[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
8
తెలుగుదేశంలో భారతీయతను వ్యతిరేకించడానికి, కులాల కుంపటి రాజేయడానికి, ఫెమినిస్టులకు, హేతువాదులకు, కమ్యూనిస్టులకు, లిబరలిస్టులకు, అదేదో ‘లౌకిక విలువల’ పరిరక్షణ ఉద్యమమనే దానికి ప్రధాన ఉపకరణంగా ఈ రామాయణ వ్యతిరేకత బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు.. ముఖ్యంగా అరస, విరస, కురస, నీరస, నోరస కవులు ఈ దిశగా విస్తృత సాహిత్యాన్ని వెలువరిస్తూ వచ్చారు. అంతకుముందే వ్యవహారభాషోద్యమం కారణంగా పరోక్షంగానైనా ప్రాచీన సాహిత్యానికి కొన్ని తరాలను దూరం చేసినట్టయింది. గిడుగు రామమూర్తి పంతులు వ్యవహార భాషోద్యమం ప్రారంభించారు. దీనిని ఆనాడే పండితులు చాలామంది వ్యతిరేకించారు. జయంతి రామయ్య పంతులు ప్రత్యక్షంగానే గిడుగువారి పంథాను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే గిడుగువారు వ్యవహార భాషలో సాహిత్యం కావాలన్నారే తప్ప ప్రాచీన సాహిత్యాన్ని తిరస్కరించలేదు. కానీ.. ఆయన ప్రారంభించిన ఉద్యమం తెలుగు సాహిత్యకారులకు, ప్రజలకు ప్రాచీన సాహిత్యాన్ని దూరం చేసింది. పద్యాన్ని దూరం చేసింది. పద్యం అనేదేదో బ్రాహ్మణ భావజాలానికి సంబంధించినదిగా పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. కొన్ని తరాలను క్లాసిక్ లిటరేచర్ కు దూరం చేయడంతో అందులో ఏమున్నదో కూడా తెలియని దశకు ఆ తరాలు చేరుకున్నాయి. ప్రాచీన సాహిత్యాన్ని చదువకుండా.. ‘రీడబిలిటీ’ ఉండదు.. అన్న పేరుతో చదువాలనుకొనే వారిని సైతం ఈ మేధావులు అనబడే వారు చదువకుండా చేశారు. చివరకు ప్రాచీన సాహిత్యం ఎందుకూ పనికిరాదనే దశకు తీసుకొని వచ్చారు. ఆ మధ్య కాలంలో ప్రాథమికోన్నత విద్య సిలబస్ తయారీ కమిటీలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఇందులో పోతన, నన్నయ్య, తిక్కనలను ఎందుకు చదవాలి? ఇప్పుడు వారి రిలవెంట్ ఏమిటన్న స్థాయిలో చర్చ జరిగింది. వారి పాఠాలు పెట్టనే వద్దంటూ తీవ్రమైన చర్చ జరిగింది. ఒకాయన ఇంకాస్త ముందుకు వెళ్లి.. పాఠ్యాంశాలలో ఏయే విషయాలు ఉండటం పక్కన పెట్టి జనాభాలో ఆయా వర్గాల దామాషా ప్రకారం.. ఆయా కులాల రచయితల రచనలు పాఠాలుగా పెట్టాలని డిమాండ్ చేయటమే కాకుండా ఆ డిమాండ్ వ్యాసాలు కూడా రాసుకొని వచ్చారు. మరీ విడ్డూరం ఏమిటంటే.. రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి, గురజాడలు బ్రాహ్మణులైనందువల్లనే వారికి కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయని, సావిత్రీబాయ్ పూలే బ్రాహ్మణ కాకపోవడం వల్లనే పేరు రాలేదనే స్థాయిలో అన్ని మెట్లూ దిగజారి మాట్లాడే దశకు చేరుకున్నారు. ప్రాచీన సాహిత్యాన్ని చదువక పోవడం వల్ల తాము ఏది చెప్తే.. ఏది రాస్తే.. ఏది మాట్లాడితే అదే నిజమనే భ్రమలు మొదలయ్యాయి. ఒకడు తాను నాస్తిక భావజాలానికి చెందినవాడనని వాపోతుంటాడు. అతడు మైకు కనిపిస్తే చాలు.. రాముడు అట్లా.. సీత ఇట్లా.. రావణుడు అలా.. పురాణాలు ఇలా అంటూ రకరకాల కూతలు కూస్తుంటాడు. మరొకడు హిందూమతం అంత దుర్మార్గమైన మతం ఇంకొకటి లేదంటాడు. ఇంకొకరేమో కారుకూతల కవితలు ఉచ్చల జలధితరంగాల్లా పొంగిస్తుంటారు. ఇదేమని ఎవరూ అడుగకూడదు. అడిగితే వేపమండలు పట్టుకొని విరుచుకుపడుతుంటారు. వాళ్ల విధానం ఎలా ఉంటుందంటే రాయి వేయాలనుకున్నప్పుడు వేయాల్సిందే. బురద చల్లాలంటే చల్లాల్సిందే.. పడ్డవాడు కడుక్కుంటాడు.. వాడి ఖర్మన్నమాట. వీళ్లెవరూ మూలాలను చదువుకున్నవారు కాదు. వాళ్లకు చదవాల్సిన అవసరమూ లేదు. ఎవరో వాళ్ల పై బాసు చెప్తాడు ‘ఆక్రమణ్’ అని.. అంతే వీళ్లు దాడి చేస్తుంటారు. గట్టిగా నిలదీస్తే.. నోరెళ్లబెడతారు.
భారతీయ స్వధర్మ విధ్వంస రచన వెనుక వీళ్ల కుట్ర చాలా పెద్దది. దీర్ఘకాలానికి సంబంధించింది. ముందే చెప్పినట్టు.. వీళ్ల కుట్రకు గిడుగు రామ్మూర్తి వారు తెలియకుండానే దోహదపడ్డారేమోననిపిస్తుంది. ఆయన వ్యవహారిక భాషలో రాయాలన్నారే కానీ, ప్రాచీన సాహిత్యాన్ని చదువవద్దు అని ఏనాడూ అనలేదు. కానీ.. కుట్రదారులకు అదే ఆలంబనగా మారింది. ముందుగా మన చరిత్రను, సంస్కృతిని, ధర్మాన్ని మరచిపోవాలంటే.. అందుకు సంబంధించిన సాహిత్యానికి ప్రజలను పూర్తిగా దూరం చేయాలి. దానికోసం.. ఆ సాహిత్యానికి సంబంధించిన ప్రధాన మాధ్యమాన్ని ధ్వంసం చేయాలి. ఇంకేం, ప్రాచీన సాహిత్యానికి ప్రధాన ప్రక్రియ అయిన పద్యాన్ని నాశనం చేసే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. ఛందస్సు సాహిత్యానికి సంకెళ్లు అన్నారు. నన్నయ్యను బొంద పెట్టాలన్నారు. పద్యాన్ని పాతరేయాలన్నారు. పద్యం ప్రజల భాష కాదు అన్నారు. ఎవరికీ అర్థం కాదు పొమ్మన్నారు. వచన కవిత్వానికి ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. వచన కవిత్వం పెరుగుతుండటంతో క్రమంగా పద్యం కనుమరుగవుతూ వచ్చింది. పద్యాన్ని వాళ్లు పూర్తిగా చంపలేకపోయారు. కానీ రెండుమూడు తరాలకు పద్యాన్ని దూరం చేయగలిగారు. పద్యం దూరం చేయడంతో సహజంగానే ప్రాచీన సాహిత్యమూ గత నాలుగు దశాబ్దాలలో ప్రజానీకానికి అందకుండాపోయింది. రామాయణ భారతాలు కానీ, భాగవతాది పురాణాలు కానీ, మనుచరిత్ర, ఆముక్తమాల్యద లాంటి ప్రబంధాలు కానీ ఈ తరానికి పూర్తిగా అందకుండా పోయాయి. ఇవేవీ చదవలేదు అంటే.. వాటిని బ్రాహ్మణులు తప్ప ఇతరులు చదువకుండా విధి నిషేధాలు విధించారని అంటూ సరికొత్త వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. ఎవరు చదువొద్దన్నారయ్యా అంటే చెప్పరు. ఇక తరువాత వారి విజృంభణ మొదలైంది. రామాయణంలో, భారతంలో, పురాణాల్లో కథలకు తమదైన వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు. సంస్కృతం తెలిసిన వాడూ.. తెలియని వాడూ.. కొత్త కొత్త అర్థాలు చెప్పటం మొదలు పెట్టారు. ప్రక్షిప్తాలను నిజం చేసేశారు. ఎక్కడ పడితే అక్కడ వేటిని పడితే వాటిని చొప్పించి.. ఆయా వ్యక్తిత్వాలకు మసిపూసి మారేడు కాయ చేశారు. విలన్లను హీరోలు చేశారు. హీరోలను విలన్లుగా మార్చేశారు. పెరియార్, త్రిపురనేని.. తదితరుల వ్యాఖ్యానాలనే ఆయా ఇతిహాసాల్లో ఉన్నట్టు.. ఆపాదించేశారు. వాటిని నిజాలు చేసేశారు. పైగా దానవీరశూర కర్ణ లాంటి సినిమాలతో అసలు ఇతిహాసాల రూపురేఖలే మారిపోయాయి. వాటిలోని కథనం అంతా కూడా తలకిందులై కూర్చుంది. ఒరిజనల్స్ ఎవరూ చదవటం లేదు కాబట్టి.. వీళ్లు ప్రచారం చేసినవే నిజాలవుతూ వచ్చాయి. అటు జోధాతో పెళ్లి చేసుకున్న అక్బర్ మతసామరస్యాలు, 19 ఏండ్ల కాపురంలో 14 మందిని కని చంపేసిన ప్రియురాలి కోసం షాజహాన్ విశ్వప్రేమలు, అనార్కలి కోసం జహంగీర్ అలియాస్ సలీం త్యాగాల గురించి చరిత్ర రాస్తూనే ఇతిహాసాల దుర్వ్యాఖ్యానలను విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ వెళ్లారు. ఈ దుర్వ్యాఖ్యానాలన్నింటి ట్రాప్‌లో మన పండితులు, కవులు, ప్రవచనకారులు పడిపోయినట్టే అనిపిస్తుంది. భారతీయ ధార్మికవేత్తలంతా.. మన ఇతిహాసాలను భక్తి, మోక్ష, సనాతన ధర్మ దృష్టితో చూశారే తప్ప.. వాస్తవాలను చెప్పి దుర్వ్యాఖ్యానాలను ఖండించకుండా.. సంజాయిషీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. అంతకు మించి చేసిన దుర్వ్యాఖ్యానాలకు తమదైన దృష్టి కోణంలో ధార్మికంగా సమర్థింపులు చేసుకుంటూ పోయేసరికి.. అవన్నీ నిజాలనే పరిస్థితి ఏర్పడింది. రామాయణంలోని జాబాలి వృత్తాంతంలో బుద్ధుడిని చొప్పించడం.. అరణ్యకాండలో రామలక్ష్మణుల సంభాషణ మధ్యన రెండు శ్లోకాలను వాల్మీకి ఆశ్రమాన్ని చేర్చటం, ఉత్తరరామాయణం వంటివన్నీ ఇలాంటివే. అయోధ్య కాండలోని 108-109 సర్గల్లో జాబాలి, రామ సంవాదము ఉంటుంది. 108వ సర్గలోని 18 శ్లోకాల్లో జాబాలి నాస్తిక మతం గురించి రాముడికి చెప్తాడు. 109 సర్గలోని 39 శ్లోకాల్లో రాముడు జాబాలి నాస్తిక మత వాదాన్ని ఖండిస్తాడు. ఈ మొత్తం వాదన జరుగుతున్న క్రమంలో 34వ శ్లోకంలో అకస్మాత్తుగా ‘బుద్ధుడు చోరుని వంటి వాడు. అతడు నాస్తికుడని తెలుసుకొనుము. అతడు ప్రజలకు శంకాపాత్రుడు..’ అన్న మాట ఉంటుంది. దీనికి ముందు కానీ, దీనికి తరువాత కానీ.. ఎక్కడా ఈ బుద్ధుడి ప్రస్తావన లేదు. జాబాలి సైతం ఈ బుద్దుడి గురించి అస్సలు ప్రస్తావించనేలేదు. రాముడు సైతం ధర్మ వర్తన, కర్తవ్యం గురించి మాట్లాడాడు. ఎలాంటి సందర్భం లేకుండా, ప్రస్తావన లేకుండా.. కనీసం జాబాలి ప్రస్తావన అయినా చేయకుండా ఒకే ఒక్క శ్లోకాన్ని బుద్దుడిని తిడుతున్నట్టుగా ఒకే ఒక్క శ్లోకం వస్తుంది. ఒకవేళ జాబాలి అడిగితే రాముడు చెప్పాడేమోననుకోవడానికి సమర్థించుకోవచ్చు. పోనీ రాముడు బుద్ధుడి గురించి నాస్తిక ధర్మంతో ముడిపెట్టి చర్చించాడని కూడా అనుకోవడానికి కూడా లేదు. ఒకే ఒక్క శ్లోకంలో మూడే మూడు మాటలతో పంటి కింది రాయిలా ఈ శ్లోకం వచ్చి వెళ్తుంది. ఇది ప్రక్షిప్తమని ఇట్టే అర్థమైపోతుంది. వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలోని 108,109 సర్గలు ఒరిజినల్‌వి చదవండి మీకే తెలుస్తుంది. దీన్ని బట్టి సోకాల్డ్ చరిత్రకారులమని అనుకునే వారు.. బుద్ధుడి కాలం తరువాత రామాయణం జరిగిందని లేదా రాశారని లెక్కలు కట్టి ఖరారు చేసి ధ్రువీకరించేసి వ్యాసాలు.. పుస్తకాలు రాసేయడం.. వాటిని ప్రచారంలోకి తీసుకొని రావడం ఈ దేశం చేసుకున్నదురదృష్టం. ఇంత భారీస్థాయిలో వక్రీకరణలు జరుగుతుంటే.. మన పండితులు, కవులు, రచయితలు, మేధావులు.. ఈ ప్రక్షిప్తాలను పూర్తిగా తొలగించి వాస్తవ వాల్మీకి రామాయణాన్ని సాధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదా? ఈ అంశాన్ని మేధావులు గుర్తించకపోవడం విషాదమే. ఇలాంటివి చేయకపోవడం వల్ల ఈ స్వయం ప్రకటిత చరిత్రకారులు, వ్యాఖ్యాతలు చెప్పినవి.. రాసినవే నిజాలుగా భావించే పరిస్థితి నెలకొన్నది. ఈ కారణంగా గత యాభై ఏండ్లలో ఒరిజినల్ రామాయణ, భారత ఇతిహాసాలు కానీ, ఇతరత్రా భారతీయ రచనలు మూలంలో ఏమున్నదో చదువకుండానే వాటిపైన అభిప్రాయాలు చెప్పే పరిస్థితి తలెత్తింది. భారతీయతను భారతీయ చరిత్రను మూలాలను వ్యతిరేకించడం వెనుక కూడా సమాజం ఎప్పటికీ అనైక్యంగా ఉండేలా చేయడంమే ప్రధాన లక్ష్యం. ఇప్పుడు కులగణన, మత ప్రాధాన్యం వంటివన్నీ ఈ కోవలోకి చెందినవే. గత పదకొండేళ్లుగా అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం ఒక మతాన్ని ఆధారం చేసుకొని అధికారంలో కొనసాగుతున్నదని ప్రత్యర్థి రాజకీయులు ఒక ఎత్తుగడ వేశారు. దాని పేరు కులగణన. ఒక మతం ఓట్లు ఒక పార్టీకి పూర్తిగా పోలరైజ్ కాకుండా ఉండాలంటే.. కులాల మధ్య అనైక్యత సృష్టించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని గమనిస్తే.. ఈ కులగణన వెనుక ఉద్దేశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎస్సీలో ఒక వర్గం జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి తక్కవ జనాభాకు అన్యాయం జరుగుతున్నదని వర్గీకరణ కోసం పోరాటం సాగింది. రేపు కులగణన జరిగితే.. ఆయా రిజర్వేషన్ల క్యాటగిరీలలో ఉన్న వర్గాల మధ్య కూడా ఇదే రకమైన విభేదాలు పొడచూపే అవకాశాలు దండిగా ఉంటాయి. అప్పుడు మతపరమైన ఓట్ల పోలరైజేషన్ జరుగకుండా ఈ విభేదాల ద్వారా అడ్డుకోవచ్చు.. భారత దేశ రాజకీయాలు ఇంత సంక్లిష్టంగా ఉంటాయి. లోతుల్లోకి వెళ్తే కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం.
సరే అసలు విషయానికి వద్దాం. తెలుగుదేశంలో త్రిపురనేని రామస్వామి చౌదరి మార్గంలోనే సామినేని ముద్దుకృష్ణ కూడా నడిచారు. ఈయన కవి, రచయిత, నాటక ప్రయోక్త కూడా. సామినేని ముద్దు నరసింహం నాయుడు గారి మనుమడు అయిన ముద్దుకృష్ణ ప్రముఖ కవుల కవితల సంకలనం ‘వైతాళికులు’ సంకలనకర్త. ఈయన ‘అశోకం’ పేరుతో ఒక నాటకం రాశారు. రావణ వధ తరువాత సీత అగ్నిప్రవేశ సన్నివేశం ఇందులో ప్రధాన ఇతివృత్తంగా మనకు కనిపిస్తుంది. తనను అగ్ని ప్రవేశం చేయాలని అడిగిన రాముడిని సీత తీవ్రంగా నిందిస్తుంది. నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవి అని దూషణ చేస్తుంది. ఈ రకమైన డైలాగులతో నాటకం కొనసాగుతుంది. ఇలా అనేకానేక నాటకాలు కథలు, విమర్శలు వచ్చాయి. సదస్సులు జరిగాయి. భారత దేశంలో కుల వ్యవస్థ ఎప్పటికీ బలహీనం కాకూడదు అని అనుకునేవారు.. అగ్ర, నిమ్న అంతర వాదాన్ని రోజురోజుకూ బలోపేతం చేస్తూ ఎప్పటికీ దగ్గరకు రాదేమోనన్న స్థాయికి రాజకీయం చేస్తూ వచ్చారు.
ఆ తరువాతి కాలంలోనూ ఈ రకమైన రచనలు కొనసాగుతూ వచ్చాయి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తే.. రచయిత్రి రంగనాయకమ్మ దానికి పూర్తి వ్యతిరేకంగా రామాయణ విష వృక్షాన్ని రచించారు. శిష్ట్లా ఉమా మహేశ్వరరావు ‘సీత గీత దాటితే’ అన్న రచన చేశారు. శీర్షిక దగ్గర నుంచే శిష్ట్లా తీవ్రమైన అభ్యంతరకరమైన వివాదాన్ని సృష్టించేశారు. భారతదేశంలో ఫెమినిజం ప్రబలిన తరువాత సీత అంటే కష్టాలకు కేరాఫ్‌గా నిర్వచించారు. ఒక దశలో ఆడపిల్లకు సీత పేరు పెట్టుకుంటేనే కష్టాలు వచ్చేస్తాయని ప్రచారం చేశారు. అది మన సమాజంలో ఒక విశ్వాసంగా కూడా మారిపోయింది. త్రిపురనేని భావజాలాన్ని ఆ తరువాతి కాలంలో హేతువాదులు, లిబరలిస్టులు, కమ్యూనిస్టులు హక్కుల సంఘాల వారు అందుకున్నారు. ఈ భావజాలాన్నే ప్రచారం చేస్తూ వస్తున్నారు. రామాయణ వ్యతిరేకతను విశృంఖలంగా అన్ని బుర్రల్లోకి చొప్పిస్తూ వచ్చారు. అయోధ్యలో రామ మందిర వివాదం ముదిరిన తరువాత ఈ రామ, రామాయణ వ్యతిరేక ఉద్యమం మరింత తీవ్రమైంది. ఆ తరువాత సేతుసముద్రం ప్రాజెక్టు సమయంలోనూ కొనసాగింది. మహా భారతంపైన కానీ, ఇతర ఇతిహాసాలపై కానీ, చారిత్రక పురుషులపై కానీ లేని అంతులేని వ్యతిరేకత కేవలం రాముడిపై మాత్రమే ఎందుకు కొనసాగుతూ వస్తున్నది. ఈ ప్రశ్నకు సమాధానం భారతదేశ సమగ్రతపైనే ఆధారపడి ఉన్నదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే.. ఆసేతు హిమాచలం భారతదేశాన్ని ఏకం చేసింది కేవలం రాముడు మాత్రమే కావడం, ఆ రాముడి జీవితం మాత్రమే భారతీయ సంస్కృతికి ఆధారభూతం కావడం. రావణుడు గొప్పవాడు కావడం కూడా ఈ ఆందోళనలో భాగం మాత్రమే. రాముడి విషయంలో, రావణుడి విషయంలో, రామాయణం విషయంలోనూ అడ్డగోలు కల్పనలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నిజంగా రామాయణంలో రావణుడు అంతటి గొప్పవాడా? రాముడు రుషులను సంపదలను దోచిపెట్టడం కోసమే రాజభోగాలను వదిలేసి అరణ్యానికి వచ్చాడా? రుషులు సామ్రాజ్యవాద శక్తులకు ప్రతీకలా? సీత నిజంగా రామాయణంలో అంతులేని కష్టాలను అనుభవించిదా? రామాయణంలో ఈ రావణుడి గురించిన కథనం ఏమి ఉన్నది? ఇప్పుడు రావణుడి అభివ్యక్తి గురించి కానీ, వ్యక్తిత్వం గురించి కానీ, రాముడి వ్యక్తిత్వం గురించి కానీ ప్రచారంలో ఉన్నవి కానీ, ప్రచారం చేస్తున్నవి కానీ.. నిజంగా వాల్మీకి రామాయణంలో వాస్తవంగా ఉన్నాయా. సత్యాసత్యాలు ఏమిటి?
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
