Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 ఫలితాలు – నిర్వాహకుల నోట్

సంచిక, రాయపెద్ది హనుమంతరావు- సంజీవ లక్షి స్మారక కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు!!!

ఈ పోటీని మొత్తం మూడు విభాగాలలో నిర్వహించాము. పౌరాణిక కథలు, సస్పెన్స్ థ్రిల్లర్ కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు అన్న ఈ విభాగాలకు చెందిన కథలకు పదిహేను వేల రూపాయలు మొత్తం బహుమతి సొమ్మును పంచాలను నిర్ణయించాము.

అయితే, పలువురు రచయితలు ఈ మూడు విభాగాలకు చెందని కథలను పోటీకి పంపారు. వాటిని పోటీలో పరిగణించకున్నా సాధారణ ప్రచురణకు స్వీకరిస్తున్నది సంచిక. ఏ విభాగానికీ చెందని రచనలను పంపినవారికి ఎవరికయినా తమ రచన సాధారణ ప్రచురణ పట్ల అభ్యంతరం వుంటే ముందుగా తెలపాలని ప్రార్ధన.

మూడు విభాగాల్లో మొత్తం  152 కథలు అందేయి.

చెరో విభాగం నుంచి అయిదు కథల చొప్పున ఎంపిక చేయాలని అనుకున్నాము. కానీ, అన్నిటికన్నా తక్కువ కథలు అందిన సైన్స్ ఫిక్షన్ కథల విభాగంలో సైన్స్ ఫిక్షన్ నిర్వచనంలో ఒదిగే కథలు అతి తక్కువగా ఉన్నాయి.  ఆ విభాగంలో రెండు కథలు మాత్రమే ఎంపిక అర్హత కలిగినవి ఉన్నాయి. దాంతో, ఈ విభాగంలో ఇన్ని కథలు అన్న నియమం వదలి, మొత్తంగా చక్కటి స్థాయిలో వున్న కథలను ఎన్నుకుని అలా ఎన్నుకున్న కథలకు మొత్తం ధనం సమానంగా పంచాలని అనుకున్నాము.

కథలను మూడు దశలలో వడపోశాము.

ముందుగా, కథా రచన ప్రక్రియతో పరిచయం లేకున్నా, కథను చదివి ఆనందించగల సామాన్య పాఠకులిద్దరితో కథలు చదివించి, వారికి నచ్చిన కథల జాబితా తయారు చేయించాము.

విభిన్న కథలను రాసే రచయితతో, సామాన్య పాఠకుడు తయారు చేసిన జాబితాలోని కథలను చదివించి, వాటిలోంచి అతనికి నచ్చిన కథల జాబితా తయారు చేయించాము.

చివరగా, వివిధ కథా ప్రక్రియల విమర్శతో పరిచయం ఉన్న విమర్శకుడితో (అతనికి తెలుగు తెలియదు. ఒకో కథను తర్జుమా చేసి వినిపిస్తే  విని తన అభిప్రాయం చెప్పాడు. ఇందువల్ల, కథల ధ్వని, పదాల వాడకంలో లయ కూడా పరిశీలించే వీలు చిక్కుతుంది) కథల ఎంపిక చేయించాము.  అంటే, మూడు దశలలో కథల వడపోత జరిగిందన్నమాట.

చివరికి బహుమతి ధనాన్ని పొందే అర్హత సాధించిన కథలు 14 మిగిలాయి. బహుమతిగా ఎంపిక చేసిన రుసుమును పంచితే ఒక్కొకరికీ వెయ్యికన్నా తక్కువ వస్తుంది. కాబట్టి, సంచిక సంపాదక వర్గం, ఈ కథలను తమ దృక్కోణంలో పరిశీలించి సంఖ్యను తగ్గించాలని ప్రయత్నించింది. అలా, బహుమతికి అర్హమైన కథల సంఖ్య 10కి తగ్గింది. పది కథలకు ఈ బహుమతి సొమ్మును దీపావళి రోజు ఉదయం ఫలితాలు వెల్లడి అయ్యే సమయానికి వారి వంతు ధనం అందుతుంది.

మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి అన్న విభజనకు సంచిక వ్యతిరేకి. ఎందుకంటే, మనం నిర్ణయించే ఉత్తమ కథల నిర్ణయం తాత్కాలికం. ఒక రచన ఉత్తమత్వాన్ని నిర్ణయించే కాలం నిర్ణయం శాశ్వతం. కాబట్టి, ఉత్తమ, ద్వితీయ అన్న విభజన వదలి , బహుమతి ధనం అందుకునే అర్హత సాధించిన కథలను నిర్ణయిస్తుంది సంచిక. ఇప్పుడు కూడా, ఈనాడు సంచిక బహుమతి ఇవ్వని కథలలో ఏదో ఒక కథ కాలాన్ని తట్టుకుని నిలబడే వీలుంది. ఆ కథ గొప్పతనాన్ని ఈనాటి పరిస్థితులలో గుర్తించలేక పోయివుండవచ్చు. కాబట్టి రచయితలెవరూ నిరాశ చెందాల్సిన అవసరంలేదు. నిజానికి, విభిన్నమయిన కథల పోటీ కోసం మామూలు కన్నా భిన్నంగా ఆలోచించి కథలను సృజించిన ప్రతి రచయితా విజేతనే! వారందరికీ సంచిక అభినందనలు! వందనాలు!

పోటీకి వచ్చిన కథలు చదువుతోంటే, కథకులు ఆధునిక సమాజంలోని అనేక విభిన్నమైన అంశాల ఆధారంగా కథలను విశిష్టంగా సృజించటం కనిపిస్తుంది. కొన్ని కథలు రచయితల ఊహా శక్తికి, సృజనాత్మక ప్రతిభకు, భావనా బలానికి ఆశ్యర్యం కలిగించాయి. తెలుగు రచయితలకు అవకాశం లభిస్తే సృజనాత్మకంగా వారిని ఎదుర్కునేవారెవరూ లేరన్న నమ్మకాన్ని ఈ కథలు బలపరిచాయి.

కథల పరిశీలనలో పదే పదే వినిపించిన అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. కొందరు రచయితలు పురాణ కథలంటే, పురాణ కథను తమ భాషలో సరళంగా తిరిగి రాయటం అనుకున్నారు. కథ అన్నది కల్పనతో కూడుకున్న సృజనాత్మక ప్రక్రియ. పురాణ గాథను సరళంగా రాయటంతో పాటూ కథలో ఒక ఊహ, కల్పనలను ప్రదర్శించాల్సి వుంటుంది.

థ్రిల్లింగ్, సస్పెన్స్ కథలనగానే అధికులు, దయ్యాల కథలు, మర్డర్ కథలన్న ఆలోచననే ప్రదర్శించారు. కథను సస్పెన్స్‌గా, ఉత్కంఠభరితంగా చెప్పటం అన్న ఆలోచనను కొందరు రచయితలు ప్రదర్శించారు.

సైన్స్ ఫిక్షన్ రచనల గురించి అస్సలు అవగాహన లేదన్న విషయం పోటీకు అందిన కథల సంఖ్య ప్రదర్శిస్తే, పోటీలో ఉండిన కథలు నిరూపించాయి. అతి తక్కువ కథలలో సైన్స్ ఫిక్షన్ స్పృహ కనిపించింది.

ఇది చదివి రచయితలు నిరాశ పడాల్సిన అవసరంలేదు. ఇందులో వారి దోషం ఏమీ లేదు.

తెలుగు సాహిత్యంలో ఒక పద్ధతి ప్రకారం కథ నిర్వచనం మార్చారు. కథ పరిథిని కుచింపచేశారు. ఇలాంటి కథలు రాయొద్దు, అవి కథలు కావు, మేము రాస్తున్నదే సాహిత్యం, ఇదే సాహిత్యం వంటి ఆలోచన ముళ్ళకంచెలతో కథను బంధించివేశారు. దీనికి తోడు కథ విస్తృతి తెలియని అజాగళ స్తన విమర్శక శిఖామణులు తెలుగు సాహిత్య ఆస్థాన పండితమ్మన్యులుగా చలామణీ అవుతూండటంతో తెలుగు సాహిత్యం ఆ నాలుగు వస్తువుల చుట్టే తిరుగుతూ చుట్టచుట్టుకుపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నది. రచయితలను, పాఠకులను వీరు తమ స్థాయికి దిగజార్చారు.

ఈ పరిస్థితి మార్చాలన్న ఉద్దేశంతో సంచిక విభిన్న కథల పోటీ నిర్వహించింది.

అతి త్వరలో మరొక కథల పోటీ నిర్వహించబోతోంది సంచిక.

అంతకన్నా ముందు రచయితలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాలలో ఔత్సాహిక రచయితలు, విభిన్న కథా ప్రక్రియల్లో రచనలు చేయాలన్న అభిలాష కల రచయితలు పాల్గొనాలన్నది అభ్యర్ధన. ఆ తరువాత ఒక విభిన్నమైన కథల పోటీ నిర్వహిస్తుంది సంచిక.

ఎలాగయితే, సూర్యకిరణాలు సమస్త జగతికి వెలుగును విస్తరింపచేస్తాయో, అలాగ తెలుగు రచయితలు తెలుగు సాహిత్యాన్ని విభిన్న వర్ణాలతో సుందరమయిన ఇంద్రధనుస్సులా నిలపాలి. అందుకోసం పత్రికలూ, రచయితలూ భుజం భుజం కలిపి, అడుగులో అడుగు కలిపి, సాహిత్య మేథామథన యజ్ఞాన్ని నిర్వహించాలి.

అందుకు అందరికీ ఇదే ఆహ్వానం!!!!

బహుమతి పొందిన రచయితల వివరాలు, మూడు విభాగాల్లో ఒక్కొక్క కథ దీపావళి నాడు వెలువడే సంచిక ప్రత్యేక సంచికలో ప్రచురితమవుతాయి!!!!

 

Exit mobile version