Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక విశ్వవేదిక – కృత్రిమ మేధ, మూలాలు, పర్యవసానాలు

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ‘కృత్రిమ మేధ, మూలాలు, పర్యవసానాలు’ అనే రచనని అందిస్తున్నారు శ్రీ సారధి మోటమఱ్ఱి.]

నిషి నిప్పును కనిపెట్టక ముందు ఉన్న జీవన విధానం, బండి చక్రం కనుగొనక ముందు ఉన్న జీవన సరళి, మనం కొంత ఊహించవచ్చు, కానీ పూర్తిగా మనకు అవగతం కాదు! తెలియనిది తెలుసుకోవాలనే జిజ్ఞాస, తెలుసుకొన్నది తనకి ఉపయోగపడి, తన శారీరిక శ్రమను అంతమొందించాలనే తరగని తపన, ఆమోఘమైన శాస్త్ర, సాంకేతిక విప్లవాలకు నాంది అనేది నా ప్రతిపాదన. వీటన్నటికీ మించి, కంప్యూటర్, లేదా గణనయంత్ర సృష్టి మనిషి ఆలోచనాశక్తికి పరాకాష్ఠ అని నా నమ్మిక. మనిషి తాను సృష్టించిన కంప్యూటర్ తనను మించిపోయే పరిస్థితి, నాలుగు దశాబ్దాలలోనే (అంటే 1990 లకే) చేరుకుంది, అంటే దాని వెనుక ఎంతటి శ్రమ, పరిశోధన, కృషి, తపన, గుర్తించని ఎందరో చెమట, దాగి ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది నిజం. ఈ పరిణామాన్నే కృత్రిమ మేధ, Artificial Intelligence, AI అనే పేర్లతో చెబుతున్నాము. ఒక ప్రక్క AI ద్వారా లబ్ది పొందాలనే తీవ్ర వ్యాపార పోటీ, మరొక ప్రక్క, సాంఘిక, నైతిక, మానవతా విలువల కొలతలలో ఈ వృద్ధి సమంజసమేనా అనే తీవ్ర మీమాంస! అంతేకాదు, కొందరిలో, రేపు ఏమిటనే నిర్వేదన, భయం కలుగ చేస్తున్నదనేది, పరిశోధనా పత్రాలలో దశాబ్దాలుగా వెలువరిస్తున్న వాదన.

ఈ మీమాంస ఒక AI కే పరిమితం కాదు. సమస్త మానవజాతి పరిణామంలో వచ్చిన అనేక మార్పుల సంధికాలంలో, ఆ తరువాత కూడా, తీవ్ర వాగ్వివాదాలకు దారితీసింది. ఈ నేపధ్యంలో, ఈ రోజు మీ అందరితో కొంచెం లోతుగా అసలు ఈ కృత్రిమ మేధ అంటే ఏమిటి, దాని మూలాలు ఎక్కడ, దీని వలన సమాజానికి జరిగే మేలు, కీడు, అంటే పర్యవసానాలు ఏమిటి? అనే విషయాలపై చర్చించాలని గత కొన్ని నెలలుగా అనుకున్నా, ఈనాటికి సాధ్యమైంది. ప్రధాన అవరోధం భాష, విధిగా ఈ సంభాషణలో ఆంగ్లం రాక మానదు. శ్రోతలు మన్నించగలరని అనుకోలు. మహాకవి గురజాడ గతాన్ని పరికించి, తన చూపును ఒక 5 శతాబ్దాల ముందుకు సారించి, వాడుక తెలుగులో 1897లో రాసిన, కన్యాశుల్కం, అనే అజరామరమైన నాటకాన్ని, “డామిట్! కథ అడ్డం తిరిగింది”, అనే గిరీశం చెప్పే అద్భుత మాటతో ముగిస్తాడు. 1818 లో మేరీ షెల్లీ వెలువరించిన మహత్తర Frankenstein నవల చివరకు, “Frankenstein’s wonder became Frankenstein’s disaster.” అనే భావనతో ముగుస్తుంది. శ్రోతలలో చాలామంది 1980 లలో వచ్చిన ఒక హాస్య ప్రధాన, అంతర్లీనంగా సందేశాత్మకమైన, “The Gods Must Be Crazy” సినిమా చూసే ఉంటారు. ఆకాశం నుండి జారిన కోకో కోలా, ఒక ఆటవిక జాతికి దేవుని వస్తువుగా, అది ఎన్నో అవసరాలుగా తీర్చేదిగా మారినా, చివరికి వారిలో వారికి కొట్లాటలు రావడంతో, దానిని విడనాడడమే మేలు అనే స్థితికి వస్తారు. అలాకాక, శాస్త్ర, సాంకేతిక, తత్వ, మతాది శాఖలు మానవునికి ఉన్నతిని అందించాలని, మానసిక పరిపక్వతనందించి, మనిషిని మనీషిని చెయ్యాలని, మనసులు కలయచేసి, తిరనాళ్ళు జరుపుకునే దిశకు మనలను నడిపించాలని నా భావన, ఆశ!

AI పరిశోధకులలో జరిగిన కొన్ని చర్చలను ఒక తాటికి తీసుకొని రావాలని ప్రయత్నంలో, ఆ రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన Artificial Intelligence, అనే విద్వత్ పత్రిక అంటే Academic Journal, జనవరి 1991 లో ఒక ప్రత్యేక సంచికని ప్రచురించింది. ఆ సంచికను చదివిన తదుపరి, 1992 లో (అంటే 32 సంవత్సరాల క్రితం) ఒక సాంకేతిక వ్యాసం, “Reflections on AI”, పేర రాశాను. కానీ, ప్రచురణకు నేను మరి 22 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. ఆ సాంకేతిక వ్యాసం, 2014 న్యూజిలాండ్ లో జరిగిన 25th Australasian Conference on Information Systems సమావేశంలో, “Reflections on Artificial Intelligence – A Hermeneutic Journey” గా చర్చించాను. ఆ వ్యాసం, 1992 ACM Software Engineering Notes లో ప్రచురితమైన నా మరొక వ్యాసం, “A Diagnostic View on Information Technology” మరియు నాలుగు దశాబ్దాలుగా చదువు, వృత్తి, పరిశోధన, అనుభవాల నుంచి కొన్ని మౌలిక విషయాలు ఇక్కడ చర్చిస్తాను. ఈ లైవ్ చర్చలో శ్రోతలు నా చరవాణికి ఫోన్ చేసి పాల్గొనవచ్చు.

ప్రారంభ పలుగులకు ఇక్కడ సెమీ కోలన్ పెట్టి, 1972 లో వచ్చిన ఆత్రేయ రచన, కె వి మహదేవన్ స్వరకల్పన, సుశీల గానం చేసిన, సాంకేతికని అల్పపదాలలో, భవిష్యత్తుకు, అనుసంధానించే, “బూచాడమ్మా బూచాడు” పాట విందాం. కంప్యూటర్ ప్రగతికి, ఒక గణనీయమైన వాహకమైన telecommunications ను ఉన్నతిస్తూ రాసిన ఈ పాట, నేటికీ క్రొత్తదే. అంతేకాదు, AI సర్వవ్యాప్తికి మూలమైన ఇంటర్నెట్ కు telecommunications మూలస్థంభం. వినండి, మీరే ఔను అంటారు.

ఈ చర్చ పూర్తి ధ్వనిముద్రణని ఈ క్రింది లంకెను అనుసంధానించి వినగలరు.

మీ మీ అభిప్రాయాలు తెలియచేయ మనవి.

https://drive.google.com/file/d/1WYIrFmRVCFIoByClYEcHW7VTHD4mM8es/view?usp=drive_link

Exit mobile version