[2025 ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సందర్భంగా ‘రామాయణం మానవజాతికి అందించిన ధర్మాలు’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
“వేరే వేద్యేపరే పుంసి జాతే దశరధాత్మజే!
వేదః ప్రాచేతసాదాసీత్సాక్షాద్రామాయణాత్మనా!!”
వేదవేద్యుడైన పరమాత్మ దశరథుని కుమారుడై శ్రీరాముడుగా అవతరించగా వేదం వాల్మీకి మహర్షిచే వ్రాయబడి సాక్షాద్రామాయణమైనది. భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యము రామాయణం. వాల్మీకి ఆదికవిగా నేటికీ ప్రస్తుతింపబడుతున్నారు. వేదము వలె రామాయణము కూడా మానవ జీవన విధానంలో మార్గదర్శకమైనది. రామాయణము కావ్యమో, ఇతిహాసమో, పురాణమో కాదు. మానవ జీవితానికి మార్గదర్శనం చేసే ధర్మశాస్త్ర గ్రంథము. రామాయణంలో చెప్పబడని ధర్మం లేదు. ప్రధానంగా వైవాహిక, కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ ధర్మాలను గురించి బోధించిన మహత్తర కావ్యమే రామాయణము.
సామాజిక వ్యవస్థ సుభిక్షంగా ఉండాలంటే వ్యక్తి బాగుండాలి. వ్యక్తి బాగుంటే కుటుంబం, తద్వారా సంఘము, దేశము బాగుపడుతుంది. కనుక దేశం బాగుపడాలంటే ముందు వ్యక్తి ధర్మపరుడై ఉండాలి.
శ్రీరాముడు ధర్మాన్ని ఆచరించి చూపించాడు.
ఒక వ్యక్తి శిష్యుడిగా, కుమారుడిగా, సోదరుడుగా, స్నేహితుడిగా, పాలకుడిగా ఎలా ఉండాలో ప్రత్యక్షంగా చూపినవాడు శ్రీరామచంద్రుడు. రాక్షసుడైన మారీచునిచే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని కీర్తింపబడినాడు.
పదారు సంవత్సరాల ప్రాయంలో విశ్వామిత్రుడి వెంట నడిచాడు. గురువు సీతారామ కళ్యాణమునకు బీజావాపం చేసినాడు. అనగా శిష్యుని వెంట తీసుకొని వెళ్ళాడు. శిష్యునిపై వాత్సల్యం గురువుకెంత కలదో, శిష్యుడయినవాడు గురువు పట్ల ఆచరించవలసిన ధర్మాలను ఆచరించి చూపిన ఆదర్శనీయుడు రాముడు.
పితృ వాక్య పరిపాలనము కొరకు పట్టాభిషేకం చేసుకొని సీతా లక్ష్మణ సమేతుడై వనవాసమునకేగినాడు. కైకేయి వరయాచనమే దానికి కారణం. ఆ సందర్భమున రాముడు ధర్మనిరతుడైన వాడెవ్వడైనను తల్లి, తండ్రి, బ్రాహ్మణుడు ఆదేశించిన వారి ఆదేశమును పాటింపవలయును అని అన్నాడు. ధర్మబధ్ధుడనైన నేను ఎంత కఠినతర కార్యమైనను కార్యమైనను తండ్రి కొరకు చెయ్యగలవాడను అనుటలో కుమారుని ధర్మము సువ్యక్తమౌతున్నది. విశ్వామిత్రుని వెంట మిథిలకు వెళ్లి శివ ధనుర్భంగము కావించగా జనకుడు జానకి నిచ్చెదనగా, తండ్రి అనుమతి లేనిది వివాహము చేసుకొనుట ధర్మము కాదు అని పలుకుటలో తండ్రిపై గల గౌరవము ప్రేమ సువ్యక్తము. కొడుకనే వాడు ఎలా ఉండాలో ఆచరించి చూపినవాడు శ్రీరామచంద్రుడు.
భ్రాతృ ప్రేమకు పరాకాష్ఠ రామచంద్రుని సోదర ప్రేమ. వనవాసంలోనున్న రాముని వద్దకు భరతుడు వచ్చి అయోధ్యకు తిరిగి రమ్మని ప్రార్థించగా “నేను ఆడిన మాట తప్పను భరతా! నీ కొరకు నేను రాజ్యమునే కాదు అత్యంత ప్రీతికరములైన ప్రాణములనైను సంతోషముతో ఇవ్వగలవాడను” అనుటలో తమ్మునిపై అన్నకు గల ప్రేమ, బాధ్యత వ్యక్తమగుచున్నవి. యుద్ధకాండలో ఇంద్రజిత్తు శరాఘాతమునకు మూర్ఛితుడైన లక్ష్మణుని చూచి రాముడు శోకించిన తీరు వేదనాభరితమైనది. ఆ సమయమున రామచంద్రుడు
“దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా!
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః!!”
అనటంలో భార్య బంధువులు ఎక్కడైనా దొరుకుతారు సోదరులు మాత్రం దొరకరు అని లక్ష్మణుని కొరకు రోదిస్తాడు. తోడబుట్టిన వారి విలువను శ్రీరామచంద్రుడు ఎంత చక్కగానో వివరించాడు. అహంకారాలకు పోయి తోబుట్టువులను దూరం చేసుకోరాదు. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. తోబుట్టువులను ఎవరు తీసుకురాలేరు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు లాగా ఆప్యాయతతో కలిసి జీవించాలి. సోదరులు ఎలా ఉండాలన్న విషయాన్ని శ్రీరాముడు ప్రత్యక్షంగా చెప్పాడు.
తరువాత జీవితంలో ప్రధానమైనది వైవాహిక బంధం ఏకపత్నీవ్రతము నాచరించి భార్య గురించి చెబుతూ రాముడు
“రామస్య చరితం కృత్స్నమ్ సీతాయాశ్చరితం మహత్!
పౌలస్త్యవధ మిత్యేవ చకార చరిత వ్రతః!!”
అన్నాడు.
సీతారామ కల్యాణం గురువు ఆజ్ఞ, తండ్రి అంగీకారంతో జరిగిన వివాహము. సీత రామునికెంతో ప్రీతి పాత్రురాలు. వివాహమైన నాటి నుండి సీతా పరిత్యాగము దాకా, సీతాపహరణం తరువాత ఒక్క సంవత్సర కాలము మాత్రమే సీతారాములు దూరముగానున్నారు. ఏనాడు సీత రాముని విడిచి ఉండలేదు. సీతారాములు ఇరువురు కాదు. అద్వైత భావమే సీతారాములది. ఆనాడు రాజులు ఎందరో భార్యలను కలిగి ఉన్నవారు ఉన్నారు. అటువంటి సమయంలోకూడా ఏకపత్నీవ్రతుడుగా పేరుపొందాడు. రాజగౌరవం కోసం సీతను పరిత్యజించాడే కానీ ఏ విధమైన శంక రాముని మనస్సులో లేదు. అవతార పరిసమాప్తి వరకు సీతయే భార్యగా ఏకపత్నీవ్రతమును అవలంబించిన వాడు శ్రీరాముడు.
భార్యాభర్తల సంబంధం మానసికమైనదే కానీ శారీరకమైనది కాదు. దూరంగా ఉన్నా భావ పరంపర ఒకటిగానే ఉండాలి. ఒక పురుషుడికి ఒకే స్త్రీ అనే ధర్మాన్ని ఏర్పరచి భార్యాభర్తల అనుబంధాన్ని చూపించాడు వాల్మీకి మహర్షి. రామాయణంలో భార్యాభర్తల అద్వైత భావన నిరూపింపబడినది. అందుకే రామాయణం చదవటం వినటమే కాదు, ఆ గ్రంథం ఇంట ఉన్నా అనుబంధాలు స్థిరంగా ఉంటాయని అంటారు.
రామాయణంలో కుటుంబ సంబంధాల తరువాత ప్రాధాన్యతను సంతరించుకున్నది మిత్రభావన. మిత్రత్వం అనేది కేవలం మనుషుల మధ్య మాత్రమే కాదు జీవాత్మ పరమాత్మల మధ్య సమకూరే భక్తి ప్రేమ భావన మిత్రత్వమునకు ప్రధానము. రామాయణంలో శ్రీరాముడు మానవులతో, రాక్షసులతో, స్త్రీ, తిర్యక్కులతో కూడా మిత్ర భావనను చూపాడు. నేడు మానవజాతికి కావలసినది ఆ భావనయే. మిత్రభావన మనుష్యులలో పెంపొందించినచో లోకంలో ఏ విధమైన దుష్ప్రభావములు కలుగవు అని చెప్పింది రామాయణము. ఈనాడు మానవులలో పెరుగవలసినది ఆ భావనయే.
రాముని రాజ్యపాలన వ్యవహారపు సరళి నేటి పాలకులకు అనుసరణీయము. రామ రాజ్యమున ధర్మము నాలుగు పాదాల నడిచింది అనేది నిర్వివాదాంశము. రామరాజ్యము సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండేది. పాలకులు ధర్మపరులై ప్రజాసంక్షేమం కోసం పాటుపడితే లోకం సుసంపన్నంగా ఉంటుంది అనడానికి రాముని పరిపాలనయే కారణం. రామరాజ్యంలో ప్రజలంతా ధర్మపరులై జీవించారు. దుఃఖం అంటే ఎవరికి తెలియదు. స్త్రీలకు వైధవ్యం లేదు. పెద్దలు చిన్నవాళ్ళకు ప్రేతకార్యాలు చెయ్యలేదు.
రామాయణము నందలి ప్రతిపాత్ర, ప్రతి సన్నివేశము లోకమునకు ఏదియో ఒక సందేశమును అందించుచు నిరంతర ప్రాతస్మరణీయము అగుచున్నది. రామాయణమందలి ఒక్కొక్క కాండ మాత్రమే కాదు, ఏ సర్గకా సర్గ, ఏ శ్లోకమునకు ఆ శ్లోకమే మహిమాన్వితమై, మానవ జీవితమునకు మార్గదర్శనము అగుచున్నది. రామాయణం చదివినా, విన్నా, వ్రాసినా కీర్తి, ఆయుష్షు, మనఃప్రశాంతత కలుగుతుంది. రామాయాణాన్ని పారాయణ చేసి పరవశించి ముక్తినందిన వారు కొందరు, విని ఆస్వాదించి తరించినవారు మరి కొందరు. రామాయణము భరతజాతి హృదయ స్పందన. మానవ జీవితానికి చుక్కాని. అభ్యుదయపథంలో సాగాలనుకునే వారికి దిక్సూచి. దానికి కారణం వాల్మీకి ఋషి కావడమే. ఋషి మాట వేదవాక్కు కదా! అందుకే అది సత్యము.
రామాయణం ధర్మసమ్మతమైనది. చదివినవారు సమస్త పాపాలు పోగొట్టుకోవటమే కాదు ఆయుష్షు, ధనం, కీర్తిప్రతిష్ఠలు పొందగలుగుతారు. పుత్ర పౌత్రులతో శతవర్షాలు సుఖ జీవనం సాగించగలరు. శత్రువుల వలన ఏ విధమైన భయము కలుగదు. ఇన్ని గొప్ప ఫలితాలనందించే కావ్యరాజము రామాయణము. కనుకనే రామాయణమున్న ప్రతి లోగిలిలో రామాయణం శుభాలను కలుగజేస్తుంది.
రామాయణమున తండ్రీ కొడుకుల, గురుశిష్యుల, భార్యాభర్తల, సోదరులమధ్య, శరణన్న శత్రువునైనా రక్షించుటలో దయ, సమస్త భూతజాలముల పట్ల కరుణ పాలనా విధానము మొదలగు విషయములలో మానవుడు ప్రవర్తించవలసిన తీరుతెన్నులు అన్ని వివరింపబడినవి. అందుకే ఏ యుగానికైనా, ఏ కాలానికైనా రామాయణము అనుసరణీయము, ఆచరణీయమైన గ్రంథముగా ప్రసిద్ధి పొందిన మహా మహిమాన్విత గ్రంథరాజము. ఇంతటి ధర్మమూర్తి కనుకనే పురుషోత్తముడుగా కీర్తింపబడినాడు శ్రీరామచంద్రుడు. అందుకే
“ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక
వ్రాయ వడకుండు గావుత! రామ
వాక్యమనిన తిరుగనిదని అర్థమగును గాత!
రమ్య గుణధామ! రఘురామ! రామ! రామ!”
అదీ రామనామ మహిమ. రామ నామ మహాత్మ్యములోని గొప్పతనము. రామనామస్మరణ గొప్పతనాన్ని చాటినవాడు ఆంజనేయుడు. త్యాగరాజాది వాగ్గేయకారులు ఆ రామనామస్మరణలో తరించి ధన్యజీవులైనారు.