Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రమ్ము నవవత్సరమ్ము మా కిమ్ము శుభము

[విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ‘రమ్ము నవవత్సరమ్ము మా కిమ్ము శుభము’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు శ్రీ అమరవాది రాజశేఖర్ శర్మ.]

శ్రీకరమైన యోచనలు శ్రేయమనంతమపార సంపదల్
లోక హితంబుగా ఘన పురోగతినొందగ జేయు విద్యల
స్తోకయశస్సు సౌఖ్యము ప్రసూనములై విరబూయు నాశలున్
ప్రాకటమైన మోదము వరంబగు నూతన వత్సరంబునన్

మావి తోరణాలు మంగళ హారతుల్
పట్టి నిలిచెనేడు భక్తి తోడ
పసుపు గడప శుభము పలుకంగ వేచెను
సకల శుభములిడగ స్వాగతమ్ము

పంచునారు రుచులు పచ్చడి ముదమున
జీవితాన గలుగు చేవ తెలుప
పంచభక్ష ములిట భక్తితో వేచెను
రమ్ము కొత్త యేడికిమ్ము శుభము

సంబరాలెన్నియో మనసంబరాన
తేలియాడగ చేసెనీ వేళలోన
మనసు కోరె విశ్వావసు తనివితీర
రమ్ము నవ వత్సరమ్ము మాకిమ్ము శుభము

కోటి ఆశలు చిగురించి మేటి జీవ
నంబు మాకిడి సత్కీర్తి సంబురాలు
జరుగునట్లుగా చూడుము కరుణ తోడ
రమ్ము నవ వత్సరమ్ము మాకిమ్ము శుభము

అతిపేదరికముతో నలమటించేవారి
కాహారమై నేడు కదలిరమ్ము
రోగాలు రొచ్చులే యోగమై బ్రతుకీడ్చు
వారికారోగ్యమై చేరరమ్ము
అద్దెకొంపల్లోన అలసిసోలిన వారి
సొంతిల్లువై దయజూప రమ్ము
ఎంతకష్టించిన చింతగింజను నిల్ప
లేనివారికి లిబ్బిలీయరమ్ము
కోరికేదైన తీర్చగా కూర్మిరమ్ము
ఆశయాలను నెరవేర్చనాశ నిమ్ము
పండువెన్నెల నీయమీ పాడ్యమందు
రమ్ము విశ్వావసు  యుగాది  యిమ్ము శుభము

Exit mobile version