[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘సంపంగి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉదయాన్నే సూర్యుణ్ణి బయటకు రానీయకుండా ఆకాశమంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
కాఫీ తాగుతూ.. కిటికీ దగ్గర కూర్చున్న శారద బయటకు చూసింది. బలంగా వీస్తున్న గాలికి సంపంగి చెట్టు ఊగుతోంది. పసుపు రంగుకు మారిన పూలు రాలి కింద పడుతున్నాయి. వాటివైపు శారద జాలిగా చూసింది.
కాలింగ్ బెల్ శబ్దం చేస్తుంటే “వస్తున్నా!” అని లేచెళ్లి తలుపు తీసింది.
“హాయ్.. మిసెస్ శారూ..!” అంటూ ఎదురుగా నిలబడ్డ మనవరాలు అన్వితను చూసి ఆశ్చర్యపోతూ..
“రేపు వస్తానన్నావుగా!” అంది.
“నిన్ను చూడాలనిపించింది. వెంటనే వచ్చేసా!” అంది అన్విత లగేజీ, హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి.
“దోసిలి పట్టు” అని ఏరుకొచ్చిన సంపంగి పూలు శారద దోసిట్లో పెట్టింది.
“కింద ఏరుకొచ్చావా?” అని నవ్వి, డైనింగ్ టేబుల్ మీద పెట్టింది.
“అవునూ! బెంగళూరులో తింటున్నావా? లేదా?”
“నేనెప్పుడూ లావుగా ఉన్నాను శారూ!”
“అదీ.. కరెక్టే! నువ్వెళ్లి ఫ్రెష్షయి రా! నేను కాఫీ పెడతాను”
“ఫిల్టర్ కాఫీయేగా!”
“అలాగే.. తొందరగా రా!”
శారద కిచెన్లోకి వెళ్ళింది. ఫిల్టర్లో.. కాఫీపొడి వేస్తూ.. “అన్వితా! మొన్న నీ పేరుతో ఒక కొరియర్ వచ్చింది” అంది.
అద్దం ముందు నిలబడి తల జుట్టు ముడి పెట్టుకుంటున్న అన్విత “ఎక్కణ్ణుంచి?” అంది.
“సందీప్ అని మాత్రమే ఉంది. ఎవరు బాయ్ ఫ్రెండా?!”
ఆ పేరు వినగానే ముడి పెట్టుకుంటున్న జుట్టు చటుక్కన వదిలేసింది అన్విత.
“నాకెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు. సందీప్ ఎవరో నాకు తెలియదు. నువ్వే ఓపెన్ చేసి చూడు”
“ఆఁ.. నీ పేరుతో వచ్చిందాన్ని నేనెందుకు ఓపెన్ చేస్తాను”
“ఎవరో నాకూ తెలియదని చెప్తున్నాగా! నీకూ తెలియకపోతే డస్ట్‌బిన్‌లో పడెయ్యి” అని వాష్‌రూమ్‌కి వెళ్ళింది.
ఫ్రెష్ అయ్యి వచ్చి.. శారద ఇచ్చిన కాఫీ కప్పు తీసుకొని బాల్కనీలోకి వచ్చి, తలముడి తీసి.. కాఫీ సిప్ చేస్తూ..యథాలాపంగా కిందికి చూసింది. ఇంటి ముందు బైక్ పార్క్ చేసి నిలబడ్డ యువకుడు ఆమెను చూసి చేయ్యూపాడు. అతన్ని చూడగానే అయిష్టంగా మొహం తిప్పుకుంది. అక్కడ నుంచి లోపలికి పోబోతుంటే..
“అన్వీ! ప్లీజ్ ఒక్కసారి కిందికి రా!” అన్నాడతను రిక్వెస్టింగ్‌గా.
అన్విత వినపడనట్టు కదలబోతుంటే “ప్లీజ్!” అన్నాడు చేతులు జోడించి.
సంకోచిస్తూనే కిందికి వచ్చి, ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూసింది.
“ఎలా ఉన్నావు? మనకి బ్రేకప్ అయి నాలుగేళ్లయింది. గుర్తుందా!” అన్నాడతను.
“..”
“బెంగళూరులో ఎడ్యుకేషన్ అయిపోయిందా?”
“..”
“నేను హైదరాబాదులో ఫైనార్ట్స్‌లో డిగ్రీ చేసి, జేఎన్టీయూలో పీ.జీ.లో చేరాను. ఇందాక నువ్వు బస్ దిగి వస్తుంటే చూసి వచ్చాను.”
అన్విత మౌనంగా వింటోంది.
మళ్లీ అతనే.. “ఐ హావ్ బికం స్క్రీన్ రైటర్. షార్ట్ స్టోరీస్, నవల్స్, ఆర్టికల్స్, షార్ట్ ఫిలిమ్స్ కి స్టోరీస్ ఇస్తున్నా. ప్రస్తుతం ఓ వెబ్ సీరియల్ కి డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది”
“నైస్”
“యా.. నువ్వెలా ఉన్నావు?”
“ఊఁ..”
“నీకు ఇంకా నామీద కోపం తగ్గలేదనుకుంటాను. నువ్వు చూసిందే కాకుండా, నాకు చెప్పే అవకాశం ఇవ్వు ప్లీజ్!”
తలెత్తి అతని వైపు చూసింది.
“ఈ రోడ్డు నీకు గుర్తుందా? అన్వీ! మనం ఫస్ట్ టైం ఈ రోడ్లో..” అంటున్న అతన్ని ఆపి..
“ప్లీజ్ ముగిసిపోయిందానిని మళ్లీ మొదలు పెట్టొద్దు. నన్ను ఎందుకు రమ్మన్నావో తొందరగా చెప్పు”
“అకారణంగా తలెత్తిన సమస్యను సాల్వ్ చేసుకుందామని రమ్మన్నాను”
“నువ్వేం చెప్పొద్దు. నేను వెళ్తున్నాను”
“అన్వీ.. నేను చెప్పేది ప్రశాంతంగా రెండు నిమిషాలు విను. ఈ నాలుగేళ్లు ఎంత నరకం అనుభవించానో తెలుసా! నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి నువ్వు ఇష్టపడే నా రైటింగ్స్‌నే ఎన్నుకున్నాను. నేను రాసే కవితలు చదివి నువ్వు నాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు రైటర్ కాగలిగాను” అని అతను చెబుతుంటే..
అన్విత కళ్ళలో తడి.
“నిన్ను కాంటాక్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నించాను. నువ్వు ఫోన్ నెంబర్ కూడా మార్చినట్టు నాకు తెలియదు. హాలిడేస్‌కి ఇంటికి వచ్చినప్పుడు మనల్ని కలిపిన కాలేజీకి వెళ్లే వాడిని. అప్పటి మన ఫ్రెండ్స్ ఎవరితోనూ నువ్వు టచ్‌లో లేవు.”
“ఐ యాం సారీ! ఐ హావ్ టు గో” అని అక్కడ నుంచి కదలబోతుంటే..
“అన్వీ! ప్లీజ్.. ఒక్క నిమిషం విను..”
అతని మాటలు పట్టించుకోకుండా ఇంట్లోకి వెళుతుంటే..
“ఛ..! నువ్వు చూసింది.. విన్నదే కరెక్ట్ అనుకోకు. ఆ తర్వాత నీ ఇష్టం” అని బైక్ తీసుకొని వేగంగా వెళ్ళిపోయాడు సందీప్.
***
ఇంట్లోకి వచ్చి తలుపు మూసింది అన్విత. ఆగకుండా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంటే.. శారద చూసి కంగారుగా “ఏమైంది.., తల్లీ!” అంది.
“శారూ!” అంటూ వేగంగా వచ్చి హగ్ చేసుకుని ఏడ్చేసింది.
“ఏంటో చెప్పు.. అన్వితా”
“ఏం లేదు” అంది కళ్ళు తుడుచుకుంటుంటే..
“ఏమీ లేదంటేనే ఏదో ఉందని నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. నా దగ్గర దాకపరికం ఎందుకు? చెప్పు తల్లీ!” అంది శారద అనునయంగా.
“నాలుగేళ్ల తర్వాత అతన్నిప్పుడు చూశాను.”
“ఎవరిని?”
“సందీప్‌ని”
ఆశ్చర్యంగా మనవరాలు వైపు చూసింది శారద.
“శారూ! మన లైఫ్ లోకి ఎవరైనా వస్తే.. మనకి నచ్చినట్టు అన్నీ మారిపోతాయనుకుంటాం. ఎన్నో కలలు కంటాం. అలా నా జీవితంలో కి వచ్చాడు సందీప్. కొద్ది రోజుల్లోనే నా ప్రపంచమే తను అయిపోయాడు. అతనికి అన్ని నేనే. నా నవ్వంటే అతనికి చాలా ఇష్టం. నవ్వినప్పుడు రెండు బుగ్గల మీద పడే డింపుల్స్ ఎంతో ఇష్టం. అందుకోసం ఎప్పుడూ నవ్విస్తూనే ఉండేవాడు. కానీ నాలుగేళ్లుగా ఏడిపిస్తున్నాడు.” అంటుంటే అన్విత కళ్ళ నుండి కన్నీళ్ళు రాలాయి.
“మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది?” అంది శారద కూర్చుని.
అన్విత ఆమెకి ఎదురుగా కూర్చొని కళ్ళు తుడుచుకుని చెబుతోంది.
***
నాలుగేళ్ల క్రితం:
ఆ రోజు సందీప్‌ని కలుసుకుందామని బయలుదేరాను. సందీప్ బైక్ మీద వస్తున్నాడు. అతని వెనక ఓ అమ్మాయి కూర్చుంది. అతని ఫోన్ మోగుతుంటే.. బైక్ పక్కన నిలిపి ఆ అమ్మాయితో ఫోన్ తీసి చూడమన్నాడు. ఆమె తీసి చూసి ఫోన్ ఆన్ చేసి, అతని చెవి పక్కన పట్టుకుంది.
“హలో! సందీప్.. ఎక్కడున్నావు? ఇవాళ మన లవ్ యానివర్సరీ గుర్తుందా?”
“యా.. గుర్తుంది. అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుంది. రాగానే కాల్ చేస్తా!”
“సరే.. బాయ్” అని ఫోన్ కట్ చేశాను. కన్నీళ్లు నా చేతిలో ఉన్న బొకే మీద పడ్డాయి. ఎందుకంటే అప్పుడు సందీప్ బైక్ నిలిపిన చోటకి ఎదురుగా ఉన్న బస్టాప్‌లో నేను నిలబడి ఉన్నాను. వాళ్ళిద్దర్నీ బైక్ మీద క్లోజ్‌గా చూసి బొకే విసిరి కొట్టి.. వెనక్కి తిరిగాను. నా కళ్ళ ముందే మరో అమ్మాయితో నా సందీప్.. ఛ! ఏడాది పాటు అతని ఊసులతోనే గడిపాను. ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునే వాళ్ళం. వాటిని తుంగలో తొక్కి మరో అమ్మాయితో.. అదీ ఆ ప్రత్యేకమైన రోజున.. తలుచుకుంటేనే అసహ్యం పుట్టింది. నో.. వాడు నాకు సరైన వాడు కాదు. ఇంత జరిగాకా కూడా ఏ మొహం పెట్టుకుని నన్ను చూడటానికి వచ్చాడో తెలియటం లేదు. కానీ ఇప్పుడు కూడా సందీప్ ముందు నిలబడలేకపోతున్నాను. ఎందుకంటే వాడితో ఉన్నప్పుడు మా ప్రేమ ఇప్పటిది కాదనిపించేది. జన్మజన్మల బంధం అనిపించేది. ఇంకొక విషయం చెప్పనా.. నన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారీ చిన్నచిన్న కవితలు రాసుకొచ్చి చదివి వినిపించేవాడు. అతనిలో మంచి రచయిత ఉన్నాడనిపించేది. సందీప్ అందరికంటే భిన్నంగా ఉండేవాడు. నన్ను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ‘అన్వి’ అని టాటూ వేయించుకున్నాడు. నేను వాడి పేరు ‘ఎస్’ అని అన్నం తినేటప్పుడు తెలిసేలా కుడిచేతి లోపలి వైపు మణికట్టు కింద టాటూ వేయించుకున్నాను. ఇదిగో” అని చూపించింది అన్విత ఏడుస్తూ.
“ఊరుకో.. అన్వితా! నిన్నూ, నీ ప్రేమా చూస్తుంటే.. నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం”
అని శారద లోపలికి వెళ్ళింది. బీరువా తెరిచి చీర మడతల్లో దాచిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకొచ్చి, అన్వితకిచ్చింది.
అందులో ఉన్న యువతి, యువకుణ్ణి.. శారదని తేరిపోరా చూసింది.
“ఇది.. ఇది..”
“నే..నే” అంది శారద కళ్ళు మూసుకుని.
మూసుకున్న కళ్ళ వెనుక నలభై ఏళ్ల గతం వెనక్కి తీసుకెళ్ళిందామెని.
***
నలభై ఏళ్ల క్రితం:
తమ ఊరికి పది కిలోమీటర్ల అవతల ఉన్న పక్క ఊళ్ళో హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నారు శారద, కవిత. బస్సు దిగి అర కిలోమీటర్ నడవాలి.
సాయంత్రం బస్సు దిగి ఇంటికి వస్తున్నారు శారద, కవిత. వెనకాల నుండి సైకిల్ బెల్ శబ్దం వినిపిస్తుంటే.. వెనక్కి తిరిగి చూశారిద్దరూ. అదే ఊరికి చెందిన కృష్ణ, సురేష్ సైకిల్ నడిపించుకుంటూ వస్తున్నారు. మళ్ళీ సైకిల్ బెల్ శబ్దం వినిపించింది. శారద వెనక్కి తిరిగి చూసి.. మొహానికి పట్టిన చెమట తుడుచుకుంది.
“అరేయ్.. సురేషూ! ఇవ్వాళ ఉక్కపోత ఎక్కువగా ఉన్నట్టుంది” అన్నాడు కృష్ణ.
“ఉక్కపోతో, నీ మీదున్న లవ్ పోతో.. యు కంటిన్యూ..” వెటకారంగా అన్నాడు సురేష్.
వెనక్కి తిరిగి చూస్తున్న శారదతో “ఏయ్.. వెనక్కి చూడకుండా రాలేవా?”అంది కవిత.
“అదేం లేదు పద”
మళ్లీ సైకిల్ బెల్ మోగింది.
“వీళ్ళిద్దరికీ పనీపాటా లేదల్లే ఉంది. ఎప్పుడు చూసినా పిల్లల కోళ్లల వెనకాలే వస్తున్నారు” అంది కవిత.
“కవితా! వాళ్ల సంగతి మనకెందుకే.. పోదాం పద” అంది శారద.
మళ్లీ సైకిల్ బెల్ గణ గణ మోగించాడు సురేష్.
“శారద ఆగు.. ఇవ్వాళ అటో ఇటో తేల్చుకుందాం” అని వెనక్కి తిరిగి “ఏయ్.. ఏంట్రా..” అరిచినట్టంది కవిత.
“అయ్యో!.. వాళ్ళతో మనకెందుకే పోదాం పద..” అంది శారద కంగారుగా.
ఆ మాటలు వినిపించుకోకుండా “రేయ్.. మిమ్మల్నే రా!” అంది కవిత.
“రేయ్.. మనల్నే రా! ఏంటో అడుగు” అన్నాడు సురేష్.
“సైకిల్ నడిపించుకొస్తున్నారు.. పంక్చరయిందా?” అంది కవిత.
“పంక్చరా?!” సైకిల్ టైర్లు పట్టుకుని చూసి “లేదే” అన్నాడు కృష్ణ.
“మరి ఏమైందిరా! మీకు.. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు కదా! లేకపోతే తొక్కే ఓపిక లేదా?”
“నువ్వు వచ్చి ముందు కూర్చో.. అప్పుడు చూడు సైకిల్ స్పీడేంటో” అన్నాడు కృష్ణ.
“అబ్బో! ఈ డొక్కు సైకిల్‌కి ఏరోప్లేనంత బిల్డప్ ఇయ్యకు”
“కవితా! వాళ్లతో మనకెందుకు రా! పోదాం” గొణిగినట్టంది శారద.
“అరేయ్ సురేషూ! అదిటియ్యి” అన్నాడు.
కృష్ణ చేతికి ఓ పొట్లం ఇచ్చాడు.
కృష్ణ గబగబా శారద దగ్గరికి వచ్చి.. “ఇదిగో” అని పూల పొట్లం శారదకి ఇచ్చాడు.
“నాకెందుకిచ్చావు?”
“ఆఁ.. తలలో పెట్టుకోవడానికి”
“నేను సంపెంగ పూలు పెట్టుకోను”
“అందమైన పేరు పెట్టుకుని పూలు పెట్టుకోనంటే ఎట్లా! రోజూ పెట్టుకునే మల్లె, కనకాంబరాల కంటే సంపెంగ పూలు పెట్టుకుంటే వెరైటీగా ఉంటుంది కదా!” అన్నాడు కృష్ణ.
శారద మౌనంగా చూసింది.
“సంపెంగ పూల స్పెషల్ ఏంటో నాకు కూడా ఇవ్వచ్చు కదా!” అంది కవిత.
“ఇష్టపడ్డ వాళ్లకే కదా! ఇచ్చేది” అన్నాడు శారదని చూస్తూ.
“నువ్విచ్చింది తీసుకున్న వాళ్లు నిన్నూ ఇష్టపడాలిగా!”
“ఇష్టమా? కాదా? అని రేపు తలలో ఈ పూలు పెట్టుకొచ్చి చెప్పమను” అని కృష్ణ వెనక్కి వెళ్లి, సురేష్ సైకిల్ తొక్కుతుంటే వెనకాల కూర్చున్నాడు. ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ నిలబడ్డ శారద, కవితల ముందు నుంచి సైకిల్ పోనిస్తూ ..
“ఫీల్ అవ్వకు కవితా! రేపు నీకు నేను మల్లెపూలుస్తాగా!” అని కవితతో అన్నాడు సురేష్.
“ఛీ! మూసుకొని పోరా! ఎదవా!” అంది కవిత కోపంగా.
“ఏంటే ఆ కిష్టిగాడు నీకు పూలు ఇయ్యటం.. నువ్వు పల్లకిలిస్తూ ఇస్తూ తీసుకోవటం.. ఏంటి సంగతి? వీటిని కలలో పెట్టుకుంటావా?” అని పుష్ప చేతిలో పూలు లాక్కొని రోడ్డు పక్కకి విసిరేసి..
“పూలిస్తాడట.. పూలు.. సన్నాసి!” అంది కవిత నడుస్తూ.
***
మర్నాడు సాయంత్రం బస్ దిగిన శారద, కవిత వస్తున్నారు. బస్సాగిన సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ కింద కృష్ణ, సురేష్ నిలబడ్డారు.
“కృష్ణా! నిన్న నువ్వు ఇచ్చిన సంపెంగ పూలు ఇవ్వాళ నీ లవ్స్ తల్లో పెట్టికొస్తుందనుకుంటుని ఎదురుచూస్తా ఎంతసేపు ఇక్కడ నిలబెడతావురా!?”అన్నాడు సురేష్.
“నా క్వీన్ కచ్చితంగా పెట్టుకోవస్తుంది. చూడరా”.
“లవ్వు రా! లవ్వు.. అట్టాగే ఉంటది. కలలు గంటానే ఉండు..”అని రోడ్డు వైపు చూశాడు సురేష్.
“రేయ్ నీ ఫిగర్ వస్తుంది రోయ్”
కృష్ణ ఆశగా శారద వైపు చూశాడు.
“తల్లో.. పెట్టుకుందో లేదో నేను వెళ్ళి చూసొస్తాను”అని సురేష్ పోతుంటే..
“రేయ్.. అవసరం లేదు. వాళ్లు ఇటు నుంచి వెళ్లాల్సిందేగా!”అన్నాడు కృష్ణ
శారద, కవిత దగ్గరకొస్తున్న కొద్దీ ఆమె తలలో పూలు ఉన్నాయో లేదో అని ఆశగా చూడసాగాడు కృష్ణ.
రెండు నిమిషాల్లో దగ్గరగా వచ్చిన శారద తలలో పూలు కనిపించలేదు. కృష్ణ మొహంలో నువ్వు మాయమైంది. సురేష్ పెద్దగా నవ్వుతూ “అరేయ్! కచ్చితంగా పెట్టుకోవస్తుంది క్వీన్ అని డైలాగులు చెప్పావుగా! చివరికి నీ క్వీన్ నిన్ను జోకర్‌ని చేసింది రా!” అన్నాడు పకపక నవ్వుతూ.
అంతలో వెళ్తున్న శారద ఆగి, కవితతో ఆగమని చెప్పి తన పుస్తకాలు ఆమెకిచ్చి చేతిలో ఉన్న సంపెంగ పూలు తీసి తలలో పెట్టుకుంటూ.. కృష్ణ వైపు చూసింది.
సురేష్ నోరేళ్లబెట్టాడు. కవిత కోపంగా శారద వైపు చూసి “నీకు ఏమైనా పిచ్చి పట్టిందా?” అంది.
“అవును” అని ఆమెకు ఇచ్చిన పుస్తకాలు తీసుకుంది శారద.
కృష్ణ మొహంలో నిరాశ మాయమై దరహాసం మెరిసింది. వేగంగా వాటర్ ట్యాంక్ పైకెక్కాడు. వెళ్తూ, వెనక్కి తిరిగి చూస్తున్న శారదకి చెయ్యూపాడు.
***
ఆ తర్వాత శారదని ఒంటరిగా కలుసుకోవడం, మాట్లాడటం, ఉదయం బస్సు ఎక్కేటపుడు, సాయంత్రం వచ్చేటప్పుడు రావడం, గుళ్లో కలుసుకోవడం, కలుసుకున్నప్పుడల్లా ఓ సంపంగి పువ్వు శారదకివ్వటం, ఆమెని సంపంగి అని పిలవడం, సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్లటం, పక్క ఊరి తిరుణాళ్ళకి ఇద్దరు వెళ్లడం, అక్కడ ఫోటో స్టూడియోలో కలిసి ఫోటో దిగటం, శారద పుట్టిన రోజుకి డ్రెస్ కొనిపెట్టడం.. ఇవన్నీ ప్రేమ లక్షణాలేనని ఇద్దరికీ తెలిసింది.
***
శారద కళ్ళ ముందు బ్లాక్ అండ్ వైట్ సినిమాలా జ్ఞాపకాలు కదిలిపోతున్నాయి.
అన్విత ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూస్తూ.. “ఆ వయసులో ఎంత అందంగా ఉన్నావో.. తెలుసా శారూ!” అంది.
శారద విరక్తిగా నవ్వింది.
“ఆ తర్వాత ఏమైంది?” ఆసక్తిగా అడిగింది అన్విత.
“ఆ తర్వాత నా జీవితమే తలకిందులైంది” అని మళ్లీ చెప్పడం మొదలు పెట్టింది.
***
ఓ రోజు కృష్ణ కోసం గుళ్లో ఎదురు చూస్తుంటే.. లేటుగా వచ్చాడు. ఆరోజు సంపంగి కోపంగా ఉంది. కవితతో తరచూ కృష్ణ మాట్లాడటం చూసింది. కృష్ణ రాగానే “నేను వెళ్తున్నా!” అని వెళ్లబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపి..
“ఏంటి సంపంగీ! నీ కోసం వస్తే నువ్వు వెళ్తానంటావేంటి?” అన్నాడు బుజ్జగింపుగా.
సంపంగీ! అనగానే నవ్వి “నువ్వు ఆ కవితతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. వాళ్ల నాన్న అన్నయ్యలు మంచివాళ్లు కాదు” అంది.
“నాకు నువ్వుండగా కవితతో పనేంటి? ఊరికే మాట్లాడాను. తను మాట్లాడిస్తే మాట్లాడానంతే”
“ఇంకోసారి తనతో కనిపిస్తే నీతో మాట్లాడను”
“అయితే నేనే నీతో మాట్లాడుతాను.” అని తెచ్చిన సంపంగి పువ్వు ఆమె తలలో పెట్టాడు.
మరుసటి వారం వరుసగా నాలుగు రోజులు కవిత స్కూల్‌కి వెళ్ళలేదు. శారద అడిగితే ఒంట్లో బాగోలేదని చెప్పింది. ఆ రోజు స్కూల్ అయ్యాక వచ్చే ఐదు గంటల బస్సు క్యాన్సిల్ అయింది. తర్వాత వచ్చే బస్సు ఎక్కి శారద ఊరు చేరే సరికి రాత్రి ఏడయ్యింది.
కృష్ణ కనిపిస్తాడేమోనని చూసింది. కనిపించలేదు. ఇంటికి వెళుతుంటే సైకిల్ మీద ఓ చెట్టు కింద కృష్ణ కనిపించాడు. తన కోసమే అనుకొని గబగబా వస్తుంటే.. ఆ లోపలే కవిత ఓ సంచి పట్టుకొని కంగారుగా అతని దగ్గరకు వచ్చింది.
“తొందరగా రా! వస్తుంటే ఎవరైనా చూశారా?”అని ఆమెని సైకిల్ మీద కూర్చో పెట్టుకుని సైకిల్ తొక్కుతూ యథాలాపంగా, నడిచి వస్తున్న శారదని చూశాడు.
మొహం పక్కకి తిప్పుకొని.. వేగంగా సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోయాడు. అంతే! శారద కళ్ళల్లో కన్నీళ్లు.
తన కళ్ళముందే.. అదీ రాత్రి పూట కవితని సైకిల్ ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు.
మర్నాడు ఉదయానికి కవిత, కృష్ణ లేచిపోయారంటూ ఊరంతా చెప్పుకోసాగారు. ఇంట్లో ఉండాలనిపించలేదు. మనసంతా ముక్కలైంది. గుడికి వెళదామని బయలుదేరింది. త్రోవలో కనిపించిన ఊళ్లో వాళ్లంతా కృష్ణ, కవిత గురించి మాట్లాడుకుంటుంటే.. వినలేక వెనక్కి వస్తుంటే కృష్ణతో ఫ్రెండ్ రాంబాబు చూసి..
“శారదా! ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళిద్దరూ లేచిపోయారంట కదా! నీకేమైనా తెలుసా? ఇన్నాళ్లు నీ చుట్టూ తిరిగాడు. ఇప్పుడు ఆ కవితతో ఉడాయించాడు. కృష్ణ లీలలు మరి” అన్నాడు.
“నాకేం తెలియదు. వాళ్ళని గురించి నాకు చెప్పొద్దు. ఇకపై వాడి మొహం నేను చూడను” అని ఉక్రోషంగా వెళ్ళిపోయింది.
కృష్ణ మోసం చేశాడన్నది తట్టుకోలేని శారద చచ్చిపోదామనుకుంది.
“ఆ రోజే నూతిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాను. కానీ విధి రాత మరోలా ఉంది”
అన్వితతో చెప్తున్న శారద కళ్ళలో తడి. “చచ్చిపోదామనుకున్నా కానీ ధైర్యం చాలలేదు”.
***
సైకిల్ మీద కవితని తీసుకొని పక్క ఊరి బస్టాండ్‌కి కొంచెం దూరంలో ఆపాడు కృష్ణ.
“కవితా! ఇప్పుడు బస్సు వస్తుంది. అందులో ఎక్కితే టౌన్‌లో ఉన్న రైల్వే స్టేషన్‌కి వెళ్లొచ్చు. కానీ అందులో వెళ్ళొద్దు. ఎందుకంటే మన ఊరివాళ్ళు ఎవరైనా బస్సులో చూడొచ్చు. లారీలు వస్తుంటాయి. మీరిద్దరు లారీలో వెళ్లండి. ఎవరికి అనుమానం రాకుండా రైల్వే స్టేషన్‌కి వెళ్ళచ్చు” అంటుంటే..
సురేష్ పరిగెత్తుకొచ్చాడు.
“ఏంట్రా? ఇంత లేటు” అన్నాడు కృష్ణ.
“డబ్బులు తీసుకొని రావటానికి లేట్ అయింది రా!”
“సరే.. సరే.. మీరేం చేయాలో కవితకి చెప్పాను. ఈ డబ్బులు ఉంచండి. తొందరగా వెళ్ళండి. అదిగో లారీ వస్తోంది” అని సురేష్ చేతిలో డబ్బులు పెట్టాడు కృష్ణ.
“థాంక్స్ కృష్ణా!” అని ఇద్దరూ చేతులు జోడించి.
“ఏ అవన్నీ తర్వాత ముందు తొందరగా వెళ్ళండి.”అని వాళ్ళు లారీ ఎక్కే వరకు ఉండి వెనక్కి తిరిగాడు కృష్ణ.
***
చెప్పటం ముగించిన శారద కళ్ళలో తడి తుడుచుకుంటూ..
“ఆ రోజు తర్వాత రోజు కృష్ణ నా కోసం వచ్చినా.. నేను అతన్ని చూడటానికి ఇష్టపడలేదు. కవిత వాళ్ళ నాన్న, అన్నయ్యలు కృష్టని కొట్టి పోలీసులుకు అప్పగించారు. అయినా కృష్ణ నిజం చెప్పలేదు.
కృష్ణని మొదటిసారి చూసినప్పుడు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నేను అతన్ని ఏం జరిగిందో అడగాల్సింది. సురేష్, కవితల కోసం రిస్క్ తీసుకొని వాళ్ళిద్దర్నీ కలిపాడు. ఆ విషయం తెలియక, నేను తెలుసుకోలేక పోయాను. కృష్ణ జైలు నుండి వచ్చేసరికి నాకు పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు.
ఆ తర్వాత జీవితంలో నాకు ఏ లోటూ రాలేదు. ఆయన ఉన్నంతవరకు సంతోషంగానే ఉన్నాను. కానీ జీవితంలో తొలిప్రేమ మనం మరణించే వరకు మనసులో ఓ మూల సజీవంగానే ఉంటుంది. నువ్వు నేను చేసిన తప్పు చేయకు.. వెళ్ళి ఆ సందీప్‌ని కలువు. అతను చెప్పేది నిదానంగా విను. అనుమానానికి, ఆవేశానికి మధ్య ఉండే పోరా తొలగిపోతుంది. అప్పుడు ఓ నిర్ధారణకు రా! వెళ్ళు” అంది శారద.
***
అన్విత తన దగ్గర ఉన్న సందీప్ నెంబర్‌కి కాల్ చేసింది నాలుగేళ్ల తర్వాత.
పది నిమిషాల్లో సందీప్ ఇంటిముందుకి కారులో వచ్చాడు. అతని కోసం బాల్కనీలో నిలబడ్డ అన్విత అతనిని చూడగానే వేగంగా కిందికి వచ్చింది.
“నేను చెప్పేది ఏదీ వినకూడదని డిసైడ్ అయ్యావు కదా!” అన్నాడు.
“వినను. నాలుగేళ్ల క్రితం జరిగిన ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు నాకు అనవసరం. ఆ రోజు ఏం జరిగిందో నాతో చెప్పొద్దు. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వులేని ఈ నాలుగేళ్లు శూన్యంలో గడిపాను. కానీ ఇప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ యాం సారీ! సందీప్” అని అతని గట్టిగా హగ్ చేసుకుంది అన్విత.
కలో! నిజమో! అర్థం కాక అప్రయత్నంగానే అతని చేతిలో ఆమెని చుట్టేశాయి.
“అయినా నీకు నిజం చెప్పాలి. ఆరోజు నా వెనక్కి కూర్చున్న మా కజిన్ సిస్టర్ ని రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయడం కోసం అర్జెంట్గా బైక్ మీద తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నువ్వు ఫోన్ చేశావు. అర్థం చేసుకోకుండా, నిజమేంటో తెలుసుకోకుండా ప్రార్థన చేసుకొని నువ్వు వెళ్ళిపోయావు.”
“వద్దు.. నువ్వేం చెప్పొద్దు” అంది.
మెల్లగా నవ్వి “పద మనం కలుసుకునే మా తోటకి వెళ్దాం. తోట పక్కన పారే కాలువ ఒడ్డున కూర్చోవటానికి నీకు చాలా ఇష్టం కదా! ఈ నాలుగేళ్లలో తోటలో చెట్లు పెద్దవయ్యాయి.”
“ఊఁ.. పద”
కారు తీస్తూ.. యాదృచ్ఛికంగా ఇంటి వైపు చూశాడు. శారద పై నుండి చూడటం కనిపించింది సందీప్ కి.
“అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడే కలిసాం. అప్పుడే మీ ఇంటి నుండి ఎవరో చూశారు” అన్నాడు.
అన్విత పైకి చూసింది. శారద పైనుండి వెళ్ళమన్నట్టు చెయ్యిపింది నవ్వుతూ. వచ్చి కారు ఎక్కింది అన్విత.
“అంతా ఓ.కే.నా?” అన్నాడు.
“ఏంటి? భయపడుతున్నావా?”
“ఛ.. భయమా! నాకా?” అని, అన్విత చేతిలో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూశాడు.
”ఎవరీ ఫోటోలో ఆమె?”
“మా బామ్మ”
“మేడ మీద నిలబడ్డారే ఆవిడా?”
“ఊ.. అవును”
“ఓ.. ఆమె పేరు?”
“శారద అలియాస్ సంపంగి”
“సంపంగా!?!?”
“ఔను.. ఏమైంది?”
సందీప్ కారు దిగి వేగంగా మేడ మీదకు వచ్చి శారదతో “మీరు!?!.సంపంగి!!??” అన్నాడు ఆశ్చర్యంగా.
“అవును నేనే సంపంగిని”
“ఆశ్చర్యంగా ఉంది. మీ గురించేనా నేను పుస్తకం రాసింది!” అన్నాడు.
అతని వైపు చూసి.. “అవును, చదివాను” అంది.
“అంటే.. మా తాత కృష్ణ..!!”
మౌనంగా తల ఊపి.. “నిన్ను ఒకటి అడగొచ్చా! తప్పుగా అనుకోకు” అంది శారద.
“చెప్పండి”
“ఈ లెటర్ ఎవరికీ తెలియకుండా మీ తాతకి ఇస్తావా?” అంది.
సందీప్ ఒక్క క్షణం పైకి చూశాడు.
“వద్దులే! ఎందుకీ వయసులో అనవసరంగా!”
“పర్లేదు బామ్మా! ఇవ్వండి నేను ఇస్తాను” అని తీసుకున్నాడు.
“చాలా థాంక్స్ బాబూ!” అంది శారద.
***
“ప్రియమైన కృష్ణకి! నీ మీద నలభై ఏళ్ల కోపం చచ్చేవరకు నన్ను వదిలి పోదనుకున్నాను. కానీ ఈరోజు ఇన్నేళ్ల నా కోపానికి అర్థం లేకుండా పోయింది. రెండు రోజుల ముందు నా మనవరాలు అన్వితకి ఒక కొరియర్ వచ్చింది. ఫ్రం అడ్రస్ లేదు. ఓపెన్ చేసి చూశాను. సంపంగి పేరుతో ఓ పుస్తకం. అది తీసి చూశాను. అందులో మొదటి పేజీలో ఆ రోజుల్లో నువ్వు, నేను కలిసి దిగిన ఫోటో కనిపించింది. ఆ పుస్తకం రాసింది నీ మనవడు సందీప్ అని తెలుసుకున్నాను. చదివాను. అలనాటి మనిద్దరి ప్రేమ కథ.. మర్చిపోలేని గతం మళ్లీ కళ్ళ ముందు కదలాడింది. ఇన్నేళ్లు నాకు తెలియని నిజం నాకు ఆ పుస్తకం చదివాక తెలిసింది. సురేష్, కవితల్ని కలపడానికే ఆ రోజు నువ్వు వెళ్ళావు అని తెలిసింది. ఇన్ని రోజులు నువ్వే నన్ను మోసం చేసి వెళ్ళావనుకున్నాను. కానీ నిజం ఏమిటంటే ఇన్నేళ్లు నన్ను నేనే మోసం చేసుకున్నాను. క్షమించమని నిన్ను అడిగే అర్హత కూడా లేదు నాకు. మన్నిస్తావా? నన్ను. నిర్ణయం తీసుకోవడం వాళ్ళ వాళ్ల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నా మనవరాలిని, నీ మనవడిని కలపడానికి ఆరోజు మనం విడిపోయామేమో.. ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేం ఉంటుంది? నన్ను క్షమించు.”
సందీప్, అన్విత ఇద్దరు ఆ లెటర్ చదువుతూ తోట పక్కన ఉన్న కాలువ దగ్గరికి వచ్చారు.
“మీ తాతయ్య ఉన్నారా?” అడిగాడు సందీప్.
“మా తాతయ్య చెన్నై రైల్వేలో పనిచేసేవాడట. వాళ్లు అక్కడే ఉండేవాళ్ళు. రెండేళ్ల క్రితమే తాతయ్య కాలం చేశారు” చెప్పింది అన్విత.
“మా తాతయ్య కూడా..” అనబోయి ఆగిపోయాడు సందీప్.
కరోనా థర్డ్ వేవ్‌లో మరణించిన కృష్ణ తాత బతికే ఉన్నాడని ఇన్నేళ్ల తర్వాత క్షమించమని లెటర్ రాసిచ్చిన శారద బామ్మను నిరాశపరచటం ఇష్టం లేక, ఆ ఉత్తరాన్ని పడవలా చేసి.. తోట పక్కనుండి పారుతున్న పెద్ద కాలువలో వదిలాడు.
‘తాతా! నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ సంపంగిని క్షమించానని, ఆమెకి కలలోనైనా కనిపించి చెప్పు’.. అని మనసులోనే అనుకున్నాడు సందీప్.
ఎం. వెంకటేశ్వర రావు చక్కని కథా రచయిత. మంచి నవలా రచయిత. “అదివో… అల్లదివో!” వీరి కథా సంపుటి. ఇటీవలి కాలంలో “విజయ విలాసం” పేరిట వ్యక్తిత్వ వికాసం సంబంధిత వ్యాసాలు కూడా రాస్తున్నారు.