[డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారి ‘సమీక్షా సౌరభాలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
సారస్వతకళానిధి, పండిత కౌశికి అను బిరుదుల నందిన డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు కవయిత్రి, రచయిత్రి, వ్యాఖ్యాత్రి, వక్త, ప్రవచనకర్తి, ఎందరో శిష్యుల అభిమానాన్ని చూరగొన్న అధ్యాపకురాలు. విద్యార్థి దశలోనే నిఘంటు రచనలో సహసంపాదకత్వము వహించడము మాత్రమే కాక, దాదాపు 30 పుస్తకాల దాకా రచనలు చేసి ప్రచురించారు. అనేక వేదికల నుండి ఎన్నో గ్రంథాలను సమీక్షలు చేసి గొప్ప సమీక్షకురాలిగా ప్రసిద్ధి వహించారు. వీరి కలం నుంచి జారివారిన పలు పుస్తకాల సమీక్షలన్నింటిని ఒక చోట చేర్చి ‘సమీక్షా సౌరభాలు’ అను పేర పుస్తకంగా అందించారు.
ఈ గ్రంథంలో గల వ్యాసాలు సాహిత్యంలో నిజంగా కావ్య సౌరభాలు వెదజల్లుతున్నాయి. పలు పద్య, వచన కావ్యాల విశ్లేషణలతో దాదాపు 54 సమీక్షా వ్యాసాలతో పాఠకులను అలరించారు. ఇందులో పద్య కావ్యాలు, శతకాలు, వచన కవిత్వము, నవల, కథాసంపుటులు, కథానికల సంపుటులు, వ్యాస, కావ్య, అనువాద కథలు, నాటక, గేయ సమీక్షలు ఉన్నాయి.
ఇలా వివిధ రకాల ప్రక్రియలను సమీక్షించడానికి రచయిత్రి అసమాన ప్రజ్ఞా ధురీణ అయిఉండాలి. వీరు సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతురాలు. తన పరిశోధనా సమయంలోనే బంగారు పతకాన్ని సాధించి డాక్టరేట్ అందుకొన్న ప్రతిభామూర్తి. విద్యార్థి దశలోనే ఆంధ్ర విశ్వ విద్యాలయం తరఫున వ్యుత్పత్తి పదకోశానికి సహసంపాదకత్వం వహించిన ప్రతిభాశాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపక, ఉగాది పురస్కారాలను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారాన్ని అందుకున్న విద్వన్మణి. ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారి పద్య కావ్యాలకు, పంచతారావళులకు మిత్ర వ్యాఖ్యను అందించి పాఠకులకు అర్థమయ్యేలా సరళ రీతిలో రచన సాగించారు. నేటి రచయితలలో విమర్శనా వ్యాసాలు, విశ్లేషణాత్మకంగా అందించేవారు ఉన్నారు కానీ పుస్తక సమీక్షలను ఇంత అందంగా అందించేవారు అరుదుగా ఉన్నారు. వీరి సమీక్షా వ్యాసాలన్నీ చదివిన పాఠకుల చేత ఆ కావ్యాన్ని చదివించే నేర్పు గల రచయిత్రి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు.
వీరి సమీక్షా సౌరభాలలో మొట్టమొదట సుగంధాన్ని అందించినవి పద్య కావ్య సమీక్షలు. తెలుగు సాహిత్యానికి పద్యమే ప్రాణం కదా. పద్యం తెలుగువాడి సొత్తు. అందుకే ఆమె మొదటగా పద్య కావ్యాలతో తన సమీక్షలను ప్రారంభించారు. ఇందులో డాక్టర్ రావి రంగారావు గారి పాత కొత్తల మేలు కలయిక అశ్వత్థ వృక్షం. సంస్కృతి సాంప్రదాయాలకు మానవతా విలువలకు చక్కని నీడనిచ్చిందన్నారు. ఆధ్యాత్మిక శక్తి వలననే సమాజంలో శాంతి, సామరస్యాలు, సౌభ్రాతృత్వము నెలకొంటాయన్న సత్యాన్ని యోగవాశిష్ఠ సారము ద్వారా విహారి గారు చెప్పారన్నారు. వెలిగే దివ్వెలను ఆర్పుతుంది మేఘజలము. కానీ ఆరిన వత్తులు వెలిగించింది మేఘరంజనీ రాగమని రసరాజు గారి కావ్య విశిష్టతను పేర్కొన్నారు రచయిత్రి. మృత్యుంజయలో సూర్యదేవర రవికుమార్ గారు చూపిన పద్య నైపుణ్యాన్ని, పంచభూతాలలో ఒకటైన సమీరం గురించి చెబుతూ ఈ గ్రంథపఠనం వలన మానవుని ఆలోచన పరిధి విస్తరిస్తుందన్నారు. పద్య కావ్య సమీక్షలను చేస్తూ రచయిత్రి పద్య కావ్య పఠనము మానవుని బుధ్ధిని, జ్ఞాపకశక్తిని, మేధాశక్తిని, ఏకాగ్రతను పెంచుతుందన్నారు.
వీరి కలం నుండి జాలు వారిన శతక సమీక్షలలో కొండవీటి వేంకటకవిచే రచింపబడిన బుద్ధశతకం, వేమశతకం, గాంధీ శతకం, పోలినేని రామాంజనేయులు గారి నారీ శతకాలు ప్రధానమైనవి. వేంకట కవిగారి శతకాల్లో హేతువాద దృక్పథం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. మనిషి మనీషిగా ఎలా ఎదగాలనే విషయాన్ని బుద్ధ శతకంలో, వేమ శతకంలోని తెలుగు నుడికారపు సొంపును రచయిత్రి చక్కగా చూపించారు. గాంధీజీ చేసిన హరిజనోధ్ధ రణము, అస్పృశ్యతానివారణలు లోకానికి మేలు చేస్తాయన్నారు. ఇతరులకు ద్రోహం చేసే ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయన్న భావనను చక్కగా వివరించి చూపారు. నారీ శతకంలో స్త్రీ అభ్యుదయాన్ని గురించి రామాంజనేయులుగారు చెప్పారన్నారు.
దాదాపు పదిదాకా వచనకావ్య సమీక్షలు చేశారు. అందులో జ్ఞానపీఠ అవార్డునందిన ఆచార్య డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారిచే రచింపబడిన విశ్వంభర మొదటిది. ఏ కాలానికి అయినా సరిపోయే వచన కావ్యము విశ్వంభర అన్నారు సమీక్షకురాలు. భవానీదేవిగారి నది అంచున నడుస్తూ అనుభవ ప్రధానమైన కవితగా పేర్కొన్నారు. శాంతి నారాయణగారి కొత్త అక్షరాలు, డా. రావి రంగారావుగారి కిరణాలు, డా. రమణ యశస్విగారి కరోనా గురించి, సోమేపల్లివారి మట్టి పొరల్లోంచి, నందిని సిద్ధారెడ్డిగారి అనిమేష, సంగవేని రవీంద్ర గారి వారేవా మినీకవితలు, జోబ్ సుదర్శన్ గారి కాకి వేదనను, భవానీదేవిగారి వేళ్ళను వెతికే చెట్లులో వివిధ భావాలతో ఉన్న వచన కవితలు పాఠకుల అభిమానాన్ని చూరగొనేటట్లుగా విశ్లేషించడమేకాక పాఠకులకు చదివించే ఆసక్తిని కలిగించారు. వీరు పలువురి వచనకావ్యాల కవిత్వాలలోని లోతైన భావాలను సాక్షాత్కరింపచేశారు రచయిత్రి.
ఇక ఆ తరువాతవి నవలా సమీక్షలు. నవలలలో శ్రీపాదవారి ఆత్మబలి నవలలో స్త్రీ మనస్తత్వ విశ్లేషణను, మాతృ హృదయాన్ని, ఆమెకు పిల్లలపట్లగల ప్రేమను చక్కగా సమీక్షించారు రచయిత్రి.బంగారుకల నవల చారిత్రక ప్రధాన మయిన దన్నారు. నవలలు మనసుకు దగ్గరగా వస్తాయి. పాఠకులని ఒకకొత్త లోకంలో విహరింప చేస్తాయన్నారు. ఆచార్య ఎన్. జి. రంగా, జి. వి. పూర్ణచంద్, సింహప్రసాద్, భవానీ దేవి, శ్యామల, సుజాత, సూర్యదేవర ప్రమీల మొదలుగాగల ఆధునిక రచయితల నవలల దాకా విశ్లేషించారు. ఆయా నవలలోని పాత్రలు ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలానికి సంభాషణ శైలిని, రచనా శైలిని, స్త్రీల సమస్యలను, వారి ధైర్యాన్ని విశ్లేషిస్తూ దాదాపు 14 నవలలను వివరణాత్మక సమీక్షలను చేశారు.
నవలల తర్వాత పాఠకుని ఎక్కువగా ఆకర్షించేవి కథలు. కథలు మానవ జీవితానికి సన్నిహితంగా ఉంటాయన్నారు రచయిత్రి. కథలు పాఠకుని మనసుకు దగ్గరగా వస్తాయి. కథ సమాజంలోని సంఘటన ఆధారంగా పురుడు పోసుకుంటుంది. ఒక్కొక్క కథ పాఠకునిలో కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయన్నారు రచయిత్రి. అల్లూరి గౌరీ లక్ష్మి, విడదల సాంబశివరావు, సోమేపల్లి పురస్కార కథలు, సంక్రాంతి పండుగ విశేషాలు తెలిపే దాసరి శివకుమారి కథలు, గోటేటి లలితాశేఖర్ సంగమం కథ సమాజానికి మార్గదర్శనం చేసే కథలు అన్నారు.
ఆండేనియల్గ్ భాషలో డెఫో రచించిన రాబిన్‌సన్ క్రూసో సాహసగాథను జి.వి.ఎల్.నరసింహారావుగారు అనువదించగా ఆ అనువాద కథలను కూడా సమీక్షించిన ప్రతిభామూర్తి సమీక్షకురాలు. పాపినేని శివశంకర్ గారు వేదవ్యాసం అనే వ్యాసరచనతో ఋషి రుణం తీర్చుకున్నారన్నారు రచయిత్రి. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి నుడి గుడి వ్యాసంలో తెలుగు పదాల పరిచయం, స్వరూపం, అర్ధం, ప్రత్యయాల వివరణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
నాటక సమీక్షలలో చిటిప్రోలు వారి రక్షాబంధన్ నాటకంలో సోదరీ సోదరుల ప్రేమ బంధాన్ని తెలియచెప్పారన్నారు. వారి అమ్మ అనే దీర్ఘ కవితను సమీక్షచేస్తూ విదేశాల నుంచి వచ్చి భారతదేశంలోని పేదలకు సేవచేసిన కారణజన్మురాలు మదర్ థెరిసా అంటూ ఆమెలోని త్యాగశీలత, సేవా దృక్పథం భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు. పెద్ది సాంబశివరావుగారి త్రిభాషా నిఘంటువు విద్యార్థులకు మూడు భాషలలో సమాంతరంగా భాషా బోధన చేస్తుందన్నారు. అర్ధాలను తెలుసుకోవడానికి విద్యార్థులకిది దిక్సూచి వంటిది అన్నారు నాగరాజ్యలక్ష్మి గారు.
ఈ పైన చెప్పిన యాభైనాలుగు ప్రక్రియా వైవిధ్య సమీక్షా వ్యాసాలలో రచయిత్రి కవుల, రచయితల, రచయిత్రుల హృదయపు లోతులను బాగా పరిశీలించి వారివారి రచనలలోని విశేషాంశాలను సమీక్షల ద్వారా ఒక పరిశోధనా గ్రంథంను పాఠకులకు అందించారు రచయిత్రి. ఈ సమీక్షా వ్యాస పుష్పాలనన్నింటిని ఒక చోట చేర్చి అందమైన మాలగాగుచ్చి ఆ వాగ్దేవిని అలంకరించిన ధన్యురాలు. ఆమె మాత్రమే కాదు ఆ పువ్వుల సౌరభాలను మనచేత కూడా ఆఘ్రాణింపచేసి, ఆనందింప చేశారు. మన చేత ఆయా సమీక్షలను చదివింపచేయడం మాత్రమే కాక తద్వారా ఆయా పుస్తకాలను కూడా చదవాలనే ఆసక్తిని, ఆకాంక్షను కలిగించారు. ఏది ఏమైనా ‘సమీక్షా సౌరభాలు’ అనే ఇంత చక్కని పుస్తకాన్ని పాఠకులకందించిన సమీక్షకురాలు నాగరాజ్యలక్ష్మిగారి కృషి బహుథా ప్రశంసనీయము. వారి కలం నుంచి ఇంకా మరెన్నో చక్కటి రచనలు జాలువారాలని ఆకాంక్షిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
***
రచన: డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
పేజీలు: 236
వెల: ₹ 250/-
ప్రతులకు:
డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి
301, రామన్న టవర్స్,
1వ లైన్, రామన్నపేట
గుంటూరు 522002
ఫోన్: 9394113848

