Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సఖ్యతా వర్షం

[షేక్ కాశింబి గారు రచించిన ‘సఖ్యతా వర్షం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

న్నమో రామచంద్రా.. అని
అలమటించే జనానికి
అణుబాంబుల్ని.. చూపి
మభ్యపెట్టే.. పలాయన వాదం..

మతంలో లేని సిద్ధాంతాలని
స్వార్థ పూర్తి కోసం.. జోడించి
మతానికి ఉగ్ర మచ్చ నంటించి
మళ్ళీ మళ్ళీ.. హింస వైపు మొగ్గే తెంపరితనం..

పొరుగు వారి బాగు నోర్వలేని అసూయతో
పచ్చని ప్రకృతిలో సేదదీరే జంటల్లోని
మగవారి నెంచుకుని.. కిరాతకంగా కాల్చి
జబ్బలు చరుచుకునే.. పైశాచికత్వం..

ఆర్థిక పతనపు అంచునున్నా
శాంతి, సుస్థిరతలు నిండుకున్నా
ప్రపంచమే వెలివేస్తున్నా
ఉగ్ర చేతి నొదల్లేని.. వ్యసనపు మోహం..

మీ సొంతాలైనా.. మీ కుటిల
ఎత్తుగడల నాకళింపు చేసుకుని
చిత్తు చేసిన నా దేశవాసుల సఖ్యతా వర్షానికి
పైపైని రంగులన్నీ వెలిసి పోగా..

మీ కుత్సిత మనోగత మవగతమై
విశ్వమంతా ఒక్కటై నిగ్గదీసింది!
‘సిందూర’ వీరుల అద్భుత వ్యూహాలు ఫలించి..
అందాల భారతం విజయంతో మురిసింది!

Exit mobile version