Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాహితీ యానంలో ఒక మైలురాయి..!

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘సాహితీ యానంలో ఒక మైలురాయి..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

క బిందువు నుండి సింధువు దాకా
నిర్విరామ ప్రయాణం నదిది
మనిషి జీవితమంతే కదా
ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు
ఎందరెందరినో కలుస్తుంటాడు
అడుగిడిన ప్రతి చోట ఏదో ఒకటి
నేర్చుకుంటు సాగిపోతుంటాడు
అనుభవ సారాన్ని అక్షరాల్లో పొందుపరుస్తాడు..!

పల్లె నుండి మొదలైన నా నడక
ఉట్నూర్ అడవుల్ని దాటింది
అపూర్వంగా బహూకరించిన
మరువని తీపి జ్ఞాపకాలనే కాదు
ఎదురుదెబ్బలను తట్టుకోవడం నేర్పింది
తట్టుకొని నిలబడటమెట్లనో బోధించింది!

మనము ఒకే దగ్గర ఆగిపోతే
చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి
ఏ అనుభూతులు మన దగ్గరండవు
దశాబ్దాల కాలాన్ని వెనక్కి నెట్టేస్తూ
అవిశ్రాంతంగా గమనం సాగుతున్నది
ఒక నిర్మాణం గురించి ఆలోచించడం
ఒక నిర్మూలన గురించి బాధపడడం
కొత్త చరిత్రను గురించి పరిశోధించడం
విమర్శలను సానుకూలంగా మార్చుకోవడం
సాధనతోనే సాధ్యమని రుజువు చేసింది
అందుకనే నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను
ఆత్మీయులైన మనుషులను అభిమానిస్తున్నాను..!

గోదావరి తీర ప్రాంతంలో వెలసిన
లక్ష శెట్టిల ఊరుగా ప్రసిద్ధి చెందిన
లక్షెట్టిపేట నాకొక మజిలీ అయ్యింది
ఉత్కుర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు
ఎన్ని వేల సార్లు నడిచానో లెక్కలేదు
వ్యాపారపు మాటల సొగసులు
మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి
గాంధీచౌక్ నాకైతే ఒక ల్యాండ్ మార్క్
నిత్య జీవన సమరానికి నిదర్శనమైన
ఈ ప్రాంతంపైన అనురాగమెక్కువ..!

గుడ్ షెఫర్డ్ స్కూల్లో నిర్వహించిన
సాహితీ స్రవంతి సమావేశాలు
సాహితీ సృజనకు దారులైనాయి
మహాలక్ష్మి వాడ, కొమ్ముగూడ, గోదావరి రోడ్డు
చర్చి గ్రౌండ్, కాలేజీ గ్రౌండ్ పరిసరాలలో
మిత్రులతోని సంభాషణలు ప్రాణవాయువు లాంటివి
సాహిత్యానికి శతారాన్ని అందించి
మా ఊరొక కావ్యాన్ని కానుకగా ఇచ్చింది
అందుకనేమో ఈ మట్టి సుగంధం నాకిష్టం..!

దారికి ఇరువైపులా
పచ్చని పొలాలతో శోభిల్లె ప్రాంతమిది
కనుచూపు మేరలో పెట్టని కోటలా
ఎత్తైన కొండలు దృశ్యమానమవుతుంటాయి
ముత్యంపేట దండేపల్లి మ్యదరిపేట తాళ్లపేట
చింతగూడ జన్నారం ఇంధన్ పల్లి కవ్వాల్
ఊరు పేరు ఏదైనా కావచ్చు
గుండె గూటిలో కొలువైన క్షేత్రమిది
నా పాదముద్రలను దాచుకున్న చోటిది
అందుకేనేమో ఈ మట్టి మనుషులపైన
అజరామరమైన ప్రేమ నాకు..!

పాఠాలు గుణపాఠాలు ఎవరికైనా తప్పవు
నా అడుగుజాడల్లో నీ లోపాలను
సవరించుకునే అవకాశాన్నిచ్చిన ఊరు
సహృదయ మిత్రులను పరిచయం చేసిన ఊరు
అక్షరాయుధాలను పదును పెట్టుకున్న ఊరు
జీవనదికి హారతినిస్తు నిలబడ్డ ఊరు
నేనెన్నటికీ మరువని ఈ ఊరు
నా సాహితీ యానంలో ఒక మైలురాయి..!

Exit mobile version