Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సామాజిక సద్భావన ‘రామ శతకము’

[సింగిరెడ్డి రాజిరెడ్డి గారు రచించిన ‘రామ శతకము’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ సామల కిరణ్.]

తెలుగు సాహిత్యంలో పద్యం సజీవ గంగా ప్రవాహంలా, నిరంతరం సాగిపోతూనే ఉంది. పద్యాలను మూటగట్టుకొని శతకాలు గుట్టలుగా వెలువడుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని శతకాలు వచ్చినా, ఎన్నెన్ని పద్య కావ్యాలు వచ్చినా, ప్రతిదీ ప్రజలనాలుకపై నాట్యమాడకపోవచ్చు. కొన్ని శతకాలు కొందరినైనా ప్రభావితం చేస్తాయి. సమీప ప్రాంతంలో ఆ శతకాలకు గౌరవం దక్కుతుంది. అలాంటిదే రామ శతకం.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని రాళ్ల రామన్నపేట గ్రామంలో నాగలి పట్టిన రైతు హృదయ లోతుల్లోంచి వచ్చినది రామ శతకము. ఆయనే సింగిరెడ్డి రాజిరెడ్డి. వేములవాడ ప్రాంతంలో ప్రసిద్ధ తెలుగు పండితులైన మధు మృత్యుంజయ శర్మ గారు వీరి గురువులైనందువల్ల వారి ప్రభావంచే మొట్టమొదటగా సింగిరెడ్డి శతకం రాసి ఆయనకు అంకితం ఇవ్వబడింది. ఆ తరువాత లోకానుభవంతో వచ్చిన మరో శతకం ‘రామ శతకము’. రామ మందిర నిర్మాణం పూర్తయి బాల రాముని పునః ప్రతిష్ట జరిగిన రోజున కవి ఈ శతకాన్ని ప్రారంభించినందువల్ల, “విన్నవించుచుంటి వినుము రామ” అనే మకుటంతో రాసినందువల్ల దీనికి ‘రామ శతకము’ పేరు సముచితమే. అయితే ఇది భక్తి శతకం ఎంత మాత్రం కాదు, ఇది సామాజిక రామ శతకం. భక్తి గురించి రాయక పోయినప్పటికీ మానవుని తీర్చిదిద్దే పద్య రత్నములు ఇందులో అనేకం కలవు. భక్తి అంటే హృదయ శుద్ధియే కదా! అలా ఈ శతకంలో రాయబడిన ప్రతి పద్యం మానవుని కేంద్రంగా మనిషి హృదయ పరివర్తన తెచ్చేవి అనటంలో సందేహం ఏం లేదు.

రామ శతకంలోని విశేషతలు ఏమిటంటే కవి జానపదుడు, కవి హాలికుడు అయినందువల్లనేమో కవిచే రాయబడిన శతకం నిండా విరివిగా తెలుగు సామెతలు, జాతీయాలు కనిపిస్తాయి. తెలంగాణ పదజాలం పద్యాల్లో గమ్మత్తుగా నిలబెట్టాడు ఈ కవి. ఆ సామెతలను, జాతీయాలను, ఆ పదబంధాలను ఛందోబద్ధంగా కూర్చడము ఈ కవికి అలవోకగా అబ్బిన విద్య. ఈ శతకము నిండా ఆరబోసిన సామెతలను, జాతీయాలను పరిశీలిద్దాం

  1. శివునియాజ్ఞ లేక చీమైన కుట్టదు
  2. అప్పు లేని వాడె అధిక సంపన్నుడౌ
  3. నేతిబీరయందు నెయ్యి లేకుండును
  4. మాటబెల్లముండు మనసులో విషముండు
  5. గురువు లేని విద్య గుడ్డిదేయందురు
  6. కరిగిపోవు సిరులు కర్పూరము వలెను
  7. మసిని బూసియున్న మారేడు కాయోలె
  8. కుక్కతోక వంక గుండు గట్టినబోదు
  9. దోనిమోత గాని దొయ్యతడవదింత
  10. పేరు బెట్టి పిలువ పెత్తనమే పోదు
  11. బతికినంతవరకు బర్రలై కనిపించు
  12. ఉనక మీది రోకలురకనట్లు
  13. చితకబాదియున్న చింత పులుపుబోదు
  14. నీటి పైన బుడగ నిలుచునా ఎప్పుడు
  15. నూతిలోనబడ్డ నూరురాళ్ళను వేసి
  16. గోటబోవు దాన్ని గొడ్డుట నరుకకు
  17. లోకులెపుడునతని కాకులై పొడిచేరు
  18. నిండుకుండలున్న నీరు తొణకకుండు
  19. పోతుమీద వాన బోసిన చందంబు
  20. నక్కజిత్తులోల్ల నమ్మ వలదు
  21. మొరుగుతున్న కుక్క కరవలేకుండును
  22. రైతు బాగుపడిన రాజ్యము బాగుండు
  23. మొరటువాడికేల మొగిలిపూవాసన
  24. పల్లమెరిగి నీరు ప్రవహించుచుండును
  25. పుట్టుకందువచ్చు పుర్రె గుణముపోదు

ప్రతి పద్యంలో ఇటువంటి సామెతలు ఉన్నప్పటికీ మచ్చుకు కొన్ని ఇక్కడ ఉదహరించడం జరిగింది. వీటితో పాటు కర్రు, పబ్బు, పుట్లకొద్ది, రేలుగాయ, కడుపుల కత్తులు, కాట్నం, పాడె, ఈతకమ్మలు, పుర్రెగుణం, బర్రలు, బొక్కెన, కావరం, చిక్కం, ఉరుకులాడు, పట్టువిడుపులు, చూరు, నక్కజిత్తులోళ్ళు, నూకి, తిప్పలు, కొంపలార్పుకుంటు.. వంటి తెలంగాణ యాసలోని పదాలు మనకు కనిపిస్తాయి.

శతక కవి రాజిరెడ్డి పూర్వకవుల వలెనే ప్రారంభంలో తన వంశంలోని వారిని స్మరిస్తూ స్వీయ పరిచయాన్ని పద్యాల రూపంలో అందించారు. గణపతి,సరస్వతి, రామచంద్రుల వారిని స్తుతిస్తూ పద్యాలు అదనంగా రాశారు. శతక రచనను

“శ్రీహరి దయతోడ శ్రీవాణి కరుణచే” అంటూ ప్రారంభించారు.

“కర్రుజోడు బట్టు కర్షకుడనుగాని
కలము బట్టి వ్రాయు కవిని గాను
పల్లెటూరివాడ పంటదీసెడివాడ”

అంటూ తన వినమ్రతను చాటుకున్నాడు కవి. 3 నుండి 6 పద్యాలలో వృక్ష ప్రాధాన్యత ను తెలుపుతూ మ్రానులోని మంచి గుణములన్నీ వివరించారు.

13- 27 పద్యాలలో లోకంలో జరుగుతున్న వివిధ పోకడలను తనదైన జానపద శైలిలో పద్యాలను కూర్చారు.

“బ్రతికియున్న నాడు బాధలు బెట్టుచు
కడుపు మాడ బెట్టు కన్న సుతులు
పెద్దకర్మ చేసి పెట్టెదరూరంత”

బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుండా, మరణించాక శ్రాద్ధ కర్మలను ఎంత గొప్పగా చేస్తే ఏమి ఫలితం? అంటూ ఒక చురక వేశాడు కవి. ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై కవి వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు.

“ఉచిత పథకమనగ ఉప్పొంగిరే ప్రజ
వంగరాయె  జనులు వారి పనికి
అంతరించిపోదె అవనిపై సంపద”

అంటూ గొప్ప సత్యాన్ని వెల్లడించారు కవి.

“ధర్మ మెరుగు నరుడు దైవ సమానుడు”

“అప్పులేని వాడె అధిక సంపన్నుడు”

“గుణము మారదెపుడు గుడమేసి కడిగిన”

“కాసులేని నాడు కనులకు కనురారు”

“వినయమున్నవాడు విర్రవీగడెపుడు”

“కఠిన హృదయమందు కరుణ లేకుండును” ఇటువంటి పద్యాలలోని మూడవ పాదము సార్వజనీన విలువగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. 30 నుండి 34 పద్యాలలో దుర్జనుల స్వభావాన్ని చక్కని ఉపమానాలతో కవి పొందుపరిచారు.

మరోచోట “సార రహితమైన చదువు జదువనేల” (38) అంటాడు కవి రాజిరెడ్డి. నేటి విద్యలు పోటీ పెంచుతుంది తప్ప, విలువలు నేర్పట్లేదు. బహుశా కవి అంతరంగంలో సారం అంటే ఆ జీవిత విలువలేనేమో!

“పెద్దవారి మాట విడచెవి పెట్టిన
పేరు గౌరవంబు పెరగకుండు”(43)

నేటి తరానికి అందాల్సిన గొప్ప మాటని సూటిగా, స్పష్టంగా కవి నొక్కి చెప్పాడు.

ఇట్లా మానవ జీవితంలో ఉండవలసిన ప్రవర్తనా విలువలు ఎన్నింటినో కవి ఈ శతకము ద్వారా లోకానికి అందిస్తున్నాడు.

సమాజ జీవనానికి కావలసిన అంశం సమరసత. అదే సామరస్యం. ఆధునికత, అందినంత సాంకేతికత పెరుగుతున్నా పర్వాలేదు. అదే సమయంలో సమాజంలో కుల దురహంకారం పెరిగితేనే ప్రమాదం. గ్రామీణ సామాజిక జీవనంలో కులస్పృహ కాస్త ఎక్కువే. స్పృహ అధికమై, కుల కొట్లాటలకు దారితీస్తేనే ఇబ్బంది. కవి పూర్తిగా పల్లె నేపథ్యం కాబట్టి ఈ సున్నిత అంశాన్ని, సున్నితంగానే చెప్పిన పద్యం పాఠకుల మనస్సులో నిలుస్తుంది.

“మాట మాట పెరిగి మాదిగ యనవద్దు
వేరు జూచుచున్న వెతలు కలుగు
పేరు పెట్టి పిలువ పెత్తనమే బోదు” (51)

సాటి మనుషులను వేరుగా చూసే ఆలోచన మారితే భారతీయ సమాజం సుఖంగా ఉంటుంది కదా!.

కవికి భాషాభిమానం ఎక్కువే. “పరుల భాష నేర్చి పలుచన జేయకు”, “తెర్లు జేయవలదు తెలుగు భాష నెపుడు”, “వెలుగ వలయు తెలుగు వెలతి గాకుండను” వంటి సరళ సుందర సామాన్య వాడుక భాష పదాలతో అద్భుత పాదాలు సృష్టించారు ఈ హాలిక కవి.

వర్తమాన పరిస్థితులను అవగాహన చేసుకుని, ప్రస్తుతం జరుగుతున్న మహిళలపై అఘాయిత్యాలను నిరసిస్తూ..

“కామ పరుల ద్రుంచ కాగడాలను బట్టి నగరవీధులందు నారి శక్తి
కనకదుర్గవలెను కదలాలి మహిళలు”

అంటూ కామాంధులను  స్త్రీలు దుర్గామాత వలె కదిలి అంతం చేయాలని పిలుపునివ్వడం కవికి ఉన్న సామాజిక స్పృహకి, మహిళలపై ఉన్న ఆరాధన భావానికి నిదర్శనం.

స్వయంగా రైతు అయిన రాజిరెడ్డి గారు రైతు గొప్పతనం 6 పద్యాలలో శ్రమ జీవనమంతా పరిచారు.

“పగలు రాత్రి అనక పనులు జేయును కాపు
కునుకురాక కాపు కుమిలిపోవుచునుండు
అన్నదాతనెపుడు నాదుకోవలెనింక
రైతు బిడ్డకింక రక్షణ కరువాయె
రైతు బాగుపడిన రాజ్యము బాగుండు..”

వంటి పద్య పాదాలలో రైతు బాధలను కూడా ఏకరువు పెట్టారు రైతు కవి రాజిరెడ్డి.

రాముని కథ కాదు, సమాజంలో ధార్మిక జీవనానికి అవసరమైన సంస్కారాలు పెంపొందేలా రాముణ్ణి వేడుకుంటున్న ‘సామాజిక రామ శతకం’ ఇది. పాండిత్యం అక్కరలేకుండా, సామాన్యులు చదివి అర్ధం చేసుకోగలిగే ఈ శతకము ఆధునికత పేరిట అతలాకుతలం అవుతున్న గ్రామీణ జీవనాన్ని మార్చేందుకు దోహదం చేస్తుంది. కవి అలవోకగా, ఆశువుగా ఎన్నో పద్యాలు వ్రాస్తున్నారు. వారి కలం నుండి మరెన్నో రచనలు రావాలని ఆకాంక్షిస్తూ..

***

రామ శతకము (ఆటవెలది పద్యాలు)
రచన: సింగిరెడ్డి రాజిరెడ్డి
ప్రచురణ: శ్రీ భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్
పేజీలు: 55
వెల: అమూల్యం
ప్రతులకు:
సింగిరెడ్డి రాజిరెడ్డి
8500820902

Exit mobile version