Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రెక్కలు విప్పిన ఆనందం

[కన్నడంలో కె.ఎం.శరణ బసవేశ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు కోడీహళ్ళి మురళీమోహన్. ]

మ్మ కట్టిన గూటిలో నోరు తెరిచి,
తిండి కోసం ఎదురు చూస్తున్నాను,
ఎగురుతూ వచ్చి ఆహారం ఇచ్చే అమ్మను
చివ్ మంటూ పిలుస్తున్నాను.

అమ్మ పోషణ ఫలితంగానే,
రెక్కలు బలం పుంజుకున్నాయి,
గూడు దాటి ఎగరాలనే కోరికలు
కలలు మొలకెత్తాయి.

మొదట్లో దూకుతూ గూడు వాకిలికి వచ్చాను,
తర్వాత ఎగురుతూ చెట్టు కొమ్మపై కూర్చున్నాను,
వీచే చల్లని గాలి ఒంటిపై,
ఈకలను నిమిరి శభాష్ అని చెప్పింది.

చెట్టు ఆకులన్నీ తల ఊపి చప్పట్లు కొట్టాయి,
స్వచ్ఛమైన నీలాకాశం స్వేచ్ఛగా
విహరించమని పిలిచింది.
అమ్మ తెచ్చే గుటక ఆహారం సరిపోక,
కడుపు ఆకలితో అల్లాడింది.

గూడు చివర నుండి ఒక్క దూకు దూకాను,
రెక్కలు కొడుతూ గాలిలో తేలుతున్నాను,
కొత్త కొత్త చెట్ల చివర కూర్చునే అవకాశం,
చరచరా దిగి పురుగు పుట్రలను ఏరి తినే ధమాకా.

ముక్కు పైకెత్తి గాలిని చీల్చుకుంటూ
పైకి ఎగరడం నేర్చుకున్నాను,
రెండు రెక్కలు కలిపి నిలువుగా ఉంచి
అలాగే కిందకి దిగడం అలవాటు చేసుకున్నాను.

నా ఆహారం నేనే వెతుక్కొని తినే శక్తి పెరిగింది,
గూడు వదిలి జీవితాన్ని నిర్మించుకునే పట్టుదల,
ముందుకు సాగింది.

రెక్కలు బలపడిన పక్షికి ఆకాశమే
కార్యక్షేత్రం అని మనసు చెప్పింది,
అందరిలాగే ఎగురుతూ పాడుతూ
ముందుకు సాగాలి.

(6వ తరగతి చదువుతున్న ఎం.దినకర్ అనే బాలుడు గీసిన చిత్రానికి కవితా రూపం)

కన్నడ మూలం: కె.ఎం.శరణ బసవేశ
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్

Exit mobile version