
‘కల్లోల భారతం’ పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు చాలామంది పాఠకుల నుంచి మొదటగా వస్తున్న ప్రశ్న ఇప్పుడు ఈ చరిత్ర దేనికని? ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం దేనికని? ఈ క్రమంలో ఈ చరిత్ర అధ్యయనం ఇప్పుడే ఎందుకు అని ప్రశ్నించే ముందు ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను కొద్దిగా విశ్లేషించాల్సిన అవసరం కనిపించింది.
ఢిల్లీలో కొద్దిరోజుల క్రితం ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బాంబు పేలుళ్ల గురించి మనం బయటపడ్డామని అనుకుంటున్న సమయంలో ఈ పేలుడు మళ్లీ ఉలికిపాటుకు గురిచేసింది. అయితే మన నిఘా వ్యవస్థలు భారీ విపత్తునుంచి మనల్ని కాపాడాయి. దేశంలోని అనేక నగరాల్లో జరగాల్సిన పేలుళ్లను అడ్డుకున్నాయి. ఈక్రమంలో ఢిల్లీలో మాత్రం పేలుడు ఆపలేకపోయాయి.
ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు కూడా బాగా చదువుకున్నవారు.. వైద్యులు. డాక్టర్ ముజిబ్, డాక్టర్ షాహిన్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ ఒమర్.. ఇలా చాలామంది ఉన్నారు. కొందరు పట్టుబడ్డారు మరికొందరు పట్టుబడుతున్నారు. పేలుళ్ల వెనుక వాళ్ల పాత్రలూ బయటపడుతున్నాయి. ఈ పట్టుబడినవారిలో డాక్టర్ ఆదిల్ నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని పొందుతున్న ఉద్యోగి. ముస్లింలు అత్యంత పేదరికంలో ఉన్నారు.. వాళ్లు అణచివేతకు గురవుతున్నారని ఇంతకాలం చేస్తూ వచ్చిన నెరేషన్ ఢిల్లీ పేలుడు సూత్రధారుల విషయంలో తప్పుగా నిరూపణ అయింది. నిజానికి తీవ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేసేవారు, విజన్ ఉన్నవారు, అజెండాను నడిపించేవారు, బ్రెయిన్ వాష్ చేసేవారు, ఇన్డాక్ట్రినేట్ చేయడానికి, ర్యాడికలైజ్ చేసేవారు.. ఎవరూ కూడా పేద కుటుంబాల నుంచి రారు. కేవలం చివరగా గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేసేవారు మాత్రమే పేద కుటుంబాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో పేల్చుకున్న వ్యక్తి మాత్రం పేదవాడు కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఈ పరిస్థితి ఈ దేశంలో ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదు. శతాబ్దాలుగా జరుగుతున్నదే.. వేషాలు మారాయి.. వృత్తులు మారాయి.. మనుషులే మారలేదు. మతమూ మారలేదు.
భారతదేశంలో సామాజిక అన్యాయం జరుగుతున్నదని, సమాజం వారిని దూరంగా నెట్టివేయడం వల్లనే తీవ్రవాదం పెరుగుతున్నదనే వాదనను మనం పదే పదే వింటుంటాం. కొన్ని సందర్భాలలో మాత్రం మదరసాలలో బోధించే కొంతమంది మాత్రమే ఈ రకమైన మనస్తత్వానికి కారకులు అన్న వాదనా వింటుంటాం. ఇంటెలెక్చువల్స్ అనే పేరుతో కొంతమందిని ముందుకు నెట్టి పదే పదే పడికట్టు పదాలతో చేసే ప్రసంగాలను కూడా వింటుంటాం. ఈ రకమైన perpetual minority victimhood అనే వ్యవస్థ అంటే మైనార్టీలు బాధితులు అనే నెరేషన్ మన దేశంలో చాలాకాలంగా కొనసాగుతూ వస్తున్నది. ఈ నెరేషన్‌ను బ్రేక్ చేయడానికి గత 11 ఏండ్లుగా కేంద్రంలోని ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. కంప్యూటర్లు ఇచ్చింది. స్కాలర్షిప్లు ఇచ్చింది. ఇంకా ఎన్నో చేస్తూ వచ్చింది. కానీ, ఏమీ మారలేదు. ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలు వారిని మరింత ర్యాడికలైజ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయే తప్ప ఆలోచనా ధోరణిని మార్చలేకపోయాయనడానికి ఢిల్లీ పేలుడు ఒక గుణపాఠం.
శ్రీనగర్‌లో ప్రభుత్వ సబ్సిడీతో నడిచే మెడికల్ కాలేజీ, ఫరీదాబాద్‌లో అల్ ఫలాహ్ కాలేజీ, హాస్పిటల్.. ప్రజలకు వైద్యం అందించాల్సిన ఈ ప్రాంతాలలో అత్యంత ప్రమాదకరమైన కుట్రకు ప్రణాళికల రచన జరిగింది. ఈ నెట్‌వర్క్‌లో డాక్టర్లే కాదు, ఇంజినీర్లు ఉన్నారు, ఐటీ నిపుణులు ఉన్నారు. కేవలం విద్యను అందించడం ద్వారానో, ఆర్థికంగా చేయూతనందించడం ద్వారానో మార్పు తీసుకొని రావచ్చు అని అనుకుంటే అది పొరపాటని ఈ ఘటన మనకు చెప్తుంది. ఈ వ్యవస్థ చాలా పెద్దది. విస్తారమైంది. కేవలం ఒక పేదరికమో.. మరొకటో దీనికి కారణం కానేరదు. ఇదొక వలయాల సమూహం. చేతికందనంత వ్యవస్థ. ఇది ఎలా ఉంటుందంటే.. మనకు మొట్ట మొదట కనిపించేది అసలు పని చేసిన వ్యక్తి. అంటే పేలుడుకు పాల్పడిన వ్యక్తి మాత్రమే.. కానీ.. అతడి చుట్టూ మొదటి వలయంగా అతడిని తీవ్రవాదానికి పాల్పడే దిశలో నడిపించే ర్యాడికల్స్ ఉంటారు. వారి చుట్టూ రెండో వలయంలో నిధులు సరఫరా చేసేవారు ఉంటారు. వారి చుట్టూ మూడో వలయంలో థింక్ ట్యాంక్ లేదా కవర్ ఫైర్ ఇచ్చే మేధావులు ఉంటారు. వారి చుట్టూ నాలుగో వలయంలో ఓటు బ్యాంకుమీద ఆధారపడే రాజకీయ నాయకులు ఉంటారు. వీటన్నింటి చుట్టూ భారతదేశం వెలుపల నుంచి ఆపరేట్ చేసే శక్తులు ఉంటాయి. ఆ తరువాతి వలయంలో గ్రౌండ్లో పనిచేసే వ్యక్తిని సమర్థిస్తూ.. వారికి కూడా హక్కులు ఉన్నాయంటూ వారిని శిక్షించవద్దంటూ సుప్రీం కోర్టులో వాదించే శక్తులు ఉంటాయి. ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ. మనం మాత్రం పనిచేసిన వ్యక్తిని మాత్రమే చూస్తాం. అతడిని శిక్షించి మిగతా వలయాలను మర్చిపోతాం. ఇది అతి పెద్ద నెట్వర్క్.
వీరి ఆలోచన ఎంత భయంకరంగా విషపూరితంగా ఉంటుందో ఢిల్లీ ఘటన, దాని నేపథ్యం చెప్తున్నది. నిఘా వర్గాల అన్వేషణలో 3 వేల కిలోల పేలుడు పదార్థం దొరికింది. ఢిల్లీలో పేలుడు జరిగిన కారులో 80 కిలోల సామగ్రి ఉన్నది. అన్నింటికంటే భయంకరమైనదేమిటంటే, కాస్టర్ సీడ్స్ నుంచి తయారు చేసే రిసిన్ అనే విషం పెద్దమొత్తంలో దొరికింది. ఇది సైనైడ్ కంటే 600 రెట్లు అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు చెప్తున్నారు. దీని పరిమాణాన్ని చూస్తే.. దీన్ని తయారు చేసే వ్యక్తులను గమనిస్తే.. వీళ్ల లోపల ఎంత ద్వేషం ఉన్నదో అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. దేవాలయాల్లో పెట్టే ప్రసాదాల్లో ఈ రిసిన్ విషాన్ని కలపాలని ఆలోచించారంటేనే ఒక సామాజిక వర్గం పట్ల ఎంత ద్వేషం వారిలో ఉన్నదో చెప్పాలా? టెర్రరిజానికి మతం ఉండదనే వారు ఈ రకమైన విషపూరిత మనస్తత్వానికి ఏం సమాధానం చెప్తారు?
ఈ పేలుడుపై ఏ లిబరలిస్టూ, హేతువాదీ, కమ్యూనిస్టూ, రేషనలిస్టూ స్పందించలేదు. కానీ ఎవరైనా హిందూ సమాజానికి చెందిన వారు ఏదైనా దాడికి పాల్పడితే, వెంటనే మతం మీద, కులం మీద, హిందుత్వ మీద, ఫాసిజం మీద వేలెత్తి దుమ్మెత్తి పోసేవారు కాదా? ఇదే లాజిక్ ఢిల్లీ పేలుడుకు మాత్రం ఎందుకు వర్తించదు? ఒకే మతానికి చెందిన వైద్యులు, నర్సులు, మౌల్వీలు వరుసగా ఈ ఘటనల్లో ఎందుకు కనిపిస్తున్నారు? ఇది నిజంగా యాదృచ్ఛికం అని భావించాలా? ఇప్పుడు మతం మీద, మత మౌఢ్యం మీద, మత ఫాసిజం మీద ఎందుకు ప్రశ్నించడం లేదు? నిజాలను దాచిపెట్టుకుంటూ, దాన్ని అంగీకరించకపోయినంతకాలం, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న నెరేషన్లకు, అంతర్జాతీయ మీడియాకు భయపడినంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. మధ్య ప్రాచ్య దేశాలు తీవ్రవాదాన్ని బహిరంగంగానే అంగీకరిస్తున్నాయి. ఈ భావాలను పెంచి పోషిస్తే తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆ దేశాలు యూరప్ దేశాలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి కూడా. భారత్ మాత్రం ఇందుకు విరుద్ధమైన అభిప్రాయాన్ని ఎందుకు కలిగి ఉండాలి?
భారతదేశానికి ఉన్న పెద్ద సమస్యల్లో ఒకటి అంతర్గత శత్రువులను ఎదుర్కోవడం. ఇదే పెద్ద సమస్య. శత్రువును గుర్తించి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. బాహ్య శత్రువును గుర్తించడం తేలికే.. అంతర్గతంగా ఉన్న ట్రోజన్లు కేవలం మతం నుంచి మాత్రమే రావడం లేదని గ్రహించాలి. ఇది కళాశాలలతో పాటు వివిధ రంగాల వరకు లోతుగా విస్తరించిన మౌలికమైన భావజాలం. మన నాగరికత ఎదుర్కొంటున్న చాలా కఠినమైన సమస్య భావజాలమే.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌తో మనం ముగించిన అమన్ కీ ఆశా అన్నది కేవలం తాత్కాలికం మాత్రమే. ఈ భావజాలమే మనదేశానికి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ భావజాలానికి పునాది మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు.. వాటికి మద్దతిస్తున్న అంతర్జాతీయ శక్తులు. ముందు చెప్తున్న వలయాలలో ఇవి ప్రధానమైనవి. ఎందుకంటే పాకిస్తాన్ అన్నది కేవలం ఒక భౌగోళిక దేశం కానే కాదు. అది ఒక మైండ్‌సెట్. ఒక భావజాలం. ఇది మన దేశంలో బాగా వేళ్లూనుకున్నది. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే.. మనం ఎదుర్కొంటున్న సంఘర్షణ ఒక దేశంతో కాదు.. ఒక భావజాలంతో, మైండ్‌సెట్‌తో అని అవగతమవుతుంది. ఈ భావజాలాన్ని భావజాలంతోనే ఎదుర్కోవాలి. ముందుగా అర్థంలేని భావోద్వేగాలను పక్కన పెట్టాలి. తర్వాత, హింసాత్మక మౌలిక భావజాలంపై UPలో చేస్తున్నట్లుగా కఠిన చర్యలు తీసుకోవాలి. మూడోది, దేశం పట్ల సానుకూల భావన కలిగిన ముస్లింలతో చర్చలు జరుపుతూనే, అసలు సమస్య అయిన డెమోగ్రఫీ పై దృష్టి సారించాలి. Demography is destiny. Democracy is dependent on demography. కశ్మీర్, బెంగాల్, అస్సాం, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు ఇవన్నీ డెమోగ్రాఫిక్ మార్పుల వల్ల మారిపోయిన ప్రాంతాలే. మొత్తం రాజకీయ సమీకరణాలను మార్చడానికి ఒక సమాజం 51% కావాల్సిన అవసరం లేదు; 30% ఉన్నా చాలు. రాజ్యాంగపరంగానే దీన్ని పరిష్కరించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మైనారిటీల హక్కులు Article 29 ద్వారా పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. అయినప్పటికీ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2006లో ఎందుకు ఏర్పడింది? దానికి రాజ్యాంగ బద్ధత ఏమున్నది? ఒకవైపు UCC కోరుతూనే, మరోవైపు ప్రత్యేక మైనారిటీ కమిషన్ ఎందుకు కొనసాగించాలి. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు కావా? ప్రభుత్వాలు తీసుకునే ఇలాంటి చర్యలు ఎట్లా ఉంటాయంటే ఒక దేశంలో మరో దేశాన్ని సృష్టించే ప్రయత్నంలా ఉంటాయి. ఈ రకమైన రాజకీయ ధోరణిని కట్టడి చేయకపోతే భారత్ గజ్వా ఎ హింద్ గా మారుతుందనటంలో సందేహం లేదు.
ఈ దేశంలో విపరీతమైన సాఫ్ట్‌నెస్ ఒక రాజకీయ సిద్ధాంతాన్ని దాటి, అన్ని రాజకీయ రంగాలలోకి ప్రవేశించింది. జరుగుతున్న చరిత్రను చూస్తున్నప్పుడు 1920లలో ఖిలాఫత్ ఉద్యమం సమయంలో భారత నాయకులు చేసిన తప్పు ఇప్పుడు మళ్లీ పునరావృతమవుతోందని స్పష్టంగానే కనిపిస్తున్నది. మరో మాటలో చెప్పాలంటే ఇది ఖిలాఫత్ 2.0 గా చెప్పవచ్చు.
ఆపరేషన్ సింధూర్ తరువాత మనకు అర్థమైన విషయం ఏమిటంటే.. మనకు మిత్రదేశాలు చాలా తక్కువ. మనకు మనమే ఆధారం. మన భారతీయతను కాపాడుకోవడానికి మనకు మనమే సిద్ధం కావాలి. భారతదేశాన్ని మత రహితంగా చేస్తున్నామనే నెరేషన్‌తో.. అన్ని మతాలను హననం చేసి ఒక పెద్ద ఏక మత సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం ఈ దేశంలో జరుగుతున్నది.
‘భారతీయ సంస్కృతి మనది కాదు’ అనే భావనే ఇలాంటి నెట్వర్క్ లకు బీజం వేసింది. ఔరంగజేబ్ తరువాత పుట్టిన ఇస్లాం పునరుజ్జీవ గ్రూపుల నుంచి దేశ విభజన వరకు, ఆ తరువాత ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన శక్తులకు ఆతిథ్యం ఇచ్చిన గ్రూపుల వరకు మనకు ఒక స్పష్టమైన ఏకీకృతమైన ఆలోచనా సరళి కనిపిస్తుంది. ఈ ఆలోచనా సరళిని బ్రేక్ చేయాలి. అందుకోసం మనం మన చరిత్రను చదువుకోవాలి. ప్రస్తుతం ఉన్న చరిత్రతో బేరీజు వేసుకోవాలి. ఇక మనల్ని మనం నశింపజేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. ఇక ‘వాడి పాపాన వాడే పోతాడు.. పైన దేవుడున్నాడు చూసుకుంటాడు’ అనే ధోరణి పోవాలి. ఇందుకోసం ‘కల్లోల భారతం’ అన్న పుస్తకం ఒక ఉపకరణం అవుతుంది. ఈ గ్రంథంలో ఈ దేశంలో జరిగింది ఏమిటో కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటో అవగతమవుతుంది. ఏం జరుగకుండా ఉండాలో అందుకు ఏం చేయాలో ఒక మార్గం తోస్తుంది.
***
రచన: కోవెల సంతోష్ కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 368
వెల: ₹ 275/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్ 9000413413
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత: 9052116463, 7396116463
ఆన్లైన్లో:
https://www.amazon.in/dp/B0FRXNJ63V
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
