మనస్సు~ ఆమనిలో వసంతపు చిగురులా,
కలకూజితాల మేజువాణి స్వాగతాలుగా
నవనవోన్మేషమై, పులకలు రేపేనిలా…
మనస్సు~ అంతలోనే వడగాడ్పుల ఘీంకారనాదంతో
నిరాశ నిట్టూర్పులతో
విరహజ్వలనములతో …
మనస్సు~ బాధల చినుకుముల్లు గుచ్చుతుంటే జోరుకన్నీరు,
జడివానలై,
అంతరంగ సునామీలై,
శ్రావణమేఘమల్లే
విషాదప్రవాహమౌతే….
మనస్సు~వయస్సు పండువెన్నెల్లో,
వలపుల తలపులారబోసి,
ప్రణయ వీధుల్లోన
విరహాల శరద్వెన్నెల కురిపిస్తే ….
మనస్సు~ సమస్యల సుడిగుండాల మునిగి
గజగజ వణికించి,
ఆకుల రాల్చేసే
ఒంటరి పత్రమై
మిగిల్చి నిషాదాల
విషాదాన్ని నింపుతే..
మనస్సు~మరలా చైత్రంలోని చిగురుల
ఎదురుచూపుల వాసంతం కోసం,
బ్రతుకు పుష్పాల సుగంధాల కోసం,
ఆకాంక్షల,తలపించీ,మురిపించీ
మైమరపించీ,ఉఱ్ఱూతలూగించీ
ఊహించీ ,ఊరించీ, అంతలోనే ఉలిక్కిపడే
ద్వేషంతో విలయతాండవం జేయించీ
నిలువరింపజేసే ప్రతీ మనస్సూ
ప్రకృతి లోని అంతర్లీనమయ్యే ఋతురాగమే….
భాగవతుల భారతి గారిది ఖమ్మం. వారు గృహిణి. డబుల్ ఎం.ఎ (బిఎడ్) చేశారు. శ్రీవారు శ్రీనివాస్ గారు ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్. పాప భాగవతుల మానస.
కుటుంబ బాధ్యతల దృష్ట్యా టీచర్ ఉద్యోగం మానేసి.. నిత్యాగ్నిహోత్రమూ, వేదాధ్యయనము, స్వాధ్యాయం వైపు నడిచి… పౌరోహిత్యం నేర్చి, ఆడవాళ్లు పౌరోహిత్యం చేయకూడదా? అనే స్త్రీ సాధికారతతో పురోహితురాలు, అనే దిశగా వీరి ప్రయాణం సాగుతోంది. ఎంతోమంది విద్యార్ధులు, వీరి వద్ద మంత్రాల్నీ నేర్చుకుంటున్నారు.
పిల్లలకూ పెద్దలకూ స్వాధ్యాయం క్లాసెస్ జరుపుతూ ఉండటం. రచనలు చేయటం రెండూ రెండు కళ్ళుగా జీవన పయనం సాగిస్తున్నారు (దీనికి శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంది.).
పద్యాలూ, పాట, వచన కవితలూ వ్యాసం, కథలూ… అనేక పత్రికలో ప్రచురణ అయినాయి. మనీతో కూడిన బహుమతులతో పాటుగా… సన్మానాలూ అందుకోవటం… మరిచిపోలేని మధురానుభూతులు. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్శిటీ లో వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా సన్మానోత్సవ కార్యక్రమం మరిచిపోలేనిది.