[శ్రీ కొండూరి కాశీ విశ్వేశ్వరరావు రచించిన ‘రోబోలతో భయం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
వెంకటేశు రోజువారి కూలి పనులు చేస్తుంటాడు. అతను సున్నాలు వేయటం, ఇళ్లు నిర్మించే మేస్త్రీల దగ్గర పని చేస్తూ తన చిన్న కుటుంబాన్ని మొత్తానికి ముందుకు లాక్కెడుతున్నాడు. అలాగే అతని భార్య కూడా ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, కుట్టు మిషన్‌పై బట్టలు కుడుతున్న ఇల్లాలు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి శ్రీనివాస్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిత్యం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
‘ఇంకా చెల్లెలు నవ్యశ్రీ ఇంటర్మీడియటే చదువుతోంది. అమ్మా నాన్నా ఎంతకాలం అని ఇలా కష్టపడాలి? వెంటనే నాకు నుంచి ఉద్యోగం ఏదైనా వస్తే, నాన్నను ఇక నుండి కూలి పని చేయద్దని చెప్పేస్తాను. ఈ మధ్యలో అద్దె ఇంటి సమస్య ఒకటి, మాకు వచ్చే రాబడి చాలా తక్కువ, దయయుంచి ఇంటి అద్దె పెంచకండి అని ఎన్నిసార్లు నమ్రతతో విన్నవించుకున్నా, ఇంటి ఓనర్లు కనికరించేవారు కాదు. అందుకని, ఇక తప్పక, తక్కువ రేటులో అద్దెకిచ్చే ఇల్లు వెతుక్కుని మారటం తప్పనిసరైపోయింది’ అనుకున్నాడు శ్రీనివాస్.
శ్రీనివాస్ ఆన్‌లైన్‌లో ఎన్నో కంపెనీలకు తన ఉద్యోగ దరఖాస్తు పంపించాడు. కానీ ఏ ఒక్క కంపెనీ నుండి కనీసం ఇంటర్వ్యూకి రమ్మనే పిలుపు రావటం లేదు. అయినా, ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగం దొరకటం కష్టమట. దానికి తోడు కృత్రిమ మేధస్సు అనే కొత్త సాఫ్ట్‌వేర్ రావటంతో, రానురాను ఉద్యోగావకాశాలు పూర్తిగా తగ్గిపోయాయట.
అందరూ కృత్రిమ మేధస్సు గురించి చర్చించుకుంటున్నారు. అసలు కృత్రిమ మేధస్సు వలన లాభాలు ఎన్ని వున్నాయో, నష్టాలు కూడా చాలానే ఉన్నాయని నిపుణులు చెపుతున్నారు.
ఇప్పటికే మార్కెట్లోకి రోబోలు దూసుకుంటూ వచ్చేశాయి. మనిషి చేసే పనులన్నీ రోబోలు చేస్తున్నాయి. మరి మనుషులకు పనులెక్కడ? మనుషులు ఎలా బ్రతకాలి?
‘అమ్మా నాకు ఇక ఉద్యోగం రానేరాదు. అమ్మా నాన్నా మీరిద్దరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. కానీ చదువుకుని కూడా మీకు నేను ఏ మాత్రం సహాయపడలేకుండా ఉన్నాను. నేను చేయటానికొక ఉద్యోగం దొరకటం లేదు. అదిగో రోబోలు వచ్చేస్తున్నాయ్!’ అంటూ నిద్రపోతున్న శ్రీనివాస్ భయంతో కలవరిస్తున్నాడు.
“ఒరేయ్! శ్రీనివాసూ! నువ్వు కలగన్నావునా! అది నిజం కాదు. ఇదిగో నీకేదో కొరియర్ వచ్చిందిరా!” అని కొడుకుకి కవర్ ఇచ్చింది తల్లి.
దాన్ని చించి చదివిన శ్రీనివాస్, “అమ్మా! నాకు ఉద్యోగం వచ్చింది” అని ఆనందతాండం చేశాడు ఇక రోబోలతో భయం లేదుగా!