[బాలబాలికల కోసం ‘రూపం కాదు.. ప్రతిభ ముఖ్యం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
సింగవరంలో ఉండే కృష్ణ పొట్టిగా కాలు వంకరతో ఉండేవాడు. అతని వీధిలోనే ఉండే శంకరం తెల్లగా పొడుగ్గా వంకీల జుట్టుతో అందగాడుగా కనబడేవాడు.
ఒకసారి రచ్చబండ దగ్గర జరిగిన సమావేశంలో కృష్ణను చిన్నచూపు చూస్తూ హేళనగా మాట్లాడాడు శంకరం. అయినా కృష్ణ ఏ మాత్రం బాధ పడకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఒకరిద్దరు అలా ఒక వ్యక్తి రూపం చూసి హేళనగా మాట్లాడకూడదని చెప్పినా తన తీరు మార్చుకోలేదు శంకరం.
ఒక రోజు కృష్ణ రచయితల సభకు వెళ్ళి తను వ్రాసిన బాలసాహిత్య కథలు, అనేక కవితల్ని వేదిక మీదున్న ప్రసిద్ధ రచయిత ద్వారకానాథ్‌కి తగిన సమయం చూసుకుని చూపించాడు. ఆ రచనల్లో కొన్ని చదివి ఆశ్చర్య పోయాడు ద్వారకానాథ్. వెంటనే కృష్ణను వేదిక మీదకు పిలిచి సభలో కూర్చున్న అందరికీ అతని ప్రతిభను గురించి వివరించాడు.
సభలో అందరూ కృష్ణ ప్రతిభకు ఆశ్చర్యపోయారు! ఆ సభలో శంకరం మిత్రుడు గిరీశం కూడా ఉన్నాడు. శంకరం అనేకమార్లు కృష్ణను హేళన చెయ్యడం తెలుసు. అతని ప్రతిభను శంకరం తెలుసుకోలేక పోయాడని అర్థం చేసుకున్నాడు గిరీశం.
సభ అంతా అయ్యాక గిరీశం శంకరం ఇంటికి వెళ్ళి కృష్ణ ప్రతిభను వివరించాడు. గిరీశం మాటలు విని శంకరం ఆశ్చర్యపోయాడు.
“నిజమే గిరీశం, కేవలం రూపం చూసి మనిషిని హేళన చేసి అవమాన పరచకూడదు. అతనిలో మనకు కనబడని ప్రతిభ ఉండవచ్చు. నేనే అతని ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను” చెప్పి వెంటనే కృష్ణ ఇంటికి వెళ్ళి సామరస్యంగా మాట్లాడి క్షమాపణలు అడిగాడు.
“అలా అనుకోవద్దు శంకరం మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాటును అర్థం చేసుకుని మరలా ఆ పొరపాటు చేయకుంటే అంతకన్నా కావలసిందేముంది? అంతకంటే ఆనందం ఏముంటుంది?” అన్నాడు కృష్ణ.
ఇంత మంచిమనిషినా నేను అవమానించింది? అనుకుని మరొక్కమారు క్షమించమని అడిగి వెళ్ళాడు. ఆ తరువాత ఇద్దరూ మంచి మిత్రులయిపోయారు.
కృష్ణ ప్రతిభ తెలిసి సింగవరం జమీందారుగారు సన్మానించారు.
ఆ సభకు శంకరం కూడా వచ్చి కృష్ణ ప్రతిభకు ఎంతో సంతోషించి చప్పట్లు కొట్టాడు.