Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనిషి నుంచీ మనసులోకి ప్రవహించిన కథనం పద్మావతి రాంభక్త ‘రెండు చందమామలు’

[పద్మావతి రాంభక్త గారి కథాసంపుటి ‘రెండు చందమామలు’ పై సమీక్ష అందిస్తున్నారు శ్రీ విహారి.]

శ్రీమతి పద్మావతి రాంభక్తగారు తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. ‘కొత్త వేకువ’, ‘మెతుకు వెలుగులు’ కవయిత్రిగా, ‘కురిసి అలసిన ఆకాశం’ కథా సంపుటి రచయిత్రిగా ఆమె సాహితీపరుల ప్రశంసల్ని పొందారు.

‘రెండు చందమామలు’ 17 కథల సంపుటి. కథల్లో ఎక్కువ భాగం పత్రికల కథానికల పోటీల్లో బహుమతులు పొందినవే. కొన్ని కథల్లో వస్తు కేంద్రం – స్త్రీ జీవనవేదన; మౌనఘోష. పురుషాధిక్య సమాజంలో ఆదరణ, కరుణ రాహిత్యం, ఆమెను అర్థం చేసుకోకపోవటం, వ్యక్తిత్వ హననం ఒక సాధారణ దుస్థితిగా మారింది. ‘నీటి బరువు’, ‘నడిపించే నీడ’, ‘సుహాసిని నవ్వు’ కథలు ఈ పరిస్థితి దర్పణాలుగా వచ్చాయి. దీనికి భిన్నంగా భర్త సహాయ సహకారాలు అందే సందర్భాలు నూటికొకటిగా తటస్థపడతాయి. ‘తరతరాల చరిత్రలో’ కథ దీనికి ఉదాహరణ. “భార్యాభర్తలిద్దరూ సంసార నావని మునిగిపోకుండా సక్రమంగా నడిపితేనే, జీవితం ప్రశాంతంగా వుంటుంది. నువ్వు ఇంటిపని చేస్తుంటే నేను ఏమైనా అనుకుంటానేమో లేక అనేస్తానేమో అని ఆలోచించావా? మొత్తానికి భలేవాడివే” అని కొడుకుని మెచ్చుకుంటుంది తల్లి. అతని భార్యేమో – “నేను కూడా వంట బాగానే చేస్తాను అత్తయ్యగారూ” అని తన భర్త చేత పనులు చేయిస్తున్నందుకు న్యూనతని మరుగుపరచుకుంటుంది. స్త్రీ సాధికారత సాఫల్యానికి కొండంత ఉదాహరణగా ‘ఇది అహంకారం కాదు’ కథని రాశారు పద్మావతిగారు. బ్రిలియంట్‌ స్టూడెంట్‌గా క్యాంపస్‌ సెలక్షన్‌లో ఉద్యోగం పొంది కూడా ఆమె వుద్యోగంలో చేరకుండా ఆర్గానిక్‌ స్టోర్‌ పెట్టి రాణించి జీవితాన్ని గెలిచి నిలిచింది.

సంపుటిలో ‘ఆకాశమంత’ అని ఒక చాలా మంచి కథ వుంది. కాలనీలో ఒక పెద్దావిడ – పుట్టుకతో ఆనందమూర్తిమత్వంతో పుట్టినదానిలా, ఊరికి ఉపకారి వున్నది. ఎక్కడెక్కడ చిన్నాపెద్దా ఇబ్బందివున్నా అక్కడ వాలుతుంది. ఆ ఇబ్బంది తనదిగా భావించి సరిచేస్తుంది. ఆమె సహాయాల్లో ఎక్కడా ఎప్పుడూ స్వాతిశయం, భేషజం కనిపించవు. అందరికీ సహకార హస్తం అందించే ‘మంచి’తనం. ఈమె అంటే కథ చెప్పిన ‘నేను’కి ఆశ్చర్యం. చివరికి ఆమె ఎవరో స్నేహితురాలు ద్వారా తెలుస్తుంది. ఆ స్నేహితురాలు చెబుతుందిలా:-

‘‘..చాలా మంచిమనసు ఆమెది. మనుషులంటే ప్రాణం పెడుతుంది. తనూ నేనూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులం. నేను పెళ్ళిచేసుకోలేదు. ఈ ఆశ్రమం పెట్టి కొన్నేళ్ళుగా నడుపుతున్నాను. తనకి ఇరవై ఏళ్ళకే పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు పసివారిగా ఉన్నప్పుడే భర్తను పోగొట్టుకుంది. ఆ తరువాత ఎంత కష్టపడి పిల్లలను పెంచిందో నాకు తెలుసు. తను అంత కష్టపడినందుకు ప్రతిఫలంగా పిల్లలిద్దరూ బాగా చదువుకుని ఫారిన్‌లో సెటిలయ్యారు. తన పిల్లలు ఎంతసేపూ అక్కడకు తనను రమ్మంటారు కానీ వాళ్ళు మాత్రం ఇక్కడకు ఒకసారీ తనని చూడడానికి రారు. వాళ్ళు ఎంత పిలిచినా తను వెళ్ళదు. తనలో నాకు చాలా నచ్చే విషయమేమిటంటే, తను జీవితంతో అలసిపోయినా ఎంతో హుషారుగా ఉంటుంది. అలాగని పిల్లలు రారని తనని చూడరని వాళ్ళమీద చాడీలు చెప్పదు. ‘వాళ్ళు అక్కడ బావున్నారు కదా. నేను ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళినా కొన్నాళ్ళే అక్కడ ఉండగలను. మిమ్మల్నందరినీ వదిలి వెళ్ళినా అక్కడ ఏమీ తోచదు. ఎక్కడికెళ్ళినా చివరకు ఈ గడ్డ మీదకు రావలసినదాన్నే కదా’ అంటుంది.’’

‘ఆవిడ పేరు వసుంధర. ఆమె కుటుంబం ఆకాశమంత’ అంటూ కథ ముగుస్తుంది. వస్తు స్పృహ నవ్యతతో పాటు, ఇతివృత్తం కథనంలో సహజత్వం, సమాజానికి ఒక వాంఛనీయమైన సందేశం వుండటం వలన – కథౌన్నత్యం ఇనుమడించింది.

ఇంతకింత మరో మంచికథ ‘నలుపు తెలుపులు’ ఉన్నది. మిత్రుడి అవసరానికి మరొకరిచేత అప్పు ఇప్పిస్తే, ఆ మిత్రుడు అప్పు తిరిగి ఇవ్వకపోగా, చాలా తేలికగా ‘అవసరానికి వాడేసాను. ఇచ్చేస్తాలే’ అనేస్తాడు- ఈ మధ్యవర్తి లలితతో. కనీసం- ఆ అప్పు ఇచ్చిన ప్రకాష్‌కు ఈ డబ్బు తీసుకున్న సూర్య- మాటమాత్రంగా కూడా ‘ఇవ్వడం కుదరటంలేదు’ అని చెప్పడు. ఈ పరిస్థితికి లలిత చాలా ఆవేదనపడుతూ, మనసులో కుములుతూ వుంటుంది. కథనమంతా ఈ లలిత మనస్తాత్విక స్థితి చిత్రణ. చివరికి ప్రకాష్‌ ఆమెకు ఒక ప్రబోధాన్ని చేస్తాడు.

‘‘లలితా! నలుపూ తెలుపులలా మనుషులలో చెడూ మంచీ కూడా ఉంటాయి. మనుషులందరూ పూర్తిగా మంచిగా నీకు నచ్చిన తీరులో ఉండాలంటే ఎలా? మనం ఎప్పుడూ మనుషులలోని నలుపును చూసి చూడకుండా వదిలేసి, తెలుపుని మాత్రమే గుర్తుంచుకోగలిగితే మనశ్శాంతిగా ఉంటుంది. ‘వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారు. వీళ్ళిలా ఎందుకు చేసారు’ అని ఎంతసేపూ అవే సంఘటనలు మననం చేసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు. పాత బరువులను ఎప్పటికప్పుడు దించేసుకుంటూ పోతేనే జీవితంలో నడక తేలికగా అనిపిస్తుంది. అసంకల్పితంగా మన చర్యల వల్లో మాటల వల్లో మరొకరు కూడా బాధపడి ఉండవచ్చు. మనకి ఎప్పటికీ ఆ విషయం వారు చెప్పకుండా ఉంటే మనకి సైతం ఆ విషయం తెలియనే తెలియదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నేను డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నాననే కదా. నాకు డబ్బు ఎలాగో అలాగ సర్దుబాటవుతుంది. కానీ మనుషుల మధ్య సన్నని తెరలు మొలవడం మొదలైతే అవి కొన్నాళ్ళకు పటిష్టమైన గోడలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది’’ అన్నాడు ప్రకాష్‌.

అసలీ కథ ఎత్తుగడ వాక్యాలే చాలా ఉత్కంఠభరితంగా వచ్చాయి. ‘సూర్య అలా చేస్తాడని అప్పుడు నేను అసలు కలలోనైనా అనుకోలేదు. అతడు చేసిన పనికి ఈనాటికి కూడా ప్రకాష్‌ దగ్గర ఎంతో ఇబ్బందిగా అనిపిస్తోంది’ అనేవి ఆ వాక్యాలు. కథలో గొప్ప నూతన వస్తువేమీ లేకపోయినా, ఒక సున్నితమైన అంశంతో లలిత మానసిక సంవేదనకు మంచి చిత్రణ నిచ్చారు రచయిత్రి.

కాగా, ‘రెండు చందమామలు’ అద్భుతంలో అద్భుతం అనిపించే గొప్ప కథ. ఒక అద్భుతం శాంతి – పవన్‌కి ‘ఏంజల్‌’. ఆమె అందం అతని ఎసెట్‌! ఆమెని చూసి తన కొలీగ్స్‌ కుళ్ళుకోవటం అతనికి ప్లెజర్‌! సరే, ఇక్కడివరకూ మగవాడి బలహీనతగానీ బలంగానీ అనుకుందాం. తర్వాత? – ‘‘నన్ను పేరుపెట్టి పిలవకు. నాకు నచ్చదు. ఏమండీ – అను’’ తో మొదలు. శాంతి బుజ్జిబాబో-పాపో ఉంటే బావుంటుందంటే, అతనంటాడు, ‘‘అవన్నీ నేను ప్లాన్‌ చేస్తాను. నీపని నన్ను సంతోష పెట్టటమే.. పిల్లల్ని కంటే నీ అందం చెడిపోదూ’’ అని! రెండో అద్భుతం చూద్దాం. ఆమెకు బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చింది. ఆపరేషన్‌ చేసి దాన్ని తొలగించవలసివచ్చింది. తొలగించారు. ఇక అతనికి ఆమె అంటే ‘వెగటు’ కలిగింది. విడాకులవరకూ వెళ్లింది వ్యవహారం. ఆమె స్థైర్యం ఆమెకు భవిష్యత్తును చూపింది. తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నది. అంతర్జాతీయంగా ‘మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ పర్సన్‌’ అవార్డుని పొందింది. ఈ క్రమంలో ఆమె ఏంచేసిందో అదీ అద్భుతం! చదవండి. అసలు ‘రెండు చందమామలు’ శీర్షికే అద్భుతం కూడా!!

ఇంకా- అత్తగారిపట్ల మాటదురుసు కోడలు-స్నేహితురాలి బోధతో జ్ఞానోదయమై మనసూ, ప్రవర్తనా మార్చుకున్న ‘ఆకాశానికో నక్షత్రం’ కథ ఉన్నది. డొక్కా సీతమ్మగారి లాంటి చల్లని తల్లిని కాలవైపరీత్యం ఏం చేసిందో చూపే అత్యంత ఆర్ద్రమైన కథనం ‘జ్ఞాపకాల సన్నజాజులు’ వున్నది.

ఈనాటి సామాజిక రాజకీయ కల్మషాన్ని చూపే ‘విలయం’, హాస్యం, వ్యంగ్యంతో అలరించే ‘తీపి చేదు’, ‘రెండు తోకల పిట్ట’ వంటి కథలూ ఉన్నాయి. మనుషుల్లోని భిన్న ప్రకృతుల వైవిధ్యాన్నీ, ప్రవర్తనలోని వైరుధ్యాల్నీ కథాత్మకం చేస్తూ మంచి రచనల్ని అందించిన పద్మావతిగారికి అభినందనలు. పుస్తకాన్ని కొని చదివి ఆనందించండి.

***

రెండు చందమామలు (కథలు)
రచన: పద్మావతి రాంభక్త
పేజీలు: 128
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
రచయిత్రి: 9966307777

Exit mobile version