Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సాహితీ వాచస్పతి’ శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్

[ఇటీవల స్వర్గస్థులైన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారికి నివాళిగా ఈ రచనని అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

సాహితీ త్రివిక్రముడిగా కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు తాను చేపట్టిన ప్రతి ప్రక్రియకూ తనదయిన మౌలిక భావస్పర్శనద్దిన మేధావి. అనితర సాధ్యమైన వైవిధ్యంతో రచనా వ్యవసాయం సాగించిన ఈ అక్షర సైనికుడు, కవి, కథకుడు, నవలా కర్త, నాటక రచయిత, ప్రయోక్త, దర్శకుడు. వ్యాఖ్యాత, జర్నలిస్టు, హరికథా రచయిత, శీర్షికల రచయిత, ఆధ్యాత్మిక ప్రవచన రచయిత, డాక్యుమెంటరీల నిర్మాత. లీగల్ కాలమ్స్ నిర్వాహకుడు, పత్రికలకు సహ సంపాదకులు, సలహాదారు, న్యాయ సలహాదారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవానిర్వాహకులు, హైకోర్టు లాయర్. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ దుర్గ చార్టర్ ప్రెసిడెంట్, జీజీ సైనిక జాతీయ స్థాయి ఫెడరేషన్ స్థాపక అధ్యక్షులు, వినియోగదారుల జాతీయస్థాయి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సైనికోద్యోగి, సంగీత సాహితీ ప్రేమికుడు, మానవతావాది.

ఇన్ని విశేషాలు ఒకే వ్యక్తిలో కేంద్రీకృతం కావటం సాధ్యమా అని ఆశ్చర్యం కల్గుతుంది. కానీ ఇది మనం చూస్తున్న నిజం! ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి విశ్లేషించటానికి ఒక వ్యాసం సరిపోదు. అయినా సముద్రాన్ని కమండలంలో ఒదిగించే ఒక ప్రయత్నం!

‘కాటూరి’ అని సాహితీ సామాజిక రంగమంతా ప్రేమాభిమానాలతో గౌరవంతో సంభావించుకునే కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు సంస్కారం, సంస్కృతీ నిలయమైన కుటుంబంలో అనసూయాదేవి, వెంకటసుబ్బారావు గార్ల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించారు. ఈ కుటుంబం 1934 వ సం॥ లో కృష్ణా జిల్లాలోని ‘కాటూరు’ గ్రామం నుండి విజయవాడకు తరలివచ్చారు.

రవీంద్ర గారి తండ్రి గారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. వివిధ సాహితీ ప్రక్రియలో పాండితీ ప్రకర్ష గలవారు. తండ్రిగారి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కాటూరి బాల ప్రతిభావంతునిగా చాలా చిన్న వయసు నుంచి 1955 సం॥ లోనే రచనలు ఆరంభించారు. వీరి తొలి రచన అదే సంవత్సరంలో ప్రచురితమైంది. చిన్నతనంలో మాటలు నేర్చినప్పటి నుంచి కథలు సృజించి చెప్పటం, చదవడం నేర్చినప్పటి నుంచి రాయటం అలవాటయింది. కాలక్రమేణా వివిధ సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు. అన్నగారి పేరయిన ‘త్రివిక్రమ్’ను తన పేరుతో కలుపుకొని రచనలు చేసిన భాతృప్రేమికుడు.

కాటూరి వారి జీవితం బహు ఆదర్శప్రాయం. వీరి కుటుంబం దేశం కోసం ఉద్యమించిన దేశభక్తి ప్రపూరితమైంది. విజయవాడ లయోలా కాలేజీలో

విద్యనభ్యసించిన కాటూరి 1963 వ సంవత్సరం డిసెంబరు నుండి 1980 వ సంవత్సరం వరకు 16 సంవత్సరాలు భారతీయ వాయుసేనలో సేవలందించారు.

పాకిస్తాన్‌తో 1965, 1971లో జరిగిన రెండు యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. విశిష్ట సేవా పతకాలు పొందారు. వాయుసేనలో గ్రౌండ్ ఇంజనీరింగ్ ఏరోనాటిక్స్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎడ్వాన్స్‌డ్ రాడార్స్, ఫైటర్స్, బాంబ్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో వివిధ విభాగాలలో పనిచేసే అదృష్టావకాశాలు పొందారు. మహావీరచక్ర, వీరచక్ర పొందిన గొప్ప పైలట్స్ తో కలసి పనిచేసిన అనుభవజ్ఞులు. జాగృతిలో ప్రచురితమయిన వారి ‘గోల్డ్ ఈగిల్’ ఆయా యుద్ధవిశేషాలకి సంబంధించినదే!

తదనంతర కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎమ్.ఎ, గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. (స్పెషల్), డిఫెన్సు ఇన్‌స్టిట్యూషన్స్ నుండి సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్‌లో పి.జి. డిప్లమోలు అందుకున్నారు

కాటూరి కవిత్వం:

‘కాటూరి’ 1968 వ సం॥ నుండి కవిత్వ సృజన ఆరంభించారు. అంపశయ్య నవీన్, వరవరరావులు సంయుక్తంగా నిర్వహించిన ‘సృజన’ మాసపత్రికలో వీరి మొదటి కవిత ‘నవసంకల్పం’ ప్రచురితమైంది. ప్రగతి వార పత్రికలో ‘నిన్న- నేడు- రేపు’, ఆంధ్రప్రభ దీపావళి ప్రత్యేక సంచికలో ‘మనవడు నా ముద్దు బిడ్డ’, పల్లకి వారపత్రికలో ‘మనసు గీతం’  ప్రచురితమై అసంఖ్యాక కవిత్వాభిమానుల్ని ఆకట్టుకున్నాయి. దూరదర్శన్‌లో అనేక కవిసమ్మేళనాలకు అధ్యక్షత వహించారు.

కృష్ణానది మీద జయశ్రీ బోట్‌లో వారు ఆలపించిన ‘ఎందరో మహాను’, ‘బాపూ నీకు జోహారు’ నాడు లైవ్‍గా ప్రసారమయి సాహితీ విమర్శకుల మన్నన పొందాయి. ‘అమృత వర్షిణి’, ‘వెన్నెల గీతాలు’ కవితా సంపుటులు వెలయించారు.

‘దివ్య సహస్రాబ్ది’ సంస్కృత సంగీత నాటిక, ‘వేయి వేణువులు’ సంగీత నృత్యరూపకం. ‘మనసు గీతాలు’, ‘పల్లె గీతాలు’లోని పాటలు అనేక సంగీత సంస్థల ద్వారా వివిధ పాఠశాలల్లో, వేదికల మీద ఆలపించబడినాయి. వీరి సాహితీ విమర్శనా గ్రంథం ‘సాహితీ సౌరభాలు’ వందేళ్ళ తెలుగు కవిత్వ వికాస పరిమళాన్ని సాహితీ పిపాసువులకు పంచి పెట్టింది.

కాటూరి కథలు:

1955 వ సంవత్సరంలో ఆరంభమైన కాటూరి కథాప్రస్థానంలో దాదాపు రోజుకొక కథ రాసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రెండు వేలకి పైగా కథలు రచించిన ఈ మహాకథకులు ఇప్పటికి 600 పైగా కథల్ని ప్రచురించారు. ఆయా కథలకు పొందిన బహుమతులకు లెక్కలేదు. ‘పుకుషిమ’ కథకు నవ్య వారపత్రిక బహుమతి లభించింది. ఆ కథలో శ్యామల, జితేంద్రల అంతరంగానురాగాన్ని రచయిత చాలా గాఢంగా చిత్రించారు. ఒక అణురియాక్టర్ మరీ పెద్ద ప్రమాదానికి గురి కాకుండా, తీవ్ర జన నష్టానికి దారితీయకుండా ఆ రియాక్టరును కాపాడాలన్న స్ఫూర్తి, ధైర్యం, తెగింపులను ఆ తెలుగు జంట మనసుల్లో కలిగించిన మెహతా గారిని మరువలేము. ఆ సందర్భ బీభత్సాన్ని సహజంగా చిత్రీకరించిన కాటూరి మనకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని అందించి కదిలించారు. ఈ కథలో వీరి కలం మాట్లాడిన –

“మట్టికి మనసు కూడా ఉంటుంది”

“తుపాకి పుచ్చుకున్నవాడే సిపాయి కాదు. క్లిష్ట సమయంలో గుండె దిటవు కలవాడు కూడా సిపాయే”

“భౌతికంగా చచ్చిపోయినా చరిత్రలో బతికి ఉంటాడు”

వంటి మాటలు గుండె తలుపును తట్టి మేల్కొలుపుతాయి.

‘ఇల్లు తల్లి’ కథలో ఇల్లు అమ్మలా లాలిస్తుంది. ఆ ఇంటి అణువణువులో కన్పించే అమ్మ జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటే పాఠకులు కూడా తమ చిన్నప్పటి ఇంటినీ, అందులో అమ్మనీ గుర్తు చేసుకుని ఆర్ద్రమౌతారు. మనసు- మనసు, మట్టిమనిషి, డబ్బు చెట్టు, జననీ జన్మభూమి, ఒకటేమిటి కాటూరి వారి కథలన్నీ మట్టి వాసన, మనిషి వాసనే వేస్తాయి. ఇంకోవిధంగా రాయటం మీరు నేర్వని విద్య. మనసు మూలాన్నీ, మానవ జీవితాన్నీ అద్దంలో చూపెట్టి ఆలోచింపజేసే కథలు రాశారు. కార్గిల్ కథలు:

రెండు వేల కథల దాకా రాసిన కాటూరి గారి ‘కార్గిల్ కథలు’ చదువుతుంటే కన్నీరు, రక్తం కలిసి ఉబికి ఉద్విగ్నమౌతుంది. రక్తం గడ్డ కట్టే చలిలో, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో శత్రువు పేలుస్తున్న తూటాలను ధిక్కరించి తమ భయాలను అధిగమించి, కష్ట నష్టాలను లెక్క చేయకుండా భారత జవాన్లు సాగించిన కార్గిల్ సమరంలో చివరకు విజయం భారత్‌నే వరించినా దానికి చెల్లించిన మూల్యం తక్కువేమీ కాదు. చలి, చీకటి, జారిపడే కొండ దారి. తూటాల దాడి, వీటి మధ్య విజయం ఎంత మధురమైందో చెప్పలేం. కానీ ఆ మాధుర్యం కోసం సైనికులు మింగిన హాలాహలం గురించి, భారతీయుల్లో అంతర్లీనంగా ఉన్న సమైక్యతా భావాన్ని ప్రోది చేసిన కార్గిల్ విజయాన్నీ మనసులో పదిలం చేసుకుంటూ భద్రతను ఉపేక్షిస్తే దేశం ఎంత మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో కార్గిల్ కథల ద్వారా తెలియజెప్పారు రచయిత. ఇవి కల్పనా కథలు కావు, వాయు సేనలో కార్గిల్ యుద్ధానికి ఒక పరోక్ష సాక్షిగా, యూనిఫాం ధరించిన యోధునిగా ఈ కథా దీపాలు వారు వెలిగించారు. “కార్గిల్ కొండలమీద ఆ దీపాలెప్పుటికే ఆరిపోవు. ఆయన రచించిన అక్షరాలూ ఎన్నటికీ మాసిపోవు” అనే కథాఋషి మునిపల్లె రాజుగారి మాట అక్షర సత్యం. మనం గుండెల మీద చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రపోగలుగు తున్నామంటే మన దేశపు పొలిమేరల్లో మన కోసం కొందరు కంటి మీద కునుకు లేకుండా తిండి తీర్ధాలతో నిమిత్తం లేకుండా ఒళ్ళంతా కళ్ళు, చెవులు చేసుకుని దొంగదారుల్లో చొచ్చుకుంటూ వచ్చే పగవాళ్ళను నిలువరిస్తూ, అవసరమైతే పరిమారుస్తూ, ప్రాణ త్యాగానికి కూడా సన్నద్ధంగా ఉండి కంటికిరెప్పలా మనల్ని కాపాడుతూ ఉండటం వల్లనే! అనేక పర్యాయాలు ఆ యోధాగ్రేసరులు శత్రువులతో పోరాడి విజయం పొందారు. ఈ ఆత్మకథలను రచించటానికి రవీంద్ర గారు ఆ రెండు యుద్ధాల తర్వాత మిలటరీ హాస్పిటల్స్‌లో క్షతగాత్రున్నీ, యుద్ధవీరున్నా కలుసుకుని వారి యుద్ధానుభవాలను రికార్డు చేసుకున్నారు. కలసి మెలసి పైలట్ల అనుభవాలు తెలుసుకున్నారు. ప్రాణాలకు తెగించి సేకరించి ప్రచురించిన విలేఖర్ల కథనాలు వారికెంతో ఉపకరించాయి. పద్మపాణి, విశ్వనాథ్, వివేక్ గుప్త, హనీపుద్దీన్ వంటి 29 మంది వీరజవానుల కదన రంగ అనుభవాలు, ప్రాణత్యాగాలు ఈ కథల్లో నిక్షిప్తమయ్యాయి. వీళ్ళలో కొందరు కొత్తగా పెళ్ళయిన వాళ్ళు, కొందరు బిడ్డలున్నవాళ్ళు, కొందరు పెళ్ళి ఇంకా చేసుకోని వాళ్ళున్నారు. కొందరు శత్రువుల బుల్లెట్లకి వీరస్వర్గం అలంకరిస్తూ మాతృరుణాన్ని తీర్చుకున్నవాళ్ళు, కార్గిల్ కొండలపై జాతీయ పతాకాన్ని ఎగరేసిన వాళ్ళు అంతా.. మన మనసుల్లో కొలువై ఉంటారు. ప్రతి జవాను వీరగాథ భారతీయులంతా చదవదగింది. యుద్ధంలో మరణిస్తే హీరో, గాయాలతో బయట పడితే జీరో అన్నప్పుడు ‘జీరో’ గుండె కలుక్కుమంటుంది. రెండు చేతులు తెగిన వాళ్ళు, అంగవికలురయిన వాళ్ళకి సరియైన న్యాయం, సాయం అందటం లేదంటే కంటి నీరు చిప్పిలుతుంది. గుండె బరువెక్కుతుంది. యుద్ధరంగంలో పోరాడడం తెలిసిన వాళ్ళకి జీవనసమరమే కష్టమౌతుందన్న సత్యం చేదుగా మారుతుంది. యుద్ధ బాధితులకి ప్రతి భారతీయుడు ఋణపడి ఉండాలి. బాధ్యత వహించాలి కూడా! ఆ స్ఫూర్తిని ‘కార్గిల్ కథల’ ద్వారా అందించిన రచయిత దేశభక్తినీ, సంస్కారాన్నీ అభినందించి తీరాలి.

కాటూరి వారి కథా ప్రస్థానంలో ఆంధ్ర సచిత్రవార పత్రిక దీపావళి కథలపోటీలో బహుమతి పొంది హిందీ, కన్నడ, తమిళ మళయాలలో అనువాదమయిన ‘గొడుగు’ కథ, జాగృతి ఉగాది కథల పోటీలో బసుమతి పొందిన ‘ఎలుగెత్తి జైకొట్టు కొట్టు తెలుగోడు’, ‘నా తెలుగు తల్లికి మల్లెపూదండ’, ‘వెన్నెలకోవెల’ మొదలయినవి ప్రఖ్యాతి చెందినవి. ఆంధ్ర ప్రభలో ‘నిలువెత్తు నిజాయితీ’, ‘నాలుగో కోతి’, ‘ఋణం’,

‘మలుపు’, ‘దశావతారాలు’; యువ దీపావళి ప్రత్యేక సంచికలో ‘నగ్నశిఖరాలు’; జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ‘ఈ మనసేం కావాలి’, విజయ మాసపత్రికలో ‘సముద్రం ఎండి పోయింది’, విజయ చిత్రలో ‘నిషా’, ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘శాండ్‌విచ్’, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ‘గోదానం’, స్వాతి మాసపత్రికలో ‘రేపటి సూర్యుడు’, ‘పోలిష్’, ఆంధ్రభూమి వారపత్రికలో ‘థ్రిల్’, జయశ్రీ మాసపత్రిక లో ‘నన్ను ప్రేమించకు’, చందమామలో ‘నీటి విలువ’, పల్లకి వారపత్రికలో ‘కాదంబరి’.. ఇలా.. రవీంద్ర గారు రాసిన వేల కథల్లో పేరుగాంచిన కొన్ని కథల పేర్లు!

నవలారచన:

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు ఇరవైకి పైగా నవలలు రాశాలు. ప్రత్యేకించి చారిత్రిక నవలల్లో మకుటాయమానంగా చెప్పదగింది ‘గురు గోవింద సింగ్’ నవల. దృశ్యమాన శిల్పంగా రచయిత దీనిని మలచారు. కఠినాతి కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్న ప్రముఖ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ జీవితం, మహనీయత్వం గురించిన ప్రతి సన్నివేశమూ మన కళ్ళముందు జరుగుతున్నట్లుగానే అక్షరీకరించబడింది. ధారావాహికగా వెలువడిన ఈ చారిత్రక సత్యనవల గ్రంథరూపంలో కూడా పాఠకుల చేతికి చేరింది. ప్రఖ్యాత రచయిత విహారి ఈ పుస్తకం గురించి “దీనిని చదవటం ఒక గొప్ప జీవితానుభవం” అనటం విశేషం.

కాటూరి వారు రాసిన మరో చారిత్రక నవల ‘బాబా బందాసింగ్ బహాదూర్’. తొలి శిఖ్ఖు సేనాపతిగా, శిఖ్ఖు రాజ్య స్థాపకునిగా అసమాన త్యాగాలు, వీరత్వం చూపిన ‘మహాఖల్సా’గా, చిరంజీవిగా, అమరుడయిన బందా సింగ్ (1670-1716) పూర్వాశ్రమంలో బైరాగి మాధోదాసు. తాంత్రిక విద్యల్లో దిట్ట. తన ఆశ్రమానికి సాధువులు వచ్చి మంచం మీద కూర్చున్నప్పుడు, దాన్ని తన మంత్రవిద్యతో తల్లకిందులు చేసి వాళ్లు నేల మీద పడిపోయేలా చేస్తాడు. సచ్చాపాషా అవతార పురుషుడు. గురు నానక్ దేవ్ వారసుడయిన గురుగోవింద్ సింగ్ మాదరి దాసు ఆశ్రమంలోకి వచ్చి ‘పలంగ్’ మీద కూర్చున్నా మాధోదాసు తంత్రం పనిచేయలేదు. అతని ఆధ్యాత్మిక అహంకారం మట్టి పాలయి సజ్జా పాషాకు ‘బందా’ గా మారాడు జన్మతః రాజపుత్రుల వంశీకుడయిన బందాసింగ్ ‘ఖల్సా’ గా మారాడు. రాజ్య స్థాపన చేసి చివరిదాకా ఆ పోరాటంలోనే జీవించాడు, మరణించాడు. ఆయన చివరి క్షణాలు మొగలాయీల చేతుల్లో అత్యంత క్రూర హింసాత్మకంగా ముగిసినా ‘వాహెగురు’ ధ్యానంలో లీనమయిన యోగి బందా సింగ్. ఈ నవల ఆసాంతం అత్యంతాసక్తికరంగా సాగి వ్యథాభరితంగా ముగిసింది. భారతదేశానికి వలస వచ్చి ఇక్కడి ప్రజలను పలు విధాలుగా అణచి వేసి క్రూరపాలన వేడిన మొగలుల దురాగతాలకు చరిత్రగా అద్దం పట్టింది. “యుద్ధాన్ని కేవలం ఆయుధశక్తితో గెలవలేరు. ఆత్మబలమే అంతిమ విజయాన్నిస్తుంది” అనేది చరిత్ర ఋజువు వేసిన సత్యం.

“మనం మతాన్ని అనుసరించినంత కాలం సమస్య ఉండదు. మతం మనల్ని అనుసరించాలనుకోవటం అన్ని సమస్యలకూ కారణం అవుతుంది.”

నవలలో ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రచయిత నేటి సమాజాన్నీ, ‘జిహాద్’ లనూ ఆలోచించమని హెచ్చరిస్తున్నారు. ఇంకా ‘చతురలో ‘జగన్నాటకం’, జాగృతిలో, వెలుతురు మంటలు’, ఆనందజ్యోతి వార పత్రికలో ‘పరిష్కృతి’, యండమూరి వీరేంద్రనాథ్‌తో కలసి జ్యోతి మాస పత్రికలో ‘ఆకాశదీపాలు’, ‘గీటురాయి’ పత్రికలో 40 వారాల సీరియల్‍తో బాటు ‘అమ్మీజాన్’ సీరియల్, వేయివేలుపులు మొదలైన ఇరవై నవలల దాకా రచించారు. సామ్రాట్ విక్రమాదిత్య, గిరిజన్, హరిజన్, పూరిల్లు, సారస్వత మన్వంతరం, ద ఫైలట్ మొదలగు నవలలు ప్రచురణలో ఉన్నాయి. విశేష ప్రతిభాశాలి అయిన రవీంద్ర గారి కలం నుంచి వెలువడిన సాంఘిక, సామాజిక చారిత్రక నవలలన్నీ దేశ సంక్షేమానికి, భారతీయ సంస్కృతీ వైభవప్రాభవానికి ఉద్దేశించినవే కావటం అభినందనీయం.

ఇతర రచనలు:

కాటూరి వారు వివిధ అంశాలపై 40 పైగా గ్రంథాలను వెలువరించారు. ‘నిరక్షరాస్యతా నిర్మూలనా ఉద్యమం’, పెండ్యులా (వాస్తు విజ్ఞానం) యోగచికిత్స, న్యాయశాస్త్రం, భారతీయ ఆధ్యాత్మికత, భగవద్గీతకు వ్యాఖ్యానం.. ఇలా వివిధ రంగాలకు చెందిన బహుముఖీనా విజ్ఞానాన్ని గ్రంథాలుగా అందించారు. ‘సరికొత్త సామెతలు’ పేరుతో ‘మల్లెతీగ’ మాసపత్రికలో చేసిన రచనలు పాఠకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

నాటక రచన:

పూర్తి నిడివిగల కాటూరి నాటకాలు 1960 సం॥ నుండి ఆకాశవాణిలో పలు మార్లు ప్రసారమైనాయి. ఇవి సామాజిక, చారిత్రిక, పౌరాణిక, హాస్య ఇతివృత్త ప్రధానాలు. విజయవాడ, చెన్నై, ఆకాశవాణి కేంద్రాల ద్వారా ఇవన్నీ పలుమార్లు పునః ప్రసారాలు. సీరియల్ నాటకాలుగా ప్రసారమైన ‘కామరాజు కాపురం’ (ఏడు వారాలు) ‘నేరం’ (నాలుగు వారాలు), ‘కార్గిల్ యుద్ధ కథలు’ (27 వారాలు) పేరు గడించాయి. రవీంద్ర గారి హాస్య నాటకం ‘జరహామ’కు జాతీయస్థాయి పురస్కారం లభించింది. ‘దేశం పిలుస్తోంది’ (దేశభక్తి), ‘అక్కమహాదేవి’ (చారిత్రకం), ‘వైతాళికులు’ (సంస్కరణ), ‘ద్వా సుపర్ణ సాయుజ సఖయ’ (పౌరాణికం), ‘పిచ్చివాళ్ళ స్వర్గం’, ‘గవాక్షం’ (సందేశం), ‘కొల్లాయి కడితేనేమి’ (మహీధర గారి నవలకు నాటకీకరణ), ‘నరవసన’ (కల్పన), ‘హనీమూన్’ (శ్రవ్యం), ‘పల్లెపడుచు’, ‘త్రిజకి యమ దర్శనం’ (2003 సం॥ ఆకాశవాణి రికార్డులకు నాటకీకరణ) మొదలైన అనేక నాటకాలనూ, నాటికలనూ అందించిన ప్రతిభాశాలి కాటూరి. వందకి పైగా ఆకాశవాణి నాటిక నాటకాలు ప్రసారమవటం వీరి సాహిత్యకృషికి నిదర్శనం.

దూరదర్శన్‌కి సీరియల్స్‌గా ‘ప్రగతి భారతం’, ‘అష్టదేవతలు’, డాక్యుమెంటరీలుగా ‘గ్రీష్మం’, ‘అమ్మల గన్న అమ్మ’ ప్రసారమైనాయి. అనేక లలితగీతాలు కాటూరి రచించారు. ఇవి దూరదర్శన్‌లో గానం చేయబడినాయి. షిర్డీసాయి సీరియల్‍లో ఆచంట వెంకటరత్నం నాయుడు గారితో కలిసి రెండు ఎపిసోడ్స్‌లో సహాయ పాత్రలో నటపోషణ కూడా చేశారీ రచయిత. అమెరికా లోని సాయి ఇంటర్నేషనల్ వారు ఈ సీరియల్‌ని నిర్మించారు. కాటూరి వారు కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక క్యాసెట్లకు స్క్రిప్టును అందించిన ఘనులు!

జర్నలిస్టుగా:

రవీంద్రగారు 1970వ సం॥ నుండి జర్నలిజంలోకి ప్రవేశించి తెలుగు, ఇంగ్లీషు పత్రికలకు వివిధ పాత్రికేయ వార్తలు, వ్యాసాలు అందించారు. ప్రత్యేక కరస్పాండెంటుగా, సహసంపాదకునిగా, రాజకీయ విశ్లేషణలను బెంగుళూరు నుండి వెలువడే జాతీయ మాసపత్రికకు, న్యూస్ ట్రావెల్, బిజినెస్ టైమ్స్, ఇంటర్నెట్ న్యూస్ మ్యాగజైన్ (అమెరికా) లకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‍గా పని చేశారు. దళితజ్యోతి (ఇంగ్లీషు & తెలుగు), ‘మనుజ గీత’ (ఇంగ్లీషు & తెలుగు) పక్షపత్రికకు, ‘సర్వహిత’ పత్రికలకు సలహా సంపాదకత్వాన్ని నిర్వహించారు. ‘రాజమండ్రి వార్తలు’ పత్రికకు సలహాదారుగా కూడా పనిచేశారు.

నాయకునిగా:

కాటూరి వారు లక్నో (1964), ఆగ్రా (1968), కలకత్తా (1971), (1974) లలో పనిచేస్తున్న కాలంలో సాంస్కృతిక వికాసానికి ఎనలేని సేవలందించారు. అనేక నాటకాలు రాసి దర్శకత్వం వహించారు. తర్వాతి కాలంలో ట్రేడ్ యూనియన్ నాయకునిగా చురుకైన కార్యక్రమాలలో సేవలందించారు. మాజీ సైనికోద్యోగుల కో-ఆర్డినేటర్స్ ఫెడరేషన్‌కు జాతీయస్థాయి అధ్యక్షులుగానూ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కన్‌స్ట్రక్షన్స్ కో-ఆర్డినేటర్స్‌కు జాతీయస్థాయి ఉపాధ్యక్షులు గానూ విశిష్ట సేవలందించారు. విజయవాడలో డిఫెన్స్ కాంటెన్ స్థాపనకు సంస్థాపరమైన కృషి చేయడమే గాక విజయవాడ దగ్గర డిఫెన్స్ కాలనీ ఏర్పాటుకు కృషిచేశారు.

కార్యనిర్వాహణ దక్షునిగా:

కాటూరి వారు ‘జీవని’ సేవా సంస్థకు జిల్లా స్థాయిలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటమే గాక వీధి బాలలకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆ సంస్థకు సాంస్కృతిక సలహాదారుగా కొనసాగుతూ సేవలందించారు.

వ్యవస్థాపకులుగా:

1985వ సంవత్సరంలో ‘సాహిత్య భారతి’ ని స్థాపించిన రచయిత అనేక సాంస్కతిక సాహిత్య కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ సాహిత్య పరిషత్, అభినేత్రి, బ్యాంక్ ఉద్యోగుల సాంస్కతిక సంస్థ, విజయవాడ మేనేజ్‌మెంట్ అసోసియేషన్, విజయవాడ వినియోగదారుల సంక్షేమ మండలులకు స్థాపక అధ్యక్షులుగా ఆయా సంస్థలను నెలకొల్పి వాటి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. కృష్ణా జిల్లా వినియోగదారుల సంఘాల ఫెడరేషన్‌కు ఉపాధ్యక్షులుగా పని చేశారు.

సామాజిక సేవలో:

విజయవాడ దుర్గ లయన్స్ క్లబ్‌కు ఛార్టర్ అధ్యక్షునిగా ఎన్నుకోబడిన కాటూరి టర్మ్ లోని సేవలకు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. కంటి పరీక్షలు, ఉచిత మధుమేహ పరీక్షలు, అవగాహనా కార్యక్రమాలు, సంస్కరణా కార్యక్రమాలు, సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. లయన్స్ డిస్ట్రిక్ట్ 324 C4 కు జిల్లా ఛైర్‌పర్సన్‌గా అందించిన సాహితీ సేవలకు 2002-03 సం॥ లకు ప్రతిభా అవార్డులు పొందారు. ‘సేవాసింహం’ నాటకాన్ని రచించగా లయన్స్ జిల్లా గవర్నర్ గుత్తా సుబ్బారావుగారు ముఖ్యపాత్ర వహించి ప్రదర్శించారు. పలు ప్రముఖ సందర్భాలలో కాంబూరి వివిధ లయన్స్ జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టి నిర్వహించారు.

ఆధ్యాత్మిక పథంలో:

సాహితీ సాంస్కృతిక రచనలే కాదు, ప్రత్యేకించి సమకాలీన పరిస్థితుల కనుగుణంగా యువకులకు అర్థమయ్యే రీతిలో గీతా రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా భగవద్గీతా సందేశాన్ని చక్కని వ్యాఖ్యానంతో అందించటంలో సహాధ్యక్షులుగా ఉన్నారు. ‘ఆత్మానంద లహరి’ అనే సీరియల్‍ని ‘ధ్యాన మాలిక’ మాస పత్రికలో యువతకు మార్గదర్శనంగా అందించారు. మాతా శివచైతన్య నిర్వహించిన యువ జనోత్సవ కార్యక్రమాల్లో అతిథి ఉపన్యాసకులుగా పాల్గొని అనేక ఆధ్యాత్మికవేత్తల నిరంతర సన్నిహితత్వంతో ప్రయోజనకరమైన అనేక కార్యక్రమాలు రూపొందించారు. మనుధర్మం, శుక్ర నీతి, విదుర నీతి, వశిష్ట గీతామృతం, భగవద్గీతల గురించి పలు ఆధ్యాత్మిక మాస పత్రికలకు, ఈనాడు దిన పత్రిక లోని సాంస్కతిక ‘అంతర్యామి’ శీర్షికకు వ్యాఖ్యా వ్యాసాలు వ్రాశారు.

బిరుదులు, గౌరవాలు:

అత్యంత ప్రతిభాశాలి, మానవతామూర్తి అయిన కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారిని ఎన్నో సంస్థలు గౌరవించి తమని తాము గౌరవించుకున్నాయి. హిందీ సాహిత్యానికి కాటూరి వారి సేవలు గుర్తించి  హీరాబాద్ లోని హిందీ ఇన్‌స్టిట్యూట్ వారు ‘సాహితీ వాచస్పతి’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. వివిధ సందర్భాలలో లయన్స్ క్లబ్ నిర్వహించే వివిధ పోటీలకు, ఆకాశవాణి నాటకాలు, డాక్యుమెంటరీలకు, కె.ఎస్. మూర్తి మెమోరియల్ పరిషత్ నిర్వహించే రాష్ట్ర స్థాయి నాటికల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. భారత ప్రభుత్వం నిర్వహించే, మద్రాసు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్యర్యంలో రచయితల సదస్సులో పాల్గున్నారు. ఆకాశవాణిలో ‘బి’ హై గ్రేడ్ ఆర్టిస్టుగా పలు జాతీయ నాటకాల్లో పాల్గొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. పలు నాటకాలు రచించి, దర్శకత్వం వహించి కోస్తా ప్రాంతంలో ప్రదర్శింపజేశారు. వీరు రచించి దర్శకత్వం వహించిన ‘మేనేజీరియల్ ఎకనామిక్స్’ అనే ఆంగ్ల నాటిక బెంగుళూరులో దక్షిణ భారత బ్యాంకింగ్ మేనేజర్స్ సదస్సులో ప్రదర్శితమై పలువురినీ ఆకట్టుకుంది.

కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారి కృషిలో ఎన్ని కోణాలను దర్శించినా రచయిత ప్రధానంగా మానవతావాది. సంగీతం, కళలంటే అభిమానించే కాటూరి వారు సామాన్యమైన అంశాన్ని కూడా తనదైన ప్రత్యేక శైలిలో ప్రదర్శించి ప్రతి ఒక్కరి ఆదరాన్ని పొందగలిగారు.

త్రివిక్రమ్ గారు మేధో రచయిత. నాయకత్వ లక్షణాలున్న జర్నలిస్టు, నిర్వహణాదక్షుడు, స్నేహశీలి, మృదు స్వభావి. వివాదాల కందని మేరునగం. బహుముఖీన ప్రజ్ఞా పాటవాలతో ప్రత్యేక వ్యక్తిత్వాకర్షణ గల ఈ సాహితీవాచస్పతి – ‘లాయర్’గా, ‘బెజవాడ బార్ న్యూస్ బుల్లెటిన్ ఎడిటర్’ గా కూడా సేవలందించారు.

ఇన్నిన్ని పనులు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేయగలగటం ఆశ్చర్యమే! పుట్టింది ఎందుకో తెలిసిన ఈ ప్రజ్ఞామూర్తి ఆం.ప్ర. రచయితల సంఘం గౌరవ సలహాదారులు కూడా. 18 డిసెంబర్ 24 వ తేదీన తెల్లవారుజామున స్వర్గస్థులైన వారి గౌరవ స్మృతికి నివాళిగా ఈ అక్షరాంజలి.

Exit mobile version