Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సైరంధ్రి’ అనువాద ప్రబంధ కావ్యం – పరిచయం

[డా. వినోద్ జోషి ‘సైరంధ్రి’ అనే ప్రబంధ కావ్యాన్ని గుజరాతీ భాషలో రచించి, హిందీలోకి అనువదించారు. ఈ కావ్యాన్ని తెలుగులో అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

క్షిణ భారతదేశంలోనూ, గుజరాత్ లోనూ ద్రౌపదిని గురించి పరిశోధన చేసిన డా॥ వినోద్ జోషి గారు పరిపుష్టమైన కావ్యభాషలో గుజరాతీలో ‘సైరంధ్రి’ ప్రబంధ కావ్యాన్ని రచించి – హిందీలోకి స్వీయానువాదం చేశారు. ఈ ప్రబంధ కావ్యానికి వ్రాసిన ముందుమాటలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. కేరళలో ఆమె పేరిట దట్టమైన అడవికి ‘సైరంధ్రీవనం’ అనే పేరున్నది. కేరళలో కథకళి నృత్యరీతిలో అనేక సార్లు ‘కీచక వధ’ నృత్యాంశం ప్రదర్శితమవటం గమనించదగినది. దక్షిణ భారతం లోని తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో అనేక శతాబ్దాలుగా 800 పైగా ఆలయాలలో ద్రౌపది మహాకాళీ స్వరూపంగా ఆరాధింప బడుతున్నది.

గుజరాత్ లోని ద్వారకలో ద్రౌపదికి సంబంధించిన అంశాలు లేవు గాని భావనగర్‌కు చెందిన పండిత కవి వినోద్ జోషి గారు భారత విరాట పర్వంలోని ‘సైరంధ్రి’గా, సుధేష్ణ అంతఃపురంలో ప్రత్యక్ష్యం చేశారు. ఈ కావ్యంలో సైరంధ్రి లావణ్యం, వ్యక్తిత్వం, అయోనిజత్వం, నిత్య యవ్వనత్వం, శైశవ ముక్తత్వమే గాక, గుజరాతీ వస్త్రధారణ (గర్భరీతి) గోచరిస్తాయి. ఈ సైరంధ్రి సౌందర్యవతి మాత్రమేగాక మేధాశక్తి గల స్త్రీ. నీటి మీద నడిచే హంస లాంటిది.

ఈ ప్రబంధ కావ్యాన్ని ‘స్త్రీ’కి అంకితమిచ్చారు కవి. ఇందులో సుధేష్ణ, సైరంధ్రి, ఉత్తరల వ్యక్తిత్వ వివరణ ఉన్నది. 13-16 శతాబ్దాలలో ప్రఖ్యాతి వహించిన ప్రబంధాలైన బల్లాల దేవుని ‘భోజప్రబంధం’; జినమదనుని ‘కుమారపాల ప్రబంధం’ వంటివి ఉదాహరణలుగా కనిపిస్తాయి.

‘సైరంధ్రి’ ప్రబంధ కావ్యంలో ఏడు సర్గలు, 49 భాగాలున్నాయి. మొదటి సర్గలోని మొదటి ఖండికను మినహాయిస్తే మిగిలిన ఖండికల్లో 16 మాత్రల చౌపాయిలు, దోహాల ప్రయోగం జరిగింది. ఒక ఖండికలో 36 పంక్తులు, మరొక ఖండికలో 8 చతుష్క చౌపాయీలు, రెండు జతల దోహాలుగా ఉన్నాయి. ఈ కావ్యాన్ని కవి 2018లో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు గుజరాతీ భాషలో రచించారు. కావ్యపఠనం, నృత్యరూప ప్రదర్శన కూడా జరిగాయి. అక్కడి పత్రికల్లో కొన్ని విశ్లేషణా వ్యాసాలు ప్రచురితాలు.

‘స్వ’ నుండి ‘పర’ వరకు కవి చేసే పరకాయ ప్రవేశం, ఆయా పాత్రుల సుఖ దుఃఖ అనుభవాన్ని ‘భావుకత’ అంటాం. మౌనానికి భాష, నిశ్శబ్దానికి శబ్దాన్నివ్వటం కవి ప్రతిభా తార్కాణం. ఈ కావ్యంలోని సంఘటనలన్నీ సంకేతాలుగా సైరంధ్రి మనోక్షోభ, ఉద్వేగం, ఒంటరి వేదనలను వ్యక్తీకరిస్తూనే మహా భారతం కాక వీరొక అంశాన్ని నిరూపణ చేశారు. ఈ రచనలో స్వయంవరంలో కర్ణుడిని చూసిన ద్రౌపది ఆకర్షితురాలవటం నుండి అతడే కీచక వధ చేసినట్లు మార్పు చేశారు. కవి అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరికి తమ తమ జీవనపోరాటంలో కురుక్షేత్రాలుంటాయి. వాస్తవంలో స్త్రీల వ్యక్తిత్వం గుర్తింపు అణచివేయబడుతుంది. ఒక రకంగా ప్రతి మనిషి జీవితం ఒక ‘అజ్ఞాత వాసమ’ని ఈ కవి వాక్కు. స్వామి వివేకానంద కూడా “మన లక్ష్యం తెలుసుకోవటమే మన నిజత్వం” అన్నారు.

‘సైరంధ్రి’ కావ్యానికి గుజరాత్ సాహిత్య అకాడమీ పురస్కార ప్రదానం జరగటం ముదావహం. మనస్తత్వ విశ్లేషణకు నూతన ద్వార ప్రవేశమిది.

Exit mobile version