Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రక్షణనిచ్చే రాఖీపండుగ

[9 ఆగస్టు 2025 రాఖీ పౌర్ణమి సందర్భంగా డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘రక్షణనిచ్చే రాఖీపండుగ’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

“అమ్మ ప్రాణంపోసి జన్మనిస్తే
నాన్న జీవితాన్నిచ్చి నడిపిస్తే
అన్న రక్షాబంధనం ముడితో
జీవితాంతం రక్షణనిస్తాడు”

అని సోదర ప్రాముఖ్యతను తెలియజేసేదే రాఖీ పండుగ. శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమనే రక్షాబంధన పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజు అక్కాతమ్ముళ్ళ, అన్నాచెల్లెళ్ళ మధ్యగల ప్రేమానురాగాలకు సూచనగా ఈ పండుగను జరుపుకుంటారు. ‘రాఖీ’ అంటే రక్షణ బంధం అని అర్థం. ఈ రోజు సోదరసోదరీమణులకు మహత్తరమైన పర్వదినము. అన్న లేదా తమ్ముడు జీవితాంతం తన సోదరికి రక్షణగా ఉండి ఆమెకు ఏవిధమైన కష్టము రాకుండా కాపాడుతానని ధైర్యాన్నిచ్చే రోజే ఈ రాఖీ పున్నమి పర్వదినము. ఈ పండుగను ఉత్తర హిందూస్థానంలో ప్రశస్తంగా జరుపుకుంటారు. సోదర సోదరీమణులందరూ ఒకచోట కలిసి ప్రేమానురాగాలను పంచుకునే ఈ రాఖీ పూర్ణిమను దక్షిణ హిందుస్థానంలో కూడా జరుపుకోవటం ఆనవాయితీగా వచ్చింది.

దీనినే జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. జంధ్యాన్ని ధరించే మగవారు ఈ రోజు తమ పాత జంధ్యాలని తీసివేసి గాయత్రి మంత్రాన్ని జపించి కొత్త జంధ్యాన్ని ధరించడం ఒక ఆచారము. కొత్తగా ఉపనయనం అయిన వటువుచేత ఉపాకర్మ, ముంజ విడుపు అను కలాపములను నిర్వర్తింపచేస్తారు. ఈ రోజున వటువు చేత గాయత్రీమాత పూజ, అగ్నిహోత్రము, సంధ్యావందనాది కార్యక్రమం చేయించటం కూడా ఒక ఆచారము. ఆ తరువాత నూతన జంధ్యాన్ని వటువుకు వేస్తారు.

ఈ రాఖీ ఈనాటి ఆచారం కాదు. అనాదిగా యుగాలనుంచీ వస్తున్నది. ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్యన ఒక పుష్కర కాలం యుధ్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవేంద్రుడు తన పరివారంతో కలిసి అమరావతి నగరంలో తలదాచుకుంటాడు. రాక్షసరాజు అమరావతిని వశం చేసుకోబోతున్నాడని తెలుసుకున్న శచీదేవి భర్తకు ఉత్సాహాన్ని కలిగించి, యుధ్ధంలో విజయాన్ని సిధ్ధింప చేయడానికి లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, వారి అనుగ్రహం వలననే ఇంద్రుడు విజయాన్ని పొందగలడని పలుకుతూ భర్త చేతికి రక్షకట్టినట్లుగా భవిష్య పురాణంలో కనిపిస్తుంది. ఇంద్రాణి మాత్రమే కాక దేవతాస్త్రీలు అందరూ కూడా ఇంద్రునికి రక్షకడతారు. శచీదేవి రక్ష కట్టిన రోజు శ్రావణ పౌర్ణమి. నాటినుంచి ఈరోజు రక్షాబంధన్‌గా ప్రసిద్ధి పొందింది. భర్తకు ఆపద కలుగుతుందని తెలిసి రక్షకట్టి భర్తను కాపాడుకుంటుంది ఇంద్రాణి.

మహా విష్ణువు దేవతలను రక్షించడానికి వామనావతారంలో భువిలో అవతరిస్తాడు. బలి చేస్తున్న విశ్వజిద్యాగానికి వెళ్లి అక్కడ బలిని మూడడుగుల నేలను దానంగా అడుగుతాడు. ఆ మూడు అడుగులను గ్రహించిన వామనుడు

“ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీథిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభా రాశిపై నంతై
చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటి పై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై”

అన్నట్లుగా పెరిగి ఒక అడుగుతో భూమిని ఒక అడుగుతో గగనమును కప్పివేసి మూడవ అడుగుకు స్థానమేదని ప్రశ్నింపగా బలి తన శిరస్సుపై నుంచమని శిరస్సును చూపిస్తాడు. అలా బలిని పాతాళానికి పంపి వేస్తాడు మహా విష్ణువు. అప్పుడు విష్ణుభక్తుడు అయిన బలి కోరిక మేరకు మహావిష్ణువు వైకుంఠమును వీడి పాతాళంలోనే ఉంటాడు. అప్పుడు శ్రీమహాలక్ష్మి పాతాళానికి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి భర్తను వైకుంఠానికి తీసుకుని వెళుతుంది.

“యేన బధ్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః!
తేనత్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల৷৷”

అను శ్లోకాన్ని పఠిస్తూ సోదరునిచేతికి రక్షాబంధాన్ని కట్టవలెను. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనకై సీతా లక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్ళునపుడు కౌసల్యాదేవి “ఓషధీం చాపి సిధ్ధార్థాం విశల్యకరణి శుభామ్” అంటూ కుమారునికి శుభాలు కలగాలని, కుమారుని క్షేమాన్ని కాంక్షిస్తూ రక్ష కట్టింది. రక్ష కట్టడం అనేది తల్లి కుమారుని క్షేమాన్ని కాంక్షించటమే కాదు, అహర్నిశలూ రామచంద్రుడు తల్లి కోసం ఆలోచించాడు. అదీ తల్లి ప్రేమ, వాత్సల్యాల గొప్పతనం.

ఇక ద్వాపరయుగంలో ద్రౌపదీ శ్రీకృష్ణులది అన్నాచెల్లెళ్ల అనుబంధం. రాజసూయ యాగ సమయంలో శిశుపాలుని వధా సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా ఆ చక్రపు రాపిడికి శ్రీకృష్ణుని వేలికి గాయం అవుతుంది. అది చూసిన ద్రౌపది తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలికి కట్టు కడుతుంది. ఆ తరువాత సభాపర్వంలో జరిగిన జూదంలో పాండవులు ఓడిపోగా, ద్రౌపది వస్త్రాహపహరణ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెకు అక్షయ వలువలను ప్రసాదించి దుశ్శాసన దురాగతం నుండి ఆమెను రక్షిస్తాడు. పరమాత్మ వేలికి కట్టిన కట్టే ద్రౌపదికి రక్షాబంధనంగా మారి ఆమె మానరక్షణకు హేతువయింది. సోదరీసోదరుల మధ్యన ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మనకు కనిపిస్తాయి.

రాఖీ కట్టడానికి కులమతాలతో సంబంధం లేదు. గ్రీకు రాజైన అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేస్తాడు. దేశమంతా ఆక్రమిస్తాడు కాని పరాక్రమవంతుడైన పురుషోత్తముని జయించడం అసాధ్యమయింది. అప్పుడు అలెగ్జాండర్‌కు మనసిచ్చిన రుక్సానా పురుషోత్తమునికి రాఖీ కడుతుంది. రుక్సానాకు ఇచ్చిన మాటకు కట్టుబడిన పురుషోత్తముడు తన కుమారుడు మరణించినా అలెగ్జాండర్‌ను విడిచిపెడతాడు. అదీ రక్షాబంధన్ యొక్క గొప్పతనం. నీవు నా చేతికి కట్టింది దారం కాదు నీ హృదయాన్ని తోరంగా చేసి కట్టావమ్మా అంటాడు. పురుషోత్తముడు పలికిన ఆ మాటలు ఆనాడే కాదు నేటికీ కూడా అన్నాచెల్లెళ్ళ అనురాగ బంధాన్ని, సోదరిపైగల బాధ్యతను, ఆమెను కాపాడాలన్న స్ఫూర్తి వ్యక్తి కర్తవ్యమని యువతకి తెలియచెపుతుంది. ఇందులో జాతి మత భేదాలు లేవు. స్త్రీని రక్షించటానికి ప్రాణార్పణకైనా సిద్ధపడాలి అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇది చారిత్రక నేపథ్యమున్న కథ. 1905లో బెంగాల్ విభజన సమయంలో రవీంద్రనాథ ఠాగూర్ సామాజిక రక్షాబంధన్ నిర్వహించారు. ఆయన స్ఫూర్తితో ఆనాడు దేశం ముక్కలు కాకుండా ఆగింది. అదీ రక్షాబంధన్ యొక్క గొప్పతనం.

ఆధునికయుగంలో రాయప్రోలు సుబ్బారావు, గురజాడ, దేవులపల్లి వంటి కవులు తమ రచనలలో రక్షాబంధన్ విలువలను చాటారు.

రాయప్రోలు వారి తృణకంకణము ఈ కోవకు చెందినదే. చిన్ననాటి స్నేహితులు కారణాంతరాల వలన విడిపోయి తిరిగి కలుసుకున్నపుడు అతను చిన్నగడ్డి పరకను కంకణమువలె చేసి ఆమె చేతికి అలంకరింపగా నామె అతని చేతికి ఉంగరమువలే నలంకరించును. వారిరువురి స్నేహ సుహృద్భావములకు నిదర్శనమీ ఘట్టము.

స్త్రీ పురుషులు ఇరువురిలో ప్రేమ పెల్లుబికాలి. అదే రక్షాబంధన్‌లో దాగి ఉన్న సత్యం. ఆ ప్రేమలో స్వఛ్ఛత, మానవత నిండిఉండాలి. ఆ సత్యాన్ని మనిషి గుండెల్లో నింపుకున్నప్పుడు దేశభవిత ప్రకాశిస్తుంది. మానవ సత్సంబంధాలకు ఈ పండుగ స్ఫూర్తిదాయకమైనది. ఒక విదేశీ ఎన్సైక్లోపీడియాలో “It is one of the several occasions in which family ties are will affirmed in India..” అని చెప్పబడింది. పాశ్చాత్యులు మనిషి సుఖసంతోషాలు పొందటానికి కేవలం సాంకేతికతే ప్రధానమనుకున్నారు. కానీ మానవ సంబంధాలే సుఖశాంతులకు మూలమని భారతీయుల నమ్మకం. భారతదేశంలోగల పటిష్టమైన కుటుంబ వ్యవస్థే అందుకు మూలమని విదేశీయులు కూడా సమర్ధించారు. ఆ సంబంధాలను నిలుపుకోవటానికి పూర్వీకులయిన మనఋషులు అనేక పండుగలను, సంప్రదాయాలను, ఉత్సవాలను మనకందించారు. పరస్త్రీని తల్లిగా, సోదరిగా భావించే సంస్కృతి మనది. ఈ సంస్కృతిని పటిష్టంగా నిలుపుకోవటానికి యువతలో స్ఫూర్తిని నింపటమే ఈ రాఖీ పండుగ ప్రధానోద్దేశము.

Exit mobile version