[డా. కొప్పరపు నారాయణ మూర్తి గారు రచించిన ‘రాయల సామ్రాజ్యం – నాటి వైభోగంపై జి.వి.పూర్ణచందు సారించిన కొత్త వెలుగులు!’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
వారలలో దిప్పాంబ కుమారుడు పరిపంథికంథిమంథాచలమై/ వీరనారసింహరాయుడు వారా శివరీత భూమివలయం బేలన్/వీర శ్రీనరసింహశౌరి పిదపన్విశ్వక్షమా మండలీ/ధారంధర్యమునన్ జనంబు ముదమంద నాగమాంబాసుతం/డారూఢోన్నతి గృష్ణరాయడు విభుండై రాజ్యసింహాసనం/బారోహించే విరోధులున్గహన శైలారోహముం జేయగన్// — అన్న ఈ పద్యము పారిజాతాపహరణ కావ్యంలో తిమ్మనామాత్యుడు రాయలవారి జననాన్ని వివరిస్తూ రాసింది. నరసింహరాయలకు, నాగమాంబకు రాయలవారు జన్మించారన్నది దీని భావం. రాయలవారి తల్లి గండికోట పాలకుడు పెమ్మసాని నాయకుల ఆడపడుచు. విజయనగర ప్రభువులైన 16వ వీర నరసింహరాయలకు ముగ్గురు భార్యలు. తిప్పాంబ, నాగులాంబ, ఓబాంబ. వీరిలో తిప్పాంబకు వీరనరసింహరాయలు, నాగులాంబకు కృష్ణదేవరాయలు, ఓబాంబాకు రంగదేవరాయలు, అచ్యుతదేవరాయలు కలిగారని పై పద్యం భావన.
ఇక రాయలవారింటి పేరుకు వస్తే, అల్లసాని పెద్దన్న రాసినది ఇది: ‘సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి /సింహాద్రి జయశిల చేర్చు నాడు, సెలగోలు సింహంబు చేరి ధికృతి గంచు/ తల్పుల కరుల ఢీ కొల్పునాడు..’ — దీనిని బట్టి రాయల వారి ఇంటిపేరు సంపెట వారు. సెలగోలు సింహం అని అనటం ద్వారా రాయలవారి స్వగ్రామం సెలెగోలు అని రూఢి అవుతుంది. సంపెటవారు తెలుగు వారనటం వివాదరహితమే. అయితే, సమ్మెట ఇంటిపేరు క్షత్రియ, వైశ్య, వెలమ, కమ్మ ఇతర కులాల్లో కూడ కనిపిస్తుంది. సమ్మెట, సంబెట అనేవి నామాంతరాలు.
ఇటువంటి విస్తుగొలిపే విషయాలన్నీ జి వి పూర్ణచందు ఇటీవల రాసి, విడుదల చేసిన చారిత్రక పుస్తకం ‘భువనవిజయం-రాయలనాటి కథలు, గాథలు’ (2025) లో వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతి సమితి, విజయవాడవారు ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇది చాలా అరుదైన విషయం.
ఇంతకుముందు కూడా రాయల జీవితంపై అనేక కథాకథనాలు వచ్చాయి. వాటిలో వాడ్రేవు సుందరరావు రాసిన ‘కృష్ణదేవరాయలు-జీవిత చరిత్ర’ ఒకటి. ఇది కల్పన, కొంత వాస్తవం కలగా పులగంగా ఉంటుంది. ఆ పుస్తకాన్నీ, పూర్ణచందు పుస్తకాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే, పూర్ణచందు రాసిన పుస్తకం అనేక ప్రామాణిక అంశాలను పరిగణలోకి తీసుకొందన్నది స్పష్టం. అటు సంస్కృతంలోనూ, ఇటు భాషావేత్తగా కొంత భాషాశాస్త్రంలో (ముఖ్యంగా ఎటిమాలజీలో) అభినివేశం ఉండటం వల్లనూ పూర్ణచందు చారిత్రక పరిశోధకుల ప్రమాణాలనే పాటించారనిపిస్తుంది.
కాబట్టే 1417 ప్రాంతంలో కడపజిల్లా పులివెందుల తాలూకా పేర్నిపాడు పాలించిన సమ్మెట సోమనృపాలుడు (రెండవవాడు), జమ్మలమడుగు తాలూకా గుండ్లూరు పాలించిన సమ్మెట లక్కాయదేవని కుమారుడు సమ్మెట రాయదేవుడు (సంగమ వంశీకుడు) ప్రొఢ దేవరాయల సామంతులే అని నిగ్గు దేల్చగలిగారు పూర్ణచందు. ఇంకా వెలుగోటి వంశావళిలో పేర్కొన్న 1361 నాటి సమ్మెట కొండ్రాజు, సాళువ నరసింహరాయల సమకాలీనులైన సమ్మెట శివరాజు, సమ్మెట వీరనారసింహ రాజు, (ఎర్రపాడు ప్రభువులు), సింగభూపాలుని కుమారుడు అనపోతానీడు గెల్చిన సంబెట భూనాధుడు బహుశ సమ్మెట సోమనృపాలుడు మొదలగు వారంతా రాయల వంశీకులే అని నిర్ధారించగలిగారు.
పూర్ణచందు పరిశోధనల వలన రాయల జీవితం చుట్టూ అల్లుకున్న అనేకానేక కట్టుకథలు పటాపంచలయినాయి. అందులో మొదటిది రాయలవారు పిన్న వయస్సులో ఉండగానే రాజ్యాభిషిక్తుడైనాడని, ఆయనకు తిమ్మరుసు అప్పటికే మహామంత్రిగా ఉండేవాడన్నది ఒకటి. తిమ్మరుసు కృష్ణదేవరాయలు అన్న వీర నరసింహ రాయలు కాలం నుంచి రాయల వంశానికి మంత్రిగా పనిచేసింది మటుకు వాస్తవం. అలాగే కృష్ణదేవరాయలు రాజుగా సింహాసనం అధిష్టించేనాటికి ఆయనకు సుమారు 38 (1509) సంవత్సరాలుంటాయని, పిన్నవయస్కుడేమీ కాదని పూర్ణచందు నిర్ణయించారు. దాదాపు 58 (అక్టోబర్ 17, 1529) ఏళ్ళు వచ్చాక కృష్ణదేవరాయలు కాలం చేశారని కూడా నిర్ణయించారు. కృష్ణదేవరాయలు జనన కాలంపైన నిఖార్సయిన నిర్ణయం ఏదీ చరిత్రకారుల దగ్గర లేకపోయినప్పటికీ ఎక్కువమంది చరిత్రకారులు ఆయన జనవరి 17, 1471 న జన్మిచారనే భావననే వ్యక్తపరిచారు. దానినే పూర్ణచందు గూడ ప్రామాణికంగా భావించి ఇతర విషయాలతో తులనాత్మక పరిశీలన జరిపారు.
ఇంకా కృష్ణదేవరాయలు ఏకైక కుమారుడు తిరుమల రాయలు విషాహారం వలన చనిపోయాడని, అది తిమ్మరుసే చేశారనే వాదన కూడ ఈ పరిశోధనలో వట్టిదనే తేలింది. అంతేగాదు, తిమ్మరుసు కళ్ళు పీకించటం, ఆయనను జైలుకు పంపటం వంటివి కేవలం కట్టుకథలన్నది సోదాహరణంగా స్పష్టం చేశారు. రాయల వారి మరణానంతరం తిమ్మరుసు తిరుమల-తిరుపతి వచ్చి అక్కడే తన చివరి రోజులు గడిపినట్టు తిరుమల తిరుపతి ఆస్థాన పత్రాల ఆధారంగా నిరూపించారు.
తిమ్మరుసు జీవిత చరిత్ర సంక్లిష్టాలను విప్పుతూ ఆయన ఎలా వీరనరసింహరాయలకు మంత్రి అయ్యాడో వివరించారు పూర్ణచందు. ఇవి గతంలో మనకు తెలియనివి. తిమ్మరుసు తల్లి నాగమ్మ నాదిండ్ల వారి ఆడపడుచు. తిమ్మరుసు చంద్రగిరిలో పుట్టాడని ఒక చారిత్రక నమ్మకం. రామరాజభూషణుడి రచనలుగా భావిస్తున్న రెండు చాటు పద్యాలలో తిమ్మరుసు తొలి జీవితం ఎంతో దుర్భరమైందని తెలుస్తుంది. కానీ, పూర్ణచందు ప్రకారం ఇది నమ్మశక్యమైన విషయం కాదు. ఎందుకంటే రామరాజ భూషణుడు వసుచరిత్ర రాసాకనే ప్రసిద్ధికెక్కాడు. అప్పటికి తిమ్మరుసు గతించాడు. అందువల్ల చాటువులు విషయవేదికలు (ఎన్సైక్లోపీడియా) కానేరవు అంటారు పూర్ణచందు.
కాకపొతే సాళువ తిమ్మరుసు గుత్తి నగరంలో విస్తళ్ళు కుట్టుకొని జీవించే కుటుంబంలో పుట్టాడని, తరువాత విస్తళ్ళతో పాటు భోజనం కూడా అందించే వృత్తిలో చంద్రగిరిలో జీవనం సాగించేవాడని భట్టుమూర్తి రాసిన పద్యాన్ని బట్టి తెలుస్తుందంటారు పూర్ణచందు. ఆచార్య కే ఏ నీలకంఠ శాస్త్రిగారు రాసిన ‘ఫర్దర్ సోర్సెస్ ఆఫ్ విజయనగర హిస్టరీ’లో ఉన్న చాటువు పద్యాన్నిబట్టి. ‘గుత్తిమ్బుల్లెలు కుట్టి చంద్రగిరిలో గూడెత్తి, పెన్గొండలోహత్తి సత్రమునందు వేడి బలుదుర్లాధీశు తాంబూలం దిత్తుల్మోసి పదస్థులైన ఘనులన్ దీవించెదన్’ అని అనటం ద్వారా తిమ్మరుసు తల్లి నాగమ్మని తెలుస్తోంది.
పెనుగొండలో ధర్మ సత్రం నిర్వాహకుడుగా ఉంటూ, నెమ్మదిగా కొన్ని సంస్థానాలలో తాంబూల కరండం అందించే ఆడపం గారి ఉద్యోగం చేశాడని దీని అర్థం. క్రమంగా వీరనరసింహరాయలుకు దగ్గరై, విశ్వాసపాత్రుడై మంత్రై రాయల వారిని రాజుని చేశారు. తిమ్మరుసుకు సాటిగల మరోమంత్రి లేనలేడని రాయలవారితో ‘అప్పాజీ’ అని ఆప్యాంగా పిలిపించుకున్నాడని నిర్ధారించారు పూర్ణచందు. తిమ్మరుసు భార్య లక్ష్మమ్మ. తిమ్మరుసుకు మగపిల్లలు లేరు. ఇద్దరూ కుమార్తెలే. ఇద్దరినీ నాదిండ్ల వారింటికే మేనరికం ఇచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ కొండవీడు దుర్గానికి పాలకులుగా, ఉపపాలకులుగా నియమితులైనారు. వీర నరసింహరాయలకు, కృష్ణదేవరాయలకు, అచ్యుత దేవరాయలకు వరుసగా తిమ్మరుసయ్యే ప్రధానిగా ఉండి 1536 వరకూ రాజ్యం నడిపించారు.
అయితే, తిమ్మరుసు 1537దాకా నిస్సందేహంగా జీవించే ఉన్నారు. రాయలు మరణించాక 6-7 ఏళ్ళు తిరుమలలోనే ఉన్నాడు. ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి తిరుమలలో విశ్రాంత జీవితం గడిపినట్టు టీటీడీ శాసనాలు చెబుతున్నాయి. వేంకటేశ్వరస్వామికి దానాదులు చేసినపుడు ప్రసాదాలలో కొంతభాగం వారు తాళ్ళపాక అన్నమాచార్య కుమారుడు పేద తిరుమలాచార్యుడికి, కొంత తమకు చెందేలా క్రయవిక్రయ పత్రాలు రాశారు. ‘ఎపిగ్రాఫికల్ గ్లాసరీ ఆన్ తిరుమల దేవస్థానమ్స్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్’ అనే గ్రంథంలో ఇవి నమోదైనాయి: ‘ప్రధాని సాళువ తిమ్మరసుగా ప్రసిద్ధినొందిన తిమ్మరుసు, కౌండిన్య గోత్రీకుడైన రాచిరాజు లేదా రాచరసు కుమారుడు. తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజూ సమర్పించే ప్రసాదంలో తన భాగస్వామ్యంలోని కొంతభాగాన్ని అన్నమాచార్యుడు కుమారుడు తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడికి విక్రయిస్తూ రాసిన ఒక దాన పత్రం’ లో ఈ వివరాలున్నాయి. దీని ప్రకారం తిమ్మరుసు సాళువ వంశస్థుడని, తండ్రి పేరు రాచరుసు అని స్పష్టం. తల్లి నాగమ్మని ఇది వరకే తెలుసుకున్నాం.
పూర్ణచందు ‘అరసు’ అనే పదం వ్యుత్పత్తిని పరిశీలించి ‘అరసి’ని వరిబియ్యం అంటారని తేల్చారు. ‘అరిసి’తో చేసే పిండివంటకంను ‘అరిసె’ అంటారని ‘వరి’ అనేది ఆస్ట్రా-ముండా పదం అయి ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు. ‘అరసి’ అరసు అయిందని, ఈ కారణంగా తిమ్మరుసు తెలుగు వాడని నిర్ధారించారు. అలా తిమ్మరుసు మొత్తం వృత్తాంతం బయటపెట్టారు పూర్ణచందు.
అలాగే రాయలు తుళు, కన్నడ, మళయాళ, సంస్కృతాలలో రాయకలిగినా, మాట్లాడకలిగినా తెలుగు వాడేనని గూడ నిర్ధారించారు ఈ గ్రంథంలో. అంతేగాదు. రాయలవారే ‘ఆముక్తమాల్యద’రాసినట్టు స్పష్టం చేశారు. ఆయనకంత కవితాపటిమ లేదని వ్యర్ధ వాదనలకు దిగిన వారిని నోరు మూయించారు. ముఖ్యంగా నంది తిమ్మన తన కృతిని రాయలవారికి అంకితమిస్తూ ‘కవితా ప్రావీణ్య ఫణీశ’ అన్న పలుకులాధారంగా, ఇంకా ‘అవంధ్య ప్రబంధ కృతి సంబంధ్యనుభావుకున్’, సకల కళా ధోరణికిన్’ లాంటి ప్రయోగాలు కావ్య మర్మం తెలియని కృష్ణరాయలుకు నాటి మహాకవులు వాడారనటం వారిని కించపరచడం తప్ప మరోటి కానేరదని బల్ల గుద్ది చెప్పారు పూర్ణచందు. 1517లో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో (ఈ శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో ఉంటుంది) శ్రీకారం చుట్టినా, 1519లో దిగ్విజయ యాత్రలు పూర్తికాగా అప్పుడు పూర్తి రచనకు పూనుకున్నారని నాటి పరిస్థితుల విశ్లేషణ ద్వారా పూర్ణచందు నిర్ణయానికి వచ్చారు. 1517లో తొలి శ్రీకార పద్యమే ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగేను/దెలుగు వల్లభుండ, దెలుగొకండ/ యెల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి/ దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న పద్యం.
ఇంకా రాయల ఆస్థాన కవులైన నంది తిమ్మన ‘పారిజాతాపహరణం’, అల్లసాని పెద్దన వారి ‘మనుచరిత్ర’లలో ఏది ముందు, ఏది తరువాత కాలనిర్ణయం చేయటంలో పూర్ణచందు చాలా శ్రమపడ్డారు. ముఖ్యంగా రాయల విజయయాత్రలలో వేసిన శాసనాల ఆధారంగా కొంత విశ్లేషణ చేసే అవకాశం ఆయన అందిపుచ్చుకొన్నట్టు తెలుస్తుంది. అమరావతిలో అమరేశ్వరుడి దర్శనం తరువాత వేయించిన దాన శాసనం, అలానే అహోబిల నరసింహ దర్శనాన్తరం ఆ స్వామికి కైంకర్యం ఇస్తూ వేయించిన శాసనం ద్వారా, నంది తిమ్మన పారిజాతాపహరణంలో రాసిన ‘ఉదయాద్రి వేగ నత్యుద్ధతిని సాధించే/వినుకొండ మాటమాత్రనే హరించె/.. గటకమును నింకననుచు ముత్కళ మహీశుండనుదినము/వెఱచు నెవ్వనికి నతడు/రాజమాత్రుండే శ్రీ కృష్ణరాయ విభుడు’ — అన్న పద్యం ద్వారం 1519లో నంది తిమ్మన ‘పారిజాతాపహరణం’ రాయలవారికి అంకిత మిచ్చినట్టు నిర్ధారించారు. తరువాత కాలంలో సింహాచలంలో రెండవ శాసనం ద్వారా 1521లో దక్షిణ దిగ్విజయ యాత్ర పూర్తైన సందర్భంగా అల్లసాని పెద్దన వారి ‘మనుచరిత్రం’ అంకితం అందుకొన్నట్టు తేల్చారు పూర్ణచందు.
రాయలవారి విషయంలో వివాదాస్పదులైన వారిలో మోహనాంగి కూడ ఉంది. ఈమెను రాయల వారి పుత్రికగా పలువురు భావిస్తారు. వేదం వెంకటరాయ శాస్త్రి, ఊటుకూరు కాంతమ్మ, కావలి రామస్వామి, గాజుల లక్ష్మినరసింహశెట్టి లాంటి వారు ఈమెను రాయల పుత్రికగాను, రాయలవారికి పుత్రసంతానం ఆలస్యంగా కలిగిందని, అందువల్ల ఆమె తన ‘మారీచి పరిణయం’ గ్రంథంలో ‘నీకు పుత్రుడు లేడు గనుక నా పుత్రుడినే (అంటే మనవాడినే) నీ పుత్రుడిగా భావించు’ అని ఆమె పేర్కొన్నట్టు ఒక పద్యాన్ని ఉదాహరిస్తారు: ‘పుత్రిక తొలుత బుట్టుటతిపుణ్యకరంబని, నేనెరింగియుం బుత్రుడు నాకొకండైన బుట్టమి, రాజ్యమునెల్ల నేల..’ అన్నదే ఆ పద్యం. అందులో తన తండ్రికి ఈ కావ్యం అంకితం ఇస్తున్నట్టు రచనారంభంలో చెప్పుకొంది.
అయితే ఆరుద్ర ఈ వాదాలను తోసిపుచ్చారు. రాయలకు కొడుకు తప్ప కూతురెవ్వరూ లేరన్న నిర్ధారణకు వచ్చారు. ‘మారీచీ పరిణయం’ ఒక కూటమి సృష్టిగా భావించారు. మోహనాంగి అళియ రామారాయలు భార్యని, ఆమెకు పలు కళలో ప్రవేశం ఉందని పలువురు భావించారు. కానీ, రాయలకు ఆమెకు తండ్రి కూతురు సంబంధం ఉన్నదనటానికి కేవలం ‘మారీచీ పరిణయం’ తప్ప మరే ఆధారం లేకపోవటంతో కందుకూరి వీరేశలింగం కూడ నిస్సహాయుడై నాడు. అలా నేటికీ మోహనాంగి విషయమై చరిత్రకారులు ఏదీ ఇదమిద్ధంగా తేల్చలేని స్థితి ఉందని పూర్ణచందు వాపోయారు.
ఇలాంటి వివాదమే ప్రతాపరుద్ర గజపతి కూతురు ‘తుక్ఖాజీ’ విషయంలోనూ ఉంది. ప్రథమ పత్ని చిన్నాదేవి మరణానంతరం ‘తుక్ఖాజీ’ని రాయలవారు వివాహం ఆడారని ఒక వాదన ఉంది. ఈమెకు తుక్ఖాదేవి, అన్నపూర్ణ, వరదమ్మ అనే ఇతర పేర్లు కూడ ఉన్నాయి. కానీ, రాయలవారు ఏనాడూ ఆమెతో విజయనగరంలో కలిసి ఉన్నట్టు మరే రచనలలోనూ కనపడదు. ఆఖరుకు రాయలు వారు రాసిన ‘ఆముక్తమాల్యద’లోనూ కనపడదు. నిజానికి రాయలవారు ఆముక్తమాల్యద రాసినది ప్రతాపరుద్ర గజపతిని ఓడించిన తరువాతనే. అంటే 1519-21 ప్రాంతాలలో. కాబట్టి ఆయన ఎక్కడో ఓ చోట ఆమెను ఏదో ఓ రూపంలో ప్రస్తావించి ఉండాలి. అలాంటిదేమీ జరగలేదు. ‘రాజుల జీవితం చుట్టూ సమకాలీనులు అల్లే కథల్లాంటివే’ ఇది కూడ కావచ్చు అని ముక్తాయించారు పూర్ణచందు.
ఇక రాయలనాటి ‘భువనవిజయం’ అనేది కేవలం రాయల సభామంటపానికున్న పేరే గాని, అందులో అష్టదిగ్గజాలెవరని ఎవ్వరూ నిగ్గు తేల్చలేకపోయారంటారు పూర్ణచందు. విస్తృత చర్చ మాత్రం ఈ పరిశోధనలో కనిపించినా, రాయలవారి కాలం నాటికున్న మనకు తెలిసిన పేర్లు రెండే కనిపిస్తాయి. ఒకటి అల్లసాని పెద్దన, రెండవది నంది తిమ్మన. ఆరుద్ర సంకుసాల నరసయ్య నొకరిని అష్టదిగ్గజాలలో ఒకరుగా భావించవచ్చన్నారు. అయితే పింగళి లక్ష్మీకాంతం మాత్రం అష్టదిగ్గజాలంటే తెలుగు కవులే కానక్కరలేదన్నారు. విజయనగర సామ్రాజ్యం ఎనిమిది దిక్కులా ఉన్న భిన్న కళాకారుల కూటమి కూడా కావచ్చునని అభిప్రాయపడ్డారు. కృష్ణ దేవరాయలనాటికి తాళ్ళపాక అన్నయ్య గతించి నాలుగేళ్లయినా, ఆయన పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యతో రాయలవారికి చాలా సన్నిహితత్వం ఉండిందన్నది పూర్ణచందు పరిశోధనా సారాంశం.
ఇదంతా పూర్ణచందు ‘భువనవిజయం-రాయలనాటి కథలు, గాథలు’లో కేవలం రాయలచుట్టూ పరిభ్రమిచే ‘కధలు-గాథలు’ భాగం. ఇక రెండవ భాగంలో పూర్ణచందు రాయలకాలం నాటి ఇతర అంశాలను ప్రస్తావిస్తారు. ముఖ్యంగా ఇక్కడ ‘రాయల కాలం’ అంటే కేవలం ‘కృష్ణదేవ రాయల’ నాటి కాలం అని కాదు. అలా తీసుకొంటే చాలా ఇబ్బందే. ఎందుకంటే కృష్ణదేవరాయలు పాలించింది కేవలం 20 ఏళ్ళు మాత్రమే. కానీ, తన అన్న వీర నరసింహరాయలకు ఆయన దాదాపు 20ఏళ్ళు గొప్ప అండగా నిలిచాడు. అన్నబదులు ఆయనే స్వయంగా యుద్ధాలకు వెళ్లి రాజ్యాలకు రాజ్యాలనే జయించి తెచ్చి, అన్నకు కానుకగా ఇచ్చాడు.
అంతేగాక, రాయల కాలం అనేది విస్తృతార్ధంలో స్వీకరిస్తే దాదాపు 100 ఏళ్లకు పైబడిన రాయల వంశీకుల చరిత్రనే ఉంటుంది. ఆ కాలంలో పరిపాలన, నాటి పాలనా యంత్రంగం, దానిలోని అధికారుల పేర్లు, రాయల వంశీకులు తినే భోజనం, వారి భోజనాలయంలోని శాకాలు, అవి చేసే విధానం, వాటి ఆయుర్వేద విలువలు వంటివి పూర్ణచందు వృత్తి రిత్యా ఆసక్తికర విశేష పరిశోధనలు. ఉదాహరణకు రాయల కాలంలో పాలనా భాషలో కొన్ని పదాలు టూకీగా: అంతరమన్నీలు (నియామక అధికారులు), అడపంగారు (వ్యవస్థ ముఖ్యాధికారి), ఆకు (ఒప్పంద పత్రం), అధిష్ఠానం, అరదాసు (రాత పూర్వక ఆరోపణ), అవసరం (వ్యక్తికి ప్రత్యేక సహాయకుడు), కరణం, ఆయగారలు (బ్రాహ్మణులు) ఇలాంటివి చాలా సేకరించారు పూర్ణచందు. ఇవాళ ఆంగ్లంలో, ఉర్దూలో పాలనా, రెవిన్యూ శాఖలలో వాడే పదాలకు నాటి తెలుగు పదాలు ఎందుకు వాడకూడదు అని ప్రశ్నిస్తారు పూర్ణచందు.
ఆనాటి వ్యాపారాలలో వజ్రాల, రత్నాల వ్యాపారాలు చాలా ప్రసిద్ధి కెక్కాయి. నాటి విదేశీ పర్యాటకుల రాతల ప్రకారం వీధుల్లో కూరగాయలతో పాటు వజ్రాలు, రత్నాలు కూడా అమ్మారని తెలుస్తుంది. ప్రత్యేకంగా కృష్ణదేవరాయలు తన ‘ఆముక్త మాల్యద’లో రాసిన వంటకాలు, శాకాలపై వివరంగా చర్చిస్తారు పూర్ణచందు. తరుచు తనకిష్టమైన భాషాశాస్త్ర పరిధిలోకి వెళ్లే ‘ఎటిమొలోజి’ లోకి చొచ్చుకు పోయి ఒక్కో పదంపై విస్తృతచర్చ చేయటం మనకు పుస్తకమంతా కనిపిస్తుంది.
ఎంతో శోభాయమానంగా సాగే ఈ పుస్తక చర్చలో ‘విజయనగర సామ్రాజ్య పతనం’, ఆఖరి కోట ‘ఆనెగొంది’ ఔరంగేజేబుకు పడిపోయిన ఘట్టం గుండెలో ఏదో సలుపు కలిగిస్తుంది. రసహృదయులైన పాఠకులకు ఈ బాధ అనుభవైక వైద్యం. రాయలకాలంనాటి అనేక ఆసక్తికర విషయాలు చర్చించాలంటే ‘నాటి విదేశీ పర్యాటకుల రచనలే ప్రధాన ఆధారాలు కావటం శోచనీయం’ అంటారు పూర్ణచందు. ఏది ఏమైనా ఈ పుస్తకంలో రాయలకాలం నాటి అనేక సంక్లిష్టాలపై కొత్త వెలుగులు సారించటంలో విషయపరంగా, భాషా పరంగా కృతకృత్యులైనారనే చెప్పాలి.