[అనుకృతి గారు రచించిన ‘సమయోచితం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
వసంతకు పెళ్లి నిశ్చయమయ్యింది. అదీ ఆఘమేఘాల మీద కుదిర్చిన పెళ్ళి.. వసంత నాయనమ్మకు ప్రాణాల మీదకు వచ్చింది.. పెద్దావిడ ఒక్కగానొక్క కొడుకైన విశ్వనాథ్‌ని “వసంత పెళ్లి చూసి పోతానురా” అంటూ దీనాలాపాలు చేసింది.
కరిగిపోయిన విశ్వనాథ్ కూతురికి మ్యాచెస్ చూడటం మొదలెట్టాడు. జయలక్ష్మి కూడా అత్తగారి మాటకు ఎదురుచెప్పలేక పోయింది. చిన్నతనంలో పెళ్ళై వచ్చిన, తల్లి లేని తనని ఎంతో ప్రేమగా, కూతురి కంటే ఎక్కువగా చూసేది, పని రాకపోయినా, నెమ్మదిగా చెప్పి, నేర్పించింది. అత్తగారంటే ఎనలేని ప్రేమ, గౌరవము జయలక్ష్మికి. వసంత తర్వాత ఇద్దరు మగపిల్లలు.
సెకండ్ ఇయర్ డిగ్రీలో వుంది వసంత. ఇరవై ఏళ్ళు కూడాలేని వసంతకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అందరి దగ్గిరి కంటే తండ్రి విశ్వనాథ్ దగ్గిర చాలా చనువు. అందుకే తండ్రితో ఇప్పుడే పెళ్లివద్దని, డిగ్రీ పూర్తయ్యాక చూద్దామని గొడవ చేసింది. ఆయన ఎప్పుడూ కూతుర్ని తిట్టింది లేదు, ఆమెపై అరిచింది లేదు. అటువంటి సౌమ్యుడైన తండ్రి మాట తీసెయ్యలేక, పెళ్ళిచూపులకు ఒప్పుకుంది వసంత.
తీరా రవీంద్రని చూసాక, చదువు సంగతి మర్చిపోయి, ఒప్పేసుకుంది. రవీంద్ర ఒక్కడే కొడుకు, అందుకే అతను ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయినా పేరెంట్స్‌ని వెంట తీసుకెళ్లేవాడు.
ఇంతాజేసి పెద్దావిడ వసంత పెళ్ళి అయ్యాక 12 ఏళ్ళు బ్రతికింది. వీలున్నప్పుడల్లా, అందర్నీ ‘నా చదువు పాడుచేశారు’ అంటూ సాధించేది వసంత.
రవీంద్ర దక్షిణ రైల్వే (SR) లో జూనియర్ ఇంజినీర్. దక్షిణ రైల్వే దేశం లోని 18వ జోన్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ చెన్నైలో. తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఈ జోన్లోకి కవర్ అవుతాయి.
అందమూ, చదువూ, మంచి కుటుంబ నేపథ్యం వున్న రవీంద్ర మాయలో పడిపోయింది వసంత. మారుమాట్లాడకుండా పెళ్ళికి ఒప్పేసుకుంది. ట్రాన్స్‌ఫర్ వచ్చినప్పుడల్లా ప్రతి ప్రదేశంలోని రైల్వే క్వార్టర్స్ లోని లైఫ్, రైల్వే క్లబ్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేసింది వసంత.
రవీంద్ర విరజాజి పూవులా వున్న వసంతని చాలా ఇష్టపడి, ఎప్పుడూ కష్టపెట్టకుండా చూసుకున్నాడు. అత్తామామలు ఇంట్లోనే ఉండటం వలన 19 ఏళ్లకే కొడుకు పుట్టినా పెద్దగా కష్టం తెలియకుండా పెంచింది, రెండో వాడినీ అంతే. వాళ్ళ సహకారంతో హాయిగా పెంచేసింది. పెద్ద కొడుకు ఆర్య న్యూ జెర్సీలో, చిన్న కొడుకు మౌర్య CA చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
పెద్ద కొడుకు ఆర్య తండ్రి అయ్యాడు. మొదట అమ్మాయి తల్లీ, తండ్రీ 6 నెలలు ‘ఆన్ డ్యూటీ’ అనుకుంటూ వెళ్ళారు. ఆరు నెలల తర్వాత కదా తన వంతు అనుకుని, తాపీగా వుంది వసంత. ఆ రోజు ఉదయం (కొడుక్కి రాత్రి) ఆర్య ఆందోళనగా కాల్ చేసాడు, “అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరాలి” అంటూ.
“ఏమిట్రా, ఏమిటి, ఏమయ్యింది?” కంగారుగా అడిగింది.
“స్నేహ వాళ్ళ అమ్మ బాత్రూం లో జారీ పడింది, వాళ్ళ అన్న డాక్టర్ కదా, తనని వాళ్ళ స్టేట్ తీసుకెళ్లి పోతున్నాడు, నీకు టికెట్ బుక్ చేస్తున్నా” అన్నాడు.
80వ పడిలో వున్న అత్తమామల్ని వదిలి ఎలా వెళ్ళాలో, పైగా తానొక్కతే వెళ్లాల్సి వచ్చేటట్టు వుంది, రవీంద్ర అంచెలంచలుగా ఎదిగి, పెద్ద పోస్టులో వున్నాడు. ఆరు నెలలు లీవ్ పెట్టి వెళ్ళటానికి లేదు. ఆ మాటే కొడుకుతో చెప్పింది.
అంతే! “అయితే నువ్వు రావన్న మాట” అంటూ ఠక్కున ఫోన్ పెట్టేసాడు.
“ఎవరు వసూ, కాల్ చేసింది?” అడిగాడు రవీంద్ర.
విషయం చెప్పింది, “నేను మాట్లాడతాను” అంటూ కొడుక్కి కాల్ చేసాడు.
“నాన్నా, టికెట్ బుక్ చేయి, అమ్మ వస్తుంది, ఒక వారం టైం ఉన్నదా” అన్నాడు ప్రేమగా. రవీంద్ర కొడుకులిద్దరినీ “నాన్నా” అంటూ పిలుస్తాడు.
“అమ్మ కుదరదని అన్నది” అన్నాడు చిన్న పిల్లాడిలా.
“నీకు అదంతా అనవసరం కన్నా, టికెట్ బుక్ చేయి, పోనీ నేను చేయనా” అడిగాడు
“లేదు, లేదు, నేనే చేస్తాను” అన్నాడు సంతోషంగా ఆర్య.
“వీడు ఒక బిడ్డకి తండ్రయినా, ఇంకా చిన్నతనం పోలేదు” నవ్వుకుంటూ, భార్యకేసి చూసి నవ్వాడు రవీంద్ర.
ఇక తన ప్రయాణం తప్పదని అర్థమయింది వసంతకు.
***
ఇంట్లో పెద్దవాళ్ళని ఎలా వదిలి వెళ్ళాలో, ఎప్పుడూ ఒక్క వారం కూడా వదిలి ఉందని రవీంద్రని వదిలి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు, కొడుక్కి రానని చెప్పలేదు, తల్లిగా అది తన డ్యూటీ, పైగా మొదటి మనుమడు, చూడాలని ఆశ.
ఇప్పుడు వసంతకి ఆపేసిన తన చదువు గుర్తుకు వచ్చింది. రవీంద్రకి రైల్వే జాబ్ కాబట్టి, ప్రయాణాలన్నీ హాయిగా పెద్దవాళ్ళతో సహా, దేశమంతా తిరిగి చూసారు. కానీ ఒంటరిగా ఫ్లైట్‌లో వేలమైళ్ల దూరం ఎలా వెళ్ళాలో అని బెంగపడసాగింది.
“నాకు డిగ్రీ ఉంటేనా, మంచి ఇంగ్లీష్ వచ్చేది, ఈజీగా వెళ్ళిపోయేదాన్ని”అంటూ భర్త దగ్గిర వాపోయింది.
రవీంద్ర నవ్వి, “నీ మొహం! డిగ్రీ కి దీనికీ సంబంధమేమిటి? దేశమంతా తిరిగావు, ఆ మాత్రం మేనేజ్ చెయ్యలేవా, ఫ్లైట్‌లో నిన్నెవ్వడూ కిడ్నాప్ చెయ్యడులే” అంటూ ఆమెని నవ్వించాడు.
అసలు విషయం అతనికి తెలుసు, తనని వదిలి వెళ్లలేక అలా మాట్లాడుతున్నదని. ఒక వారం రోజులు మల్లాది కృష్ణమూర్తి వ్రాసిన “అమెరికా వెళ్ళినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” చాలాసార్లు చదివి, బట్టీ పట్టింది. ముంబై వరకు వచ్చి, ఫ్లైట్ ఎక్కించాడు రవీంద్ర.
అటు కొడుకు, మనవడి బంధం; ఇటు వైవాహిక బంధం రెండింటి మధ్యన నలిగిన మనసుతో ఫ్లైట్ ఎక్కింది వసంత.
చిన్న నోట్ బుక్‌లో ఆర్య అడ్రస్ వ్రాసుకుంది. ‘18 పార్క్ స్ట్రీట్, JERCEY సిటీ, NJ 07302’ అని నోట్ చేసి పెట్టుకుంది. కొరియర్‌లో, పొళ్ళూ, పచ్చళ్ళూ, మిఠాయిలూ పంపించేశారు. ఒక పెద్ద సూట్‌కేసు, బ్యాగు అంతే. సామాను తీసుకుని బయటకు వచ్చేసరికి కొడుకు నవ్వుతూ ఎదురొచ్చి, గట్టిగా హగ్ చేసుకున్నాడు అమ్మని. పెళ్ళై వెళ్ళాక, నాలుగేళ్ల తర్వాత ఇదే కొడుకుని చూడటం.
కార్‌లో కూర్చున్నాక, “ముందు నాన్నకి ఫోన్ చేయరా” అన్నది. వీడియో ఆన్ చేసి తల్లికిచ్చాడు. రవీంద్రని చూస్తూ ఏమీ మాట్లాడలేక పోయింది. అతని పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. “ఇపుడే రీచ్ అయ్యా, “ అన్నది నెమ్మదిగా. “ఆర్యకివ్వు” అన్నాడతను.
“హలో నాన్నా, ఇంటికెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తా, మీ ఆవిడ ఏ ఇబ్బంది లేకుండా వచ్చింది” అన్నాడు నవ్వుతూ.
“పోరా” అని నవ్వుతూ, “కొద్దిగా అలవాటు అయ్యేవరకు అక్కడ ఎలా వుండాలో, ఏమిటో అన్నీ చెప్పండి నాన్నా” అంటూ ఆఫ్ చేసాడు.
ఆర్య నవ్వుతూ, తల్లి భుజం చుట్టూ చేయి వేసి, “ఒకవేళ నేను రాలేకపోతే ఏం చేసేదానివి వసంత లక్ష్మీ” అల్లరిగా అడిగాడు.
“ఏదో ఇంటర్ వరకే చదివింది అని తక్కువ అంచనా వెయ్యకురోయి” అంటూ అతని అడ్రస్ అప్ప చెప్పింది. “ఎవడో ఒక కాప్ (cop) ని పట్టుకుని ముందొక ‘please’, వెనకొక ‘please’ తగిలించి, వాడిని ‘ప్లీజ్’ చేసి క్యాబ్ మాట్లాడమని చెప్పేదాన్ని” అన్నది నవ్వుతూ.
“అమ్మ ఇంటరూ, బాగానే ప్రిపేరయి వచ్చావు” అంటూ తల్లిని ఆటపట్టించాడు ఆర్య.
***
ఇంటికి చేరుకోగానే, తలారా స్నానం చేసి, చక్కగా తయారై, అప్పుడు మనవడిని ఎత్హుకుంది. చేతులు చాచగానే వచ్చేసాడు. కొడుకు, తల్లి కళ్ళలోని ఆనందాన్ని ఫోటోలలో బంధించసాగాడు. ఒక్క క్షణంలో ఇండియాలోని జీవితాన్ని, మర్చిపోయి, రెండు చేతులతో, బొద్దుగా, ముద్దుగా వున్న మనవడిని చేతుల్లో పైకెత్తి పట్టుకుని, ముద్దులాడింది. తల్లి మొహంలో ఒక అనిర్వచనీయమయిన మహదానందాన్ని చూసాడు ఆర్య.
“బాబు ఎవరి పోలిక అత్తయ్యా” అంటూ అడిగింది స్నేహ.
ముందే చెప్పాడు రవీంద్ర “పొరపాటున ఎవరి పోలిక అంటే నా కొడుకు పోలిక అనేవు, తల్లి హర్ట్ అవుతుంది, ఇద్దరి పోలిక అని చెప్పి తప్పించుకో” అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, “మీ ఇద్దరి పోలికే, ఇంకెవరి పోలికలొస్తాయి” అంటూ తప్పించుకుంది.
***
ఆర్య ఉండేది ఏడో ఫ్లోర్‌లో. బిల్డింగ్ బయటకు రాగానే లోకల్ రైల్వే స్టేషన్, ప్లాట్‌ఫామ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ చుట్టూ చాలా బెంచీలు వున్నాయి. రైల్వే గేట్ దాటగానే, రోడ్ ప్రక్కనే ఇంకో పెద్ద బిల్డింగ్ వుంది. బాబుని స్ట్రోలర్‌లో అక్కడ తిప్పవచ్చని చెపింది కోడలు. ఎక్కువ దూరం వెళ్లోద్దని, ఎవరిని తేరిపారా చూడవద్దని, పలకరించవద్దనీ, వేరేవారి పిల్లల్ని ముద్దు చేయకూడదని అలా చాలా జాగ్రత్తలు చెప్పేది. ఎక్కువ చదువుకోని అత్తగారికి తాను చెప్పే విషయాలన్నీ అర్థమవుతున్నాయో లేదో అని పెద్ద డౌట్ స్నేహకి.
వసంత వెళ్లిన ఐదో రోజు, ఉదయమే లేచి, బాబుకి వేడినీళ్లు ఫ్లాస్క్‌లో పోసి. మిల్క్ పొడి డబ్బా రెడీగా పెట్టుకుంది. అప్పుడే నిద్ర లేచిన కొడుకుని, అత్తగారికి ఇచ్చి మళ్ళీ వెళ్ళి పడుకుంది స్నేహ. ఇక అప్పటినుండీ వాడికి డైపర్ మార్చడం, నీళ్లు పోయటం, పనులన్నీ వసంతవే. మధ్యలో రవీంద్ర ఎడబాటు వలన కలిగిన బెంగ ఒకటి.
నెమ్మదిగా వాడి డైపర్ మార్చి, పాలు కలిపింది.. అంతలో ఫైర్ అలారం మ్రోగసాగింది. చటుక్కున లేచి, వాడి స్వెటర్, తన స్వెటర్ రెండు డైపర్లు, పాల బాటిల్, వేడి నీళ్ల ఫ్లాస్క్, మిల్క్ పొడి డబ్బా, సన్నగా మడత పెట్టిన రగ్గు, ఒక చిన్న ఫోల్డబుల్ స్టూల్ అన్నీ ముందుగానే సర్దిపెట్టుకున్నది ఒక బ్యాగ్‌లో. కొత్తగా పెట్టుకుంది బాబు ఆహారానికి సంబందించినవి మాత్రమే.
తన పాస్ పోర్ట్, మిగతా అవసరమైన సర్టిఫికెట్స్ చిన్న హ్యాండ్ బాగ్‌లో అంతకు ముందే తన మంచం ప్రక్కనే రెడీగా పెట్టుకుంది.
బాబుని ఆర్య ఎత్తుకున్నాడు, స్నేహ వెనక తాళం వేసి వచ్చింది. లిఫ్ట్స్ ఆగిపోయాయి. ఏడు అంతస్తులు దిగేసరికి వసంతకు చుక్కలు కనపడ్డాయి. తీరా క్రిందకు వచ్చేసరికి బిల్డింగ్ చుట్టూ వున్న ఒక్క బెంచీ ఖాళీగా లేదు, బిల్డింగ్ గోడనానుకుని నించున్నారు చాలా మంది.
బాగా చలిగా వుంది, వసంతకు తట్టుకోవటం కష్టంగానే వుంది, అసలే కాళ్ళ నొప్పులు. నెమ్మదిగా బాగ్ తెరచి స్వెటర్ వేసుకుని, బాబుకి వేయమని స్వెటర్ ఇచ్చింది. ఫోల్డబుల్ స్టూల్ వేసుకుని, దానిమీద కూర్చుని, “ బాబుని ఇలా ఇవ్వరా” అంటూ మనవడిని ఒళ్ళోకి తీసుకుని, రగ్గు కప్పింది. నానమ్మ ఒళ్ళో వెచ్చగా పడుకున్నాడు వాడు. కలిపి ఉంచిన పాలు త్రాగించింది. నానమ్మ ఒళ్ళో హాయిగా పడుకున్నాడు వాడు. తల్లిగా మళ్ళీ జన్మ ఎత్తినట్టు, అమ్మతనమంతా రంగరించి, వాడి తలని నెమ్మదిగా నిమరసాగింది.
దాదాపు రెండు గంటల తర్వాత మళ్ళీ లిఫ్ట్స్ పనిచేయసాగాయి. ఇంటికొచ్చాక తల్లి చూపిన సమయస్ఫూర్తి ఆశ్చర్యపోయారు స్నేహ, ఆర్య.
ఆర్య అన్నాడు “అమ్మా చాలా బ్రిలియంట్‌గా హేండిల్ చేసావు ఇవ్వాళ, ఎలా తెలుసు నీకు ఇవన్నీ” ఆశ్చర్యంగా అడిగాడు.
“అంతా మల్లాది వెంకటకృష్ణమూర్తి దయ” అంటూ పకపకా నవ్వింది వసంత లక్ష్మి.
(సమాప్తం)
అనుకృతి అనే కలం పేరుతో రచనలు చేసే బి. భవాని కుమారి గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 34 ఏళ్ళు లెక్చరర్‌గా పని చేసి 2014లో రిటైరయ్యారు. 2019లో వీరి మొదటి కథ ‘తొలకరి’ సాక్షి ఆదివారం అనుబంధం ‘ఫండే’లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన అనేక కథలు పలు వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.