Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రెచ్చగొట్టిన పేదరికం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అగతంబిడి ఉదయ్ కైలాష్ గారి ‘రెచ్చగొట్టిన పేదరికం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

బెంజ్ కారు నుండి దిగి, నేను కాపీ తాగడానికి కాఫీ హబ్ లోనికి వెళ్లి, కాఫీ త్రాగాక బేరర్ వచ్చి “సార్ బిల్లు” అని చెప్పగా, సెల్ అలారం మ్రోగింది.

నాకు మెలుకువ వచ్చింది. ఆవలిస్తూ, రెండు చేతులు ఇరువైపులా పైకి ఎత్తి ఒళ్ళు విరుచుకుని (బద్ధకం తీర్చుకుని) నా అర చేతులు ఒకటిగా చేసి మర్ధన చేస్తూ, నా కళ్ళకు నా చేతులను ఆనించి, చేతులను తీసి కళ్ళు తెరిచి చూస్తే మా ఇల్లు. ఏంటి ఇది కలా అని చిన్న వంకర నవ్వు నవ్వాను.

మా ఇంటి దుస్థితి చూస్తే, పగుళ్లొచ్చిన గోడ, చెమ్మ వేసిన నేల, వర్షపు నీరు బొట్టు బొట్టుగా కారుతున్న ఇంటి పైకప్పు, ఆ కారుతున్న క్రింద నేలలో చిన్న ప్లేటు. ఇవన్నీ చూసి నేననుకున్నా, ‘కలలో కాపీ హబ్, కళ్ళు తెరచి చూస్తే శిధిలావస్థకు చేరిన హౌస్ హబ్’. ఓ వెకిలి నవ్వు నవ్వాను.

హాయ్ అండి, నా పేరు రాజేష్. మీకు నా కథ చెబుదామనుకుంటున్నా, నా కథ చెప్పుకునేంత గొప్పవాడ్నికాదు. కానీ, నాకు నేను గొప్ప వాడ్నని అనుకోకపోతే నేనెప్పుడూ గొప్ప వాడినౌతాను? నా కధ కాస్త చిన్నదే, కానీ వివరణ కాస్త పెద్దది.

వెకిలి నవ్వు నవ్వి మంచం నుండి లేచి నేను కప్పుకున్న దుప్పటిని మడతబెట్టి, అరుగు దగ్గరకి వచ్చాను.

అరుగు పైన నానమ్మ కూర్చొనుంది. నానమ్మని చూసి నిశ్శబ్దంగా అరుగు దాటి ఇంటి బయటకు వచ్చి, ఆకాశం వంక చూశాను. సూర్యోదయం అయ్యి చాలా సేపు అయ్యింంది. మేలిమి బంగారంలా, నారింజ పండు వలె ధగధగ, భగభగమని మెరుస్తున్న సూర్యుడ్ని చూస్తూ, నా మనసులో ‘సూర్యా, నీవు ఉదయించినట్లు, నా జీవితంలో కూడా ఉదయం ఎప్పుడొస్తుందో ఏమో’ అనుకున్నాను. పైకెత్తిన తల కాస్త నిటారుగా పెట్టి చూసా, ఎదురుగా అమ్మ తలపై రెండు బిందెలు నీళ్లు మోసుకొని నా దగ్గర వచ్చి “బాబూ బిందె దింపరా” అంది. ఈ రోజు ఆదివారం. అమ్మ పనికి వెళ్ళలేదు. నేను చేతులు పైకిత్తి, బిందెను గట్టిగా పట్టుకొని, బిందె కిందకు దించేటప్పుడు, “బాబూ ఆ నీళ్లు డ్రమ్ములో పొయ్యి” అంది అమ్మ. నేను నీళ్లు పోసాక డ్రమ్ము సగమే నిండింది. అమ్మ మళ్ళీ నీళ్లు తేవడానికి వెళ్ళింది. డ్రమ్ములో నుండి జగ్గు నీళ్లు తీసుకుని, ముఖం కడుక్కుని, దండ మీద ఆరవేసిన తువ్వాలు తీసి తుడుచుకున్నాను. ఇంతలో నానమ్మ ఏడ్చింది.

“ఏమైంది? ఎందుకేడుస్తున్నావు?” అన్నాను.

“ఊ.. రేపో మాపో చచ్చేదాన్ని. ఇప్పడిదాంక మీ అమ్మ టీయే ఇవ్వలేదు” అని ఏడుస్తూ చెప్పింది.

నానమ్మకి చెవులంతగా వినపడవు. ఆమె చెవుల దగ్గర వెళ్లి “నానమ్మా, నీకు షుగర్ కదా అందుకే అమ్మ టీ ఇవ్వలేదు” అన్నాను.

“నాకేమున్నా సరే నాకు టీ తాగితేనే మనస్సు కుదుటపడుతుంది” నానమ్మ అంది.

నేను సర్లేనని వంటగదిలో వెళ్లి పొయ్యి వెలిగించి, దానిపై ఒక పాత్ర పెట్టి దానిలో కాసిన్ని నీళ్లు, టీ పొడి, నానమ్మకి షుగరని కొంచెం పంచదార వేసి రెండు నిమిషాలు పాటుగా టీ మరగబెట్టి ఒక చిన్న గ్లాసులో టీని వడపోసి నానమ్మకిచ్చాను.

నానమ్మది ఏడుపదుల వయస్సు. నానమ్మ టీ కొంచెం తాగి మళ్ళీ ఏడ్చింది. “ఈసారి ఎందుకేడుస్తున్నవ్ నానమ్మా?” అని అన్నాను.

నానమ్మ ఏడుస్తూ, “ఇంత బ్రతుకు బతికి ఇంటెనకాల చావన్నట్టు – ఇంత బతుకు బ్రతుకిన దాన్ని, నాకు చప్పటి టీ ఇస్తారా, ఏం మనింట్లో పంచదార లేదా?” అని అంది.

అది విన్న నేను, “నీకు షుగర్ కదా నానమ్మా, అందుకే టీ లో కొంచెం పంచదార వేసాను” అని చెప్పా.

నానమ్మ “ఏంటి?” అంది.

నానమ్మకి వినపడదు కదా. ఆమె చెవుల దగ్గరకు వెళ్లి, ఇప్పుడు చెప్పిన విషయమే మళ్ళీ చెప్పాను.

నానమ్మ “ఊ.. నాకు బి.పి. ఉన్నా, షుగరున్నా, నేను చప్పటి టీ తాగాను. ఉంటే ఉంటాను, ఊడితే ఊడతాను” అంది.

నాకు చిరాకు వచ్చి, టీ తాగితే తాగని, లేకపోతే లేదని, అరుగు మీద నుండి ఇంటి బయటకొచ్చాను. అప్పుడే అమ్మ ఎదురుగా నీళ్లు మోసుకొని వస్తుంది. నా ఎడమ వైపు నుండి నాన్న వస్తున్నాడు. అరుగు మీద నానమ్మ ఏడుస్తుంది.

నాన్నేమో, “నాన్నమ్మ ఎందుకేడుస్తుందిరా?” అని అన్నాడు. నేను జరిగిన విషయం చెప్పాను. అప్పుడే అమ్మ వచ్చింది.

“ఏమండీ, ఈ బిందెలు కాస్త దించండి” అంది.

నాన్న బిందెలు దించుతున్నప్పుడు, అమ్మ “ఏమండీ? మీ అమ్మేందుకేడుస్తోంది?” అని అడిగింది.

నాన్నేమో, “ఉమ్మేది ఉమ్మైతే, ఊడిపడింది పన్ను” అని చెప్పి, చిరాకుపడి బిందెలు దించేసి వెళ్లిపోయాడు.

మా అమ్మ నా దగ్గర వచ్చి, “ఒరేయ్ నాన్నా, నేనంతా విన్నాను. ఈసారి మీ నానమ్మ టీ అడిగితే షుగర్ కాస్త ఎక్కువ వెయ్యి” అంది.

“అదేంటమ్మా అలా చెయ్యటం తప్పు కదా!” అని అన్నాను.

అమ్మేమో, “ఏం పర్లేదు బాబు. అసలే అప్పుల బాధతో చస్తున్నాం చాలదా, ఇదో ఈవిడ పెద్దరికంతో మనల్ని పీడిస్తూ చంపుతుంది. మీ తాతగారు మన పేదరికాన్ని అర్థం చేసుకుని త్వరగా పోయారు. ఈవిడ మాత్రం చిన్న చిన్న విషయాలకు ఏడుస్తూ, మనల్ని ఏడిపిస్తూ చంపుతోంది. పోనీ ఏడవకుండా ఉండమంటే ఉండదే, ఆవిడ మాటే. పట్టిన పట్టు, ఇంటిపోరు వదలకుంటే ఎలా? అందుకే ఈసారి పంచదార ఎక్కువెయ్యి. ఎలాగో ఆవిడక్కావాల్సిందదే కదా” అని అంది.

“సరే అమ్మా” అని, ఉద్యోగి అయిన స్నేహితుడు విజయ్ ఇంటికెళ్ళాను. వీడికి తక్కువ వయసులోనే ఉద్యోగం వచ్చింది.

“ఏరా విజయ్? ఇంకా బడికెళ్ళలేదా?” అన్నాను.

“ఆఁ< ఇప్పుడే బయలుదేరుతున్నా రా” అనీ, “ఒరేయ్ రాజేష్ నువ్వేం అనుకోకపోతే ఏదైనా షాపులో చేరవచ్చు కదా! బ్రతకడం కోసం ఏ జాబైతేనేమి, అందరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎలా?” అని అన్నాడు.

నేను డిగ్రీ వరకు చదివున్నాను. “అవున్రా నువ్వు చెప్పింది నిజమే కానీ, ప్రయత్నిస్తున్నా!” అన్నాను.

“ఏరా రాజేష్, ఇంకెన్నేళ్ళని ప్రయత్నిస్తావ్. ఒక్క ప్రయత్నమేన, ఫలించేదేమైన ఉందా! రేయ్ నా మాట విని మొదట ఊరు నుండి వెళ్లి ఉద్యోగం చేసుకోరా ప్లీజ్.”

నేనన్నాను “రేయ్ విజయ్, ఎవ్వడు ఊరిలో ఊరకే ఉండడు. ఏదైనా సమస్య కానీ, సంబంధం కానీ ఉంటేనే ఉంటాడు.”

“ఇలాంటి సిల్లీ డైలాగ్స్ చెప్పుకుంటూ ఊరికి ఊరకనే ఉంటున్నావ్ జాగ్రత్త” అని, “సరేరా స్కూల్‌కి వెళ్తాను” అని బైక్ స్టార్ట్ చేసి ఆమడ దూరం వెళ్ళాక, నేను “ఒరేయ్ విజయ్” అని పిలిచాను.

విజయ్ బండి ఆపి, “ఏరా? స్కూల్‌కి టైమవుతుంది. త్వరగా చెప్పు” అన్నా డు.

“ఏమి లేదురా, నువ్వేమనుకోకపోతే నాకు ఐదు వందలుంటే ఇవ్వు, మళ్ళీ ఇచ్చేస్తాను, ప్లీజ్ రా” అని అన్నాను.

వాడు, “నా దగ్గర నిజంగా ఇప్పుడు లేవు. రేపైతే ఇస్తాను” అని చెప్పి, స్కూల్‍కి వెళ్ళిపోయాడు.

ఈ కాలంలో అందరి దగ్గర సెల్‍ఫోన్ ఉంటుంది. నేను రోడ్డుపై నడుచుకుంటూ నా పేంటు జేబు నుండి సెల్ ఫోన్ తీసి, నాకిష్టమైన గొప్ప గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాట వేశాను. సెల్ ఫోన్లో పాట వస్తుంటే దానికి సమానంగా నేను కూడా కొంచెం మెల్లిగా “మేఘాలే తాకింది హాయ్ హైలెస్స”, అని పాడి, ‘మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో ఏమో, వందేళ్ళు బ్రతకకపోయిన కనీసం తొంబైఏళ్ళు బ్రతికినా బాగుండును. ఏం చేస్తాం కలికాలం. అయినా, 80, 90 లలో వచ్చిన పాటలు, ఏం పాటలు ఏం పాటలు, ఏమి రోజులవి. ఆ కాలం మళ్ళీ వస్తే బాగుండును. ఆఁ.. అయినా గతం గతః అన్నట్టు, గడిచిన కాలం గాడిద తన్నినట్టు, కరిగిన సబ్బు మళ్ళీ వస్తుందా? గడిచినా కాలం తిరిగి వస్తుందా?’ అని మనసులో అనుకుంటూ నడుస్తున్నాను. మాకు మరుగు దొడ్డిలేదు. అందుకే చెరువు దగ్గర వెళ్లి, కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వచ్చేసాను.

***

అమ్మ అంట్లు తోముతూ “ఒరేయ్ నాన్నా, చల్దన్నం ఆ కంచంలో పెట్టాను. బ్రష్ చేసి తిను” అంది.

నేను విసుక్కుంటూ అగ్గిబుగ్గయినట్టు, “రోజూ ఈ చల్దన్నమేంటి?” అని దేవుడ్ని అడిగా.

“దేవుడా నాకెప్పుడు కోట్లిస్తావ్? దయ చేసి, ఒక్క కోటి ఇవ్వొచ్చుగా? నీవు కోటి ఇస్తే నీకు కచ్చితంగా లక్ష ఇస్తా ప్లీజ్” అని వేడుకున్నా.

అటుగా మా చెల్లి, తన స్నేహితులు వస్తున్నారు.

“ఏమే వర్షిణీ, ఇప్పటిదాక ఎక్కడున్నావ్? అమ్మ ఒక్కర్తే అంట్లు తోముతోంది. కాస్తా సాయం చేద్దామన్న ఉద్దేశం లేదా?” అంటూ అరిచా.

అమ్మంది “రేయ్ నాన్న దాన్నెందుకు తిడుతున్నావ్? అదేం చేసిందనీ..”

“అది కాదమ్మా. ఇది నీ వల్లే ఇలా తయారౌతుంది” అన్నాను.

చెల్లి కాస్త విసుక్కుంటూ, చిరాకుపడుతూ “నేనెంత చేసినా మీ కంటికి కనిపించదు” అని చెప్పి, ఇంట్లోకి వెళ్లిపోయింది. చెల్లితో వచ్చిన స్నేహితులు “బై వర్షిణి, తర్వాత కలుద్దాం” అని వెళ్లిపోయారు.

నానమ్మ మళ్ళీ ఏడ్చింది. “మళ్ళీ ఏమైంది నానమ్మా?” అని చిరాకు పడుతూ అడిగాను.

నానమ్మ ఏడుస్తూ, “ఇంత యేలయ్యింది. ఈ ఏళ దాంక ఏ ముసలిదైన తినకుండా ఉంటదా? ఎందుకు నాకీ బ్రతుకు, నాకు చావైనా రాదు. ఇంత పెద్దమనిషిని ఇబ్బందెడతారా, ఇదేమైనా న్యాయమా బాబూ. నేను సంపాదించిన భూమి, బుట్రా లేదా? ఒకప్పుడు నేను మహారాణిలా బ్రతికాను. కానీ, చచ్చేటప్పుడు మాత్రం నాకింత ఇబ్బంది” అంది.

ఈ రోజుల్లో పూరి గుడిసెలోనైనా టీవీ ఉంటుంది. అప్పుడే మా ఇంట్లో టీవీ వేసి వుంది. భక్తి టివిలో ధర్మసందేహలు కార్యక్రమంలో గురువు గారు, ఇలా అన్నారు. “ఒకప్పుడు ఎలా బ్రతికమన్నది ఉద్దేశం కాదు. ఇప్పుడేలా ఉన్నాం, చివరికి ఎలా చస్తామన్నదే సందేశం”.

ఆ మాట మా నానమ్మకి వినబడలేదు, ఏడుపు ఆపలేదు. నాకు నవ్వొస్తోంది. నేను ‘సర్లే రోజు ఇదే నస, ఇదే చింత’ అనుకుని, బ్రష్ మీద పేస్ట్ వేసి టంక్లీనర్ తీసుకొని, ఇంటి ముందు కుళాయి దగ్గర చిన్న మురుగు

కాల్వ వుంది. అక్కడ బ్రష్ చెయ్యడానికొచ్చాను. మా ఇంటి ముందు ఒక పెంకుటిల్లు ఉంది. మా ఇంటికి, మా ఎదురింటి పెంకుటిల్లుకీ మధ్యన మురుగు కాల్వ వుంది. అక్కడ నేను నిలబడి బ్రష్ చేస్తున్నాను. మా ఇంటి కుడివైపున ఒక మేడ ఇల్లు. దాని వెనకాల మరో మేడిల్లు, అ ఇంట్లో వసుధ అనే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. తనంటే ఆకర్షణో, ప్రేమో, కామమో తెలీదు. నేను, ఆమెతో తక్కువగా మాట్లాడుతాను. ఆమెతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబుదామంటే నా ఇంటి పరిస్థితి గుర్తొస్తుంటుంది. నేను నా ప్రేమ సంగతి చెప్పాక, ఆమె అంగీకరిస్తుందేమో నాకు తెలీదు కానీ, ఆమె సరే అంటే శిధిలావస్థకు చేరిన నా ఇంట్లో, ఆమెతో ఎలా కాపురం చెయ్యాలనీ, పోనీ ఇల్లు కూల్చేసి వేరే ఇల్లు నిర్మిద్దామన్నా డబ్బు లేదు. ఒక ఉద్యోగం లేదు. నచ్చినది పొందక, నచ్చినట్లు పొందుకోలేక, చావకా, బ్రతకకా, ‘గాడిద పాలుకి గతి లేదు, గన్నేరు పాలుకి గతి లేద’న్నట్టు ఇలా సాగుతుంది నా జీవితం. ఇది నా దుస్థితి, పరిస్థితి.

ఇన్ని సంశయాలతో సతమతమౌతూ, బ్రష్ చేస్తూ, మేడింటి వైపు చూస్తున్నాను. అప్పుడే వంట గదిలో అమ్మ, చెల్లి మాట్లాడుకుంటుంటే నాకు మెల్లిగా వినిపిస్తుంది.

“అమ్మా, బంగాళాదుంప ప్రై చెయ్యమ్మా ప్లీజ్” చెల్లంది.

అమ్మెమో “లేదమ్మా నాన్నకి, నానమ్మకి కాళ్ళు నొప్పులు కదా ఈ పూటకి వట్టి చారు చేద్దాం” అంది.

ఈ మాట అరుగు మీద కూర్చొన్న నానమ్మకెలా వినపడిందో ఏమో, విసుగుతూ, “ఏంటీ! వట్టి చారు చేస్తావా?” అని మళ్ళీ ఏడుస్తూ, “ఇంత బ్రతుకు బ్రతికి వట్టి చారు తినాలా?, నేనింత ఆస్తి సంపాదించి చివరికి వట్టి చారుతో తింటున్నానే దేవుడా..” అని ఏడుస్తూ అంటుంటే, బ్రష్ చేసి ముఖం కడుక్కుని అమ్మ దగ్గర వెళ్ళాను.

అమ్మేమో నానమ్మ గురించి కాస్తా నెమ్మదిగా ఇలా అంటోంది – “ఓ పెద్ద ఆస్తి. ఈమె సంపాదించింది ఆస్తి మూరేడు, ఈమె రాగాలేమో బారెడు”.

“అత్తయ్య ఇంట్లో కూరగాయల్లేవు ఒక్క బంగాళాదుంపలు మాత్రమే ఉన్నాయి. మీకు కీళ్ళనొప్పులు కదా! అందుకే వట్టి చారు చేస్తానంటున్నాను” అంది.

“నాకు కీళ్ళనొప్పు లైతే మాత్రం వట్టిచారు చేస్తావా? ఏం వేరే కూర కొనుకొచ్చి వంట చేయలేవా? నా ఆస్తి ఎంత, నేనెంత? ఇంతటి నేను వట్టి చారు తినాలంట, వట్టి చారు..” అంది నానమ్మ.

“మనిషి నీర్సమైనా, మాటలు మాత్రం పౌరుషం.”

ఈ మాటలింటుంటే నాకు చిరాకొచ్చి వంటగది నుండి లేచి ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికిటీవీ గదిలోనున్న ప్లగ్ బోర్డు దగ్గరెళ్లాను. మా నాన్న ముందే ఛార్జింగ్ పెట్టుకున్నాడు.

విషయమేమిటంటే, నా ఫోన్‍కీ, మా నాన్న ఫోన్‌కీ ఒకటే చార్జర్, అది నా ఛార్జరే. నాన్న ఫోన్ 69% ఎక్కి వుంది. నా ఫోన్‌కి 42% వుంది. ఇలా ఫోన్ ఛార్జర్ తీస్తున్నానో లేదో ఇంతలో మా నాన్న కోపంగా “ఏరా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వున్నానుగా ఎందుకు తీస్తున్నావ్?” అంటూ అరిచాడు.

“ఇది నా చార్జర్ నా ఇష్టం. రోజు తాగుడికి, సిగరెట్లకీ ఖర్చేడతావ్, ఏం ఒక ఛార్జర్ కొనుక్కోలేవా?” అని అన్నాను.

నాన్నేమో, “ఏరా నన్నే ఎదురించి మాట్లాడతా?” అని లెంప మీద ఒకటిచ్చాడు.

నేను ఏడవలేదు. కోపంతో, “పిల్లల్ని పోషించడం తెలీదు కానీ, కొట్టడం మాత్రం వచ్చు” అన్నా.

నాన్నేమో నన్ను, “ఒంటి మీద ఇంత వయసొచ్చి ఒక ఉద్యోగం సంపాదించుకోలేవ్, నువ్వు నాకు చెబుతావా?” అన్నాడు.

నేను మాటకి మాట, తూటకి తూటన్నట్టు, “నాకంటే నీదింకా పెద్ద వయసు, నువ్వూ పది వరకు చదివావు కదా. మరి నువ్వెందుకు సంపాదించలేదు ఉద్యోగం? నువ్వు నాకు చెబుతావు” అంటూ కోపంతో మరో మాట మాట్లాడకుండా ఇంటి నుండి బయటకొచ్చి, నా రెండో స్నేహితుడు జీవన్ ఇంటికెళ్ళాను. వాళ్ళమ్మ నడిగితే డ్యూటీకెళ్ళి పోయాడంది. జీవన్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు, ఒక్క నేను తప్ప. ఏ జన్మలో ఏం పాపం చేసానో ఏమోననీ నాలో నేను, నాతో నేను నిందించుకుని, నాక్కూడా మంచి రోజుల్లోస్తాయని నిశ్చయంగా, నిర్భయంగా ఒక్కడినే ఊరు చివర్న మా మాగాణి గరువు దగ్గరకొచ్చాను. గరువు చుట్టు పక్కల్లో ఎవ్వర్లేరు. గరువు మధ్యగట్టులో చెప్పులు పక్కన విడిచి కూర్చొని, పేంటు జేబు నుండి ఫోన్ తీసి, ‘ఎన్నాళ్ళని ఖాళీగా వుంటాననీ, నన్ను నేను నిందించుకునీ, ఎవరికైనా ఉద్యోగం చూడమ’ని ఫోన్ చేద్దామనుకున్నా. నలుగురు మిత్రులకు ఫోన్ చేశా, అందరూ చూస్తానన్నారు. ఆ క్షణాన నాకెందుకు దేవుడా ఈ జీవితం అనుకున్నా.

‘నాకు ఇవ్వవచ్చుగా ఉద్యోగం’ అని దేవుడ్ని నిందించాను. నాకుద్యోగం దొరకక, నచ్చిన కొడుకు కాలేక, ఒక భర్త కాలేక, ఏ పని చెయ్యక, ఎందుకీ జీవితమని, నాలో నేను దుఃఖంలో కుమిలిపోతున్నాను. కానీ, చిన్న ఆశ నేనెప్పటికైనా గొప్పవాడినౌతానని. అప్పుడే వసుధ గుర్తొచ్చింది. ఆమె కోసం ఒక కవిత రాద్దామని అలోచించి ఫోన్లో నోట్ అనే యాప్ ఓపెన్ చేసి ఇలా రాసుకున్నా.

♥ “నిన్ను చూసాక ఆ క్షణం ఆకాశంలో
అంబికా దర్బార్ బత్తిలా పొగలు.
నా గుండె గుడిలో నీ జడలో ఊగుతున్నా
జడగంటలు.
నీ కోసమే నింగి నుండి పూల వర్షం కురిసినట్టు,
నా మదిలో నీ ముచ్చట్లు.
కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రేమన్నదీ
ఒకటే, దానికి మరణం లేనట్లు.”♥

అని రాసి ‘శబ్బాష్ రా రాజేష్’ అని నా కుడిచేతితో, నా ఎడమ భుజాన్ని తట్టాను. అవునిప్పుడీ కవిత సెండ్ చెయ్యాలా? సెండ్ చేశాక ఆమె నిరాకరిస్తే? ఒకవేళ అంగీకరిస్తే? మళ్ళీ నాలో ఆలోచన మొదలైంది.

ఆలోచిస్తే ఆశాభంగం, ఆలోచించకపోయినా భంగమేననీ, సంశయంలో పడిపోయాను. సమయం పన్నెండయ్యింది.

నాన్న ఫోన్ నుండి కాల్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేసా. ఫోన్‍లో చెల్లి మాట్లాడుతుంది.

“అన్నయ్య ఎక్కడున్నావ్? అన్నం తినడానికి రమ్మని అమ్మచెప్పింది” అని చెప్పి ఫోన్ కట్ చేసింది.

నేనున్న ప్రదేశం నుండి లేచి, ఇంటికెళ్లి, కాళ్ళు చేతులు, ముఖం సబ్బుతో కడుక్కుని, దండం మీద ఆరేసిన తువ్వాలు తీసి తుడుచుకొని, ఇంటిలోనికెళ్ళి, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. నానమ్మ కుర్చీలో కూర్చొని అన్నం తింటోంది.

నేను చాపేసుకుని కింద కూర్చొన్నా. నాకు క్రింద కూర్చొని తినటం అలవాటు. అమ్మ నాకు అన్నం తెచ్చిచ్చి వంటగదిలో కెళ్ళింది. కంచంలో, అన్నం వట్టి చారు తప్ప ఏమి లేదు. “అమ్మా! వేరే కూర లేదా?” అని గట్టిగానే అడిగాను.

వంట గదినుండే అమ్మ, “వేరే కూర లేదు బాబూ” అంది.

“మరి నానమ్మ కూరతో తింటోంది?” అన్నాను.

“అది ఎదిరింటోళ్ళు ఇచ్చార్రా” అని అంది అమ్మ.

నాకు వట్టి చారంటే, అస్సలిష్టం లేదు. కానీ తప్పదు, ఆకలి. ‘నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు’. సర్లేనని నచ్చి నచ్చక తినేసి, చెయ్యి కడుక్కుని, కుర్చీలో కూర్చున్నా. కరెంటు పోయింది, అప్పుడే వర్షం వచ్చింది. ఆ వర్షం జోరుగా పడుతోంది. ఆ వర్షపు శబ్దానికి నిద్ర కమ్ముకు వస్తోంది. లేచి పడగదికెళ్లి మంచం మీద పడుకున్నా, పడుకున్న నాకు, నా కుడి కాలి వైపు ఒకటిన్నర అడుగు దూరనా వర్షపు నీరు, పైకప్పు నుండి కారి, కిందకి తుళ్ళి, నా కాళ్లకు చల్లగా తాకుతుంది. నాకు మెలకువ వచ్చింది. ఏమిటబ్బా అని చూస్తే వర్షపు నీరు. నేను మంచం నుండి లేవకుండా చిరాకుతో, “అమ్మా, నాన్నకు చెప్పు రేపైనా పైకప్పు బాగుచెయ్యమని” అన్నాను.

అమ్మ వచ్చి ఏమి మాట్లాడకుండా, ఆ కారుతున్న స్థలంలో చిన్న ప్లేట్ పెట్టి వెళ్లిపోయింది. అయినా మళ్ళీ అలాగే అ వర్షపు చినుకు నా కాళ్లకు చిలుకుతుంది. నా కాళ్ళను మంచానికి ఎడమ వైపు జరిపి మంచం నుండి లేవకుండానే, మళ్ళీ చిరాకుపడుతూ “అమ్మా మళ్ళీ తుళ్ళుతుందే” అని అరిచాను. ఈసారి అమ్మ రాలేదు.

చెల్లి ఒక బకెట్టు తీసుకొచ్చింది. కారుతున్న స్థలంలో అమ్మ పెట్టిన కంచంలో సగం నీళ్లున్నాయి. అ నీళ్లని చెల్లి బకెట్టులో పోసి, మళ్ళీ కారుతున్న స్థలంలో బకెట్ పెట్టి, అక్కడే నిలబడి పైకప్పు నుండి వర్షపు ధార వస్తుంటే రెండు చేతులతో, అ వర్షపు ధారపై చేతులు పైకి కిందకి, పైకి కిందకి చేస్తూ ఇదో సమస్య కాదన్నట్టు ఆడుకుంటుంది. ఇదంతా మంచం మీద నుంచి నేను చూస్తున్నాను.

ఈ సమస్య నాకొకటి అర్థమయ్యేలా చేసింది. మా చెల్లి సంతోషంగా సమస్యతో ఆడుకుంటుంటే నేను మాత్రం కోప్పడి మంచం నుండి అలానే ఉండిపోయి, మా నాన్నను దూషించడం, అమ్మని శ్రమ పెట్టడం, నేను ఏమి ప్రయత్నించకపోవడం, ఏమైనంటే నాన్నదే తప్పని, దీనిక్కారణం పేదరికమని నన్నేను నిందించుకోవడం.

ఆ క్షణాన ఒక్కటనిపించింది. ఏదైనా చెయ్యాలనుకుంటే, ఆచరించాలి. ఇది చేస్తా, అది చేస్తా, ఇదైతేనే చేస్తా, ఇలా వుంటేనే చేస్తాననుకుంటే అనుకుంటావ్ తప్పితే అనుకున్నది సాధించలేవనీ, మనసులో అనుకుంటున్నాను.

చెల్లి ఆడుకోవడం ఆపి, ఛార్జింగ్ పెట్టిన నా ఫోన్ తీసుకుని ఏదో వీడియోస్ చూస్తుంది. “ఫోన్ ఉంచేయ్” అని చెల్లితో అన్నాను. చెల్లి ఏమి పట్టించుకోలేదు. నేను సర్లేనని వదిలేశా.

శయనించాను. నిద్ర రావడం లేదు. కన్నులు మూసుకుని వున్నా, వర్షం తగ్గింది. నేను లేచి, బకెట్ దగ్గరకెళ్లి చూస్తే వర్షం నీళ్లు కాస్తా పసుపురంగులో వుంది. ఆ బక్కెట్టు పట్టుకొని అరుగు దగ్గరకి వచ్చా, నా చెప్పులలో వర్షం నీరు నిండి వుంది. అ చెప్పు లేసుకుని కాలువ దగ్గర బకెట్లో ఉన్నా నీళ్లు పారబోసాను. ఇంతలో ఇంటి పైకప్పు పెంకొకటి కింద పడింది. కానీ పగల్లేదు. నేను బకెట్ పక్కనెట్టి పెంకు తీసి మళ్ళీ ఆ పెంకు ఎక్కడ వుందో అక్కడే పెట్టేసా.

మళ్ళీ దేవుణ్ణి నిందించాను. రోజుకొక్కసారైనా నిందించడం మానను. ఎందుకో తెలీదు. నా వయసు పెరిగి, ఆయుష్షు తరుగుతుంది కానీ, నా పేదరికం మాత్రం తరగటం లేదు. ఇంటిలోని కెళ్లాను, చెల్లి అమ్మ ఒక్కదగ్గర కూర్చొని ఏదో వీడియోస్ చూస్తున్నారు. పెంకు పడిన విషయం వాళ్ళకు తెలీదు. నాన్న పొద్దున వెళతాడు, ఆరైతే వస్తాడు. నానమ్మ వర్షం పడితే వేరే ఇంటికెళ్లిపోతుంది. ఎందుకంటే ఇల్లు పాతది, ఇల్లు పడిపోతుందేమోనని భయం. కానీ మేమేక్కడకి వెళ్లలేం. నాకంటూ ఏ ఆశయం లేదు. ఇల్లొక్కటి కట్టుకోవాలి, మా పేదరికాన్ని జయించాలి. అంతే ఇంకేం లేదు. సమయం పావు తక్కువ ఆరవ్వింది.

నాన్న వచ్చాడు. ప్రతి రోజు తాగి వస్తాడు. కానీ మరంతా గొడవ చెయ్యడు. కానీ, నాకనిపిస్తువుంటుంది – ‘తాగడానికి నీళ్లు ల్లేవు కానీ, పుక్కిలించడానికి పన్నీర’న్నట్టు నాన్న తాగుడికి డబ్బు ఎలా వస్తుందో ఏమో, ఇంతలో కరెంటొచ్చింది. నాన్న కాళ్ళు కడుక్కుని ఇంటిలోని కొచ్చాడు.

జేబులో నుండి నాన్న ఫోన్ తీసి, “అమ్మా వర్షిణి, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు” అన్నాడు.

సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్టు, నాకు చాలా చిరాకనిపించింది. నా చార్జర్ ఇవ్వను. నువ్వింకోటి కొనుక్కో అని అందామనుకున్నా కానీ, తాగున్నాడు కదా గొడవ చేస్తాడని అనడం ఆపేసా.

చెల్లొచ్చి నాన్న ఫోన్ తీసుకొని, ఛార్జింగ్ పెట్టి, టీవీ పెట్టింది. అమ్మేమో వంట చెయ్యటం మొదలెట్టింది. నేను పడగ్గదిలో ఉన్నాను, చెల్లి, నానమ్మ హాలులో చిన్న మంచం మీద ఉన్నారు. దానికెదురుగా డబ్బా టీవీ, నాన్న కుర్చీ తీసుకొని వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు. “వార్తలు వెయ్యమ్మా” అని చెల్లికి చెప్పాడు. చెల్లెమ్మో “నేను సీరియల్ తప్ప వేరేదేమి వెయ్యను” అంది. నాన్నకి చెల్లి ఇష్టం. చెల్లిని ఒక్క మాట కూడా ఏమనడు. కొంతసేపయ్యాక, ఇంతలోనే నానమ్మ మళ్ళీ ఏడవడం మొదలెట్టింది.

మంచం మీద ఒరిగి ఫోన్ చూస్తున్న నేను లేచి వచ్చాను. చెల్లేమో నానమ్మతో “ఎందుకేడుస్తున్నావ్?” అంటోంది.

నానమ్మ ఏడుస్తూ, “టైమ్ ఏడున్నర, ఈవేళ దాకా నోటికి ముద్ద లేదు, ఇలాగైతే నా ఆరోగ్యం ఎలా బాగుంటుంది. నేను చచ్చిపోవాలనే మీ అమ్మ, నాకింత ఇబ్బంది చేస్తుంది” అంది.

నాన్న, చెల్లి, నానమ్మని ఏమి అనలేదు. అమ్మ ఏమో ఎప్పుడుండేదే కదానీ, వంటగది నుండి రాలేదు. నాకు కొట్టేంత కోపం వచ్చింది. కానీ, కొట్టలేను. తన కర్మ, తానే పోతుందని ఊరుకున్నా. కానీ, నానమ్మ ఏడుపు ఆపలేదు. ఇంతలో అమ్మ ఏమో “వంటయ్యింది”, అని అంది. అందరు చేతులు కడుక్కుని కూర్చున్నాం. అమ్మ అన్నం వడ్డించి ఇచ్చింది. తాను మేము తిన్నాక తింటుంది. మా అమ్మ చాలీ చాలని అన్నం తింటుంది. అలాని పస్తులుండటం లేదు. నాకు ఇదో ఇబ్బందైతే, మా నాన్న రోజు తాగేసి, అన్నం మాత్రం కొంచెం తింటాడు. మిగతా సగమన్నం వృథా చేస్తాడు. కొన్నిసార్లు అమ్మ ఆ మిగిల్చిన అన్నాన్ని తింటుంది, కొన్ని సార్లు తినదు. నేను కోపంతో “అమ్మా! నాన్న అన్నం వృథా చేస్తాడు. అన్నం కొంచమే వడ్డించు” అని నేనెన్నిసార్లు చెప్పిన వినదు, ఎందుకో ఏమో. మేం తినేసాం, ఇవాళ కూడా నాన్న అన్నం మిగిలించాడు. అమ్మ, నాన్న మిగిల్చిన అన్నం తినలేదు. వేరే అన్నం తింది. అమ్మ, చెల్లి, నానమ్మ TV ఉన్న గదిలో, నేను, నాన్న పడక గదిలో పడుకుంటాం. నాన్న పక్కన పడుకోవడం నాకిష్టం లేదు. కానీ తప్పదు. శయనించాను.

నిద్రపట్టదు. మళ్ళీ ఆలోచన మొదలైంది. మా కుటుంబం గురించి ఇలా అనుకుంటున్నా.. ‘మేం ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నామో నానమ్మకు తెలిసి ఇట్లా ప్రవర్తిస్తుందా? తెలీక ప్రవర్తిస్తుందా? అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మా పరిస్థితిని అర్థం చేసుకొని నానమ్మ, బ్రతికి చెడిన నాన్న, పై చదువులు చదవలేని చెల్లి, డిగ్రీ దాకా చదివి, నచ్చిన ఉద్యోగం దొరికితే కానీ చెయ్యని నేను. ఇంతమంది భారాన్ని మోస్తూ ఇలాంటి కుటుంబాన్ని ఏ కూలోనాలో చేస్తూ బ్రతికిస్తున్నది అమ్మ. 🙏. ఇలా నన్ను రెచ్చగొడుతున్న సమస్యలు. పేదరికం కూడా అనవచ్చు.’ ఇలా మనస్సులో అనుకుంటూ నిద్రపోయాను.

***

సెల్ అలారం మ్రోగింది. మెలుకువ వచ్చింది. ఎప్పటిలాగే కళ్ళకు చేతులు ఆనించి, కళ్ళు తెరిచి చూశా.

నేనొక్కడినే ఉన్నా. ఆవలిస్తూ కప్పుకున్న చిన్న దుప్పటిని మడతబెట్టి, ఇంటి బయటవచ్చాను. అమ్మ అంట్లు తోముతుంది, నాన్న లేడు. చెల్లి బట్టలుతుకుతుంది. నానమ్మ అరుగు మీద కూర్చొనుంది. మళ్ళీ టీ ఇవ్వలేదని ఏడుస్తుందేమోనని విసుగు చెందాను. కానీ నానమ్మ కాళ్ళ దగ్గర టీ గ్లాస్ ఖాళీగా ఉంది. టీ తాగేసిందనుకునీ, హమ్మయ్య అనుకున్నా. ఎడారిలో నీళ్లు దొరికితే ఎంత ఆనందమో, నాకు నానమ్మ ఏడవకుంటే అంతే ఆనందం. ఆకాశం వైపు చూశా మబ్బు లేసి, మేఘాలు సూర్యుడ్ని కప్పివేసి అంతా పలుచటి వెలుతురుగా వుంది. వర్షం వచ్చేలా అనిపిస్తోంది. ముందు జాగ్రత్తగా గొడుగు తీసుకొని చెరువు గట్టు దగ్గర కాలకృత్యాలు తీర్చుకుని, ఇంటికి వచ్చేసాను. కానీ, వర్షం పడలేదు. ఇంటి బయట నిల్చొని చెల్లిని బ్రష్ ఇమ్మని పిలిచాను, చెల్లి రాలేదు. రెండవసారి కోపంతో “వర్షిణి బ్రష్ ఇమ్మంటుంటే వినిపిస్తుందా లేదా?” అని అరిచాను. చెల్లి కూడా విసుక్కుంటూ బ్రష్ ఇచ్చి పేస్ట్ లేదని చెప్పి లోనికెళ్లిపోయింది.

“అమ్మా డబ్బులివ్వు పేస్ట్ కొని తెస్తాను” అన్నాను.

అమ్మేమో “నా దగ్గర డబ్బుల్లేవ్ నాన్నకు తెమ్మని చెబుతాలే” అంది.

నేనిప్పుడు ఎలా బ్రష్ చెయ్యలన్నాను. అమ్మొచ్చి, పూర్తిగా అయిపోయి చెక్కలా ఉన్నా పేస్ట్ డొక్కుని తీసుకొని, దాన్ని బాగా పిండగా, కొంచెం పేస్టు, రంద్రం నుండి బయటకొచ్చింది. ఆ కాస్తా పేస్టుని నా బ్రష్‌కి వేసి “ఈరోజికి సర్దుకోరా, నాన్నకు తెమ్మని చెప్పానులే” అంది అమ్మ.

నాకనిపించింది, ‘ఏమి ఖర్మ రా దేవుడా’ అని. ఎలాగొలా పళ్ళు తోమేసుకుని, ముఖం కడుక్కుని ఇంటిలోనికెళ్ళాను. అమ్మేమో ఓ చిన్న గిన్నెలో వేడివేడిగా నూకల గంజి తెచ్చి ఇచ్చింది. నాకేమో గంజంటే ఇష్టం లేదు. కానీ తప్పదు. ఏదోలా తాగేసా. ‘ఎన్నాళ్ళని ఇలా?’ అనుకున్నా. సెల్ ఫోన్ తీసుకొని, మా ప్రెండ్స్‌కి ఉద్యోగం కోసం మళ్ళీ ఫోన్ చేశా. అందరూ దొరకటం లేదురా, చూస్తాలేరా అని చెబుతున్నారు. నాకు చాలా చిరాకు వేసింది. నాకే ఎందుకిలా జరుగుతుంది. ఇలా కొన్ని నెలలు గడిచాయి.

తేదీలు మారుతున్నా యి, వారాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి.. కానీ, నా దుస్థితి, నా బ్రతుకు మారటం లేదు. ఇంకా లాభం లేదని, ఏదొక ఉద్యోగం చేసుకుందామని నిశ్చయించుకున్నా. ఇలానే ఉంటే నూతిలో కప్పలాగా, ఊరికి ఊరకే ఉండిపోతానేమోనని భయమేసింది.. ఏదైతేనేం సిటీకెళ్ళా ను.. నాకు తెలిసిన నా స్నేహితుడికి ఫోన్ చేశాను. తానొచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు.. తనో ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.. నేను వీడికి నా గోడు అంతా చెప్పి, కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను, ఉద్యోగం దొరికాక వెళ్తానన్నాను. అతను పర్లేదు నీకు నచ్చినన్ని రోజులుండన్నాడు. రాత్రి పడుకొని తెల్లారక లేచి కాలకృత్యాలు తీర్చుకుని, నీట్‍గా తయారవ్వి ఉద్యోగ వేటకు వెళ్ళాను. రోజంతా తిరిగి తిరిగి, ఎన్నో చోట్ల అడిగాను. కానీ, ఖాళీ లేవు, ఈ ఉద్యో గానికి నీవర్హుడు కావని చెప్పడం. ప్రతి రోజు, ప్రతి ఒక్కడు ఇదే మాట, నేను సిటీకొచ్చి ఎనిమిది రోజులవ్వింది.

కానీ, ఉద్యోగం దొరకలేదు. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏమోనని ఆ రాత్రి పడుకున్న నాలో, మదిలో ఆవేదనతో నా జీవిత కవిత పుట్టుకొచ్చింది.

“బ్రతుకు బరువు, మెతుకు కరువు.
పగిలిన గోడలు, మాసిన నేలలు.
చీకటి జీవితం, చేరని జీతం.
ఆగని ఆంక్షలు, అందని ఆశలు.
అలసిన మనషులు, అడగంటిన ఆశయాలు.
ఎటు నా ఆగమనం, ఎందుకీ నాటకీయం,
ఎందుకీ భవసాగరం.”

అని కన్నుల నుండి కన్నీళ్లు జారుతూన్నాయి. నా కణతలు దాటి కన్నీరు చొక్కాకు చేరింది. భుజాలకు తడిగా అనిపించింది. లేచి చూస్తే చొక్కాకి కన్నీళ్ల అభిషేకం అయ్యింది.. చొక్కా విప్పేసి పడుకున్నా, తెల్లారింది.. నా స్నేహితుడు డ్యూటీకీ బయలుదేరాడు. నేను లేచి పళ్ళు తోముకుని, స్నానం చేసి, తయారయ్యాను. టిఫినేమో హోటల్ నుండి తెచ్చినదేమో ఇడ్లీ ఉంది. అ ఇడ్లీ ప్లేట్లో తీసుకొని తినాలనుకున్నా కానీ, తినాలని అనిపించలేదు. తినకుండా ప్లేట్ పక్కన పెట్టి, అ ప్లేట్ పై మరో ప్లేట్ పెట్టి, చెయ్యి కడుకుని, రూమ్ తాళాలు వేసి, బాత్రూమ్ లోన సబ్బు డొక్కు దగ్గర తాళాలు పెట్టి, ఉద్యోగం వెతుకులాటకు ఆకలి కడుపుతో బయలుదేరాను. అన్ని ఆఫీసుల్లో మళ్ళీ అందరూ అదే మాట, ఖాళీల్లేవ్ ఖాళీల్లేవ్, తప్ప వేరే పదం వినపడటం లేదు. ఒకతను మాత్రం “ఆఫీస్‍లో ఉద్యోగం లేదు కానీ, మా ఇంటికి వాచ్‍మన్‌గా ఉద్యోగం ఉంది చేస్తావా?” అన్నాడు.

ఆ క్షణం అలసిన పేగు, అరిగిన కాళ్ళు, అలసిన మనిషి. ఇది నా పరిస్థితి. ఇక తప్పక, మనసొప్పక, ఒప్పుకున్నాను. “నెలకు 10వేలు జీతం. రేపు రా ఉద్యోగంలో చేరడానికి” అన్నాడు.

నేను మరో మాట అనకుండా లేచి, బయటకొచ్చి, ఆటో ఎక్కి రూమ్‍కి వచ్చేసాను.

ఆ మరునాడు ఉద్యోగంలో చేరాను. ఇప్పుడీ ఉద్యోగం నచ్చో నచ్చకో చేస్తున్నాను. నేను ఇవైతే చేస్తా, ఇదైతేనే చేస్తానని అనుకుంటుంటే, ఊర్లో ఊరకే అనుకుంటూ ఉండేవాడినేమో, ఇవన్నీ నన్ను రెచ్చగొట్టి నన్నిక్కడ దాక తీసుకొచ్చింది. ఒక్కటి మాత్రం వాస్తవం. మనకు మనమే, మన కోసం ఎవ్వరు ఏమి చెయ్యరు. మన ప్రయత్నం మనదే, కానీ నేనీ ఉద్యోగంతో ఆగను, మళ్ళీ నా ప్రయత్నం, నా ప్రయాణం కొనసాగుతుంది.

ఇదండీ నా కథ. కాస్తా పొడవుగా ఉంది కదా, ఇంత వరకు ఓపిక పడి చదివినందుకు, మీ అందరికి ధన్యవాదములు.

స్వస్తి 🙏🙏🙏

Exit mobile version