Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సైనికులు

[‘సైనికులు’ అనే శీర్షికతో 12 పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ చిరువోలు విజయ నరసింహారావు.]

సైనికులు రేలను బవళ్ళు కాన లందున
పర్వతములపై తిరిగాడు భయము లేక
శత్రు సైన్యాల తరిమి దేశమును గాచి
నిరత జాగరూకులగుచు తిరుగు వారు (1)

కన్న తల్లి, బంధు జనము, నున్న ఊరు
విడిచి,సైన్య మందున చేరి, వివిధ ప్రాంత
సీమల సరిహద్దుల రక్ష సేయు వారు
దేశ సంరక్ష చేయుటే ధ్యేయముగను (2)

కష్ట సుఖముల యనుభవ గణన లేదు
నిద్ర సుఖమన్న చింతయే నిలుప బోరు
ధన్య భోజన రుచులను తలప బోరు
ఆలు బిడ్డల ప్రేమ తామాస పడరు
కరడు గట్టిన మనసుల తిరుగు చుండి
నిత్య పోరాట పటిమను నెగడు వారు (3)

అల్ప సంతోషులుగ మన నలవరచుచు
కష్టముల నలవోకగా కాయములవి
గాయముల పాలయిన లెక్క గనక, వీరు
నిత్యము మరణ మంచుకు నెట్ట బడరె! (4)

మంచు కొండల, నడవుల, మారణాయు
ధములను ధరించి, వైరుల దాడు లెల్ల
నిలువరింపగ, నరికట్ట నిపుణు లగుచు
దుర్భరపు బ్రతుకుల నీడ్చుదురు రణమున
నింటి విషయాలు మరచెద రొంటరులయి (5)

బ్రతుకు తెరువున కయి చేరి రణము నందు
సైనికోద్యోగమున శ్రద్ధ, శత్రు సేన
తోడ పోరాడ సిద్ధమై, తుదకు మరణ
మందుటకు కూడ వెరవని మహిత యోధు
లైన మన సైనికులు నిత్య మమరు లకట! (6)

వారి సేవచే మనమింట భద్రముగను
నిద్ర పోవుచు పనులన్ని నిర్భయముగ
జరుపుకొని బ్రతుకుదు మని మరువ రాదు
వారి కంజలి ఘటియింప వలయు మనకు (7)

దొంగ దెబ్బతీయు రిపుల ,దుండగులను
పట్టి, బంధించి దునుమాడు భద్ర దళము
దేశ రక్షణే ధ్యేయమై దిక్కులెల్ల
గాచి కంటికి రెప్పయై ఖ్యాతి గాంచు (8)

త్యాగ శీలురు సైనికుల్ తమ బ్రతుకులు
పణముగా బెట్టి, కాపాడు ప్రజల నెపుడు
శత్రువుల చొరబాటుల సమర మందు
నాపి, ముష్కరులను చంపు పాపు లనుచు (9)

యుద్ధమున గాయపడినంత యోధులెల్ల
అవిటివారయి జీవింప నవసరమగు
నట్టి తరి వారి బాధల కంతులేదు
కష్ట తరమైన బ్రతుకులు గడప వలసె (10)

అధిక సౌకర్యములు కూర్చి, ఆదు కొనగ
ప్రభుత వారికి మరికొన్ని భద్రతలిడి
ధైర్యమును పెంచగా వలె దళము లందు
ప్రజల రక్షణ మాధార పడుచు నుండు
త్రివిధ దళముల శక్తిపై దినదినంబు (11)

స్వంత లబ్ధికి నిసుమంత చింత లేక
నిత్యమును దేశ భద్రత నిల్పు లక్ష్య
మొండె తమ ముందు గాంచుచు, గుండె నిండ
ధైర్య సాహసముల నిరతంబు సాగు
సైన్యమే మనకిడు రక్ష సతత మిలను (12)

Exit mobile version