Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాహితీ దిగ్గజం సినారె

[29 జూలై డా. సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘సాహితీ దిగ్గజం సినారె’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

డా. సి. నారాయణరెడ్డి గారు 1931 జులై 29న ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా అత్యంత పవిత్రమైన గురుపూర్ణిమ నాడు మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు వేములవాడ మండలం హనుమాజీపేటలో జన్మించెను. ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత విద్యాభ్యాసం ఉర్దూలో జరిగింది. బాల్యంలోనే తెలుగుభాషపై గల మక్కువతో హరికథలు, జానపదాలు, జంగంకథల వైపు ఆకర్షితులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రోత్సాహంతో ఆధునికాంధ్ర వాఙ్మయంపై సిధ్ధాంతగ్రంథ సమర్పణ చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యుడుగా ఎందరో విద్యార్థులకు విద్యాబోధన గావించారు. విశ్వంభరకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠను అందుకున్నారు.

పద్మభూషణ్, కళాప్రపూర్ణ మొదలు గాగల అనేక పురస్కారములను పొందారు. ఆంధ్రప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, రాజ్యసభ సభ్యులుగా తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించారు శ్రీ నారాయణ రెడ్డి గారు. దాదాపుగా శతాధిక వచన, పద్యకావ్యాలు, వారి కలంనుండి జాలువారాయి.

ఆయన కలం నుండి పద్య, గేయ, వచన కావ్యాలు, నాటకాలు, గద్యకృతులు, వచనకవితలు, యాత్రాకథనాలు, బుర్రకథలు, గజల్స్, పద్యనాటికలు అనేకము వెలువడినాయి. ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదు. అజంతా సుందరిలో సొగసైన అందాలు చిందించి, కర్పూరవసంత రాయలుగా గుబాలించి, రామప్పలో సంగీతహొయలు చూపించి సరస్వతీ సమర్చన చేసిన సాహితీస్రష్ట. ఆయన రచనలు ఇంగ్లీషు, ఫ్రెంచి, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ భాషలలోనికి అనువదింపబడినాయి. సాహితీప్రక్రియలో మాత్రమే కాక చలనచిత్ర సీమలో కూడా దాదాపుగా 3000పైగా సినీగీతాలను రచించి సినీపాటల రచయితగా ప్రసిధ్ధి చెందారు. యన్.టి. రామారావుగారు నటించిన గులేబకావళికథ సినిమాతో సినీగీత రచయితగా మారి ఎన్నో అందమైన గీతాలను రచించిన మహాకవిగా ప్రసిధ్ధి చెందారు. కేవలం పాట మాత్రమే కాదు ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది ఆయన రచన. జన సామాన్యానికి చేరువుగానున్న ఏకైక సాహితీ ప్రక్రియ సినిమాపాట. సంగీతం తెలిసినా, తెలియకపోయినా, పాటను విని పాడే ఆసక్తి కలవారు ఎందరో మనకు కనిపిస్తారు. పురాణ గాథల యందలి విశేషాలను పాట రూపంలోనే కాక పద్యరూపంలోనూ మన కళ్ళ ముందు నిలుపుతుంది వారి రచన. నిరక్షరాస్యులకు సైతం వినికిడి జ్ఞానం చేతనే పాటలను మాత్రమే కాక పద్యాలను కూడా ఆలపించే శక్తి జనసామాన్యానికి కలిగించింది. సాహిత్య ప్రధానమైన గీతాలు రచించిన వారికి మాత్రమే గౌరవాదరములు లభించే మాధ్యమం సినిమా.

పాటకు పల్లవి ప్రాణం అన్నారొక సినీకవి. పల్లవి, అనుపల్లవి, చరణము పాటకు ప్రాణం. ఇవన్నీ సమకూరినపుడు మాత్రమే పాటకు రససిద్ధి కలుగుతుంది. అంతటి గొప్ప రసవంతమైన పాటలు రచించిన మహాకవి డా. సి నారాయణరెడ్డి గారు. రెడ్డిగారు వైవిధ్య భరితమైన వేల పాటలను రచించారు. సన్నివేశాలకు తగినట్లుగా నవరసాలను తన పాటలలో చొప్పించి రచన చేయటం వారి ప్రతిభకు నిదర్శనం. జీవితం అందమైన పాటలాంటిది అన్నారు మహాకవి. మనసుపెట్టి వినగలిగితే వీచే గాలులలో, పక్షుల కువకువలలో, కదిలే మేఘాలలో, పలికే ప్రతి మాట మధురమైన పాట వంటిది. చతుర్వేదములలో సామవేదము సంగీత ప్రధానమైనది. పాట మనసుకు హాయిని కొలుపుతుంది. తెలుగు నాటకాలలో రాగయుక్తమైన పద్యాలను జనం ఆదరించేవారు. పద్యానికి ఎప్పుడుపట్టాభిషేకం చేస్తారు ప్రేక్షకులు. ఆ తరువాత కాలంలో పద్యమే పాటగా రూపాంతరం చెందింది. సినిమాలకు పూర్వం పల్లెపడుచులు పొలంలో పనులు చేసుకుంటూ లల్లాయి పదాలు పాడేవారు. అవే జానపద గేయాలుగా ప్రసిద్ధి పొందాయి. తరువాత సినిమా జనరంజకమై సాహిత్య ప్రధానమైన పాటలు ఉద్భవించాయి.

డా. సి. నారాయణ రెడ్డిగారి గీతాలను 10 రకాలుగా చెప్పవచ్చును. ప్రణయ గీతాలు, ప్రకృతి గీతాలు, దేశభక్తి గీతాలు, భక్తిగీతాలు, ప్రబోధాత్మక గీతాలు, సామాజిక గీతాలు, వ్యక్తిత్వ వికాస గీతాలు, బాంధవ్య గీతాలుగా విభజించవచ్చును. వీరు చేపట్టని ప్రక్రియ లేదు.

1962లో గులేబకావళి కథలో వారి కలం నుంచి జాలువారినది తొలి శృంగార గీతం. వారికి ప్రఖ్యాతి తెచ్చినపాట

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి

ఈ పాటలో ప్రేమ యొక్క మాధుర్యాన్ని ఎంతో చక్కగా వర్ణించి చెప్పారు కవి. పూలదండ, కర్పూరకళిక అనే ఉపమానములు అత్యద్భుతములు. అవి రెండు పరిమళ భరితమైనవి. రెండుా భగవంతునిసేవలో తరించేవి. నాయకుడు కూడా ఆమె ప్రేమ పుష్పము తన మనస్సున వీడని బంధము వేసింది అని నర్మగర్భముగా ప్రేమ మాధుర్యాన్ని అనుబంధ, గంధములతో పోల్చి చెప్పిన నారాయణరెడ్డి గారు. ఎన్నో పరిమళభరితమైన పాటలను మనకు అందించారు.

మబ్బులో ఏముంది నామనసులో ఏముంది
మబ్బులో కన్నీరు నా మనసులో పన్నీరు

అంటూ మబ్బులో వర్షించే నీటినికన్నీరుతో పోల్చారు కవి. ఆమె మాటలలో ఉండే మాధుర్యాన్ని ఆమె మనసులోని పన్నీరుగా వర్ణించారు. ఈ పాట శృంగారభరితంగానే కాక చివరలో

నేనులో ఏముంది నీవులో ఏముంది
నేనులో నీవుంది నీవులో నేనుంది

అన్న ముగింపులో ప్రేమలోని అద్వైత భావన మనకు కనిపిస్తుంది. నీవు నేను అనే భేదం పోయి ఇద్దరం ఒకటే అనే అద్వైత తత్వాన్ని గోచరింప చేసిన కవి దృష్టి అద్భుతం.

“అద్వైతం సుఖదుఖయో రనుగతం సర్వాస్వవస్థాసుయత్” అని దాంపత్య వైశిష్ఠ్యాన్ని గురించి భవభూతి చెప్పిన శ్లోకం స్ఫురణకు వస్తుంది. సాహిత్యము, మాధుర్యము పెన వేసుకున్న ఈ పాటను వింటుంటే నాయికా నాయకులను మన కళ్ళ ముందు నర్తింపచేస్తారు. ప్రేమలోని అద్వైత భావాన్ని చొప్పించి రచన చేయటము కవి ప్రతిభకు నిదర్శనము. అలానే వివాహబంధం సినిమాలో నాయిక నాయకుల హృదయ స్పందన వినిపింప చేశారు.

‘నేటికైనా ఏనాటికైనా నిలుచు ఈ బంధము’ అన్నప్పుడు శాశ్వతమైన వివాహబంధ విశిష్టతను గురించి చెప్పారు. ఏకవీరలోని పాటలలో ప్రియురాలు ప్రియుడు కోసం చేసే వెతుకులాట, నీటిలో గలగలల సవ్వడిలో, తెల్లని పారిజాతాలలో, చిరుగాలుల శబ్దాలలో, ప్రియుని నవ్వుల అడుగుల సవ్వడులు అని భ్రమింపచేయటం అద్భుతం. స్త్రీ యొక్క సున్నితమైన మనసుకి తగినట్లుగా కవి ఉపమానాలు ప్రయోగించారు. ఇక్కడ

చాటుగా పొదరింటి మాటుగా విన్నాను
పాటలాధర భావనలు కన్నాను

అని నాయకుడు అన్నప్పుడు పాటలోనే ఆమె రూపాన్ని తన కన్నులలో ఊహించుకొని తన్మయుడయినాడు. ఆమె పాట అతని మనసులో అనురాగ మధుధార అయినదని పేర్కొన్నారు. ఇలా ప్రేయసి ప్రియుల మధ్య గల సున్నితమైన రాగ బంధాన్ని గురించి మన కన్నుల ముందు వారు కనపడకపోయినా వారి మనసులో కలిగే స్పందనలను ఏకవీర చిత్రంలో అద్భుతంగా చూపించారు. అలానే బందిపోటులో నాయకుడు నాయికను కవ్విస్తూ పాడే పాటలో

“కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే”

అంటూ నాయకుడు నాయికను కవ్వించడం ఈ రచనలో ద్యోతకం. నారాయణరెడ్డి గారు ప్రణయ గీతాలను వ్రాయటంలో అందెవేసిన చేయి అని చెప్పవచ్చు.

దేశభక్తి గీతాలు దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా అన్నారు గురజాడ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలువారు. అంత గొప్పగా దేశభక్తి గేయాలు రచించిన ఘనత నారాయణరెడ్డి గారిది. దేశాన్ని ప్రేమించాలి, దేశ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని గురించిన రాసిన కవులు వీరు. ప్రతి మనిషికి దేశం పట్ల గౌరవం, భక్తి, ప్రేమ ఉండాలి. దేశం కోసం ప్రాణమిచ్చేంతటి భక్తి ఉండాలి. ఈ దేశం నాకేమిచ్చింది అని కాక ఈ దేశం కోసం నేనేం చేయాలి అన్న ఆలోచన ప్రతి మనిషికి ఉండాలి అన్నది వీరి ఉద్దేశం. అలాంటి పాటలలో ఒకటి

నా దేశం భగవద్గీత
నా దేశం అగ్ని పునీత సీత
నా దేశం కరుణాంతరంగ
నా దేశం సంస్కార గంగ

అంటూ దేశం యొక్క గొప్పతనాన్ని అధ్భుతంగా వర్ణించారు. కురుక్షేత్ర యుద్దరంగంలో నిలబడి బంధుమిత్రులను, తాతలను, గురువులను, అశేష జన వాహిని చూసిన అర్జునుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు ప్రబోధించినట్లు అన్నట్లు నా దేశం ఒక భగవద్గీత అని గొప్పగా చెప్పాడు. నా దేశం అగ్ని పునీత సీత, పావనగంగ అంటూ దేశం గొప్పతనాన్ని చాటారు నారాయణ రెడ్డి గారు.

నింగికి కులమేది నేలకు కులమేది అంటూ కులమతవ్యత్యాసాలను నిరసించారు.

నల్లని రాలలో కన్నులు దాగెనో

బండలమాటున గుండెలు దాగెనో

అంటూ వివరించినా,

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి

అంటూ బంధాల గొప్పతనాన్ని తెలిపారు.

ఇదేనా మన సంప్రదాయం ఇదేనా

అంటూ వరకట్న దురాచారాన్ని నిరసించినా,”

నీ పేరు తలచిన చాలు కృష్ణా అని భక్తి గీతాలు పాడినా,

అన్నా నీ మనసే వెన్న అంటూ ప్రశంసించినా,

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు

అంటూ ధర్మాన్ని మన కన్నుల ముందు నిలిపినా,

మారాలి మనుషుల నడవడి మారాలి

అంటూ ప్రబోధాత్మక గీతాలను రచించినా,

వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాలలాలి

అంటూ జోలలు పాడినా,

రాయలసీమ గడ్డ దీని కథ
తెలుసుకో తెలుగు బిడ్డ

అంటూ సామాజిక గీతాలను వినిపించినా,

స్నేహమేరాజీవితం స్నేహమేరా శాశ్వతం

అని స్నేహం గొప్పతనాన్ని చాటారు.

“అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి” అన్నా, “చదువు రాని వాడవని దిగులు చెందకు” అంటూ వ్యక్తిత్వ వికాసాన్ని గీతాలలో తెలియచెప్పిన కవిస్రష్ట నారాయణరెడ్డిగారు.

నన్నుదోచుకొందువటే అంటూ సాహితీ ప్రస్ఠానాన్ని ప్రారంభించి ఆ సాహితీమతల్లి హృదయాన్ని దోచుకొని వేల వేలపాటలను మన కందించారు. వారి కుమార్తెలకు పవిత్ర నదీమతల్లుల పేర్లను పెట్టి వారి దేశభక్తిని చాటుకున్నారు.

తెలుగుజాతిమనది నిండుగ వెలుగుజాతి మనది
ప్రాంతాలువేరైన మనఅంతరంగమొకటేనన్న
యాసలువేరుగవున్నా మనభాష తెలుగుబాసన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నావరాలతెలుగు ఒకటేనన్నా

అంటూ తెలుగుభాషపైగల అభిమానాన్ని చాటిన కవిదిగ్గజము డా. సి నారాయణరెడ్డి గారు. సాహిత్య అకాడమి, రాజలక్ష్మి పురస్కారం, భారతీయ భాషాపురస్కారం, పద్మభూషణ్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలనందిన కవిశ్రేష్ఠుడు.

20వ శతాబ్దిలో – తనదైన సాహితీ ప్రతిభను చాటిన సి.నా.రె. సాహితీదిగ్గజముగా ప్రజలమనస్సులలో కొలువైన చిరస్మరణీయుడు.

Exit mobile version