[శ్రీ శరన్నవ రాత్రుల సందర్భంగా కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
6
రావణుడిని హీరో చేసింది.. చేసి నిలబెట్టింది కూడా దక్షిణ భారత ప్రజలే. ఇందుకు కారణం కూడా స్పష్టమే. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్యన ఒక స్పష్టమైన విభజన రేఖ గీయాలన్న రాజకీయ అజెండా తో మాత్రమే ఈ వాదన రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ‘బ్రాహ్మణ భావజాలం’ అన్న పదబంధంతో కేవలం బ్రాహ్మణ వ్యతిరేకతే కాకుండా, మొత్తం భారతీయ ధర్మాన్నే తూలనాడటం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశంలో రామాయణ వ్యతిరేకత ప్రారంభమైంది త్రిపురనేని రామస్వామి చౌదరి ద్వారా అని చెప్పవచ్చు. అంతకు ముందు రామాయణ వ్యతిరేకత ఆనవాళ్లయితే మనకు కనిపించవు. త్రిపురనేని రామస్వామి చౌదరి శంబూక వధ అనే ఒక నాటకాన్ని రాశారు. ఇందులో ఉత్తర రామాయణంలో పేర్కొన్న శంబూక వధకు సంబంధించిన ఇతివృత్తం ప్రధానమైంది. శంబూక వధకు ప్రాధాన్యం లభించింది బహుశా అప్పటినుంచే కావచ్చు. ఆయన జస్టిస్ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ ఆశయాలతో తెలుగునాట హేతువాద, రామాయణ వ్యతిరేక ఉద్యమానికి సారథ్యం వహించారు. ఆయన ఇంటికి సూతాశ్రమం అని పేరు కూడా పెట్టుకున్నారు. 1925లో తెనాలి మున్సిపాలిటీ చైర్మన్ గా ఆయన జస్టిస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తెనాలిలో జరిగే గంగానమ్మ కొలుపులలో జంతు బలులను నిషేధించారు. ఈ విషయంలో పెద్ద దుమారం రేగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయన్ను తొలగించినా.. మళ్లీ జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్నికై 1938 వరకు ఆ పదవిలో కొనసాగారు. ‘జాతీయ బ్రాహ్మణేతర ఉద్యమం’ అన్న పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. విజయవాడలో ఈ ఉద్యమానికి సంబంధించి మహాసభలను నిర్వహించి ఆ మహాసభలకు అధ్యక్షత వహించి బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.
పురాణాలపై వ్యంగ్యంగా సూత పురాణం రాశారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేనరాజు నాటకాన్ని నిరసిస్తూ అందులోని వేనుడు, బుద్ధుడి ఇతివృత్తాన్నే తానూ తీసుకొని వేనరాజుకు భిన్నంగా ఖూనీ అన్న నాటకాన్ని రచించారు. రామాయణ కల్పవృక్షానికి వ్యతిరేకంగా రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం రాసిన తీరుగానే త్రిపురనేని వారి ఖూనీ నాటకం వచ్చింది. ఆ తరువాత వివాహ విధి లోని మంత్రాలను అచ్చ తెలుగులోకి అనువదించి వధూవరులతో ఆ తెలుగు మంత్రాలతో ప్రమాణం చేయించడం ద్వారా అనేక వివాహాలు కూడా జరిపించారు. తెలుగునాట హేతువాద ఉద్యమానికి త్రిపురనేని బలాన్నిచ్చారనే చెప్పాలి. వివాహం ద్వారా ఎలాంటి జీవితాన్ని జీవించాలో పురోహితుడుగా చెప్పిన తరువాత.. వధూవరులచేత ప్రమాణ స్వీకారం చేయించి, తాళిబొట్టు కట్టించి సప్తపది జరిపించి చివరగా మంగళ గీతం పాడించడంతో పెండ్లి తంతు ముగుస్తుంది. ఈ పుస్తకం రాయడం ద్వారా పురోహితులు చేసే దోపిడీని అరికట్టామని త్రిపురనేని ఘాటుగా మాట్లాడారు.
సూతపురాణంలో త్రిపురనేని రామస్వామి చౌదరి చాలా వింతైన విచిత్రమైన వాదనలు, విశ్లేషణలు చేస్తూ పోయారు. తృతీయాశ్వాసంలో హిరణ్యకశిపుని వృత్తాంతం గురించి రాశారు. హిరణ్యకశిపుడు ద్రవిడ రాజు అని నిర్ణయం చేశారు. ఇక్కడ ఆయన రాసిన ఈ పద్యాన్ని చూడండి.
సీ.
మాంస పంకిలములౌ మఖశాలలును లేవు
భగవంతునకు జంతుబలులు లేవు
ఇంకిపోయెడునట్టి యేరువాకలు లేవు
సివమెత్తి కాయని చెట్లు లేవు
విసిరి కొట్టెడునట్టి వేడి గాడ్పులు లేవు
పండకుండెడి చౌటిపడెలు లేవు
మూడు వానలు లేక పాడైన నేల లేదు
రుతు ధర్మమెఱుగని యేడు లేదు
గీ.
లేశమైనను బ్రజలకు లేమి లేదు
దొంగతోడుబోతుల పౌజుదొద్దలేదు
ప్రధితవీరాగ్రగణ్య హిరణ్యకశిపు
ధారుణీపాలకుండేలు ద్రవిడసీమ
హిరణ్యకశిపుడి పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో జీవించారని కీర్తించిన త్రిపురనేని, చతుర్ధాశ్వాసంలో శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కాదని, ఒక రాజకీయ వేత్త అని.. ఆర్యుల అనుగ్రహంతో, వారి బంధుత్వాలతో ఆర్య మతోద్ధరణకు కృషి చేశాడని చెప్పారు. అంతే కాదు.. కృష్ణుడిని కూడా ద్రవిడుడే అన్నారు. ద్రావిడుడైనా జాత్యభిమానాన్ని వదిలిపెట్టి.. చాలా మంది ద్రావిడులను చంపాడట. చివరకు ఈ కృష్ణుడి వల్ల యాదవ కులానికి దుర్గతి పట్టిందట.
సీ.
కామోపభోగముల్ కాంక్షించి వాంఛించి
చెలరేగి యాదవ స్త్రీజనంబు
మితిమీరి గతి దప్పి మ్లేచ్ఛ కిరాత వి
షాద పురుషాళి పజ్జ జేరి
కాంతార వీధుల గదిలిపోయిరి వారు
మరులెత్తి సరిక్రొత్త మగలతోడ
శ్రీకృష్ణునంతటి చిర యశోవంతుని
చెలిమి చుట్టరికంపు జేసియుండి
గీ.
యతడు చనినంత కుల గౌరవాదులైన
సరకు సేయక దుశ్చింత జారపాళి
గూడ యేగిరి కామార్తకుటిలు లగుచు
నేమికలదు రామస్వామి! యింకజెప్ప
శుభలగ్నాలు, అపశకునాలు.. ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలని రుజువు చేయడానికి కూడా త్రిపురనేని వారు రామాయణాన్నే చక్కగా వినియోగించుకున్నారు. అయోధ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం చేయడానికి వశిష్ఠుడు పెట్టిన ముహూర్తం.. శ్రీరామచంద్రుని వనవాసానికి దారి తీసిందని తనదైన వ్యాఖ్యానం చేశారు. మరి అదే వనవాసం రావణ వధకు దారితీసిందని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే.. రావణుడు గొప్పవాడని అనాలి కదా! అందుకే చూడండి..
ధరణి బుట్టుట గిట్టుల కొఱకు గాదె
యెప్పుడో యొకప్పుడు చావు తప్పబోదు
జాతి యభివృద్ధి కొఱకునై సమసిపోయె
రావణుండెంత ధన్యుడూ ప్రథన భూమి
నిజంగా ఇలాంటి రచయితల కారణంగా రావణుడు ధన్యుడయిపోయాడు. ఇక త్రిపురనేని వారు రాసిన శంబూక వధ నాటకం శ్రీరామచంద్రుని దుర్మార్గుడిగా చిత్రించడానికి మాత్రమే రాసినది. ‘ఆర్య పక్షపాతి యైన శ్రీరామచంద్రుడు ద్రావిడులను అష్టకష్టాలు పెట్టాడంట. శంబూకుడిని ప్రశంసిస్తూ.. అతడు ‘కృషాంగున్, నిరాహారున్, శోణకుటాఛ్ఛటాదారున్, మహోగ్రచారు నేకాగ్రతాపారీణాత్ము నధోముఖున్, భసిత శంభత్పాండుర శ్రీనిధిన్, ధీరత్వాకరు, జీరధారు, దీప్యత్తపస్యాన్వితుడు’ అని పేర్కొన్నాడు. ఇతడు కేవలం ‘అనార్య తాపసి’ అన్న కారణంతో దయాదాక్షిణ్యాలు లేకుండా రాముడు సంహరించాడంట. రామరాజ్యంలో అనార్యులకు తపస్సు చేసే హక్కు కూడా లేదా అని చౌదరి గారు ప్రశ్నిస్తారు. 1920లో రాసిన ఈ నాటకంలో శంబూకుడు స్వాతంత్ర్య సిద్ధి కోసం ప్రాణత్యాగం చేశాడని.. ద్రావిడులను నిరంతరం బానిసలుగా ఉంచడానికి రాముడి మత గురువైన వశిష్ఠుడు కుట్ర చేశారని రాశారు. సమసమాజ స్థాపనానికి ఆర్య మతము విఘాతం కలిగిస్తున్నదని ఇందులో పేర్కొన్నారు. ఈ నాటకంలోని కొన్ని సంభాషణలు చదివితే లోతుపాతులు అర్థమవుతాయి.
చైనులు: ద్రావిడులయందు నూతన శక్తి యొండుద్భవిల్లినది. ఆర్యులతో సమాన స్వత్వమును గోరుచున్నారు. దీనికంతకును మూలకంద మా శంబుకుడు. వానిని గడతేర్చినగాని యీ యాందోళనము సమసిపోదు.
సోమయాజులు: అయితే నీవు శంబుకునెఱుంగుదువా? వాడెంత పనిజేయుచున్నాడు. తొల్లి తపోభంగమై ద్రావిడుడై పుట్టెను గాబోలు.
చై: ఆ! యెఱుంగుదును. పరమ సాధువు, విజ్ఞాని. పరాపకారము దలపెట్టడు
సో.యా: నీ మాటలు చిత్రముగానున్నవి. అట్లయినచో నిదియంతయు నేమిటి? యెందులకు వచ్చిన పని?
చై: ప్రజలందఱు సమానముగా బరిపాలింపబడవలయుననియు, అందులో నీషణ్మాత్రమైన భేదముండగూడదని యాతని యభిప్రాయము. అందుచే నతడిట్లు చేయుచున్నాడు.
సో.యా. అట్లయితే రుషిప్రోక్తములగు గ్రంథములన్నింటిని సున్న చుట్టవలసినదేనా?
చై: స్వత్వసామాన్యమునకు బ్రతిబంధకములగు నీతులన్నియు గర్హ్యములనియే యాతని యభిప్రాయము.
సో.యా.: ఓహో! కొంపకు నిప్పు ముట్టించుచున్నాడే? అతడిప్పుడెక్కడ నున్నాడు?
చై: మన పట్టణంబునకు బరిసరంబుననే సరయూనదీతీరమున జిదానందాశ్రమమని పేరు పెట్టుకొని యాశ్రమము నిర్మించుకొని తపస్సు జేసికొనుచు, నప్పుడప్పుడు శిష్యులకు దత్వోపదేశము గావించుచున్నాడు.
సో.యా: (మండిపడుచు) ఏమి: తపస్సా? శుద్రుడు, తపస్సా? శిష్యుల కుపదేశములా? ఏమి వింత? రామరాజ్యంలోనే యిట్టి వింతలా; ఇప్పుడు మనము చేయవలసినది యేమి?
ఈ సంభాషణలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆర్యులు, ద్రావిడులు వేరు. శంబుకుడు అనేవాడు ద్రావిడుడు. ఈ ద్రావిడుడు.. ఈ ఆర్యుల మతాన్ని నిరసించాడు. సమసమాజ స్థాపనకు ప్రయత్నించాడు. పురాణాలు, రుషిప్రోక్తములనైన గ్రంథాలన్నీ సమసమాజానికి, స్వేచ్ఛా జీవనానికి విఘాతములైనవి.. వాటిని చెత్తబుట్టలో పారేయాలి. శూద్రులు తపస్సు చేయకూడదు. ఇది చాలా అన్యాయమైనది. ఈ రకంగా శంబుకుని పేరుతో నాటకం రాశారు.
ఈ టైమ్ లోనే రాముడికి శంబుకుడితో ఒక లెటర్ కూడా రాయిస్తారు రామస్వామి చౌదరిగారు ఈ నాటకంలో
మ:
అతిలోభంబునుబూని యాత్మహిత కార్యస్థాపనాచార్యులై
స్మృతి నిర్మాణ విదగ్ధులై తనరువారిన్ సభ్యులం జేసి త
ద్ధిత పక్షుండవు ధర్మపీఠమునయం: దేకూరు చున్నత మా
గతియే మౌనొ యెఱుంగజాల మొకొ యింకన్ రామచంద్ర ప్రభూ!
మ:
మత నిర్మాణమునకై వచించి రుషులామ్నాయంబులన్ బిమ్మటన్
స్మృతులంజెప్పిరి యార్య సంఘమొగి వర్ధిల్లంగ మేమందుచే
జతురామ్నాయములం దలంచుచు నమస్కారమ్ముం జేయుచున్
స్మృతి ధిక్కారము జల్పబూనితిమి మా క్షేమాభిలాషంబుచే
ఆర్యసంఘం ద్వారా వచ్చిన స్మృతులను ధిక్కరించాలని నిర్ణయం చేసుకున్నామని శంబుకునిచే అనిపించిన త్రిపురనేని చివరకు రాముడితో ‘మా రాష్ట్రవాసులకెల్ల సమానములగు హక్కులిచ్చి పక్షపాత రహితముగ రాజ్యమేలుట మాకు విద్యుక్త ధర్మము’ అని అనిపించి నాటకాన్ని మమ అనిపించారు. సామ్యవాద ఉద్యమానికి ప్రత్యేకమైన టెర్మినాలజీ ఉంటుంది. దేనికైనా ఆ టెర్మినాలజీని ఆ ఉద్యమకారులు.. ఆ ఉద్యమంలోనుంచి పాయలుగా వచ్చిన ఉద్యమాల కార్యకర్తలు తరచూ వాడుతుంటారు. ఆ వాడకం కూడా వారికి కన్వీనియంట్‌గా ఉండేలా జాగ్రత్త పడతారు. ఈ టెర్మినాలజీ ప్రపంచ ప్రజలందరి పట్లా అద్భుతమైన కన్సర్న్ చూపుతుంది. కానీ, వాటి వినియోగంలో మాత్రం తమ అజెండా ప్రకారం ముందుకు పోతారే తప్ప ఇతరత్రా ఏమీ ఉండదు. ఇందుకోసం ఎంతకైనా సిద్ధపడతారు. తమ లక్ష్యసాధన కోసం కొన్నింటిని తామే అడ్డం పెట్టుకొని.. వాటిని నానా రకాలుగా తమదైన టెర్మినాలజీని కుప్పించి చంపేయడానికి ప్రయత్నిస్తారు. తట్టుకోలేనివి చనిపోతాయి. రామాయణ భారతాల వంటి గట్టి పిండాలు తట్టుకొని నిలబడతాయి. భారతీయ ధర్మం కోసం దానిని నిలబెట్టేందుకు ఎక్కడైనా ప్రయత్నాలు జరిగితే.. వాటికీ తామే అడ్డంగా నిలబడి.. వాటిపై దుర్వ్యాఖ్యానాలు చేస్తూ.. కావలసినంత బురదను ఏరుకొని వచ్చి మరీ చల్లారు. ఇందుకు ఉదాహరణ త్రిపురనేని వారి ఖూనీ నాటకం. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వేన రాజు అనే నాటకాన్ని రాశారు. భాగవతంలోని వేనుడి వృత్తాంతాన్ని వస్తువుగా తీసుకొని పది అంకాలతో ఈ నాటకాన్ని రచించారు. ఈ నాటకాన్ని త్రిపురనేనివారు తీవ్రంగా నిందిస్తూ.. విశ్వనాథవారిపై కావలసినన్ని రాళ్లు వేస్తూ.. దానికి ప్రతిగా ఖూనీ అనే నాటకం రాశారు. విశ్వనాథ వారు మరచిపోయిన తాతల నాటి కథలను తవ్వి, పెకళించి, ఆర్య రుషుల మహాత్మ్యములను కొత్త మాటలతో బోధించడానికి ప్రయత్నించి విఫలమయ్యారని ఇందులో చెప్పుకుంటూ వచ్చారు. విశ్వనాథ తన తర్క కుతర్కాలతో వైదిక మతాన్ని, ఆస్తిక ధర్మాన్ని ప్రచారం చేయడానికి కుట్ర చేసి కృతకృత్యులు కాలేకపోయారని వేన వధను సమర్థించడానికి విశ్వనాథ పడరాని పాట్లు పడ్డారని కూడా పేర్కొన్నారు. ఇట్లా త్రిపురనేని ప్రారంభించిన ఉద్యమం తరువాతి కాలంలో అనేక మంది రచయితలకు ఆలంబన అయింది.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
