Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాధకుడు – సాధన – సాధనాచతుష్టయము

త్యం గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండి, ఆ సత్యం కోసం నిరంతరం వెతుకులాడు వాడు సత్యాన్వేషి. అతనే సాధకుడు. అతను వెతికే సత్యము ఏమిటి? అదియే బ్రహ్మం. బ్రహ్మమే సత్యం.

సత్యం అంటే ప్రమాణములచే నిరూపించబడినది. ప్రమాణములంటే ‘వేదములు’ అని చెప్పవచ్చును.

ఈ సత్యాన్వేషణలో ఉన్న జీవుడు సాధకుడు. సాధనా మార్గంలో సత్యంను ఆవిష్కరించుకుంటాడు.

జీవుడు ‘నౌకాగ్రకాకవత’ వలె అన్వేషణ చేయవలెను.

కాకి నౌక మీద వాలి ఉంటుంది. నౌక సముద్రంలో ప్రయాణమైన తరువాత కాకి ఎగిరినప్పుడు చుట్టూ నీరే కనపడుతుంది. కొంత సేపటికి కాకి తిరిగి వచ్చి నౌక మీదనే వాలుతుంది. అలా నౌక మీద చిక్కుకుపోయిన కాకికి మార్గము లేదు. కేవలము వడ్డుకు చేరేవరకూ ఎదురుచూడటము తప్ప.

అలాగే సంసారములో చిక్కుకుపోయిన జీవునికి వడ్డు చెరే వరకూ సంసారములో చిక్కుకు పోవలసినదే.

కాని సంసారము మాయ అని గ్రహింపు కలిగాక సత్యమునకై అన్వేషణ మొదలవుతుంది.

జీవుడు తన యందు ఉన్న ఆత్మను కనిపెట్టి, సత్యమును గ్రహించటం సాధకుని గమ్యం.

అద్దము మీద మకిలి చేరి ఉంటే రూపము అగుపడదు. అలాగే మాయ కప్పిన జీవునికి ఆత్మ దర్శనం కలగదు.

ఈ మాయ జన్మ జన్మల కర్మముల ఫలం.

అద్దం శుభ్రం చేసుకుంటే కాని బొమ్మ అగుపడదు. కర్మలను కాల్చుకుంటే తప్ప, మాయ విడిపోతే తప్ప సత్యం ఎరుకపడదు.

మరి ఈ కర్మలను తొలగించి సత్యమును దర్శించుటకు జీవుడు చెయ్యవలసినది ఏమిటి?

సద్గురువు సహాయంతో జీవుడు సాధకుడౌతాడు.

దీనికి సాధకునికి ‘సాధనా చతుష్టయములు’ సహాయం సత్య దర్శనకు చేస్తాయి.

సాధనాచతుష్టయములు అనగా నేమి?

1. నిత్యా నిత్య వస్తు వివేకము:

అదే విచక్షణా జ్ఞానం.

నామరూపాత్మకమైన జగత్తుగా దీనిని గుర్తించటం. మకిలి పట్టిన అద్దం వలే ఉన్న మాయను తొలగించుకోవటము. వివేకమును మెరుగు పర్చుకోవటం.

ఈ ప్రపంచములో వున్నది సర్వం తాత్కాలికం. శాశ్వతమని దేనిని అనుకుంటామో అది మన అజ్ఞాన ఫలము. నిత్యమైన శాశ్వతమైనది ఏమిటో గ్రహించి అది బ్రహ్మమని తెలుసుకొని ఆ బ్రహ్మము నందు లయమగుటకు అనుక్షణము సాధకుడు యత్నించవలెను.

శంకరభగవత్పాదుల వారి ఏకశ్లోకిలో చెప్పినట్లుగా:

“కిం జ్యోతి స్తవ భానునా నహన్ మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే
చక్షు స్తస్య నిమిలనాది సమయే కిం ధీర్దియో దర్శనే
కిం తత్రాహ మతో భవాన్‌ పరమకం జ్యోతి స్తదస్మి ప్రభో॥”

ఇది గురుశిష్య సంభాషణ:

గురువు: నీవు ఎలా చూస్తున్నావు?

శిష్యుడు: సూర్యుని సహాయముతో

గురువు: మరి రాత్రి ఎలా చూడగలుగుతున్నావు?

శిష్యుడు : దీపపు సహాయముతో

గురువు: సరే, కాంతిని కన్నులు తెరువపూర్వం ఎలా గ్రహిస్తున్నావు?

శిశ్యుడు: జ్ఞానముచే

గురువు: ఆ జ్ఞానము నీకున్నదని ఎలా తెలుసుకున్నావు?

శిశ్యుడు: నేనే (చైతన్యం) తెలుసుకున్నాను.

గురువు : అవును. నీలోని వెలుగే చైత్యనవంతమైన బ్రహ్మం।

శిష్యుడు : తెలుసుకున్నాను గురువుగారు.

నిత్యానిత్య వివేకము, ఏది శాశ్వతమో దానికై సాదకుల అన్వేషణ.

2. ఇహాముత్రార్థఫలభోగ విరాగము:

ఈ లోకములో కానీ పరలోకములో కానీ వున్న సుఖాలను, సౌఖ్యాలను తృణీకరించి సత్యానికై దృఢనిశ్చయంతో వుండటము. ప్రపంచ విషయములపై వైరాగ్యముతో వుండటము.

3. శమాదిషట్కసంపత్తి:

అదే షట్ సంపత్తి అని కూడా అందురు.

దమము, శమము, తితీక్ష , ఉపరతి, శ్రద్ద, సమాధానం.

ఇంద్రియాలు రెండు రకములు:

అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు

శమము అంటే అంతఃకరణము నందు నిగ్రహం. అంతఃకరణములు అంటే – బుద్ధి, చిత్తము లేదా మనసు, అహంకారమును నిగ్రహించటం. ఇవి అంతఃకరణములు.

దమము అంటే – బాహ్యేంద్రియాలను కట్టడి చేసుకొని, అనగా, పంచేద్రియాలైన వాక్కు, శ్రవణం, దృశ్యం, వాసనా, రుచి యందు విరాగముతో, ఉండటం దమము.

అంతరేంద్రియాలను కట్టడి చెయ్యటం , అనగా బాధలను ఓర్చుకోవటం తితీక్ష .

ఇంద్రియ నిగ్రహమే ఉపరతి.

గురువాక్యం నందు గురి కలిగి, నమ్మకం కలిగి ఉండటం శ్రద్ధ.

బ్రహ్మము నందు జ్ఞానమును నిలిపి ప్రవర్తించటం, ఆత్మనిశ్చయం పొంది సంశయ నివృత్తి కావించుకోవటము సమాధానం.

4. ముముక్షత్వము:

సదా మోక్షముకై ఆపేక్షను కలిగి వుండటము. ముక్తికై తీవ్రంగా తపించటము. స్వేచ్ఛకై, బంధాలనుంచి విడుదలకై ఎదురుచూపు ముముక్షుత్వం.

ప్రపంచపు విషయములు అశాశ్వతము లన్న ఎరుకనే వివేకము. ఆ ఎరుక కలిగిన తరువాత విషయములపై ఆసక్తి నశిస్తుంది. అదే వైరాగ్యం.

శమ,దమాది సంపత్తిలతో మనోనిగ్రహము కలిగి గురువు యందు పూర్తి శ్రద్ధతో సేవ చేసిన వారికి సమాధానము కలుగుతుంది. సత్యమునకై దారి అవగతమవుతుంది. గురుకృపతో ఆ సాధకుడు స్వేచ్ఛను పొంది సద్గతి, ముక్తి పొందుతాడు.

Exit mobile version