[సమాజంలో సమస్యలని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలనే ఆలోచనతో ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అందిస్తున్న పద్యకావ్యం.]
9. ఉద్యోగం – ఉపాధి
చం॥
కొలువులు నింపు ప్రక్రియను కుంచిత నీరస స్థాయి దించి, యే
విలువలు లేనివారికిని విస్తృత రీతిని ‘జాబు’ పంచగా
పలుచన యయ్యెగా, కనగ పాలన ప్రక్రియ, పారదర్శకం
బెలిమియు లేక ప్రశ్నలను పిచ్చిగ ‘లీకులు’ చేయ డబ్బుకై
సీ.॥
ఎంతెంతొ శ్రమకోర్చి ఎనలేని ఖర్చుల
పితరులు చెమటను ధారవోయ
కోచింగులను పేర టీచింగు బదులుగా
చీటింగు జేసెడు మేటిబడులు
లక్షల వెచ్చించి లక్ష్మీసుపుత్రులు
ప్రశ్నపత్రాలనే ప్రాప్తిబొంద
ఉద్యోగ ప్రక్రియ నూరించు సంస్థయు
అవినీతి బురదలో నణగిపోవ
తే.గీ.॥
పేద విద్యార్థులందరు వేదనగను
భావినూహించి మనమున భంగపడగ
మన నియామక ప్రక్రియ మహితమైన
ప్రహసనంబయి వెలుగొందు భ్రష్టమగుచు
శా॥
బాబాసాహెబు తొల్త చెప్పె మనకున్ భారీ రిజర్వేషనుల్
రాబోవీ పదివత్సరాలకనుచున్ రాజ్యాధినేతల్ సదా
కాబోదీపది, చాలదంచు విధిగా కావించు పొడ్డింపులన్
మాబోటుల్ ప్రతిభన్ హరించుటనుచున్ వారించినన్, స్వార్థులై
సీ॥
తొలిమినహాయింపు తోడ చేరినవాని
కది నిల్పివేయంగ కాదె సబబు
ఉద్యోగమును పొంది ఊర్జితుడైనట్టి
వానిదౌ పరివారమునకు గూడ
ఈ రిజర్వేషను లికమీదసాగించు
పద్ధతియేటికి పాడియగునె
అట పదోన్నతులను అమలు జేయగ వీని
అంబేద్కరు స్ఫూర్తి యారిపోదె
తే.గీ.॥
వెనుక బడినట్టివారిదౌ వెసులుబాటు
మాకు కూడను వర్తింప వలయుననుచు
ఉద్యమంబులు చేయంగ నుత్సుకులగు
చిత్రమైనట్టి దౌర్భాగ్య శేషమిదియె
తే.గీ.॥
ఇంజనీరింగు, మెడిసను లివియె చదువు
లన్యమైనవి పనికిమాలినవి యయ్యె
చదువు పేరిట పిల్లలన్ చాల నలిపి
చిరుత మనసుల వేదన చిందునకట
కం॥
‘ఎమ్‌సెట్’ ఎత్తేస్తామని
క్రమముగ యింటరులొ మార్కు కాదిక ‘వెయిటే
జీ’ మరియనెడు ప్రభుత్వము
భ్రమయగు నుద్యోగమింక భావినిజూడన్
సీ॥
వందల సంఖ్యలో వృత్తి కళాశాల
లేమూతబడియెను లేక తగిన
అడ్మిషన్లవి; ప్రభుతయు నలవిగాక
ఫీజు ఇంబర్సుమెంటును వేసె నిలిపి
ఇంగ్లీషు భాషలో నెటువంటి నేర్పును
సాధించలేనట్టి ఛాత్రులకును
ఉద్యోగ కల్పనే యుండక పదివేల
ముష్టి జీతము కోరి మోజపడగ
తే.గీ.॥
ఇంజనీరింగు విద్యను ఈ విధాన
నాశనమొనరించు దుస్థితి భృశముకాగ
మెరిటు కల్గిన కొందరే మేలుపొంది
మిగులు విద్యార్థులందరు వగచుచుంద్రు
కం॥
ఎంబీబీఎస్ అనునది
సంబరమే కాదు, విలువ చచ్చెను, పీజీ
యంబరమంటు ప్రయత్నము
డాంబికమే వైద్యమిపుడటందురు జనులే
కం॥
ఎన్నియొ ఇతరపు విద్యలు
మన్ననతో చదువ దొరుకు మంచివి కొలువుల్
గ్రన్నన వాటిని వదలుచు
అన్నన్నా, కుములనేల? యని ప్రశ్నింతున్
సీ॥
నెలనెలా జీతాల నిచ్చునట్టిదికాదు
ఉద్యోగమన్ననుపాధియగును
శ్రమ జీవనంబున తమ గౌరవంబును
కాచుకొనెడి పట్టు గ్రహణ చేసి
మిర్చిబండ్లు, టిఫిన్ల మేలగుపట్టులు
ఆటోలు, క్యాబులు ఆర్జనమును
సదుపాధి నందించ సాధ్యము కాదొకో
సరిగ శ్రమను చేయ సౌఖ్యమబ్బు
తే.గీ.॥
తెల్లకాలరు జాబులే తెల్లపోవ
స్వీయమైనట్టి కృషి మీరు స్వీకరించి
సాగిపోవుడు విజయాల వేగముగను
ధిక్కరించుడు సరకారు ధిషణతోడ
10. కుల వివక్ష
కం॥
కులములనేకముగా గల
విలసిత సంఘంబు మనది విస్తారగతిన్
తెలిసెడు లోపమె యియ్యది
కలదిట యస్పృశ్యతనెడు కశ్మలమదియున్
చం॥
పనులను బట్టి, కల్గు నిజమైన గుణంబులబట్టి, వర్ణముల్
తను సృజియించె నంచనియె తాపస గమ్యుడు గీతలో తగన్
పనులతొ చింతలేదు మరి పట్టు గుణంబుల మాట యేలొకో?
ఘనగుణ హీన దుర్గుణ వికాసము చూపు కులంబులన్నియున్
తే.గీ.॥
కులము ప్రామాణికంబుగ గుణము గలదె
జన్మచేతను శూద్రులు సకల నరులు
మంచి కర్మల నౌదురు మహిత ద్విజులు
కాన, కులమను విచికత్సమనకదేల?
సీ॥
రాజకీయములోన రాణించులే కులము
ఓట్ల సంఖ్యను బట్టి యుండు విజయ
మభ్యర్థులను నిల్ప మరి లెక్క కులముదే
మంత్రి వర్గము గూడ మలచు కులము
కుల సమీకరణలే కురిపించు ఓట్లను
కులవిహీనమైన బలము గలదె
కులపోని, మనవాని, కోరి ప్రేమగ దెచ్చి
నిల్పగ తహతహ నిత్యముండు
తే.గీ.॥
మనది కులస్వామ్యమేగాని ప్రజలస్వామ్య
మెప్పుడునుగాదు ప్రజలును యెన్నికలను
కులము జూసియె యెన్నుదు రేలికలను
దీని తుదముట్టజేసెడు ఘనుడు కలడె?
చం॥
తనయ కులాంతరంబయిన దైనవివాహము జేసికున్న, నా
జనకుడు, బంధువుల్ కలిసి చంపుదురా సరిక్రొత్తజంట, నె
మ్మనమున ద్వేషమూని పరువన్నది పోయెనటంచు, కాలుచున్
మనవగు ప్రేమలన్నియును మాడవె నీచ కులాగ్ని కీలలన్
తే.గీ.॥
కార్యశాలలయందున, కార్మికాళి
శ్రమను పండించు చోటుల, శాస్త్రములను
సర్వ విద్యల బోధించు ఛాత్రనిలయ
ములను కులమొక్క రీతిగ నలముకొనియె
కం॥
మీదే కులమని సిగ్గును
వదలుచునడిగెదరు, కాని, పరకులమైనన్
అదయుత దూరమువెట్టుదు
రదెమనసంకుచిత దృక్పథంబు గణింపన్
తే.గీ॥
సింహభాగము దేవతా శ్రేణి, ఋషులు
అగ్రకులమున జన్మించి యలర లేదు
జ్ఞాన సంపద, వైరాగ్యగరిమ యెపుడు
నొక్క కులముకు సొంతంబె? నిక్కమిదియె
ఉ॥
మనుసుతు లొక్కటేకులము మానవతే యసలైన ధర్మమే
మనుమనశాస్త్రముల్? సలక ప్రాణుల నీవలె గారవించినన్
తనమతి యెల్ల నక్కవసుధైక కుటుంబపు స్ఫూర్తిగల్గదే
వినతి యొనర్పరే జనులు వీడికులంబు, గుణంబుజూడరే!
11. మేధావుల వలస
ఆ.వె.॥
మాతృ సమమైన దేశంబు వదలిపెట్టి
వలసన వెళ్లెడి వారల నలుసుగాను
వీరికెప్పుడు ధనమందె వీక్షణంబు
స్వార్థపరులని తెగడుట సరియె? కనగ
తే.గీ.॥
తాము చదివిన విద్యకు తగిన కొలువు
దొరకకే కద మనవారు దూర దేశ
మేగి జీవనపోరాట వేగమునను
చేరి నిలద్రొక్కు కుందురు వారి ప్రతిభ
ఉ॥
దేశము వీడిపోయినను తేకువతో మనదైన సంస్కృతిన్
లేశమునైన వీడక వరిష్టము లైన కళాభిమానులై
పాశమునిల్పి పిల్లలకు పాటలు, నృత్యము నేర్పి, మక్కువన్
క్లేశము లెన్నియున్న పులకింతురు భారత ధర్మరక్షణన్
కం॥
తెలుగును పెంపొందించగ
నల సంఘంబులను కూర్చి ఆదరమొప్పన్
పిలుతురు కవులును, పండిత
తిలకుల, కళలందు మించు ధీశాలురనున్
చం॥
నెలవుగ భారతావనిని నిత్యమునుండి, పరాయి సంస్కృతిన్
చెలగెడు వారు లేరెయిటు? చిత్రములైన విదేశ వస్త్రముల్
పలికెడు భాష, తిండియును పశ్చిమ మార్గము సంతరించగా
కులికెడి వారికన్న మన కూర్మిని నిల్పెడు వారె మేలగున్
కం॥
సంపాదించిన విత్తము
పంపుచు మన దేశమునకు పటుతర వృద్ధిన్
యింపగ పెట్టుబడుల్ తగ
నింపుదురే? వారిమీద నిందలు తగునే?
తే.గీ.॥
“దేశమాతను వీడియు ధీరులగుచు
కన్నభూమిని వొగడుచు చెన్నుమీర”
యన్నసూక్తిని నమ్ముచు నవనిలోన
భారతావని వెలిగించు వారు, వారు!
కం॥
ఏ దేశమేగకున్నను
ఈ దేశపు ధర్మములను యిక్కడి విలువల్
కాదనువారల కన్నను
ఆ దేశమునున్నవారు యధికులు చూడన్
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.