[శ్రీ శరన్నవ రాత్రుల సందర్భంగా కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
4
రామ రావణ దృక్పథాలకు సంబంధించి తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అతివాద వైఖరులు మనకు బలంగా కనిపిస్తుంటాయి. మిగతా రాష్ట్రాల్లో సామాన్య ప్రజల్లో కనిపించకపోయినా.. మార్క్సిస్టు రచయితలు మాత్రం తమ దృక్కోణంలో రామాయణ వ్యతిరేకతను వివిధ కోణాల్లో ప్రెజెంట్ చేస్తూ పోయారు. మార్క్సిస్టు రచయితలు కానీ, మార్క్సిస్టు చరిత్రకారులు చరిత్ర, నవలలు, కథలు, కావ్యాల పేరుతో పలు రచనలు చేసినప్పటికీ అవి పెద్దగా నిలిచింది లేదు. కానీ ఈ మార్క్సిస్టు చరిత్రకారులు రాసిన ఈ గ్రంథాలలోని అంశాలనే ఆయా ‘మేధావులమని చెప్పుకునే వర్గం’ వల్లె వేస్తుంటుంది. బెంగాల్లో మైఖేల్ మధుసూదన్ దత్ అనే మతాంతరీకరణ చెందిన రచయిత రామాయణ వ్యతిరేకత ఆధారంగా మేఘనాథ వధ రచించారు. భారతదేశ చరిత్ర విధ్వంస రచనలో మార్క్సిస్టు చరిత్రకారులు ముందుగా విరుచుకుపడింది, ప్రధానంగా దాడి చేసింది రామాయణంపైనే. ఉత్తరాదిన బెంగాల్ నుంచి మైఖేల్ మధుసూదన్ దత్ ‘మేఘనాథ వధ’ కావ్యాన్ని రచించారు. ఇందులో ఇంద్రజిత్ కథానాయకుడు. ‘రాక్షసులు మంచివారు. రావణుడు చాలా గొప్పవాడు. రామ లక్ష్మణులు పిరికివారు. రెండు సార్లు రామ లక్ష్మణులను ముప్పుతిప్పలు పెట్టిన ఇంద్రజిత్తును తన బాబాయి విభీషణుడు ద్రోహం చేయడం వల్ల నిరాయుధుడుగా ఉన్నప్పుడు లక్ష్మణుడు హతమార్చాడు.’ స్థూలంగా ఇదీ ఆ కావ్యంలోని సంగ్రహ కథ. ఇంద్రజిత్తును హీరోగా చేయడం కోసం 1861లో మైఖేల్ మధుసూదన్ దత్ రాసిన కావ్యమిది. దీనికి మార్క్సిస్టు సాహిత్య లోకంలో ఎనలేని ప్రశస్తి లభించింది. తెలుగు నటుడు ఎన్టీరామారావు ఈ కథను ఆధారం చేసుకొనే సతీ సులోచన, ఇంద్రజిత్తు సినిమాలు తీశారు. నిజానికి వాల్మీకి తన రామాయణంలో దాదాపు పదకొండు సర్గల్లో విస్తారంగా చెప్పిన ఇంద్రజిత్, లక్ష్మణుల యుద్ధాన్ని పూర్తిగా మార్చేసి నిరాయుధుడిగా ఉన్నప్పుడు హతమార్చాడంటూ మైకేల్ మధుసూదన్ దత్ కథను మార్చేశాడు. దీంతో అటోమేటిక్‌గా లక్ష్మణుడు విలన్ అయిపోయి.. ఇంద్రజిత్తు హీరో అయ్యాడు. మహాభారతంలో కర్ణుడిని హీరో చేసి.. అర్జునుడిని, పాండవులను విలన్ చేసినట్టుగానే ఇది కూడా కథ మారింది. నిజంగా వాల్మీకి రాసింది ఇదేనా? అన్న అనుమానం వచ్చేస్తుంది. ఈ కావ్యగాథ చదివాక నాకు కలిగిన సందేహం అచ్చంగా ఇదే. దీనికోసం రామాయణాన్ని తిరిగి పరిశోధించాల్సిన పని పడింది. వాల్మీకి ఇంద్రజిత్తు గురించి, ఆతని యుద్ధ తంత్రం గురించి.. రామలక్ష్మణులతో అతడి యుద్ధం తీరు గురించి అత్యద్భుతంగా వివరించారు. తరువాతి వ్యాసాల్లో వాల్మీకి తాను రాసినదేమిటో, చెప్పినదేమిటో విస్తారంగా చర్చించుకుందాం.
క్రైస్తవాన్ని స్వీకరించి పేరుకు ముందు మైఖేల్ అని చేర్చుకున్న మధుసూదన్ దత్ రాసిన ఈ మేఘనాథ వధ కావ్యం ఆ తరువాత రామాయణ వ్యతిరేకులకు బాగా పనికి వచ్చింది.
తరువాతి కాలంలో అబ్రే మీనన్ అనే ఒక బెంగాలీ ఐరిష్ రచయిత రామాయణ కావ్యాన్ని రాశాడు. వాల్మీకి రాసిన రామాయణానికి 180 డిగ్రీలు రివర్స్ అంటే ఈ కావ్యమేనని చెప్పవచ్చు. మూల రచయిత రాసిన కథనానికి, పాత్రల వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఈ కావ్యం రాయడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం రేగింది. సాహిత్య లోకం మీనన్‌ను తీవ్రంగా ఆక్షేపించింది. భారతీయ సమాజం నుంచి తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కోవలసి వచ్చింది. రామాయణాన్ని బ్రాహ్మణులు ఆల్టర్ చేశారని (మార్చి రాశారని), అందువల్లే తాను వాస్తవ కావ్యాన్ని రాశానని ఈయన వెటకరించాడు కూడా. ఈయన గారి సిద్ధాంతం ఏమిటంటే.. రాముడు చికాగో ముఠా రౌడీ లాంటి మనస్తత్వం కలిగిన వాడంట. సీత చాలా చిన్న మనస్తత్వం ఉన్న ఆడపిల్ల అంట. తనను రావణాసురుడు బలవంతంగా ఎత్తుకుపోతుంటే చాలా సంతోషపడిన పిల్లంట. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు ఎన్నెన్నో ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. దీనిపై భారతీయ సమాజం సహజంగానే భగ్గుమన్నది. దీంతో 1956లో మీనన్ రచనను జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం నిషేధించాల్సి వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిషేధానికి గురైన మొట్టమొదటి పుస్తకం ఈ మీనన్ రామాయణమే. రామాయణంపై అనేక రచనలు, అనువాదాలు, అను సృజనలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. అయితే మూల కథను, కథనానికి దూరం కాకుండా స్వతంత్రత తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ, మూల కథలోని పాత్రల వ్యక్తిత్వాలను, చివరకు కథనాన్ని కూడా తమకు ఇష్టం వచ్చిన రీతిలో మార్చిపారేసి.. చిత్తం వచ్చినట్టు రాసేసి.. దాన్ని ప్రచారం చేసుకొని అవార్డులు కొనుక్కోవడం ద్వారా మహా రచయితలుగా చలామణి అయినవారు ఎందరో ఉన్నారు. ఒక ప్రఖ్యాత చరిత్రను ఎవరు పడితేవారు.. ఎలా పడితే వారు.. ఆ పాత్రల పేర్లను వాడుకొని.. తమ తమ సొంత పైత్యాన్ని, భారతీయతపై ఉన్న ద్వేషాన్ని కలగలిపి కలంలో పోసి అనేక రచనలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ అనేక రచనలు వారి వారి ఊహాపోహలను ఆయా పాత్రలకు ఆపాదిస్తూ ఉంటున్నాయి తప్ప వాల్మీకి రామాయణంతో వారికెలాంటి అవసరమూ లేదు.. అక్కరకూ రాదు. అమీశ్ త్రిపాఠీ అనే మైథో ఫిక్షన్ రచయిత 2015లో ఒక సీరీస్‌గా రామాయణం పైన పుస్తకాలు తీసుకొని వచ్చారు. ‘సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు’, ‘సీతా: వారియర్ ఆఫ్ మిథిల’, రావణ్: ఎనిమీ ఆఫ్ ఆర్యావర్త’, ‘వార్ ఆఫ్ లంక’ అన్న నాలుగు పుస్తకాలు తీసుకొని వచ్చారు. ఇందులో రావణుడిపై రాసిన నవల గమ్మత్తైనది.. చిన్నతనంలో చాలా కష్టాలు పడి పైకి ఎదిగి వచ్చిన రావణుడు సీతను ఎలా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందన్నది కథనం. ఇదే విచిత్రం.. రావణుడు చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడంట. వాల్మీకి ఈ మాట రాశాడా? లేక కనీసం ఉత్తర రామాయణంలోనైనా ఈ మాట ఉన్నదా? లేక ఈ రచయిత తనను తాను రావణుడిగా భావించి.. తన కష్టాలను రావణుడికి ఆపాదించాడా? ఇలా అసలు వాల్మీకి రామాయణానికి ఏ విధంగానూ సంబంధం లేని విధంగా ఇలాంటి కథనాలు రాసి వాటిని రామాయణ కాలంలోని వ్యక్తులకు ఆపాదించి వాటిని సినిమాలుగా తీసి జనం మీదకు వదులుతారు.. ఇదే రామాయణం అనుకొని ఆహా ఓహో అని చప్పట్లు కొడుతుంటారు. కొన్నాళ్లకు ఈ కథే రామాయణమనుకొనే దశకు చేరుకుంటుంది. ఇవాళ రామాయణ గాథలోని కథలుగా చెప్పుకుంటున్న వాటిలో చాలా చాలా కూడా ఇలాంటివే.
ఇక మరో రచన గురించి చెప్పుకోవాలి. ఈ రచన పేరు ‘లంకాస్ ప్రిన్సెస్’. ఈ పుస్తకాన్ని రాసిన రచయిత్రి పేరు కవిత కానే. రావణుడి చెల్లెలు శూర్ఫణక గురించిన రచన ఇది. శూర్ఫణకను హీరోయిన్గా చూపిస్తూ నిర్మించిన రచన. ప్రపంచంలోనే చాలా అందమైన యువతిగా శూర్ఫణకను ఈ రచయిత్రి అభివర్ణించింది. ఆమెను మీనాక్షిగా అంటే చేపవంటి కన్నులున్నదిగా పేర్కొన్నది. లంకా వినాశనానికి కారకురాలని శూర్ఫణకను బ్లేమ్ చేశారని.. నిజానికి ఆమె ఈ క్రూరమైన, గర్వంతో కూడిన ప్రపంచం వల్ల బాధితురాలైన యువతి అని తెగ బాధపడిపోయిందీ రచయిత్రి. మన లెఫ్టిస్టులు దీన్ని మరింత ఎలివేట్ చేసి మార్కెటింగ్ చేసేస్తుంటారు. అసలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా విక్టిమ్ శూర్ఫణక అని ప్రచారం చేస్తుంటారు. నిజంగా వాల్మీకి రామాయణం శూర్ఫణక గురించి ఏమని చెప్పిందో కనీసం వీరు చదువుతారా? అంటే అనుమానమే.
అరణ్యకాండ 17వ సర్గలో 10 నుంచి 12 శ్లోకాలలో రాముడు, శూర్ఫణకలను వాల్మీకి వర్ణించాడు. ఏమని వర్ణించాడో మీరూ చదవండి ‘ఆ రాక్షసి రాముడిని చూడగానే మన్మథునిచే ఆవహింపబడెను. ఆ రాముని ముఖము చాలా అందమైనది, ఆమె ముఖము వికృతముగా ఉన్నది. అతని నడుము సన్నగా ఉన్నది, ఆమె పొట్ట చాలా పెద్దది. అతని నేత్రములు విశాలమైనవి, ఆమె నేత్రములు వికృతముగా ఉన్నవి. అతని జుట్టు నల్లగా అందముగా ఉన్నది, ఆమె జుట్టు ఎర్రగా ఉన్నది. చూచువారకు ఆనందము కలిగించే రూపమాతనిది, ఆమెది వికృతమైన రూపము. అతని కంఠధ్వని మధురమైనది, ఆమె కంఠధ్వని కర్ణ కఠోరము. అతను నవ యవ్వన వంతుడు, ఆమె వెగటు కలిగించే వృద్ధురాలు. అతడు మాటలలో నేర్పరి, ఆమె వంకరగా మాట్లాడును. అతని నడవడిక న్యాయసమ్మతమై ఉన్నది, ఆమె చాలా చెడ్డ నడక కలది. అతను చూచువారికి ఆనందము కలిగించును, ఆమె చూచువారికి ఏవగింపు కలిగించును. (వాల్మీకి రామాయణం అరణ్యకాండ 17వ సర్గ 10-12 శ్లోకాలు). శూర్ఫణక ఎలాంటిదో ఇంత వివరంగా చెప్పిన తరువాత కూడా ఇలాంటి పుస్తకాలు రాసేవారిని ఏమని ప్రశ్నించాలి? పైగా ఆమె బాధితురాలంట. అసలు శూర్ఫణక వ్యక్తిత్వం ఏమిటి? ఆమె చేసిన దురాగతాలు ఏమిటన్న వాటి గురించి మున్ముందు మరింత విస్తారంగా తెలుసుకుందాం.
ఆనంద్ నీలకంఠన్ అనే ఆయన ‘అసుర’, ‘వాల్మీకీస్ వుమెన్’ అనే రెండు గ్రంథాలు రచించారు. మొదటిది రావణుడి దృక్కోణంలో రాసిన రచన. ఇందులో రావణుడు అణచివేయబడ్డ పీడిత గళాలకు ప్రతినిధి. వీరికి అసురులనే పేరు పెట్టి వేల ఏండ్ల క్రితమే రావణుడిని అతడి సైన్యాన్ని దారుణాతి దారుణంగా హతమార్చినవాడు ఆర్యుడైన రాముడు. ఇదీ నీలకంఠన్ అభివ్యక్తీకరణ. ఇక రెండో గ్రంథం వాల్మీకి రామాయణంలోని స్త్రీ పాత్రలు. ఇందులో ఆయన చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ వెళ్లారు. 1. అసలు దశరథుడి కూతురు శాంత త్యాగం చేయకపోయి ఉంటే.. ఆయనకు కొడుకులు పుట్టేవారా? అలాగే తన యజమానురాలైన కేకేయిని కాపాడుకోవడానికి మంథర ప్రవర్తిస్తే.. ఆమెను ఒక దుర్మార్గురాలిగా చిత్రిస్తారా? శూర్ఫణక, మండోదరి, కైకేయి, సీత, ఊర్మిళ.. ఇలా అనేక పాత్రలను ఫెమినిస్టు దృక్కోణంలో చూసి.. చిత్రించి.. ఒక పుస్తకాన్ని మార్కెట్లోకి వదిలేశారు. రామాయణం అంతా పురుషాధిక్య ప్రపంచానికి సంబంధించినదేనని.. స్త్రీలకు అసలు విలువే లేదనేది ఈ నీలకంఠన్ గారి దృఢమైన అభిప్రాయం. ఇట్లా కుప్పలు తెప్పలుగా రామాయణాలు ఎవరికి లోచినరీతిలో వారు రాసుకుంటూ వెళ్లిపోయారు. ఇవన్నీమూల రామాయణాన్ని.. దానిలోని నిజమైన చరిత్రను విధ్వంసం చేసే కుట్రలో భాగంగా మాత్రమే వచ్చినవి తప్ప మరేమీ కాదు.
దివాకరుని చిత్రా బెనర్జీ అనే రచయిత కూడా ఆనంద్ నీలకంఠన్ మాదిరిగానే ‘ది ఫారెస్ట్ ఆఫ్ ఎన్‌చాంట్ మెంట్స్’ అన్న శీర్షికతో రామాయణాన్ని ‘సీతాదేవి’ దృష్టితో రచించారు. ఒక అపహరణకు గురైన భార్యగా, అడవిలో వదిలేయబడిన తల్లిగా సీతాదేవి అనుభవాలు, కష్టాలను తన కోణంలో రాసుకుంటూ పోయారు. రామాయణంలో స్త్రీలను, వారి వ్యక్తిత్వాలను చాలా తక్కువ చేసి చూపించారని చిత్రా బెనర్జీ దృఢమైన అభిప్రాయం. ఇందులో సహజంగానే కైకేయి, శూర్ఫణక, మండోదరిల గురించిన చర్చ చేశారు. ప్రపంచంలోని పురుషులకు అనుకూల సమాజాల్లో మహిళలు తమ సాధికారత కోసం చేసే పోరాటానికి ప్రతీకగా రామాయణంలోని స్త్రీ పాత్రలను చిత్రా బెనర్జీ వస్తువుగా స్వీకరించారు.
సంహిత ఆర్ణి అనే మరో రచయిత్రి కూడా సీతాస్ రామాయణ అనే మరో రచన సీతాదేవిని ప్రధాన పాత్రధారిగా చేసి రచించారు. ఈ గ్రంథానికి మోయినా చిత్రకార్ చక్కని బొమ్మలు కూడా గీశారు. ఇది రామాయణ వ్యతిరేక గ్రంథం అని చెప్పలేము. తప్పుకు, ఒప్పుకు మధ్య జరిగిన ఘర్షణ, విశ్వాసం, విధేయత, కరుణ వంటి అంశాలతో పాటు యుద్దంలో మహిళలు, పిల్లలు, జంతువులు, పర్యావరణానికి కలిగిన హానిని గురించి ఈ రచన విస్తృతంగా చర్చిస్తుంది. రావణుడి చెర నుంచి బయటపడిన తరువాత కూడా సీతాదేవి తన నిజాయితీని, వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి పరీక్షను ఎదుర్కోవడాన్ని సంహిత ఆర్ణి చర్చించారు.
స్వామి ప్రేమానంద్, భారతీ అగర్వాల్ అనే రచయితలు సంయుక్తంగా 755 పేజీల బృహత్ గ్రంథాన్ని రచించారు. దీని పేరు ‘రావణ సంహిత(మంత్ర, యంత్ర, తంత్ర)’. ఈ గ్రంథంలో రచయితలు రావణుడికి సంబంధించి ఒక సరికొత్త అంశాన్ని సృష్టించారు. రామ, రావణులు రెండు వేర్వేరు నాగరికతలకు సంబంధించిన వ్యక్తులుగా పేర్కొన్నారు. ఇంతవరకు పెరియార్ నుంచి చాలా మంది చెప్పుకుంటూ వచ్చిన వారే. ఒకరు ఆర్య ద్రావిడ అంటే, మరొకరు ఉత్తర దక్షిణాలని చెప్పారు. మరొకరు మరొక రకంగా వివరించారు. వారి కోవలోనే వీరూ రచించారని అనుకోవచ్చు.. కానీ.. రావణుడి సమాజానికి, నాగరికతకు వీరొక కొత్త పేరు పెట్టారు.
Ravan is a must. Nobody can achieve the best results from this oldest scientific book, without knowing the Raksh civilization and Ravan. The followers of the raksh civilization were called rakshas. Ravan was the most powerful king of the raksh civilization, so we say him raksraj. But Ravan was neither a demon nor a devil, he was the most shining star of raksh culture, and civilization. Ravan was not only a great warlord and the most powerful king, but he was also 4: a great philosopher and psychologist. Doing regular hard work to achieve the deepest knowledge of both civilizations was his hobby. This book is a fruit of the hard labour done by Ravan in the fields of palmistry, numerology and numinous.
In Tretayug, there were two main civilizations in India. Arya “I civilizations was some more advanced and bigger than Raksh J. civilization. Followers of Arya civilization are known as Aryan, those we are. Ram is the most shining star of the Arya civilization. Ram defeated Ravan, so we believe that Ram was a Avtar of God Vishnu. The great war between Ram and Ravan, was not a war between two persons or to groups, it was the war between two great civilizations. This great ‘War was not only an incident, but was a well-planned game of Aryans, in which the Aryans were not only get victory, but also destroyed the raksh civilization.( Ravan Sanhita (Mantra, Tantra and Yantra.21)
రావణుడు దయ్యం కానీ భూతం కానీ కాడు. అతను ‘రక్ష్’ అనే నాగరిక సమాజానికి చెందిన వాడంట. రక్ష్ నాగరికతను అనుసరించేవారిని రాక్షసులని పిలుస్తారంట. రక్ష్ అనే రాజ్యానికి అత్యంత శక్తిమంతమైన రాజు. రక్ష్ సంస్కృతిలో నాగరికతలో మెరిసే తార లాంటి వాడు. రావణుడు గొప్ప వీరుడే కాక, అంతకంటే గొప్ప తత్త్వవేత్త, మానసిక శాస్త్రవేత్త, సాముద్రికం, సంఖ్యాశాస్త్రంలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నవాడే కాకుండా ఆర్య, రక్ష్ నాగరికతలకు సంబంధించిన నాలెడ్జి కోసం నిరంతరం పరిశ్రమించే గొప్పవాడు. అటు ఆర్య నాగరికతలో రాముడు గొప్పవాడు. రామ రావణ యుద్ధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యనో, రెండు గ్రూపుల మధ్యనో జరిగింది కానే కాదు. ఇది రెండు నాగరికతల మధ్యన జరిగిన యుద్ధం. ఆర్య నాగరికత కలిగిన సమాజం చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి రక్ష్ నాగరికతను వినాశనం చేసింది. ఇలా ఎవరికి తోచింది వారు.. ఎవరికి తోచిన రీతిలో వారు.. రామాయణాన్ని చీలికలు.. పేలికలు చేసి అడ్డగోలుగా కథలల్లి చివరకు ఒరిజినల్ వాల్మీకి రామాయణానికి విలువే లేకుండా చేసే ప్రయత్నం చేశారు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.