[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
9
రావణుడు చాలా గొప్పవాడు. ఇది గత అర్ధ శతాబ్దంలో ఖాయం చేసిన అంశాలలో ఒకటి. ఈ మధ్య కాలంలో మహిషాసురుడు, నరకాసురుడు కూడా గొప్పవాళ్లై.. ఉస్మానియాలో పూజలందుకొంటున్నారు. రావణుడు చాలా గొప్పవాడు అంటే.. ఎలా గొప్పవాడయ్యాడు. మనం కన్న దృశ్యాలు.. విన్న కథలు చెప్తున్న ప్రకారమే అయితే, ‘ఆయన వేద వేదాంగాలు చదివాడు.. ఉపనిషత్తులు చదివాడు.. మహా శివభక్తుడు.. కైలాస పర్వతాన్నే తన రెండు చేతులతో ఎత్తి ఆ మహాదేవుడిని ఎలుగెత్తి పిలిచిన వీరుడు.. రుద్రవీణాగానంతో మహేశ్వరుడిని మెప్పించిన భక్తుడు.. అత్యద్భుతమైన లంకా నగరానికి రాజు.. ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించాడు.. తన రాజ్యంలో దారిద్ర్యమనే పదానికి తావే లేకుండా చేసిన చక్రవర్తి.. ఇంతటి చక్రవర్తి మీద సీతాపహరణమనే అపవాదు మోపబడింది. ఈ ఒక్క కారణం చేతనే అతను చెడ్డవాడైపోయాడా? సీతాపహరణం అనేది న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ఒక ప్రతీకార చర్య మాత్రమే. తాను ఎంతో అల్లారుముద్దుగా ప్రేమించి పెంచి పెద్ద చేసిన తన ప్రియమైన చెల్లెలు శూర్ఫణకను నిష్కారణంగా అవమానించి ముక్కు చెవులు కోసినందుకు ప్రతీకారంగా చేసిన పనే సీతాపహరణం తప్ప ఇందులో దురుద్దేశం వేరే లేనేలేదు. తన చెల్లెకు అవమానం జరిగినప్పుడు ఏ అన్నయ్యకైనా సహజంగా వచ్చే కోపంతోనే రావణుడు సీతను ఎత్తుకొచ్చాడు. ఎత్తుకొచ్చిన తరువాత కూడా ఆమెను ఏమీ చేయలేదే.. అశోకవనంలో కూర్చోబెట్టాడు. తనను పెళ్లి చేసుకోవడానికి టైం ఇచ్చాడు. ఇలాంటి రావణుడిని ఎలా దుర్మార్గుడిగా చిత్రిస్తారు. అడవిలో ఏమీ అనకుండా తమ మానాన తాము కందమూలాలు తింటున్న ఖరదూషణాది రాక్షసులను అన్యాయంగా చంపేసి.. రావణుడి చెల్లెలి ముక్కు చెవులు కోసి హింసించి.. అక్కడి రుషులకు అంతులేని సంపదలను మూట గట్టి ఇచ్చిన రాముడు మంచివాడు ఎలా అవుతాడు? ప్రపంచంలోనే మొట్ట మొదటి స్త్రీ హింస అనదగిన శూర్ఫణఖ అవమానానికి ప్రతీకారం చేసిన రావణుడు కచ్చితంగా చాలా గొప్పవాడు. ఉన్నతుడు. సుప్రజాపాలన చేసినవాడు. అంతటి శివభక్తుడైన రావణుడు సీతను అపహరించడం ద్వారా తప్పు చేశాడా? లేక అది కేవలం పరిస్థితుల ప్రభావమేనా? ఇది రాముడు అనే ఉత్తరాది పాలకుడు.. దక్షిణాది పాలకులను అణచివేసేందుకు పన్నిన కుట్రలో భాగమేనా? నిజంగా ఇది లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశమే.’ ఈ విషయాన్ని వరంగల్ సదస్సులో పాల్గొన్న వక్తలే వ్యక్తం చేసిన అభిప్రాయాలు.
రామాయణ మూల రచయిత వాల్మీకి. అలాంటప్పుడు వాల్మీకి తన రామాయణంలో రావణుడి గురించి ఏం రాశాడు. రావణుడి గుణగణాలను కానీ, ఆతడి జీవితాన్ని గురించి కానీ, ఆతడి చర్యల గురించి కానీ వాల్మీకి వాస్తవంగా పేర్కొన్నది ఏమిటి? ఈ హేతువాదులు, నాస్తికులు, ‘లౌకిక’వాదులు చెప్తున్నట్టు ఉత్తర రామాయణం కూడా వాల్మీకే రాశారని ఒకవేళ అంగీకరించినా.. ఆ ఉత్తర రామాయణంలో నైనా రావణుడి గురించి పేర్కొన్న అంశాలు ఏమిటి? నిజంగా రావణుడు ఎలాంటి వాడు? అతడి వ్యక్తిత్వం ఏమిటి? తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, ప్రజల పట్ల, సామ్రాజ్యం పట్ల అతడు వ్యవహరించిన తీరు ఏమిటి? నిజంగా ప్రస్తుతం వాదిస్తున్నట్టుగానో.. లేక ఏ రామారావు సినిమాల్లో మాదిరిగానో.. రావణుడి వ్యక్తిత్వం నిరుపమానమైనదేనా? అయితే.. ఆతడిని ఎందుకు ప్రతినాయకుడిగా చిత్రించారు? ఈ రావణ రహస్యం ఏమిటి? వాల్మీకి రామాయణం ఈ రహస్యాన్ని ఎలా విప్పి చెప్తున్నది?
2
రావణుడి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో మొదట బాలకాండలో వస్తుంది. తొలి ఐదు సర్గలలో రామకథ సంక్షిప్తంగానూ.. ప్రక్షిప్తంగా భావించే ఉత్తరకాండలోని అంశాలు నాలుగో సర్గలో రెండు శ్లోకాలు.. ఐదో సర్గ సంపూర్ణంగా ఉత్తరకాండను సంక్షిప్తంగా వ్యక్తీకరిస్తుంది. అసలైన రామ చరిత్ర ఆరో సర్గ నుంచి మొదలవుతుంది. పదిహేనవ సర్గలో రావణుడి ప్రస్తావన వస్తుంది. సంతానం కోసం దశరథుడు పుత్రీయేష్టి (పుత్రుల కోసం యాగం, అందరూ అనుకుంటున్నట్టు పుత్రకామేష్టి కాదు.) ప్రారంభించిన క్రమంలో దేవతలు శాస్త్రానుసారంగా ఆ యాగానికి వచ్చారు. అక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మతో దేవతలు మాట్లాడుతూ.. ‘రావణుడనే రాక్షసుడు నువ్విచ్చిన వర ప్రభావం వల్ల మూడు లోకాలను బాధిస్తున్నాడు. ఋషులను, గంధర్వులను, అసురులను, బ్రాహ్మణులను అవమానిస్తున్నాడు. ఎవరూ అతడిని జయించలేకపోతున్నారు. బాధలు పడుతున్నారు. అతడిని చంపడానికి కూడా ఉపాయం చెప్పాలని కోరారు. అప్పుడు బ్రహ్మ.. మనుష్యులతో మాత్రమే రావణుడు చస్తాడని చెప్తాడు. దీంతో అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణువును దేవతలందరూ కోరడంతో తానే నలుగురిగా మారి దశరథుడి కడుపున పుడతానని, రావణ సంహారం చేస్తానని హామీ ఇస్తాడు. ఇదే సర్గలోని 33వ శ్లోకంలో ‘గొప్ప పౌరుషము కలవాడు, లోకములను ఏడ్పించువాడును అయిన రావణుడిని సైన్య బాంధవాది సహితముగా చంపు’మని దేవతలు విష్ణువును కోరుతారు. ఇక్కడ రెండు అంశాలు.. విష్ణువు రాముడిగా, ఆదిశేషువు లక్ష్మణుడిగా, శంఖచక్రాలు భరతశతృఘ్నులుగా జన్మించారని వాల్మీకి పేర్కొనలేదు. విష్ణువే తనను తాను నాలుగు విధాలుగా విభజించుకొని దశరథుడికి నలుగురు కుమారులుగా జన్మిస్తున్నట్టు చెప్పారు. ఇక రావణుడి తొలి పరిచయంలో అతడు గొప్ప పండితుడు అని కానీ, మేధావి అని కానీ, లోకోత్తర నాయకుడని ఎక్కడా చెప్పలేదు. గొప్ప పౌరుషము కలవాడు అని చెప్పడంతోనే అతడు ఎంత ఈగోయిస్టో స్పష్టంగానే చెప్పుకొచ్చారు. తరువాత రావణుడి దౌష్ట్యాలు అన్నీ కూడా అరణ్య కాండ నుంచి అధికంగా, ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాయి. రావణుడి జన్మ వృత్తాంతం గురించి ఇక్కడ ఎలాంటి ప్రస్తావన లేదు. రావణుడు ఎప్పుడు ఎవరికి జన్మించారన్నది మళ్లీ మనకు ఉత్తరకాండలోనే కనిపిస్తుంది. ఉత్తరకాండ ప్రక్షిప్తం అని అనేక పండితులు చెప్పుకుంటూ వచ్చారు. అందుకు దృష్టాంతాలు కూడా అనేకం ఉత్తర రామాయణంలో, పూర్వ రామాయణంలో కనిపిస్తాయి. రెండింటి మధ్య రచనలోనూ, పాత్రల చిత్రీకరణలోనూ స్పష్టమైన అంతరం కనిపిస్తుంది. ప్రఖ్యాత సంస్కృత పండితులు పుల్లెల శ్రీరామ చంద్రుడు రామాయణంలో ప్రక్షిప్తాలను చాలా వరకు గుర్తించి పరిష్కరించారు. ఒక్క ఉత్తర కాండలోనే 13 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దాదాపు 13 వందల శ్లోకాలు ఈ ప్రక్షిప్తాలలో ఉన్నాయి. వీటితో పాటు పూర్వ రామాయణంలోని ఆరు కాండలలో.. ముఖ్యంగా అయోధ్య, అరణ్య కాండల్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే శ్లోకాలు వీటిని తొలగించినట్టయితే వాల్మీకి బాలకాండలో చెప్పినట్టు 24 వేల శ్లోకాలకు రామాయణం సరిపోతుంది. కానీ.. దీన్ని లబ్ధ ప్రతిష్ఠులైన పండితులే పరిష్కరించాలి.
రావణ జన్మ వృత్తాంతం మనకు కనిపించేది ఈ ఉత్తర రామాయణంలోనే. రావణాదులు, వారి సంతానం, వారి పూర్వీకుల వృత్తాంతం కూడా మనకు ఉత్తర రామాయణం లోనే మనకు కనిపిస్తుంది. ఈ రావణుడు ఎవరు? రావణుడు బ్రాహ్మణుడని, వేదవేదాంగాలు చదివి అద్భుతమైన పరిపాలనానుభవంతో, తపఃశక్తితో లంకా సామ్రాజ్యాన్ని ఏలాడని చెప్తారు. ఇక్కడే నాకు సందేహం కలుగుతున్నది. రావణుడు బ్రాహ్మణుడా? ఈ బ్రాహ్మణ శబ్దం రావణుడికి ఎలా వర్తిస్తుంది? ఈ బ్రాహ్మణ శబ్దం ఈరోజు మన సమాజం అనుసరిస్తున్న ఆమోదిస్తున్న బ్రాహ్మణ కులానికి సంబంధించిందా? లేక ఎప్పుడో వేల ఏండ్లనాడు అమలులో ఉన్న చాతుర్వర్ణ్య వ్యవస్థలోని బ్రాహ్మణ శబ్దానికి సంబంధించిందా? ఈ రెండూ కాకుండా సృష్టికర్త అయిన బ్రహ్మ సంతానాన్ని బ్రాహ్మణులని అనవచ్చా? ఎందుకంటే బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన పులస్త్యుడి కుమారుడు విశ్రవసుడు. ఈ విశ్రవసుడి మొదటి భార్యకు పుట్టిన సంతానం వైశ్రవణుడు లేదా కుబేరుడు కాగా రెండో భార్యకు జన్మించిన వాడే రావణుడు. ఇంతవరకు బాగానే ఉన్నది. బ్రాహ్మణ శబ్దంలో బ్రహ్మ అన్న మాట ధ్వనిస్తున్నది కాబట్టి బ్రహ్మ సంతానం మొత్తాన్ని బ్రాహ్మణులు అనవచ్చన్న మాటనే విశ్వసించినట్టయితే.. సమస్త జీవజాలానికి కూడా బ్రాహ్మణ్యమే వర్తిస్తుంది కదా.. అలా అని అనుకోవడానికి అవకాశం ఉన్నదా? ఇది పండితులు తీర్చాల్సిన సందేహం.
చతుర్ముఖ బ్రహ్మ.. విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన బొడ్డుతాడు ద్వారా ఉద్భవించిన తామర నుంచి సృష్టి పొందాడు. మనం ఇప్పుడు విశ్వసించే విజ్ఞాన శాస్త్రం ప్రకారమే అయినా ఈ బొడ్డుతాడు నుంచే మానవ జన్మ కలుగుతుంది. గర్భంలో జీవం పురుడు పోసుకున్న తరువాత తల్లితో ఆ జీవానికి ఈ బొడ్డుతాడు నుంచే కనెక్టివిటీ ఉంటుంది. భూమ్మీద శిశువు పడేంత వరకు కూడా ఈ బొడ్డుతాడు నుంచే ఆ శిశువుకు ఆహారం అందుతుంది. మూలకణాలు కూడా ఈ బొడ్డుతాడు నుంచే పిండానికి చేరి.. ఒక్కో మూలకణం ఒక్కో అంగంగా అభివృద్ధి చెంది చివరకు పూర్ణ మానవ రూపాన్ని సంతరించుకుంటుంది. అందువల్లనే ఈ మూలకణాల ప్రిజర్వేషన్ కోసం పుట్టగానే బొడ్డుతాడును పరిరక్షించే బ్యాంకులు మనకు ఏర్పడ్డాయి.
ఇక అసలు విషయంలోకి వద్దాం. విష్ణువు నాభి కమలం నుంచి పుట్టిన బ్రహ్మ తన సంకల్ప మాత్రం చేత కొంతమంది పుత్రులను సృష్టించాడు. వీరిని బ్రహ్మ మానస పుత్రులని పిలిచారు. వీరు సాధారణంగా మనం పుట్టినట్టుగా యోని నుంచి పుట్టినవారు కాదు. వీరు అయోనిజులు. వీరు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, నారదుడు, కర్దముడు, వశిష్టుడు, సనందనుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, స్వాయంభువుడు. వీరంతా బ్రహ్మ మానస పుత్రులే. వీరందరికీ మనం అనుకునే బ్రాహ్మణ కులం అనేది వర్తిస్తుందా అన్నది పండితులు తేల్చాల్సిన విషయం. మనం ఈ రోజు అనుకునే వర్ణాశ్రమ ధర్మం బ్రహ్మకు వర్తిస్తుందా? అన్నది పెద్దలు తెలపాలి. లేదా ఇప్పుడున్న కుల వ్యవస్థ నిర్మాణ పరంగా బ్రాహ్మణ శబ్దం బ్రహ్మకు వర్తిస్తుందా? వర్ణాశ్రమ ధర్మం అన్నది ఎప్పుడో భూమిపై వచ్చిన అంశమే కానీ, సృష్ఠి, స్థితి, లయకారులకు ఇది వర్తిస్తుందా అన్నది ప్రశ్న. సృష్టి కర్త తన మన: సంకల్పంతో కొంతమంది పుత్రులను సృజించాడు. వారంతా అయోనిజులే.. ఆ తరువాత వారి నుంచి ఇతర సృష్టి కార్యం మొదలైంది. ధార్మికపరంగా నాకు అంత లోతైన పరిజ్ఞానం లేదు. కానీ, ఒక సామాన్యుడిగా నాకు ఈ అంశంపై కొంత ఆలోచన కలిగింది. నా సందేహాలను పండితులు తీర్చాలని మనవి.
జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం, బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఇది మనందరికీ తెలిసిన శృతియే. స్కంద పురాణంలో షోడశోపచార పూజలో అష్టమ ఉపచారంలో బ్రహ్మ నారదుడికి చెప్పినట్టుగా కనిపిస్తుంది. దీని అర్థం పుట్టుకతో అంతా శూద్రులవుతారు, కర్మ చేత ద్విజులు అవుతారు. వేదజ్ఞానం చేత విప్రులవుతారు. బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణులవుతారు. ఇక్కడ బ్రహ్మ సంతానం బ్రాహ్మణులని ఎక్కడా చెప్పినట్టు కనిపించదు. అందరూ చెప్పే మరో శ్లోకం భగవద్గీతలోని నాలుగో అధ్యాయంలోని 13 వది.
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః.
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్
గుణ కర్మల అనుసారంగా విభజించి నాలుగు వర్ణాలను నేను సృష్టించాను అని గీతాచార్యుడైన కృష్ణుడు చెప్పాడు.
భగవద్గీతలోని 18వ అధ్యాయం 41వ శ్లోకంలో
బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప
కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః
అని గీతాచార్యుడు చెప్తాడు. దీని అర్థం.. హే పరంతపా! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల కర్మలు.. స్వభావాత్మకమైన గుణాల ద్వారా (పుట్టుకతో కాదు) విభజన చేయబడ్డాయి అని అన్నారు. ఇక ద్విజ అనే పదం ఉన్నది. దీన్ని కూడా బ్రాహ్మణులకు వర్తింపజేయడం చూశాం.. ఈ పదం ద్వి, జ అనే రెండు ధాతువుల నుంచి జనించింది. ‘ద్వి’ అంటే రెండు, ‘జ’ (జాయతే) అంటే పుట్టుక. ద్విజ అంటే రెండుసార్లు పుట్టినవాడు అని అర్థం. మొదట తల్లి గర్భం నుంచి మానవుడిగా అంటే ఏమీ తెలియని వాడిగా పుడతాడు. పెద్దవాడై, జ్ఞాన సముపార్జన చేసి, సంస్కారవంతుడైన తరువాత రెండోసారి పుట్టినట్టుగా భావించడం ఉన్నది. పైన ఉన్న శ్లోకం జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః లోని అర్థం ఇదే. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. అసలు అర్థం ఏమిటన్నది దాని ప్రయోగ స్వభావాన్ని అనుసరించి ఏర్పడుతుంది. ఉదాహరణకు ‘వర్ణం’ అనే పదానికి మూలం ’వ్ర‘. అంటే ‘లెక్కించడం, వర్ణన చేయడం, ఎంపిక చేయడం, వర్గీకృతం చయడం’ అని దీని అర్థం. కానీ, మహాభారతంలో దీన్ని ‘రంగు’ అన్న అర్థంలో వాడారు. ఈ విషయాన్ని గ్రహించకుండా మనం సంస్కృత శ్లోకాలను అర్థం చేసుకోవడం దుర్లభం.
బ్రిటిష్ కాలం నాటికి వచ్చేసరికి హిందూ కోడ్ బిల్లులో పండిత్ అన్న పదాన్ని బ్రాహ్మణుడు అన్న అర్థంలో వినియోగించారు. పురోహితుడు, పూజారి ఇలాంటి వారిని పండితులు అని అన్నారు. పండిత శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే ‘పన్డ’ అనే ధాతువు నుంచి ఉత్పన్నమైంది. పన్డ అంటే జ్ఞానం, సమీకరించడం, సేకరించడం అనే అర్థాలు ఉన్నాయి. జ్ఞానాన్ని సముపార్జించడం అన్న అర్థంలోనే దీన్ని వినియోగిస్తారు. పండిత శబ్దానికి సామాజిక దృష్టి కోణం ఏదీ లేదు. బ్రాహ్మణులు అందరూ పండితులు కారు. పండితులు అందరూ కులం అనుకునే సామాజిక కోణంలో బ్రాహ్మణులు కారు. ఉదాహరణకు క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఒకరు పీహెచ్‌డీ చేశారనుకొండి. అతడు ఆ రంగంలో పండితుడే. ప్రస్తుత కుల నిర్వచనాల ప్రకారం బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మ శబ్దం పరమ సత్యమైనది. బ్రాహ్మణ శబ్దం వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించినది. వర్తమాన కాలానికి వస్తే కులానికి సంబంధించినది. వేదం కూడా బ్రహ్మాణా అన్న శబ్దాన్ని వాడిందే కానీ, బ్రాహ్మణ అని వాడినట్టు నాకు కనిపించలేదు. బ్రహ్మాణా అంటే పరబ్రహ్మం కు సంబంధించిన సంకేతార్థం. నిజానికి బ్రహ్మ పుత్రులలో మనువు, దక్షుడు వంటి వారు క్షత్రియ ధర్మాన్ని పాటించారు. సనకసనందనాదులు పుట్టుకతోనే జ్ఞాన సంపన్నులై వెలిగారు. మన్మథుడు మరో మార్గంలో పయనించాడు. వశిష్ఠాది మిగతా వారు బ్రహ్మర్షులై తపోమార్గాన్ని అనుసరించారు. రావణుడి పులస్త్యుడు బ్రహ్మర్షిగా తపోమార్గాన్ని అనుసరించిన వాడు. ఈతని కుమారుడు విశ్రవసుడు కూడా తండ్రిబాటలో నడిచాడు. ఈయన కుమారుడైన దశగ్రీవుడు అంటే రావణుడు వీరి మార్గంలో వెళ్లకపోగా.. తనదైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ రకంగా గమనించినప్పుడు రావణుడిని వర్ణ ధర్మం ప్రకారం, లేదా నేటి సామాజిక కుల సమీకరణాల ప్రకారం బ్రాహ్మణుడు అనవచ్చా? పండితులు ఈ సందేహాన్ని తీర్చాలి.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
