[వి. భాగ్యలక్ష్మి గారు రచించిన ‘సముద్ర తీరం..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ సముద్ర తీరమా!
నీ పై నుండి నువు తీరం చేర్చిన ఓడలెన్నో
కానీ నీ సంద్రమే ఎక్కని ఒడ్డున
మిగిలున్న చిన్న తెప్పని నేను
అయినా నా జీవన పయనంలో నీ పాత్ర ప్రధానమే
నాలో నన్ను అన్వేషిస్తూ నీ తీరం చేరిన తరుణం
నా మనసులోని కల్లోలం నీకు వినిపించింది నా దుఃఖం
నీ అలల శబ్దంతో విన్నా అని నువు బదులిచ్చిన ధైర్యం
నీ చల్లని గాలితో నా కురులను తడిమినది నీ కోమలం
నీ అలల ఘోషతో నాలో నిశ్శబ్దాన్ని నింపిన నీ గాంభీర్యం
ఇలా నీ ఒడ్డున నా కలతలు మరిచిన క్షణాలెన్నో
నీ తీరాన సేద తీరిన రాత్రులింకెన్నో
చిరునవ్వుతో వెను తిరిగి జీవిత సంద్రాన్ని
ఈదిన సంఘటనలింకెన్నో
ఓ అలుపెరుగని సముద్ర తీరమా!
నీ మనోస్పూర్తితో తిరిగి పయనించిన నావంటి
ఒడ్డున మిగిలున్న తెప్పలింకెన్నో..