పుట్టుకతో అందరూ సమానమేగా
భాగ్యవంతులని, బీదవారని ఉండదు కదా.
సమాజంలో కొందరు బీదవారు ఎందుకు అయ్యారు
కొందరు మధ్యస్తంలో, మరి కొందరు వీరికన్నా ఎక్కువ స్థాయి
కొందరు అతి భాగ్యవంతులు ఎందుకు అయ్యారు
కారణమెవరు? దేవుడా? సమాజమా?
జంతుజాలం, పశు పక్ష్యాదులలో లేని అసమానతలు మానవులలో ఎందుకు?
బీద వారికి దానం, ధర్మం చేయాలనే ఉవాచ
ఎందుకు వచ్చినట్లు?
మానవులందరు సమానమైన నాడు దాన ధర్మాల ప్రసక్తే ఉద్భవించదే.
జంతుజాలం, పశు పక్ష్యాదులలో ఈ అవసరం వుండదే?
ఆకలేస్తుంది, తినటానికి లేదు
చేతిలో డబ్బులు లేవు.
చేయటానికి పని లేదు.
మరేమి చేయాలి?
వున్నవి రెండే మార్గాలు
అడుక్కోవటం. లేదా దొంగతనాలు చేయటం
ఈ పరిస్థితి నాకే ఎందుకు వచ్చింది?
ఇది బీదవాని పరిస్థితి నేటి సమాజంలో.
సమ సమాజం ఎన్నటికీ ఏర్పడదా?
సమ సమాజం ఏర్పడే రోజుకోసం ఎదురు చూద్దాం.
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.