[శ్రీ శింగరాజు శ్రీనివాసరావు రచించిన ‘సమరనాదం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
నవమాసాల గర్భంలోనే కాదు
నేలమీద పడినా కూడ అదే చీకటి
కంటి అంచుల తీరాలలోనే కాదు
కనుచూపుమేర కాటుక వర్ణమే
నల్లపలక మీద తెల్లని అక్షరాల జాడలేదు
పసిమి చేతుల మెరిసే చీపురుకట్ట తప్ప
నల్లనువ్వుల పేరంటాలు చేసి, లక్ష్మణరేఖ గీసి,
వంటగదిలో పొగగొట్టం చేతికిచ్చారు
పచ్చని పందిటి క్రింద పసుపు పలుపు కట్టి
మూడు రాత్రుల లొంగుబాటును శాశ్వతం చేశారు
నల్లని కురులు వెండి తీగలయ్యే వరకు
నాలుగు గోడల మధ్య వెట్టిచాకిరి వరమయింది
అడుగడుగున వెనుకబాటుతనం
మరణం వరకు విడువని వివక్ష
ఇదేనా సమానత్వపు బంగారు కిరీటం
ఇంతేనా జగతిన ఇంతి బ్రతుకు
సంకెళ్ళను తెంచుకుని ఆడపిల్ల
త్రిశూలం ధరించిన శక్తిలా విజృంభించాలి
మణుగుల కొలది మనోబలమున్న మగువ
మరో అగ్నికణమై జాతిబేధాలను తుదముట్టించాలి
పాలిచ్చి పెంచడమే కాదు పాలించడమూ
మా వంతేనని సమాజానికి చాటిచెప్పాలి
కారుమబ్బులను చీల్చుకుని కాంతిరేఖలై
అతివలు అవనిని అలరించాలి..