్జమము నుండి పై షడ్జమము వరకు ఎన్నియో శృతులు కలవు. ఒక గీత లోని బిందువులతో శృతులను పోల్చవచును. ఈ శృతులలో కొన్నిటిని ఏరి మనకుపయోగించిన యెడల ఆ శృతులు స్వరములుగా మారి ఒక రాగము యొక్క స్వరము లగుచున్నవి. ఆ స్థాయి లోని తక్కిన శృతులు శృతులు గానే యుండి మరియొక రాగమునకు స్వరములగుచున్నవి.
సామగానము చేయునప్పుడు, వారి వారి గాత్రమునకు తగినట్లు (అనగా మధ్యస్థాయి) మొదలిడి క్రిందకి తమ గానమును దింపిరి. సామగానము 5 స్వరములలో పాడిరి. అవి గ – రి – స – ని – ద. ఇది 3 స్వరముల సామిక గానము నుండి ఉద్భవించినది.
ఈ 5 స్వరములకు పైన మధ్యమమును, క్రింది (ప) చేర్చిన 7 స్వరములు పూర్తి అయ్యెను (మ గ రి స ని ద ప).
కనుక సామగానము యొక్క మెట్లలో 2 భాగములు మ గ రి స; స ని ద ప. రెండు చివరల స్వరములు మ ప. వాటి నిష్పత్తి 3:4.
క్రీ.పూ. 1500 సంవత్సరము – మన భారతదేశములో సప్త స్వరములు పాడుట అలవాటయ్యెను. తార, మధ్య, మంద్ర స్థాయి లను కూడా ఉపయోగించుచుంటిరి. ఉదాత్త, అనుదాత్తల అర్థము – కాలమును బట్టి మారుచూ వచ్చెను. మొదట ఒక స్వరమునకు, తరువాత 2 స్వరములకు, అటు తరువాత 3 స్వరములకు, చివరకు 1 స్థాయికి ఈ పేర్లు వచ్చినవి. స్వరిత ఆధార స్వరముగనే యుండెను; కాని తరువాత షడ్జమము (లేక) మధ్యమము (లేక) పంచమము తెలిపెను.
భరతుడు స ప, స మ సమ్మేళనతో 22 శృతులను కనుగొని 22 శృతులు గల 2 గ్రామములను పేర్కొనెను. వీటికే జాతులను పేరు. శుద్ధ వికృతి జాతులను, స్వరము మెట్లను (scale) కూడ పేర్కొనెను.
భరతుని తరువాత జాతి, రాగములని, గ్రామ రాగములని పేర్లు వచ్చినవి. తరువాత భరతుడు పరిశీలించిన 5 స్వరముల మెట్లను, 6 స్వరముల మెట్లను, తక్కిన ఉపమెట్లను, భాషా, విభాషా, అంతర్భాషలను రాగములుగా బయల్దేరినవి. జాతి రాగములు జనక (లేక) పురుష రాగములు గాను; భాషా మొదలగు రాగములను స్త్రీ రాగములుగా వాడుకలోనికి వచ్చినవి. ఇప్పటి హిందుస్థానీ సంగీతములోని రాగ రాగిణి, పరివార రాగములకు ఇదియే పునాది.
వేంకటమఖి 72 మేళములను కనిపెట్టెను. వానిలో వేలకొలది చిన్న రాగములు అనగా జన్యరాగములు బయలుదేరినవి.
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.