[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
7
త్రిపురనేని నడిచిన బాట చాలామందికి బాసట అయింది. తెలుగునాట అనేకమంది కవులు, రచయితలే కాకుండా కమ్యూనిస్టు, హేతువాద, సామ్యవాద, స్త్రీవాద, కులవాదులందరికీ కూడా త్రిపురనేని దిక్సూచిగా నిలిచారు. రాజకీయులకు తమ ఉనికిని నిలుపుకునే బ్రహ్మాస్త్రమైంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.రావూరి భరద్వాజ ‘కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం-సాహిత్యం’ అన్న గ్రంథానికి రాసిన రెండు మాటలులో ‘పుస్తకాలు మనిషిని మారుస్తాయా అన్న ప్రశ్నకు అలా మార్చగలిగినవే ఉత్తమ గ్రంథాలు అన్నది ప్రత్యుత్తరం. నా జీవితం మీద ప్రబలమైన ప్రభావాన్ని కలిగించిన వారు రామస్వామి చౌదరి గారు, గుడిపాటి వెంకటచలం గారు. గోపరాజు రామచంద్రరావుగారూనూ. ఈ త్రిమూర్తులే లేకపోతే, వీరి పుస్తకాలే లేకపోతే, నేనెలా ఉండేవాణ్ణి కాదనుకుంటాను’ అని రాశారు. 1944లో తాటికొండలో శంబుక వధ నాటక ప్రదర్శన వేశారు. అందులో శంబుక పాత్ర రావూరి భరద్వాజ వేశారు. ఈ మాట ఆయనే స్వయంగా చెప్పారుకూడా. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా త్రిపురనేని భావజాలం విస్తృతంగా ప్రసరించింది. 60వ దశకంలో రామాయణ భారత, భాగవతాలలోని ఇతివృత్తాలను యథాతథంగా స్వీకరించి ఒక సిరీస్‌గా అనేక సినిమాలను చేసిన నటుడు ఎన్టీరామారావు.. 80వ దశకం వచ్చేసరికి రావణ, దుర్యోధనులను హీరోలు చేసి సినిమాలు చేయడం పూర్తి కాంట్రాస్ట్ అని చెప్పాలి. ఉదాహరణకు కొండవీటి వెంకటకవి, ఎన్టీరామారావు కాంబినేషన్‌లో దానవీరశూర కర్ణ సినిమా వచ్చింది. కర్ణ, దుర్యోధనాదులు గొప్పవారుగా, పాండవులు అధర్మపరులుగా చిత్రించిన సినిమా ఇది. కులంపై, కుల వివక్ష పై సుదీర్ఘమైన డైలాగులతో ఆ సినిమాను ఎన్టీరామారావు సూపర్ హిట్ చేశారు. దుర్యోధనుడిని హీరో చేయడానికి అతనికి ఒక డ్యూయెట్ కూడా పెట్టారు. అంతే కాకుండా దుర్యోధనుడి ముందు భీముడిని చిన్నచేసి వెకిలివాడిగా చూపించారు. అర్జునుడు, కృష్ణుడి పాత్రలను చిన్నచేశారు. అన్నింటికీ మించి ద్రౌపది పాత్రను దారుణాతి దారుణంగా చూపించారు. అజ్ఞాతవాస సమయంలో కృష్ణుడి చేత ఒక్కొక్కరి మనసులో భావాలను చెప్పాలని అడిగించి మహాభారతంలోని వారి వాస్తవ వ్యక్తిత్వాలను కించపరిచారు. ద్రౌపది చేత కర్ణుడిని ఆరో భర్తగా కావాలని కోరుకుంటున్నట్టు చెప్పించారు. ఇతిహాసాలలోని ఇతివృత్తాలను అత్యంత దారుణంగా పరిహాసం చేస్తూ ఇంతకంటే వికృతమైన సినిమా పౌరాణికంలో తెలుగులో వచ్చి ఉండలేదు. ఆ తరువాత తీసిన విరాట పర్వం సినిమా కూడా ఇదే కోవలో వచ్చింది.
తెలుగునాట పత్రికల ద్వారా సంస్కృతం పట్ల వ్యతిరేకతను, రామాయణ వ్యతిరేకతను త్రిపురనేని బాటలో బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లిన మరో ప్రముఖుడు నార్ల వెంకటేశ్వరరావు. సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదు అనే అభిప్రాయాన్ని తిరస్కరించారు. అగ్రకుల ఆధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి ప్రతీక అని అభివర్ణిస్తూ ‘శంబూక వధ’ ను రచించారు. ఆ తరువాత ఆయన జాబాలి పేరుతో ఒక నాటకాన్ని రాశారు. అయోధ్య కాండలో కనిపించే నాస్తికవాది జాబాలి గురించిన చర్చ వస్తుంది. జాబాలిది చాలా పిరికి పాత్ర. రాముడిని అడవికి వెళ్లకుండా ఆపడానికి విఫల ప్రయత్నం చేస్తారు. వశిష్ఠుడిని చూడగానే.. ఆయన్ని ఎదిరించే ధైర్యం చాలక రాముడి నిష్ఠను పరీక్షించడానికే తాను ప్రయత్నించానని చెప్పి వెళ్లిపోతాడు. రాముడితో అతడు జరిపిన సంభాషణ ద్వారా రుషులు కుట్రదారులు, మోసకారులు, అసూయలతో నిండినవారు అని నిరూపించే ప్రయత్నం చేశారు నార్లవారు.
వాల్మీకి రామాయణాన్ని కేవలం సంస్కృత రామాయణం అని మాత్రమే సంబోధించాలని.. ఎందుకంటే.. అందులో అనేక వాల్మీకులు చేయి చేసుకున్నారని సూత్రీకరించారు. త్రిపురనేని వారి బాటలోనే నడిచిన నార్లవారు సీత జోస్యం, జాబాలి పేర్లతో రెండు నాటికలు రచించారు. మనం ముందుగా చెప్పుకున్నట్టు రోమిలా థాపర్, త్రిపురనేని వారి ప్రభావాలు నార్ల వారిపైన తీవ్రంగానే పడ్డాయి. ఈ రెండు నాటికలకు వారు రాసిన సుదీర్ఘమైన పీఠికలలో తనదైన విశిష్టమైన ఆలోచనాశైలితో రామాయణ, భారతాలపై వ్యతిరేకతలను స్పష్టంగా వ్యతిరేకించారు. రామాయణంలోని అనేక అంశాలను, సన్నివేశాలను స్పృశిస్తూ వాటిని తనదైన రీతిలో ఖండిస్తూ వెళ్లారు. రామాయణాన్ని, రామ రావణ యుద్ధాన్ని థాపర్ రాసినట్టుగా ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య జరిగిన సంఘర్షణగానే ఆయన చూశారు. దాన్ని బలంగా విశ్వసించారు. దాన్ని బలంగా ప్రచారం చేస్తూ వచ్చారు. సీత జోస్యం నాటికలోనే ఈ రకమైన అభిప్రాయాన్ని నార్లవారు బలంగా వ్యక్తం చేశారు.
సీత జోస్యం కు రాసిన పీఠిక చివరి పేరాలో “రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు వీటన్నిటి ముఖ్య ధ్యేయం వర్ణ ధర్మ పరిరక్షణ. రాచరిక వ్యవస్థ రక్షణ.” అంటారు నార్ల. దీన్లో దండకారణ్యంలో ఋషులూ రాక్షసుల మధ్య ఘర్షణని ఆహారం ఉత్పత్తి చేసేవారికీ ఆహారం పోగు చేసేవారికీ మధ్య సంఘర్షణగా పోల్చి చిత్రిస్తారు. రఘు వంశానికే గొప్ప యుద్ధవీరుడని ఋషులు తనని పొగిడితే దాంతో ఉబ్బిపోయి రాక్షసుల్ని చంపే అహంభావిగా రాముణ్ణి చిత్రిస్తారు. అడవుల్ని నాశనం చేస్తున్న ఋషుల వల్ల రాక్షసుల భుక్తికి ప్రమాదం కలుగుతున్నదని సీత సత్యం గ్రహిస్తుంది. రాక్షసులు తిరగబడతారనీ, వాళ్ళ మానాన వాళ్ళను వదిలెయ్యమనీ సీత రాముణ్ణి కోరుతుంది. దక్షిణ ప్రాంత భూముల్ని ఆక్రమించటానికి ఇది ఋషులు వేసిన పథకం అని వివరిస్తుంది. కాని అతను వినడు. ఫలితం ఏమన్నా కానీ, బ్రాహ్మణులని కాపాడతానని మాట ఇచ్చానంటాడు. ఒకనాటికి ఆ బ్రాహ్మణుల్ని మెప్పించటానికి తనను కూడ వదులుకుంటాడని సీత జోస్యం చెప్పటంతో నాటకం ముగుస్తుంది!
ఈ నాటికలో రామాయణం గురించి తనకు ఉన్న అభిప్రాయాలను స్పష్టంగా వివరించారు.
- రామాయణంలో నూటికి 75 వంతులకు పైగా పుక్కిటి పురాణమే.
- తక్కిన 25 వంతుల కథకు కీలకం సింహాసనానికి దాదాపు అన్ని రాజ కుటుంబాలలో కొనసాగుతుండే కుట్రలు, కుహకాలు మాత్రమే.
- రాముడు వింధ్య పరిసరాలు దాటి రాలేదు.
- రావణుడు గోండు రాజు కావచ్చు, ఆదివాసి తెగ రాజు కావచ్చు. ద్రవిడ జాతికి చెందిన వాడు కాదు.
- రావణుడి లంక, ఈ నాటి శ్రీలంక ఒకటి కావు
- రామరావణ యుద్ధాన్ని రెండు విభిన్న జాతుల మధ్య సంఘర్షణ అనడం కంటే, ఫుడ్ ప్రొడక్షన్ ఎకానమీకి, ఫుడ్ గ్యాదరింగ్ ఎకానమీకి అంటే ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు సంఘర్షణ అనడమే సమంజసం.
- దండకారణ్య ప్రాంతానికి వ్యవసాయ విస్తరణతో రాముడికి కొంత సంబంధం కలదు కనుక, రాముని భార్య పేరు సీత కనుక, వేదకాలపు సీత మారి మారి రామాయణం సీతగా పరిణమించినట్టు చెప్పడానికి వీలు కలిగింది.
ఇలా అనేక అంశాలను పేర్కొంటూ పోయారు. రామాయణం ప్రాచీనమైంది కాదు అని ముందుగానే ఫిక్స్‌డ్ అభిప్రాయానికి వచ్చేశారు కాబట్టి.. రామాయణాన్ని బౌద్ధ జాతక కథలు, దక్షిణ భారత ప్రాంతానికి చెందిన కొన్ని జానపద కథల కలగాపులగమే రామాయణమని ఈయన వ్యాఖ్యానించారు. అంతే కాదు రామాయణంపై గ్రీకు, పౌరాణిక గాథల ప్రభావం కూడా బలీయంగా ఉన్నదని పేర్కొన్నారు. రామాయణం ప్రాచీనమైందని అంగీకరిస్తే రామాయణం ప్రభావం వీటన్నింటిపై పడిందని చెప్పాల్సి వస్తుంది. ఇది ఆయనకు అంగీకారయోగ్యం కాదు. రామాయణం పూర్తిగా కల్పిత గాథ అని తేల్చేశారు. ఇలా అన్న నార్లవారే రామాయణం లాంటి ప్రాచీన గాథలలో చరిత్రను తేల్చడానికి తవ్వకాలు జరపాలని సూచించారు. లక్ష్మణపురంగా పిలిచే లక్నోలో, గుహుడి రాజధానిగా పిలిచే శృంగబేరిపురంలో, వాల్మీకి, భరద్వాజ ఆశ్రమాల్లో తవ్వకాలు జరపాలని డిమాండ్ చేశారు. విచిత్రమేమిటంటే నందిగ్రామం, అయోధ్య, లక్ష్మణపురం, హస్తినాపురం, కురుక్షేత్రం, మధుర మొదలైన చోట్ల తవ్వకాలు జరిపితే.. రామాయణ భారతాలు ఎక్కడ కల్పిత గాథలని నిరూపితమవుతాయోనన్న ఆందోళనతో ప్రభుత్వాలు తవ్వకాలు జరపడానికి వెనుకంజ వేస్తున్నాయంట. అయోధ్యలో తవ్వకాలు జరిపితే అవి నామమాత్రంగా జరిగినవంట. కానీ, ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీబీ లాల్ నేతృత్వంలో ఈ రెండు ఇతిహాసాలు చెప్పిన పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. తవ్వకాలు ప్రారంభం కావడాన్ని నార్ల వారైతే చూశారు. భరద్వాజాశ్రమంలో రామాయణ ఆనవాళ్లను బీబీలాల్ తవ్వి తీశారు. ఒడిశా ప్రాంతంలో శిశుపాలుడి కోటనూ వెలికి తీశారు. కాకపోతే అప్పటికి నార్లవారు లేకపోవడంతో దీనిపై తెలుగు నాట పెద్దగా చర్చ జరగలేదు. రామాయణంలో రాముడికి విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అగస్త్యుడు అనేక ఆయుధాలు అందజేశారు. అవి ఆయనకు రామరావణ యుద్ధంలో ఉపయోగపడ్డాయి. కానీ, ఇవన్నీ కట్టుకథలేనని నార్లవారు కచ్చితంగా నిర్ధారించారు. తాను అలాంటి నిర్ధారణకు ఎందుకు వచ్చారో సమాధానం కూడా ఇదిగో ఇలా చెప్పారు. ‘నిజంగా అలాంటి ఆయుధాలే ఉంటే ఆధునిక కాలంలో అలెగ్జాండర్‌ను మనం ఎందుకు ఓడించలేకపోయాం? ఆ తరువాత అనేక యుద్ధాలలో మనం ఎందుకు ఓడిపోయాం?’ అని కూడా ఆయన ప్రశ్నిస్తారు. ఈ వాదనే పరమ విచిత్రంగా ఉంటుంది. ఆదిమకాలంలో మానవులు వాడిన ఆయుధాలు ఇప్పుడు ఎక్కడున్నాయి అంటే ఏం చెప్పగలం? ఒకనాడు బాణాలు, బరిసెలు, కత్తులు, కటార్లతో జరిగిన యుద్ధాలు ఇప్పుడు ఎందుకు జరగటం లేదు. తుపాకులు, శతఘ్నుల కాలం కూడా దాటిపోయి ఎయిర్ స్ట్రైక్సే ప్రధానంగా సాగుతున్న రోజులివి. అణ్వస్త్రాలు, క్షిపణులు, జీవ రసాయనాయుధాల ప్రయోగాలతో భూమిని క్షణాల్లో బూడిదపాలు చేయగల అస్త్రాలు శస్త్రాలు ఉన్న కాలంలో మనం ఉన్నాం. మున్ముందు అసలు కాల్బలంతో, గెరిల్లా యుద్ధాలతో పని లేని దశకు చేరుకుంటున్నాం. అలాంటప్పుడు రామాయణ భారతాల్లో ఆయుధాలు ఉండి ఉంటే అలెగ్జాండర్‌ను ఎందుకు జయించలేకపోయాం అని నార్ల వారు వ్యాఖ్యానించడంలో అర్థమేముందో వారి అనుచర గణం సవివరంగా చెప్పాలి.
నార్ల వారు ప్రధానంగా ప్రఖ్యాత మార్కిస్ట్ చరిత్రకారులు, సాహిత్యవేత్తలు అయిన డీడీ కొశాంబి, సంకాలియాలను ఆధారం చేసుకొని వాల్మీకి రామాయణాన్ని తనదైన స్టైల్‌లో వ్యాఖ్యానించారు. అగ్రేరియన్ కల్చర్ తోనే రామాయణం సాగినట్టు నిర్ధారించేశారు. మార్క్సిస్టు చరిత్రకారులు రోమిలాథాపర్ లాంటి వారు వాదించిన రీతిలోనే ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్యన జరిగిన యుద్ధమే రామాయణం అని తేల్చేశారు. రోమిలా పేరును ప్రస్తావిస్తూ తన అభిప్రాయానికి బలం చేకూర్చేలా వ్యాఖ్యానించారు. రామాయణంలో రుషులను, మునులను సంపద దోపిడీదారులుగా చిత్రించారు. రామాయణంలో మనకు కనిపించే విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అత్రి, శరభంగుడు, సుతీక్ష్ణుడు, సుదర్శనుడు, అగస్త్యుడు తదితరులంతా ఆశ్రమాల పేరుతో దండకారణ్యంలో పెద్ద ఎత్తున ఫాం హౌస్ లను (వ్యవసాయ క్షేత్రాలు) నిర్మించారని చెప్పారు. వీటిని నెలకొల్పడానికి యజ్ఞయాగాదుల పేరుతో ఎక్కడ పడితే అక్కడ హోమ కుండాలు ఏర్పాటు చేసి, మంటలు పెట్టి అడవులను పెద్ద ఎత్తున కాల్చివేశారని కూడా నిర్ధారించారు. దగ్ధం చేసిన ప్రాంతాలను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చారు. వ్యవసాయానికి కావాల్సిన పశు సంపదను రాజుల నుంచి గోదానాల రూపంలో సంపాదించారు. వ్యవసాయానికి కావాల్సిన కూలీలను విద్యార్థుల రూపంలో సమీకరించారు. ఇక్కడ విద్యార్థులంటే వ్యవసాయ కూలీలని భావించాలంట. వారి ప్రధాన కర్తవ్యం రుషుల కోసం పని చేయడం, పశుపాలన చేయడం, వీరు అడవులను కాల్చివేయడం వల్ల ఆహార సేకరణకు పాకులాడే స్థానికులైన అసురులకు ఆహారమే దొరక్కుండా పోయిందని, అందువల్ల మాత్రమే అసురులు రుష్యాశ్రమాలపై దాడులు చేశారని దీన్ని తట్టుకోలేక, రాముడిని రెచ్చగొట్టి, ఆయన్నుంచి హామీ తీసుకొని, అసురులను సంహరించేలా రుషులు, మునులు కుట్ర పన్నారని పేర్కొన్నారు. పైగా సీతాదేవియే అసురులను చంపడం పాపమని పేర్కొన్నదంట. అశోకుడు ఈ కారణంగానే యజ్ఞయాగాదులను నిషేధించాడట. నార్ల వారి రామాయణ ఇంటర్ప్రెటేషన్ ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది.
సీత జోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1981లో వచ్చింది. ఈ నాటకం పై సాహిత్య అకాడమీలోని ఒక ఉపసంపాదకులు ఈ నాటికపై ఒక సమీక్షను రాశారు. ఈ సమీక్ష అదే సంవత్సరం ఇండియన్ లిటరేచర్ మే-జూన్ పత్రికలో ప్రచురించారు. ఇందులో తనపై కొన్ని విశేషణాలను కూడా ఆ రచయిత వాడినట్టు స్వయంగా నార్లవారే పేర్కొన్నారు. (నార్లవారి రచనలు 3, 418 పే)
- ముందుగా ఒక అభిప్రాయానికి వచ్చి తరువాత కారణాల కోసం వెతికే వారు,
- తిరుగుబాటు భావాన్ని పాదుకొల్పదలచుకున్నవారు,
- ఇంకా ఎదుగని ఓ కళాశాల వాగ్వివాది,
- ఒక దురావేశపరుడు వంటి విశేషణాలను తనపై వాడినట్టు నార్ల వారు చెప్పారు.
ఈ సమీక్షకు నొచ్చుకొని వారు సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించారు. దానిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో వారు ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. నార్ల వారు జాబాలి, సీత జోస్యం పీఠికలలో ఏవైతే సూత్రీకరణలు చేశారో.. ఆ సూత్రీకరణలనే ఈరోజు రామాయణ వ్యతిరేకులు అస్త్రాలుగా వినియోగిస్తూ వస్తున్నారు. మొదటి వ్యాసంలో చెప్పినట్టు వరంగల్ లో 2024లో జరిగిన సదస్సులో వక్తలు మాట్లాడిన ప్రతి వాక్యానికి కూడా ప్రాతిపదిక నార్ల వారి పీఠికలనే చెప్పవచ్చు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
