ఎక్కడో మారుమూల పల్లె
హన్మాజీపేట కన్నది
మనసు బుచ్చమ్మ కొంగు బంగారమై
నడక మల్లయ్య నయనాల మైదానమై
అక్షరం పురుడు పోసుకున్నది
మూలవాగు ప్రవాహ గీతమై
భాష ఆశల హారం ఆవహించింది
కవిత్వ తత్వాన్ని విశ్వంభరలో నింపింది
చదువు సాగింది కరీంనగర్, సిరిసిల్ల,
హైదరాబాద్ బడుల్లో
కవిత నేర్పిన బతుకు బాటలో
భావస్ఫూర్తి పండిన పద్యమైంది
నేలపై నడిచిన శ్వాసలో
కలల కాంతి విశ్వాసాల కవితలల్లి
విశ్వంలో తెలుగు అక్షరాలను
జ్ఞానపీఠంతో అభిషేకించింది
విశ్వగీతి నుండి మొదలైన యజ్ఞం
ఆఖరి శ్వాస వరకూ సృజన సాగింది
కర్పూరవసంత రాయలూ, నాగార్జున సాగరం
గేయకావ్యాలు ధాత్రిని వెలిగించెను
విశ్వంభర కీర్తి పతాకాలు ఎగిరేసే
వ్యాసోపన్యాసాల కలయికలో
కలం ప్రజ్వలించింది జలంలా పారింది
తెలుగు భాషాకవి సినారె విశ్వంలో
రానున్న తరాలకు తారగా వెలిగైనారు
సినారె చిరునవ్వుల స్నిగ్ధ కావ్యంలో
మహాకవిగా వెలిగారు పాఠకుల్లో
మందార మకరందమై ఎదల నిండే
అక్షర గవాక్షాలు బతుకు తడి
కవిత్వమైంది యశోఉశస్సులా
సముద్రంలో దాగిన ముత్యాలెన్నో
తన కనుల్లో అక్షర మాలలైనవి
విశాల మనస్వి విలువల తపస్వి
సాహితీ సముద్రుడు సినారె
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.