[పాణ్యం దత్తశర్మ గారి ‘సాహిత్య సంత!’ అనే వ్యంగ్య రచనని అందిస్తున్నాము.]
తెలుగు రాష్ట్రాల్లోని ఒక ముఖ్యనగరం. సాహితీవేత్తలకు, పుస్తక ప్రచురణకు, చివరికి సినిమా వాల్ పోస్టర్ల ముద్రణకు పేరుగాంచిన ఊరు. అక్కడ జరుగుతూ ఉందో ప్రహసనం. నవలల, కథల పోటీలను, ఒక పత్రికవారు నిర్వహించి; విజేతలకు బహుమతి పందేరం చేసే ఒక సభ.
దాదాపు సంవత్సరం క్రిందనే ఈ నవలల, కథల పోటీలు పెట్టారు. ఫలితాలు ప్రకటించేశారు. కానీ ఎవరికీ బహుమతి సొమ్ములు ఇవ్వలేదు. “ఎప్పుడో బహుమతుల సభ పెడతాం, అప్పుడిస్తాం” అని ఊరిస్తూ వస్తున్నారు.
యథాప్రకారం, వీళ్లకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాన్నిండా స్వకుచ మర్దనాలూ, పరకుచ పీడనాలే. పత్రికను ఆకాశానికెత్తుతూ, ఆహా! ఓహో! అంటూ పోస్టులు. కథల మీద విశ్లేషణలు! రాతల వాళ్లు కాస్తా కోతల వాళ్లయ్యారు. వందిమాగధులు వీళ్ల పోస్ట్ లను చూసే సిగ్గుపడి అస్త్రసన్యాసం చేస్తారు. భట్రాజులు పారిపోతారు. స్టాండ్ అప్ కమెడియన్ల లాగా, రైట్ కప్ కమెడియన్లు తయారైనారు.
ఉత్తరాంధ్ర లోని ఒక చిన్న పట్టణం నుండి రైటరొకాయన సభకు బయల్దేరాడు. ఆయన పేరు వాణీ ప్రసాద్. ఆయనకు ఆ పత్రికలో ఒక నవలకు, రెండు కథలకు బహుమతులు వచ్చాయి. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. న్యాయనిర్ణేతలు గుణగ్రాహులు. ఎంపిక నిష్పక్షపాతంగా చేశారు. అందుకే వాణీ ప్రసాద్‌కు బహుమతులు వచ్చాయి.
ఆ మధ్య ముఖపుస్తకంలో ఒకాయన పెద్ద పోస్ట్ పెట్టాడు. విరసం, అరసంల లాగా ‘సరసం’ అని ఉందట. దాని ఫుల్ ఫార్మ్ ‘సర్దుబాటు రచయితల సంఘం’ అట. ప్రతి పోటీ ఫలితాలలో ఇంచుమించు అవే రచయితల పేర్లు దర్శనమిస్తుంటాయని, ‘సర్దుబాటు’తో అది జరుగుతుందని ఆయన చెప్పారు. ఇంకొకాయన సాహిత్య అకాడమీల పురస్కారాలు కూడా అదే బాపతని కుండ బద్దలు కొట్టారు. ఈమధ్య ‘లలిత కళా వజ్ర’ అనే సంస్థ, ‘సంవత్సరాది పురస్కారాల’కు మందలు మందలుగా కవులను, రచయితలను, ఇతర కళాకారులను ఎంపిక చేసి సరిగ్గా ముందు రోజు రాత్రి వారికి సమాచారం ఇచ్చి, వారు రాజధానికి చేరుకోడానికి నానా పాట్లు పడేలా చేశారని, తానందుకే, తనకు పురస్కారం వచ్చినా వెళ్లడం లేదని, ఇంకొక ఆయన పోస్టు పెట్టారు.
సరే, వాణీ ప్రసాద్ సభాస్థలికి చేరుకున్నాడు. ఆయనొక సీనియర్ సిటిజన్. సభావేదిక మూడో ఫ్లోర్ అన్నారు. లిఫ్ట్ లేదు! హతవిధీ! అనుకున్నాడు. చచ్చి చెడీ మెట్లన్నీ ఎక్కి పైకి చేరాడు.
అప్పుడు ఉదయం 11.00 గంటలయింది. సభ 10 గంటలకే ప్రారంభం అని ప్రకటించి ఉన్నారు. వేదిక మీద కోటు వేసుకొని స్మార్ట్‌గా ఉన్న ఒక యువకుడు, మామూలుగా ఉన్న ఒక యువతి, ప్రేక్షకులకు కాలక్షేపం కలిగించడం కోసం, సినిమా పాటలు పాడుతున్నారు. సాంకేతికత ముదిరి, వాద్య సహాకారం కూడా పాటతో పాటు వస్తోంది. కాని అది మరీ బిగ్గరగా ఉండి, గాయనీ గాయకుల గొంతులను డామినేట్ చేస్తున్నట్లు అనిపించింది వాణీ ప్రసాద్‌కు. వారి పాటలలో శృతి అప్పుడప్పుడూ గతి తప్పుతూంది.
ముందు వరుసల్లోని కుర్చీలన్నీ నిండిపోయాయి. వాణీ ప్రసాద్‌కు ఎక్కడా కుర్చీ దొరకలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ, అప్రసిద్ధ రచయితలు, రచయిత్రులు ఎంతో మంది కనబడ్డారు. మొత్తానికి ఇంతమంది రచయితలను ఒక చోట చేర్చడం ఆషామాషీ వ్యవహారం కాదనుకున్నాడు ‘వాప్ర’.
వేదిక మీద రెండు డజన్ల కుర్చీలున్నాయి! అంటే అంతమంది వేదికని అలంకరించబోతున్నారన్న మాట! విశిష్ట అతిధి, ఆత్మీయ అతిథి, గౌరవ అతిధి, ప్రత్యేక అతిథి, అనుకోని అతిధి, ఇలా ఎందరున్నారో!
12 గంటలకు అధికార ఎమ్.ఎల్.ఎ. గారు వచ్చారు. గన్‌మ్యాన్ సరే సరి. తర్వాత అధికార పార్టీకి చెందిన చాలామంది చోటా మోటా పతలా నాయకులు వేదికని అలంకరించారు. వారిలో కొందరే ఈ బహుమతులన్నీ స్పాన్సర్ చేశారని ‘వాప్ర’ కు తెలిసింది. మరి వారంతా ప్రసంగించాలి కదా!
సభాధ్యక్షులు ఆ పత్రిక ఎడిటర్ గారే. రాజకీయాన్నీ, సాహిత్యాన్నీ ముడిపెట్టడం ఆయనకే చెల్లింది. బహుమతులు స్పాన్సర్ చేయించుకోవడమే కాకుండా, తన పత్రికకు స్వంత భవన నిర్మాణం కోసం ప్రభత్వం ద్వారా నివేశన సలం ఇప్పించమనీ, దాంట్లో రచయితలు విశ్రాంతి తీసుకోడానికి రెండు రూములు అన్ని సౌకర్యాలతో కడతామనీ, వేదిక మీదే అప్పటికప్పుడు స్థలం ఇప్పిస్తానని వాగ్దానం చేయమనీ అధ్యక్షుల వారు ఎమ్.ఎల్.ఎ. గారిని కోరారు. ఆయన ఈయన కంటే ఏడాకులు ఎక్కువ చదివినవాడు. హామీ ఇచ్చాడా లేదా అనేది తెలీకుండా జాగ్రత్తగా ‘కమిట్’ కాకుండా మాట్లాడాడు.
“గత ప్రభుత్వ అరాచక పాలనలో..” అంటూ కొందరు వక్తలు గర్జించారు. గత ప్రభుత్వం సాహిత్యాన్ని ఎదగనివ్వలేదట.. వీళ్ళు ఉద్ధరిస్తారట!
మధ్యాహ్నం రెండు దాటింది. రచయితలు, రచయిత్రులు ఆకలితో నకనకలాడసాగారు. రాజకీయ నాయకులు ఎంతకీ వదలరే! పాపం అధ్యక్షుల వారు ‘రెండే నిమిషాలు’, ‘క్లుప్తంగా’ అని చెప్పినా వినరే! మైకాసురులు వారు మరి.
కొందరు సీనియర్ రచయితలకు ‘జీవన సాఫల్య పురస్కారం’ అంద చేసిందా పత్రిక. బాగానే ఉంది. వేదిక చూట్టూ మైకుల గొట్టాలు పట్టుకొని విలేఖరులు, టి.వి ఛానళ్ల వాళ్లు! ప్రేక్షకులకు వేదిక కనబడటంలేదు!
జీవన సాఫల్య పురస్కార గ్రహీతలను వేదిక మీదకి పిలిస్తే, వారు వెళ్లడానికి కష్టపడాల్సి వచ్చింది. ఒకావిడ సన్మానపత్రాలు ఫ్రేమ్ కట్టినవి మైకులో చదువుతూ ఉంటే వినే వారే లేరు. అంతా గందరగోళం. తొక్కులాట. వారి గురించి అధ్యక్షల వారు చెబుతూంటే వినబడితే గద!
ఇంతలో క్యాటరింగ్ వాళ్లు భోజనాలు తెచ్చారు. రచయితలంతా బఫె లో లంచ్ కోసం క్యూలో నిలుచున్నారు.
జీవన సాఫల్యం వాళ్లు కూడ, కష్టపడి వారి భోజనం వారు సంపాదించుకోవలసివచ్చింది. భోజనం బాగుంది. ‘వాప్ర’ జనాలు ఎక్కువవక ముందే వెళ్లి తిన్నాడు. ఒక కుర్చీలో కూర్చొని చిన్న నిద్ర తీశాడు.
తర్వాత మొదలైంది బహుమతుల ప్రదానం. ప్రశంసాపత్రాలు రడీ! నవలలకు చెక్కులు, కథలకు నగదును కవర్లలో పెట్టి ఇవ్వాలని..
ఈలోపు ప్రశంసాపత్రాలు కలగాపులగం అయ్యాయి. రచయితలను పిలిచి, కుర్చీలో కూర్చోబెట్టి, శాలువ, ప్రశంసాపత్రం, షీల్డ్, చెక్ లేదా నగదు కవరు ఇస్తున్నారు. ఒక నాయకుడి ద్వారా ఇప్పిస్తున్నారు. ఐదారు మందికి ప్రదానం జరిగింది. అంతే, సృజనా ధురీణులైన రచయితలు రచయితులు వేదిక మీదకి ఎగబడి, మా చెక్ ఇవ్వండి, మా కవర్ ఏది? మా ప్రశంసాపత్రం ఏది? అని పోడియం చుట్టూ మూగారు. కొందరు లోపలికి వెళ్లి అవన్నీ చూస్తున్నవారిని, త్వరగా ఇవ్వమని ఒత్తిడి చేయసాగారు. పాపం అధ్యక్షుల వారు, రచయితలను రచయిత్రులను సంయమనం పాటించమని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఎవరయినా వింటే కద! రచయితలూ మనుషులే!
‘వాప్ర’ దూరంగా కూర్చొని ఈ ప్రహసనమంతా చూస్తున్నాడు. తన నవలకు, రెండు కథలకు బహుమతి వచ్చింది. ఎందుకొచ్చిందా అని అనుకొని బాధపడ్డాడు వాప్ర. వేదిక వద్ద జనసమ్మర్దం సారీ, రచయితల సమ్మర్థం సాయంత్రం 4.30 గంటలకు తగ్గింది. అప్పుడు వెళ్లి అడిగాడు. ఒక రచయితనైతే, కుర్చీలో కూర్చోబెట్టి “ఇప్పుడు కాదు తర్వాత” అని లేపేశారు! ఆయన చిన్నబుచ్చకున్నాడు.
“మీ చెక్ రాశానండీ! కనిపించడం లేదు!” అన్నది చెక్కులు ఇచ్చే అమ్మాయి! “చూసి, మీకు పోస్టులో పంపుతాం లెండి” అన్నది. ప్రశంసాపత్రాలు మాత్రం ఇచ్చారు. ‘అవెందుకు? చెక్ కావాలి గాని’ అనుకున్నాడు ‘వాప్ర’. చివరికి అధ్యక్షులవారు విషయం తెలుసుకొని, ఇంకో చెక్ రాయించి యిచ్చారు. దటీజ్ ది స్పిరిట్. రెండు కథలకు నగదు అందింది కవర్లలో. ఇవన్నీ పెట్టుకోవడానికి అందమైన, ఖరీదైన బ్యాగ్ కూడా అందరికీ ఇచ్చారు. కాని సాహిత్యానికి ఇంత ‘షో’ అవసరమా! సరిగ్గా ఆర్గనైజ్ చేయకపోతే, ఇలాగే ‘సంత’లా తయారవుతుంది – అనుకున్నాడు ‘వాప్ర’!

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.