Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సహజీవన తీరాన్న

[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘సహజీవన తీరాన్న’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

సాంప్రదాయ మంగళసూత్రాలు
మెడ చుట్టూ చుట్టక పోయినా
నీ ఆధిపత్యపు సూత్రాలు
వెఫై లా వ్యాపించి ఉంటాయి!
వలసల విలాసాల్లో ఆశలూ,
మోహ తీరాలు
ప్యాకేజి బరువులూ
కట్టేసుకున్న భవిష్యత్ సౌధాలు!

***

కాలం గడిచే కొద్దీ
సౌధాలు ధ్వంసమవుతుంటే
అతను తరాల అహానికి
ప్రతినిధి ఐనప్పుడూ,
ఆమె ఎదిగి నప్పుడూ
అతను అసూయా సర్పమై
బుసలు కొట్టినప్పుడూ,
‘నీ’, ‘నా’
‘మనమై’
మన లేనప్పుడూ ,
మోహం మూడు
అడుగులు ముందుకి
వేసినా
అహం ఆరు అడుగులు
వెనక్కి లాగినప్పుడూ
దీపాల సాక్షిగా
ఒకే శయ్యను ఆశ్రయించినా,
ద్వీప కల్పాలై
మిగిలి పోయినప్పడు,
‘రాజీ’ పేజీలు
బతుకు పుస్తకంలో
చింపేసు కున్నప్పుడు
ఎవరికి వారు
స్వార్థపు లావాలై
ప్రవహించి నప్పుడు
జీవన పొత్తం
విత్తమై వ్యాపించినపుడు,
జీవన వాహినిలో
అంతర్వాహిని
ప్రేమ ఎక్కడ?
గాడి తప్పిన జీవితాల్ని
ప్రేమ సూత్రంతో
అనుసంధించేది ఎప్పుడు?

Exit mobile version