[శ్రీ దినకర్ రెడ్డి వెలువరించిన ‘సంధి కాలం’ అనే కథాసంపుటికి కొల్లూరి సోమ శంకర్ వ్రాసిన ముందుమాటను పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]
ప్రతి మనిషిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. అవి స్థిరంగా ఉండక, ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. ఏది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మనిషి అలా ప్రవర్తిస్తుంటాడు. చాలాసార్లు బయటికి ఒకలా, లోపల ఒకలా ఉంటాడు. మనిషి ఎప్పుడెలా ప్రవర్తిస్తాడనేది ఎవరికీ అంతుపట్టని విషయం!
సమాజంలో జరుగుతున్న ఘటనలని చూస్తుంటే మనుషులెందుకు ఇలా తయారవుతున్నారు? వస్తు వాంఛ సంబంధిత కారణాలా? మానసిక కారణాలా? వినిమయ సంస్కృతి మాయలో పడడమా? శరీరాలని భోగవస్తువులుగా చూడడం వెనుక ఉన్న చీకటి కోణాలేంటి? ఏయే శక్తులు మనిషి అంతరంగాన్ని ప్రభావితం చేసి ఉన్మాదానికి కారణమవుతున్నాయి? మనిషి చేసే ప్రతి చర్యకీ వెనుక మార్కెట్ మాయాజాలం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మనసుని కుదిపేయగా, దినకర్ రెడ్డి గారి అంతర్మథనం నుంచి పుట్టిన కథలివి.
మనిషి ప్రవర్తనకి ఏది గీటురాయి అని ప్రశ్నించి, ప్రవర్తనే ఆ గీటురాయి అని చెబుతారు. తాను చేసే ప్రతీ పనిని మనిషి సమర్థించుకుంటాడు. ఒక్కోసారి peer pressure బలంగా పని చేసి.. గుంపులో ఒకడిగా.. చెయ్యరాని పనులు చేస్తాడు. కానీ మనస్సాక్షి ఊరుకోదు. మారడానికి మరో అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నవాడి ప్రవర్తన మరొకడి ప్రవర్తనకి గీటురాయి అవుతుంది.
***
మనిషి తన ప్రవర్తనలకీ, చర్యలకీ, ఆలోచనలకీ – కారణం తను కాక, వేరే ఎవరికో ఆపాదిస్తాడు. శరీర మోహం తొలగితే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని కాక, మోహాన్నే అట్టేపెట్టుకున్నవాడు పశువవుతాడు. జ్ఞానాన్ని నిలుపుకున్నా, మోహాన్ని పూర్తిగా వదులుకోలేక, అంతర్మథనానికి గురవుతూ, తప్పుగా ఆలోచించినా, తనని తాను దిద్దుకునేవాడు మనిషిగా మిగులుతాడు. మోహాన్ని పూర్తిగా విడిచి, జ్జానాన్నే ఆభరణం చేసుకున్నవాడు మానవతామూర్తి అవుతాడు. మనిషిగా మారేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని ఒక కథ వెల్లడిస్తుంది.
కరోనా సృష్టించిన సమస్యలలో అతి ముఖ్యమైనది – ఆ సమయంలో వేరే ఇతర జబ్బుతో మరణిస్తే, అది కరోనా వల్ల సంభవించిన చావు కాదని నమ్మించాల్సి రావడం! సొంతూరులో తల్లి చనిపోతే, అంత్యక్రియలకి కొడుకు చేరుకోలేని దుస్థితి. పోలీసులని బ్రతిమాలి, అధికారులని వేడుకుని, నానాతంటాలు పడి ఇంటికి చేరిన ఆ కొడుకు, తన ఊరినే చివరిసారిగా చూసేస్తాడు ఓ కథలో.
ప్రేమికుల మధ్య అపార్థాలు ఎంతటి అగాధాన్ని సృష్టిస్తాయో తెలిసిందే. తనకి ఇష్టం లేని పని చేశాడని తన ప్రియుడిని దూరం పెడుతుందో యువతి. కొన్ని రోజులకి కరోనా వచ్చి లాక్‍డౌన్ విధిస్తారు. ఎక్కడివాళ్ళక్కడ ఉండిపోతారు, సమాచారాలు తెలియవు. కామన్ ఫ్రెండ్ మాధవితో మాట్లాడే ప్రయత్నమూ చేయదా యువతి. దాదాపు వంద రోజులు గడిచాకా, కాలేజీకి వెళ్ళాకా, జరిగిన విషయం తెలిసిన ఆమె గుండె బద్దలవుతుంది. ఇల్లు చేరి, మేడ మీద కూర్చుని గుండెలవిసేలా ఏడుస్తుంది. మాండలీకంలో రాసిన ఈ కథ మనసుని తాకుతుంది. కథలోని చివరి వాక్యం హైలైట్.
మామిడిపళ్ళు పండించిన ఓ రైతు వ్యథని ఒక కథ ఆర్ద్రంగా చెబుతుంది. రైతు ఆశలకి తెల్ల పురుగు పట్టిందని రచయిత రాసిన వాక్యం – ఆ రైతు దుస్థితిని కళ్ళకు కడుతుంది. పంటని అంత తక్కువ ధరకి అమ్ముకోవాల్సి రావడంలో తప్పెవరిదో అతనికి అర్థం కాదు. మార్కెటింగ్ మాయని అవ్యక్తంగా చెప్తుందీ కథ.
ఎడారిలో విండ్ మిల్ పెట్టి పవన విద్యుత్తు ఉత్పత్తి చేయడమనే ఇతివృత్తంతో రాసిన వైవిధ్యమైన కథ ఒకటుందీ పుస్తకంలో. ఈ ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన కథలు తక్కువేననిపించింది. ఎడారిలో వచ్చే ఇసుక తుఫాను ఆనుపానులు స్థానికులకు బాగా తెలుసు. కానీ, జైసల్మీర్ ప్రాంతంలో ఓ గ్రామ శివారులోని సబ్ స్టేషన్‍లో ఉద్యోగం కోసం వేల కిలోమీటర్లు దాటి వచ్చిన ఆ తెలుగు యువకుడి అంతరంగంలో చెలరేగే తుఫానుని ఎవరు అర్థం చేసుకోగలరు? కథ అసంపూర్తిగా అనిపించవచ్చు. కానీ పాఠకులలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుందీ కథ.
ఎన్నో విషయాల్లో మనం గుర్తించని ఓ మీమాంసని ఓ కథలోని పాత్ర మన ముందుకు తెస్తాడు. జనంలో ఉన్నప్పుడు మన ప్రవర్తనని ప్రశ్నిస్తాడు. మనిషి ఆలోచనా విధానాన్ని – ఓటిటి వెబ్ సీరిస్‍లు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఈ కథలో ఒకే వాక్యంలో రచయిత చెప్పినా, దాని వెనుక ఉన్న ఆవేదన గ్రహింపుకొస్తుంది.
పత్రికల్లో వచ్చేదీ, నిజంగా జరిగేదీ ఒకటేనా అని ఆలోచించాలని ఓ తండ్రి కొడుక్కి చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరికీ వర్తిస్తాయి. పెద్దయ్యాకా ఆ కొడుకు వ్రాసిన వ్యాసం పేపర్లో అచ్చవుతుంది. చిన్నప్పుడెప్పుడో అమ్మానాన్నలు ఓ వ్యవసాయ వేడుక గురించి చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని మీద వ్రాసిన ఆ వ్యాసం చదివాక తండ్రి కళ్ళలోంచి నీళ్ళు జారి చదువురుల మనసులను తడుపుతాయి.
దేనినీ, ఎవరిని జడ్జ్ చేయకూడదనీ, ప్రకృతిలో దేని అందం దానిదేననే విజ్ఞత ముఖ్యమని చెప్తుందో చిన్న కథ. కోవిడ్ కాలంలో కరోనా వార్డులో డ్యూటీ చేసిన ఓ యువ వైద్యురాలి మానసిక వేదనకి మరో కథ అద్దం పడుతుది.
సమాజంపై సోషల్ మీడియా ఇన్‍ఫ్లూయెన్సర్ల ప్రభావం ఎలా ఉంటుందో ఒక కథలో చక్కగా చెప్పారు రచయిత. ప్రస్తుత కాలానికి అత్యవసరమైనదీ కథ.
టీవీ సీరియల్స్ సాగదీతలపై సంధించిన వ్యంగ్య బాణం మరొక కథ. రచయిత రాసిన పద్ధతికి కాస్త నవ్వొచ్చినా, బాగా ఆలోచింపజేస్తుందీ కథ.
మన దగ్గర అవసరం లేకుండా పడి ఉన్నవాటిని, నిజంగా అసవరమున్న వారికి ఇస్తే, తీసుకున్నవారితో పాటు మనకీ ఎంతో తృప్తి కలుగుతుంది. కానీ వస్తు వ్యామోహం అంత తొందరగా వదలదు. కొన్నిసార్లు వేరెవరో ముందుకొచ్చి ప్రేరణనిస్తే గాని ఆ వ్యామోహాన్ని తొలగించుకోలేం. మెదడు బీరువాలో కుక్కిన ఆలోచనలని వదిలించుకోమని చెప్తుందో చక్కని కథ.
తనకేమీ పట్టనట్టు వేడి గాలి మమ్మల్ని తాకుతూ వెళ్ళింది అంటారు రచయిత ఓ కథలో. పట్టనిది గాలికి కాదు, మనుషులకే అనిపిస్తుంది ఆ కథ చదివాకా.
నిర్వాణషట్కం నేపథ్యంలో అల్లిన కథ ఈ సంపుటికి తలమానికం లాంటిది. మనకు మంచి అనిపించే పని చెయ్యడానికి ఎవరో ఏదో అనుకుంటారని వెనుకాడనక్కరలేదని ఈ కథ చెబుతుంది.
అమ్మ జ్ఞాపకాలని నిలిపి ఉంచిన పోపుల పెట్టి అత్యంత అపురూపమవుతుంది ఓ కొడుక్కి ఓ చిన్ని కథలో.
పెళ్ళికి గొప్ప నిర్వచనం ఇస్తుందో కథ. మగవాడి ప్రామాణికతని ప్రశ్నిస్తూ.. బయటివాళ్ళని అనేముందు, మనవాళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో చెక్ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తుందీ కథ.
మగాళ్ళను మృగాళ్ళుగా మారుస్తున్న ఆధునిక మానసిక వికృత ధోరణులను, వాటికి ఊతమిస్తున్న సమాజపు పోకడలను, ఓ లెక్చరర్ అంతర్మథనాన్ని కళ్ళకు కట్టిన కథనే ఈ సంపుటికి శీర్షికగా ఉంచటం బావుంది.
~
కళ్ళకి ఎదురుగా ఎన్నో కనిపిస్తున్నప్పుడు, దేన్ని, ఎలా చూడాలో, ఈ కథలు చెబుతాయి.
ఈ కథలవి ఇతివృత్తాలు వేర్వేరయినా, అంతస్సూత్రంగా వీటన్నిటినీ కలిపే అంశం ఒకటుంది. అదే – సెన్సిటివిటీనీ కోల్పోయి, బండబారిపోతున్న మనుషుల పట్ల రచయిత ఆవేదన! కథ అర పేజీది కావచ్చు, రెండు పేజీలది కావచ్చు, కానీ అన్ని కథల్లో ఈ ‘కన్సర్న్’ కనబడుతుంది.
ఓ కథలో ఓ అమ్మాయి పేరు గమ్మత్తుగా ఉంటుంది ‘ప్రతిక్రియ’ అని! మనిషవన్నీ ప్రతిక్రియలే, అయితే దేనికెలా స్పందించాలి, ఎటువంటి ప్రతిక్రియ చేయాలన్న విజ్ఞతని కోల్పోనివాడే అసలైన మనిషని ‘సంధికాలం’ సంపుటిలోని కథలు చెబుతాయి.
గుండె తడి కోల్పోని యువ రచయిత కథాసంపుటికి స్వాగతం.
***
రచన: దినకర్ రెడ్డి
ప్రచురణ: తపస్వి మనోహరం పబ్లికేషన్స్,
పేజీలు: 67
వెల: ₹ 125/-
ప్రతులకు:
+91 78934 67516
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/dp/B0FGXY32YN?
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
