Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!

[వినాయక చవితి సందర్భంగా ‘రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!’ అనే శీర్షికతో పద్య కవితని అందిస్తున్నారు శ్రీ అమరవాది రాజశేఖర్ శర్మ.]

 

శ్రీ గిరిజా సుత! విఘ్నేశా!
గణ నాయక! గణేశ! సామజ వదనా
నాగోపవీత ధారణ!
రాగదె! లంబోదరా! వరమ్ములు కురియన్

విఘ్న నాశన మొనరించి విజయమిడగ
ప్రథమ పూజలనందుకో పరమ పురుష
కుడుములుండ్రాళ్ళు దండిగా నిడుదుమయ్య
రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!

భాద్రపద శుద్ధ చవితిన ప్రణవ రూప
జననమొందితివయ్య యీ జగతియందు
విశ్వ కారణ జీవన విఘ్ననాశ
రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!

ఆయురారోగ్యములనిడ యాది పురుష
సిరులు సౌఖ్యముల నీయగా శివతనూజ
లోకమందున యశమిడ యేకదంత
రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!

పంచ భూతాత్మకా యీ ప్రపంచమందు
మట్టితో మూర్తిగా నిన్ను మలచి కొలచి
జలమునన్ ఘనముగ నిమర్జనము జేతు
రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!

ఏక వింశతి పత్రాల నేరి దెచ్చి
పూలనేకవింశతి గూర్చి పూజజేసి
కుడుములుండ్రాళ్ళ పాయసమిడుదుమయ్య
రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!

మంచి పరిమళ ద్రవ్యాల నుంచి దివ్య
ధూప దీపముల్ వెలిగించి యోపి నిల్చి
భక్తి నీరాజనాలను పాడి నిడుదు
రమ్ము! మాయింట పూజ చేకొమ్ము! తండ్రి!

తలను వంచితి దోషముల్ తలపబోకు
భక్తి గుంజీలు దీసితి పరుడననకు
లెంపలను వేసికొన్నాను పెంపు జేయు
ముక్కు నేలకు రాసితి ముక్తి నిమ్ము

Exit mobile version