[‘సైనికుడిని కావాలనుంది’ అనే పిల్లల కథ అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
“జ్యోతి టీచర్, ఆరవ తరగతి క్లాస్‌ను హ్యాండిల్ చేయండి. వాళ్ళ క్లాస్ టీచర్ శలవు పెట్టింది. బాగా గోల చేస్తున్నారు. కొద్దిగా చూడండి” ప్రిన్సిపాల్ చెప్పిన మాటకు “అలాగే సార్” అంటూ బదులిచ్చింది జ్యోతి టీచర్.
మధ్యలో పెద్ద మైదానం, చుట్టూ క్లాస్ రూములతో అక్కడక్కడా చెట్లతో ఉన్నదా స్కూలు. మెకానిక్ షాపులు, ఇనుప రేకులు వెల్డింగ్ షాపుల మధ్యలో ఒక షాపులా కాకుండా కొద్దిగా భిన్నంగా ఉంటుంది స్కూలు. స్కూలు పెట్టిన యజమాని కేవలం డబ్బుల కోసమే కాకుండా పిల్లలంటే ఉన్న ప్రేమతో పెట్టాడు.
ప్రిన్సిపాల్ రూము దాకా వినిపిస్తున్న గోలను వింటూ జ్యోతి ఆరవ తరగతి క్లాసుకు వెళ్ళింది.
“గుడ్ మార్నింగ్ టీచర్” అంటూ పిల్లలంతా నిలబడి పెద్దగా చెప్పారు. “ప్లీజ్ సిట్ డౌన్” అంటూ జ్యోతి కర్చీలో కూర్చుంది.
“ఈ రోజు కొద్దిగా సరదా ఆటలు, మాటలు, పాటలు, అన్ని చేద్దామా” అంటూ టీచర్ “ముందుగా రాబోయే స్వాతంత్ర్య దినోత్సవానికి పాటలు పాడేవాళ్ళు పేర్లివ్వండి. అందులోనూ ఇవి అమృతోత్సవాలు. మంచి పాటలు పాడండి” అని చెప్పగానే కొంతమంది తమ పేర్లిచ్చారు. టీచర్ ఒక కాగితం మీద రాసుకొని బుక్‌లో పెట్టుకుంది.
“పిల్లలూ! మీరు పెద్దయ్యాక ఏమి కావాలనుకుంటున్నారో ఒక్కక్కరూ చెప్పండి. మీ ఆకాంక్షలకు తగ్గట్లుగా ఇప్పటి నుండీ పునాది వేసుకోవాలి. సరే చెప్పండి. సృజన్! నీ దగ్గర నుంచి మొదలుపెట్టు” అన్నది జ్యోతి టీచర్ పిల్లల్ని ఉత్సాహపరుస్తూ.
“టీచర్ నేను ఫస్ట్ చెప్తాను. నేను డాక్టరు కావాలనుకుంటున్నాను. అందరి జబ్బులూ నయం చేస్తాను అందరికీ ఇంజక్షన్ చేస్తాను టీచర్” అన్నాడు ఆకాష్ లేచి నిలబడి.
“టీచర్ టీచర్ నేనైతే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అవుతాను. మా డాడీ అదే అవమని చెప్పాడు. నేను కూడా అమెరికా వెళ్ళి బోలెడు డాలర్లు సంపాదిస్తాను టీచర్!” కళ్ళు గుండ్రంగా తిప్పుతూ గొప్పగా చెప్పాడు హరీష్.
అంతలో ప్రత్యూష లేచి నిలబడి “నేను టీచర్ అవుతాను టీచర్. రోజూ స్కూలులో పిల్లలకు పాఠాలు చెపుతాను. హోం వర్క్ చెయ్యని వాళ్ళను బెత్తంతో కోడతాను” అన్నది హుషారుగా.
క్లాస్ అంతటికీ పొడుగ్గా ఉన్న కిరీటి లేచి “నేను పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అవుతాను. ఎక్కడా దొంగతనాలు జరక్కుండా చూస్తాన్ టీచర్. నాకప్పుడు నిజం గన్ ఇస్తారు” కళ్ళు మెరుస్తుండగా ఉత్సాహంగా చెప్పాడు. ఈనాడు వస్తున్న సినిమాల ప్రభావమిది. తనలో తను నవ్వుకుంది జ్యోతి టీచర్.
“ఒక వరుసలో చెప్పండిరా. ఇలా అక్కడోకరూ, ఇక్కడొకరు చెపితే ఎలా! అయినా నేను సృజన్ దగ్గర నుంచి మొదలుపెట్టమన్నానా. సృజన్! నువ్వులే! ఏమవ్వాలనుకుంటున్నారు చెప్పు” అని టీచర్ కొద్దిగా గట్టిగా అన్నది.
సృజన్ లేచి నిలబడ్డాడు. కాని చెప్పకుండా నిలబడి పోయాడు. “ఏంట్రా చెప్పు” అని టీచర్ గద్దించాక “నేను’నేను” అంటూ ఆగిపోతున్నాడు. “అలా నీళ్ళు నముల్తా వేంటి చెప్పు!” అని టీచర్ గట్టిగా అనేసరికి, “నేను సైనికుడ్ని అవ్వాలనుకుంటున్నాను టీచర్. నేను హిమాలయాల్లో కాపలా కాస్తాను. దేశాన్ని కాపాడుతాను” అంటూ గబగబా చెప్పేశాడు సృజన్.
“దీని కోసం అంత ఆలోచించావేంటీ! మంచి పని అని” టీచర్ అంటుంటే, “రోజు నేనీ మాట చెప్తుంటే మన క్లాసులో పిల్లలందరూ ఎగతాళి చేస్తున్నారు” కొద్దిగా ఉక్రోషంతో అవమాన భారంతో చెప్పాడు సృజన్.
“ఏయ్ పిల్లలూ, ఎందుకలా ఎగతాళి చేస్తున్నారు? దేశాన్ని రక్షించటం అంటే మీరు చెప్పిన అన్ని ఉద్యోగాల కన్నా గొప్పది. శత్రు దేశాల దాడి నుంచి మన దేశాన్ని రక్షించుకోవడం గొప్ప బాధ్యత” అని టీచర్ చెప్తుంటే పిల్లలంతా మూకుమ్మడిగా అరుస్తూ ఇలా అన్నారు –
“టీచర్, బార్డర్‌లో చలికి చచ్చిపోతాం! అక్కడ మనక్కావాల్సిన ఫుడ్ దొరకదు. సినిమాలు, గేమ్స్ ఉండవు. ఇంకా శత్రు సైనికులు బాంబులేస్తే పుల్వామా దాడిలో లాగా చచ్చిపోతాం. అమ్మో వద్దు టీచర్. వాడికి వన్నీ తెలియదు. అమాయకుడు. అందుకే ఎగతాళి చేశాం”.
ఈనాటి పిల్లలకున్న జనరల్ నాలెడ్జ్‌కి ఆశ్చర్యపడాలో, స్వార్థంగా తయారౌతున్న ఈ తరాన్ని చూసి భయపడాలో అర్థం కాలేదు టీచర్‌కు. తాను అన్ని విషయాలూ విడమరిచి చెప్పాలనుకుంది. అసలు ముందుగా సృజన్ మనసులో ఏముందో తెలుసుకుందాం అనుకున్నది.
“సృజన్ నువ్వు సైనికుడివి ఎందుకు కావాలనుకుంటున్నావో చెప్పు” అని ఆసక్తిగా అడిగింది టీచర్. “టీచర్! కార్గిల్ యుద్ధంలో వాళ్ళ మామయ్య చనిపోయాడు. అయినా వాడికేమి అర్థం కాదు” సృజన్ ఫ్రెండ్ సాత్విక్ చెప్పాడు.
జ్యోతి టీచర్ మనసులో ఆశ్చర్యపోతూనే “ఏంటి సృజన్ నువ్వు చెప్పు” అన్నది ఉత్సుకతతో.
“టీచర్! వ్యాధులు వచ్చాక మందులు వాడటం కన్నా వ్యాధులు రాకుండా చూడటం మంచిది కదా! అంటే దేహంలోకి బాక్టీరియా, వైరస్‌లు రాకుండానే వాక్సిన్‌లు వేయించుకోవటం గానీ, వాటికి దూరంగా ఉండటం కాన్నీ చెయ్యాలి కదా” అని చెప్తుంటే టీచర్ అడ్డు తగిలి “అది కాదురా నువ్వెందుకు సైనికుడివిగా కావాలనుకున్నావో చెప్పరా” కొద్దిగా అసహనంగా అన్నది.
“టీచర్! సృజన్ వాళ్ళ డాడీ డాక్టర్. వాడికి చాలా మెడిసిన్స్ తెలుసు టీచర్!” అని ప్రియాంక చెప్పింది.
టీచర్ తల ఉపుతూ ఏదో అనబోయేంతలో సృజన్ మాట్లాడటం మొదలుపెట్టాడు.
“టెర్రరిస్టులు మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించి దాడులు చేస్తున్నారు. గోకుల్ చాట్ దగ్గర జరిగిన దాడిలో ఎంతోమంది మరణించారు. నేను సైనికుడిని అయితే అక్రమంగా చొరబడేవారిని లోపలికి రాకుండా అడ్డుకుంటాను. అంటే వైరస్‌ను దేహమనే దేశం బయటే నిలబెట్టేస్తాను. అందుకే సైనికుడ్ని కావాలనుకున్నాను. నేనివన్నీ చెపితే వీళ్ళంతా నవ్వుతున్నారు” అంటూ పెద్ద ఆరిందాలా చెప్పాడు సృజన్.
వీడికివన్నీ ఎలా తెలుసు అన్న ఆశ్చర్యంలో టీచర్ ఉండగానే సృజన్ మళ్ళీ మాట్లాడాడు – “మా మూత్తాతగారు స్వాతంత్య్ర సమరయోధులు టీచర్. గాంధీతో కలిసి పనిచేశారు, తామ్ర పత్ర గ్రహీత. మా తాత నాకు చిన్నప్పటి నుంచీ ఇదే కథలు చెప్పేవాడు టీచర్.”
‘ఇప్పుడర్థమయింది వీడి తెలివికి కారణమేమిటో’ అని మనసులో అనుకుని “ఇలా నా దగ్గరకు రా సృజన్” అని ప్రేమగా పిలిచింది.
సృజన్‌ను తన పక్కన నిలబెట్టుకుని అందరి పిల్లల చేతా చప్పట్లు కోట్టించింది. “సృజన్ ఆశయం చాలా గొప్పది. తన ఆశయం నెరవేరాలని మందరం కోరుకుందాం. ఇంకో విషయం పిల్లలూ ఎప్పుడూ ఎవ్వరినీ ఎగతాళి చేయకూడదు. సృజన్‌కు అందరూ సారీ చెప్పండి” అని జ్యోతి టీచర్ చెప్పింది.
అలాగేనన్నట్లుగా పిల్లలందరూ తలూపి సృజన్‌ను చేయి పట్టుకోని తీసుకెళ్ళారు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.