Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-5

[శ్రీ శరన్నవ రాత్రుల సందర్భంగా కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

5

ఇప్పుడిక మొదటి వ్యాసంలో పేర్కొన్నట్టు.. మార్క్సిస్టు చరిత్రకారుల గురించి చెప్పుకోవాలి. చరిత్రను కూడా ఒక పర్టిక్యులర్ దృక్కోణంలో మాత్రమే చూడాలని నిర్వచనం చెప్పింది వీరే. మార్క్సిస్టు దృక్పథం, ఇస్లామిస్ట్ దృక్పథం, హిందూ దృక్పథం, గ్రీకు దృక్పథం, పాశ్చాత్య దృక్పథం.. ఇలా రకరకాలుగా చరిత్రను చీల్చి చెండాడింది ఈ కమ్యూనిస్టు ప్రపంచం. తమను తాముగా మేధావులుగా ప్రకటించుకునే ఏకైక వర్గం ఏదైనా ఉన్నదంటే.. అది మార్క్సిస్టు కమ్యూనిస్టులే. అసలు చరిత్ర అంటే దానికి ఇజాలు ఏముంటాయో నాకైతే అర్థం కాని విషయం. గతకాలమే చరిత్ర. దీన్ని ఉన్నదున్నట్టుగా చెప్పడానికి, రాయడానికి ఇబ్బంది ఏమిటి? దీనికి తమదైన ఇంటర్‌ప్రిటేషన్లు ఎందుకు ఇస్తారు? మార్క్సిస్టు చరిత్రకారుడు అని చెప్పుకుంటారు, కానీ చరిత్రకారుడు అని చెప్పుకోలేరేమి? ఈ చెప్పుకోవడంలోనే పక్షపాతంతో విశ్లేషిస్తున్నట్టు స్పష్టమవుతున్నది కదా.. ఇక ఆ చరిత్ర వాస్తవ చరిత్ర ఎలా అవుతుంది?

వీళ్లు ఎన్ని రకాలుగా పిల్లిమొగ్గలు వేస్తారో అయోధ్యలో రామజన్మభూమి కేసు వాదోపవాదాల సందర్భంలోనే చాలాసార్లు స్పష్టమైంది. శతాబ్దాల నాటి విశ్వాసాన్ని, ధర్మాన్ని, రామరాజ్య కాన్సెప్టును సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు చరిత్రకారులు గత వందేళ్లుగా చేయని ప్రయత్నమంటూ లేదు. 1990-1991లో రామజన్మభూమి కేసు విచారణ, వివాదం నడుస్తున్నప్పుడు విశ్వహిందూ పరిషత్, బాబ్రీమసీద్ యాక్షన్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్న సందర్భంలో ఈ మార్క్సిస్టు చరిత్రకారులు నిపుణులుగా ప్రత్యక్షమయ్యారు. తాము స్వతంత్ర చరిత్రకారులమని చెప్పుకుంటూ బాబ్రీమసీదుపై తమ వాదనలు, వ్యాఖ్యానాలు చేయనారంభించారు. ఈ విషయాలన్నింటినీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మాజీ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కేకే మహమ్మద్ తన ఆటో బయోగ్రఫీలో రికార్డ్ చేశారు. ఈ చరిత్రకారులు.. శాంతియుతంగా పరిష్కారం వెతికే ప్రయత్నాలను గండికొట్టేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ‘A team of left historians in Jawaharlal Nehru University such as Romila Thapar, Bipin Chandra, and S. Gopal argued that there was no mention of the dismantling of the temple before the nineteenth century and Ayodhya was a Buddhist-Jain centre. Historians such as Irfan Habib, R. S. Sharma, Athar Ali, D. N. Jha, Suraj Bhan, too joined and it became a big grouping.’ అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ చరిత్రకారులు మొట్టమొదట బాబ్రీమసీదు పూర్తిగా ఖాళీ స్థలంలోనే నిర్మించారని.. అక్కడ ఎలాంటి కట్టడం అంతకు ముందు లేదని వాదించారు. కానీ వివాదాస్పద స్థలంలో సంప్రదాయ భారతీయ నిర్మాణం బయటపడిందో.. వెంటనే మాట మార్చారు. అయోధ్య అనేది జైన, బుద్ధ కేంద్రం అని, 19వ శతాబ్దం తరువాతే అక్కడ రాముడికి ప్రాధాన్యం పెరిగిందని, అక్కడ కనిపించే శిథిలాలన్నీ కూడా బౌద్ధ, లేదా జైనుల నిర్మాణాలకు సంబంధించినవేనని క్లెయిమ్ చేశారు.

1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ కట్టడాన్ని కూల్చి వేశారు. ఆ శిథిలాలలో 11, 12 శతాబ్దాలకు చెందిన గహాద్వాల శాసనం ఒకటి బయటపడింది. ఈ శాసనంలో అక్కడ విష్ణుహరి మందిరం ఉన్నదని విస్పష్టంగా రాసి ఉన్నది. వెంటనే మార్క్సిస్టు చరిత్రకారులు మరింత దారుణంగా ప్లేటు ఫిరాయించారు. ఈ శాసనాన్ని లక్నో మ్యూజియం నుంచి దొంగలించుకొని వచ్చి 1992 డిసెంబర్ 6న ఆ శిథిలాలలో పెట్టారని.. దాన్నే బయటపెట్టారంటూ కొత్త కథ అల్లారు. వారి వాదాన్ని నిరూపించడంలో విఫలమవడంతో, వాళ్లలోనే ఒక చరిత్రకారుడైన సీతారామ్ రాయ్.. ఆ శాసనం ప్రకారం అక్కడ ఉన్న కట్టడం విష్ణుహరి అనే ఒక వ్యక్తికి సంబంధించిన ప్యాలెస్ కావచ్చని కొత్త కథను రచించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వివాదాస్పద స్థలంలో తవ్వకాలు నిర్వహించింది. ఈ తవ్వకాల కార్యక్రమాన్ని పూర్తిగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపూ వివాదంలో భాగస్వాములైన సంస్థల ప్రతినిధులందరూ ప్రత్యక్షంగా హాజరయ్యారు. అయినప్పటికీ సోకాల్డ్ మార్క్సిస్టు చరిత్రకారులు తమ ప్రయత్నాలను వదిలిపెట్టలేదు. వివాదాస్పద స్థలంలో లభించిన కసౌటీ పిల్లర్లు, పిల్లర్ బేస్ లను వివిధ ప్రాంతాల నుంచి తరలించుకొని వచ్చి అక్కడ పెడుతున్నారని వాదించారు. ఏఎస్ఐ తవ్వకాలు హిందూ ముస్లిం ప్రతినిధుల సమక్షంలో జరుగుతున్నా.. కూడా లైవ్ వీడియో, ఫోటోగ్రఫీలు తీస్తున్నా కూడా ఇలాంటి ఆరోపణలు చేయడానికి వారు తెగించారనే చెప్పాలి. ఒక్కో సాక్ష్యం బయటపడుతున్నకొద్దీ.. ఒక మాట తరువాత మరో మాట మార్చడానికి వాళ్లు ఎంతమాత్రం వెనుకాడలేదు. కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ అవుతున్నప్పుడు ఈ చరిత్రకారులంతా ముస్లింల వైపు నిలబడ్డారు. కానీ వీరిలో ఏ ఒక్కరూ కూడా అయోధ్యను ఒక్కసారి కూడా సందర్శించింది లేదు.. ప్రాథమిక ఆధారాలను అధ్యయనం చేసిందీ లేదు. కేవలం ప్రకటనలు, న్యూస్ పేపర్ వ్యాసాలు, వార్తా కథనాలపై ఆధారపడి వారు మాట్లాడటంతో వారి వాదన పస లేనిదని తేలిపోయింది. నిరాధారమైన వారి మాటలు కోర్టులో క్షణకాలం కూడా నిలవలేకపోయాయి. ఈ చరిత్రకారుల తీరుతెన్నులపై అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సుధీర్ అగర్వాల్ అబ్జర్వేషన్లను ఒకసారి చూడండి.. సుప్రీం కోర్టు తీర్పు పాఠం యథాతథంగా ఇక్కడ పొందుపరుస్తున్నా.

“3622. We may mention here that though the said report claims to have been written by four persons but in fact it was not signed by Sri D. N. Jha. The opinion of an alleged expert, which is not based on her own study and research work but reflection of others’ opinion, in our view, shall not qualify to be considered relevant under Section 45 of the Evidence Act[7] as well as the law laid down by the Apex Court in State of Himachal Pradesh Vs. Jai Lal (supra).

3623. Normally, the Court does not make adverse comments on the deposition of witness and suffice it to consider whether it is credible or not but we find it difficult to resist ourselves in this particular case considering the sensitivity and the nature of dispute and also the reckless and irresponsible kind of statements, and the material got published by the persons claiming to be Expert Historian, Archaeologist etc. without making any proper investigation, research or study in the subject.

3624. This is really startling. It not only surprises us but we are puzzled. Such kind of statements to public at large causes more confusion than clear the things. Instead of helping in making a cordial atmosphere it tends to create more complications, conflict and controversy. Such people should refrain from making such statements or written work. They must be extremely careful and cautious before making any statement in public on such issues.

3625. The people believe that something, which has been said by a learned, well studied person, would not be without any basis. Normally they accept it as a correct statement of fact and affairs. Normally, these persons do not find a stage where their statement can be scrutinized by other experts like a cross-examination in a Court of law. In legal terminology, we can say that these statements are normally ex parte and unilateral. But that does not give a license to such persons to make statements whatsoever without shouldering responsibility and accountability for its authenticity. One cannot say that though I had made a statement but I am not responsible for its authenticity since it is not based on my study or research but what I have learnt from others that I have uttered. No one, particularly when he claims to be an expert on the subject, a proclaimed or self styled expert in a History etc. or the facts or events can express some opinion unless he/she is fully satisfied after his/her own research and study that he/she is also of the same view and intend to make the same statement with reasons.”[8]

వామపక్ష వాదులు తమ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పోవడానికి హేతుబద్ధమైన ఆధారాల కంటే కూడా రాజకీయ అధికారాన్నే వినియోగించుకుంటూ వచ్చారు. వాళ్లకు నిజాలు అవసరం లేదు. తాము చెప్పినవే నిజాలని ప్రజలను ఒప్పించడానికి రాజకీయ బలం, మేధో గూండాగిరిని చిత్తం వచ్చినట్టు వాడేసుకున్నారు. అన్ని వ్యవస్థల్లోనూ దూరిపోయి.. భారతీయ చరిత్రను, సంస్కృతిని తమ భావజాలానికి అనుగుణంగా ఇష్టారాజ్యంగా మార్చిపడేశారు. ఇస్లామిక్ చొరబాట్ల విషయంలో ముస్లింలు, అరబ్బులు, మంగోలులు చేసిన అరాచకాలను పూర్తిగా వైట్‌వాష్ చేసేశారు. ఒక్కోసారి అనిపిస్తుంది.. రాముడి కథ రాక్షసులు లేకుండా ఎలా కంప్లీట్ అవుతుంది అని..

అలాంటివారిలో రోమిలాథాపర్ చాలా ముందుంటారు. రామాయణం విషయంలో ఆమె రాసినన్ని వికృతాలు మరెవరూ రాసి ఉండలేదేమో అనిపిస్తుంది. రామాయణం అన్నది 800 బీసీలో జరిగిందని.. ఆర్యులనే వారు దక్షిణాది వైపు దండెత్తిన క్రమంలో జరిగిందే రామాయణమని ఆమె పేర్కొన్నారు. అసలు రామాయణం గంగా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారులకు, వింధ్య ప్రాంతంలో ఆహారం కోసం వేటాడే సమాజాలకు మధ్యన జరిగిన యుద్ధంగా అభివర్ణించారు. భారతదేశానికి మధ్యలో ఒక గీత గీసి వింధ్య సానువులకు పైన ఉన్న వారు.. వింధ్యకు దిగువన ఉన్నవారిపై చేసిన యుద్ధమని రాసుకొని వచ్చారు.

The description of Rama crossing the peninsula and conquering Ceylon is clearly a representation of Aryan penetration into the peninsula. As the southward movement of the Aryans is generally dated to about 800 B.C. the original Ramayana must have been composed at least fifty or a hundred years later. An earlier date for the original Ramayana is possible if it is conceded that the conflict between Rama and Ravana is a description of local conflicts between the agriculturists of the Ganges valley and the more primitive hunting and food-gathering societies of the Vindhyan region. The transference of these events to a more southerly location and the reference to Ceylon may have been the work of an editor of a later period.

ఇది రోమిలా థాపర్ ఎన్సీఈఆర్టీ ఓల్డ్ సిలబస్ 6వ తరగతి పుస్తకంలో రాసిన రామాయణ గాథ వివరం. మార్క్సిస్టు చరిత్రకారులు చరిత్రను ఎంత గొప్పగా వ్యాఖ్యానం చేస్తారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదు. పోనీ ఈ వ్యాఖ్యానానికి వాళ్లు చూపించే ఆధారం ఏమైనా ఉన్నదా అంటే.. అబ్బే అదేమీ ఉండదు. కనీసం వీరు రామాయణం చదివారో కూడా తెలియదు. వీళ్లు పదే పదే పేర్కొనే ఆహారోత్పత్తి సమాజాలు, ఆహార సేకరణ సమాజాలు అంటే ‘అగ్రేరియన్ కల్చర్’ అనేది ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నది. భారతీయ సమాజంలోనూ ఉన్నది. ఏ జీవి కూడా ఆహారం లేకుండా మనుగడ సాగించలేదు. భారతీయ చరిత్రలోకి మొదటిసారి అగ్రేరియన్ కల్చర్‌ను ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారుడు డీడీ కొశాంబి తీసుకొని వచ్చారని.. మరో ఇస్లామిక్, మార్క్సిస్టు చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కొనియాడారు. ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి డీడీ కొశాంబి అభిప్రాయాలను క్రోడీకరిస్తూ ప్రఖ్యాత పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది కె. బాలగోపాల్ ‘ప్రాచీన భారత దేశ చరిత్ర, డీడీ కొశాంబి పరిచయం’ అన్న చిన్న పుస్తకాన్ని రచించారు. కొశాంబి భారతదేశ చరిత్రపై రెండు గ్రంథాలు రచించారు. మొదటిది An Introduction to the Study of Indian History (ISIH), Popular Prakasan, Bombay, 1956 కాగా రెండవది The Culture and Civilisation of Ancient India, in Historical Outline (CCAI), Vikas Publishing House Pvt. Ltd., 1964. ఈ రెండు గ్రంథాల్లోనూ డిడి కొశాంబి అగ్రేరియన్ కల్చర్ మన చరిత్రతోనూ.. మన పురాణాలతోనూ పోల్చి చెప్పారు. దేవీ దేవతల స్వరూపాలు, వారి ఆయుధాలు, వాహనాలు అన్నీ కూడా ఏదో విధంగా ఆహారానికి, వ్యవసాయానికి ముడిపడి ఉన్న విషయాలపై కొశాంబి విస్తృతంగా చర్చించారు. మానవ సమాజంతో సమ్మిళితమైన భారతీయ ఆధ్యాత్మిక చింతనను, శాస్త్రీయ విజ్ఞానాన్ని మార్క్స్ దృక్కోణంలో కొశాంబి చర్చించారు. భారతీయ సమాజంలో అగ్రేరియన్ కల్చర్‌ను గురించి కొశాంబి చేసిన చర్చలో విభేదించడానికి బహుశా ఏమీ లేదు. సర్పాన్ని పూజించడం, నాగలి ఆయుధంగా ఉండటం, ఏనుగు, ఎలుక, నెమలి లాంటి అనేక జంతువులు, నీటిలో నుంచి పుట్టిన దేవతలు, ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలు, సూర్యుడు, చంద్రుడు ఇలా ప్రకృతిలోని అన్ని అంశాలు కూడా జీవ జాలంతో ముడిపడి ఉన్నవే. ప్రతి ఒక్కదాన్నీ భారతీయ సమాజం ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఆపాదించడం ద్వారా వాటికి ఒక పవిత్రతను కట్టబెట్టడం ద్వారా వాటిని సంరక్షించుకుని.. సవ్యంగా వినియోగించుకునే మార్గాన్ని చూపించింది. ఉదాహరణకు ఒక నదిలో చెత్త వేస్తే కలుషితమైపోతుంది. అదే నదిని అమ్మగా కొలిస్తే చెత్త వేసే సాహసం ఎవరూ చేయరు. అందులో రాగి నాణాలు వేస్తే.. నీరు ప్యూరిఫై అవుతుంది. ధర్మాన్ని, విజ్ఞానశాస్త్రాన్ని సమన్వయం చేయడం ప్రపంచంలో మన దేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. వనరులను ఎక్స్‌ప్లాయిట్ చేసే ఇతర ధర్మాల దృష్టికి మన భారతీయ దృక్పథానికి హస్తిమశకాంతరం ఉంటుంది. దేవీ దేవతలు ఉన్నారా? లేరా? లేక మిథ్య, వాస్తవం, కల్పితం.. పుక్కిటి వంటి పదాలను పక్కన పెడితే.. వ్యవసాయం లేకుండా భారతీయ సమాజం, జనజీవనం లేదనేది అందరికీ తెలిసిందే. మన సంస్కృతిలోనే వ్యవసాయం మమేకమై ఉన్నది. భారతీయ సమాజమే వ్యవసాయ సంబంధమైంది. ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు. ఉండక్కర్లేదు కూడా. మన ఇతిహాసాల్లో, పురాణాల్లో, వేదాల్లో సైతం వ్యవసాయ సంబంధమైన అనేక అంశాలు ప్రస్తావనకు ఉన్నాయన్నదీ వాస్తవమే. కొశాంబి కూడా అగ్రేరియన్ కల్చర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఇతిహాసాలు, పురాణాలు, దేవీ దేవతల కథనాల్లోని అనేక ప్రతీకలను ఉదాహరణలుగా చూపించారు. కొశాంబి తరువాత హెచ్ హెచ్ సంకాలియా కూడా అదే బాటలో నడిచారు. రామాయణం పూర్తిగా వ్యవసాయ సమాజానికి సంబంధించినదని.. వ్యవసాయం చాలా ముఖ్యమైన వృత్తిగా వీరు చెప్పుకుంటూ వచ్చారు. కృషికార, కృషివనః అన్న పదాలు రామాయణ కాలంనాటి వ్యవసాయ సమాజాలను సూచిస్తున్నాయని చెప్పారు. జనకుడు నాగలితో దున్నుతున్నప్పుడు సీత లభించింది. రాముడు నవగ్రహాయన పూజ నిర్వహించాడని, ఇది బహుశా వ్యవసాయానికి సంబంధించింది అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యవసాయదారులు వర్షాధార పంటలమీద ఎక్కువగా ఆధారపడ్డారని, అదేవ మాతృక అన్న పదం ఇరిగేషన్‌ను సూచిస్తుందని దేవ మాతృక, నదీ మాతృక పదాలు నీటి వనరులను సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి నాగలి, శూల, టంక, గొడ్డలి వంటి ఉపకరణాలను వాడేవారని, రాబోయే ప్రకృతి విపత్తులను రాజులు ముందే గుర్తించి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారని పేర్కొన్నారు.

రామాయణంలో వ్యవసాయ సమాజాలు ఉన్నాయా లేదా అన్న మీమాంస అవసరం లేదు. దీన్ని నిరూపించడానికి అందులోని పదాలను అన్వేషించి వాటికి నిర్వచనాలు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే భారతీయ సమాజం ముందు నుంచీ కూడా వ్యవసాయాన్ని ఆలంబనగా చేసుకొని ఎదిగిన సమాజమే. సహజవనరులను ఆధారం చేసుకొనే.. వాటిని సద్వినియోగం చేసుకుంటూనే భారతీయ నాగరికత విలసిల్లింది. ఇందులో సందేహం లేదు. కానీ, వచ్చిన చిక్కల్లా ఏమిటంటే.. రామరావణ యుద్ధం ఆహార ఉత్పత్తి సమాజానికి, ఆహార సేకరణ సమాజానికి మధ్యన జరిగిందని ప్రచారం చేయడమే. ఇందుకోసం రుషులను, మునులను భూకబ్జాకోరులుగా చిత్రించడం, వారి కోసమే రాముడు ఆహార సేకరణ సమాజాన్ని నామరూపాలు లేకుండా చంపాడని వ్యాఖ్యానించడం దారుణాతి దారుణం. రామాయణంలో ఆయా కథనాలను ఆయా కాలాలలో రచయితలు తమదైన రీతిలో రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ, అసలు ఏమాత్రం ఊహించడానికి కూడా వీలు లేని విధంగా వికృతమైన వాదనలను పైకి తీసుకొని వచ్చి.. అగ్రేరియన్ కల్చర్‌తో రామాయణాన్ని ముడిపెట్టి చూడటం క్షమించరానిది.. సహించరానిది.

(ఇంకా ఉంది)

Exit mobile version