Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాలభంజిక

[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘సాల భంజిక’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

డపిల్లలు
జడలల్లుకోవడం మానేసాక, విరబోసుకున్న కురులలో
విరులు తురుముకోవడం కుదరదు కనుక
మూరలమ్మే పూల బజారులో
మల్లెల రాశి
పెళ్ళిళ్ళకు ఉత్సవాలకు, అమ్మవారి గుడి పూజలకు
చటాకు ధరను తెలివిగ పెంచుకుని బరాబరుగ
పరిమళాల విలువను తెలిపింది.

రిక్షా బండి వాడి శ్రమనైనా ఎంచక దంపతులు,
అలవాటుగ అన్నిట బేరం చేసి
ఆదా చేసిన రూపాయిలతో
చదువులను కొన్న సంతానం
కార్యాలయ వేగాలకు చేరాలని
ఒక్కొక్కరుగా ప్రత్యేకించి ఖరీదు చేసిన వాహనాలతో
మధ్య తరగతి స్థాయి పెరిగింది.
అధిక వినియోగానికి
అదనపు ఇంధనాల ధర పెరిగింది.

పెళ్ళి చూపులకు కాలం చెల్లింది.
కాఫీ ఫలహారాలు సిద్ధం చేసే
అవసరం ఇక లేకపోయింది.
వారిద్దరూ ఒకరికొకరు మనసిచ్చి
పుచ్చుకున్నాక,
దూర తీరాల
వివాహ మహోత్సవాలకు
బాహాటమైన ఖర్చు
తడిసి గంపకు మోపెడయింది.

మాంగల్యాన్ని ధరించరు.
కంఠాభరణాలను సహించరు.
పసిడి కన్న మిసిమిని చూపే
సొగసుల మాటకేమి గాని, భవితవ్యానికి
మదుపుగ నిలిచే బంగారాల అంగడి
మిరుమిట్లు గొలిపే కాంతులతో
గురువిందగింజ తూకానికి
బరువు గుండెల భారనికి సోలక
మిన్నంటే ధరలతో రచ్చ చేసింది..

ఆడుతు పాడుతు
కలసి పని చేసుకునే కాలం
గడచిపోయింది.
పాకెట్ పాలను తాగుతున్న
శిశివులకు అవ్వలి చను కబళించే అవకాశం లేక
ఆ ‘వల’ దృశ్యాలకు లోబడి
గుక్క మింగుడు పడింది.
అక్కర ఆయాలకు గ్రక్కున అవసరం వచ్చి
పసి పాపల పాలనకు
ఇచ్చుకునే దిన భత్యం లెక్కకు మించింది.

కేలండరులో గడులకు
గిరి గీసుకుని ఉండక ఖరారుగ తేదీలు
దూకి పోతుంటే
గడియారం ముల్లు
గుచ్చుకుంటుంది.
అధిక వ్యయాల దిగులు గాయాలకు,
మలాము పట్టీల అన్వేషణ మార్గాలకు చిక్కి
మమతాను బంధాల గడువు దాటింది.
ఒంటరి గాజు మేడల మూల్యం తాహతుకు మించింది.

కరచాలనం
ఇమోజీలకు పరిమితం అయింది.
సాలభంజిక ఆకృతిని దాల్చి వచ్చింది.
అక్షరం వేళ్ళ కొసలతో పలకరించింది.
శత ప్రయోగాల విజయంతో
బాహ్యాకాశం త్రినేత్రం తెరచింది.
కోకిల మాత్రం
సహజ రుచుల చిగురు మామిళ్ళను మెసవుతూ,
వెల కందని మధుర గాంధర్వ
విశ్వావసు గానాలను వినిపించింది.

Exit mobile version