Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సామాజిక దార్శనికుడు కవి

[సిహెచ్. కళావతి గారు రచించిన ‘సామాజిక దార్శనికుడు కవి’ అనే కవితని అందిస్తున్నాము.]

ర్ధరాత్రి అయ్యింది
అమావాస్య పరచుకొంది
అందరూ నిద్రలోకి జారుకొన్నారు
ప్రకృతి సైతం తలవంచి నిద్రిస్తోంది
మరి నాకు నిద్ర రావడం లేదే?

నా కళ్ళు ఆల్చిప్పల్లా తెరుచుకొనే ఉన్నాయి
నా గుండె లోతుల్లో ఆలోచనలు
అక్షరాలు నాలో అలజడులు రేపుతుంటే
భావాలు నాలో రొద చేస్తుంటే
కలం నా వైపు చూస్తు
నన్ను పట్టుకోవా అని అదోలా అడుగుతుంటే

ఈ తతంగమంతా చూస్తున్న
నాలోని మనసు
మౌనంగా ఉండలేక చేతికి కలాన్ని
అందుకోమని ఆజ్ఞ జారీ చేస్తూ
కర్తవ్య బోధ చేసింది
కలం గలగలా సాగిపోవాలనుకొంది
గోదావరి నదీమ తల్లిలా.
ఊహల్లోని ఊసులు ఎగసెగసి పడుతున్నాయి
సముద్రంలోని అలల్లాగా.

సమాజంలోని సమస్యలు గుండెను
తట్టి లేపుతున్నాయి కల్లోలభరీతంగా
ఏమి రాయాలి? ఎవరి కోసం రాయాలి?
ఎవరు వింటారని, ఎవరు ఆచరిస్తారని?
అన్నీ నన్ను చుట్టుముడుతున్న ప్రశ్నలే
అందరూ వింటారనీ చెప్పాడా శ్రీకృష్ణుడు గీతని
విన్నవాడు బాగుపడతాడు
బాగుపడ్డ వాడు మరొకరిని బాగు చేస్తాడు
నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అంటుంది నా మనసు.

గుప్పెడు అక్షరాలు గుండెల్లో నింపుకొంటే
పరివర్తన దశ ఎప్పుడో ఒకప్పుడు జరగకపోదు
పరిణామ క్రమం పరిమళించక పోదు
కవి సమాజానికి దశాదిశా నిర్దేశకుడు గదా
అందుకే రాయడానికి ఉద్యుక్తురాలనౌతు

కవితల పరంపర శరాఘాతాన్ని
సమాజానికి సంధిస్తున్నా..

కవి దృక్పథం సమాజం
కవి ఆలోచన సమాజం
కవి జీవితం సమాజం
కవి పుట్టుక చావు సమాజం
అన్నారందుకేనేమో!

Exit mobile version