Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంస్మరణ

[శ్రీ ఏ. కె. రామానుజన్ రచించిన ‘Obituary’ అనే ఆంగ్ల కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల.]

(ఏ.కె. రామానుజన్ ప్రసిద్ధ ఆంగ్ల కవి. బహుభాషా వేత్త. సామాన్యంగా వ్యక్తి చనిపోయిన తరువాత వారిని పొగుడుతూ ఉత్ప్రేక్షిస్తూ దిన పత్రికలలో ప్రకటిస్తారు. ఇక్కడ కవి తన తండ్రిని గూర్చి ఉన్నది ఉన్నట్లుగా చిత్రించారు. కవి నిందా వ్యాజంగా తండ్రి మీద గల ప్రేమను వాస్తవకోణంలో నిరూపించారు. తండ్రి స్మృతులను పదిల పరచుకున్నారు. ఈ కవిత మధ్యతరగతి తండ్రులకు నీరాజనం ఇస్తుంది.)

~

ప్ప చనిపోయాక
మాకు వదిలి వెళ్ళింది
ఆ రాత బల్లమీద సన్నని ధూళి పేరుకున్న
కొన్ని కాగితం పుటలు,
మరి కొన్ని అప్పుల బాకీ పత్రాలు,
ఆడపిల్లలిద్దరి పెళ్ళి బాధ్యతలు.
ఇంకా పక్క తడిపే చిన్ని మనుమడొకడు.
ఆకస్మికంగా చనిపోయిన నాన్న పేరే పెట్టవలసివచ్చింది,
తప్పని సరిగా వాడికి,

మాకు వదిలి వెళ్ళిందంతా మానాన్న
మాకు వయసు పెరిగేకొద్దీ
వాకిట్లో కొబ్బరి చెట్టుకు
ఒరిగి వాలుతున్న ఇల్లొక్కటి.

భగ భగ మంటల ఆహుతికి
సిద్ధమైనట్టున్న సదా సడలి కృశించిన దేహం
శవం అయ్యాక ధగ ధగ మని కాలింది.
ఇదంతా అయ్యాక కొడుకులకని
మిగిలాయి, మూసిన కళ్ళ మీదుంచిన కాసులు,
కరకుగ మారిన వెన్నుపూస ఎముకలు.

పురోహితుడు చెప్పినట్టు
అతిజాగ్రతగా వాటిని ఏరి
ధూమ శకటం ఆగే చోటు దగ్గర
త్రివేణీ సంగమంలో
పూర్వాభి ముఖులమై..
తేలి ఉంటాయి, వదిలిన ఆ బొమికలు;
అంతే కాని తండ్రి జనన మరణ దినాలను తలచుకునేట్టు,
సమాధిని, కట్టించే సాహసం చేయనేలేదు.

మిట మిట లాడే మధ్యాహ్నాన
బ్రాహ్మణ వాడలో సిజేరియన్ కోతతో
సునాయసంగా పుట్టిన అప్ప
అంతే సుళువుగా పళ్ళమ్మే బజారులో
గుండె పోటుకు
కూలి నేలకు ఒరిగాడు.

నాలుగు రోజులయాక తెలిసింది,
అప్పను గురించి వార్తా పత్రిక లోపలి పుటలో
రెండు వరసలు పొగిడి రాసిన సంగతి,
నాలుగు వారాలయాక ఆ పత్రిక
పాత పేపర్ల దుకాణదారుని
చిత్తు కాగితాలలో చేరి, ఉండిపోక
దినసరి వెచ్చాలమ్మే కిరాణా కొట్టు
పొట్లాలకు జరిగింది.

అంగడిలో బేరం చేసిన సరకులు కట్టిన
కాగితం మీద రాసిన విశేషాలను
సరదాగా చదివే అలవాటున్న
అప్పను గురించిన వాక్యాలెపుడైనా
దొరుకుతాయేమోనని వెతకడంలో
వీడదు ఏదో తెలియని ప్రత్యాశ.

ఏది ఏమైనా చెప్పుకోడానికిపుడు
లేడు కదా అప్ప;
మాకు ఇచ్చింది వేరే ఏదీ లేకున్నా,
వదిలి వెళ్ళాడు, విధవగ మారిన అమ్మను,
ప్రతి వర్షం విధి తప్పక చేసి తీరాల్సిన
తర్పణాలను.

మూలం: ఏ. కె. రామానుజన్

అనువాదం: రాజేశ్వరి దివాకర్ల

Exit mobile version